SOURCE :- BBC NEWS

స్టోన్‌హెంజ్ ఆఫ్ తెలంగాణ

  • రచయిత, బళ్ల సతీశ్
  • హోదా, బీబీసీ ప్రతినిధి
  • 21 డిసెంబర్ 2024

    అప్‌డేట్ అయ్యింది 22 డిసెంబర్ 2024

తెలంగాణలోని నారాయణపేట జిల్లా ముడుమాల గ్రామంలో ఈరోజు (21 డిసెంబరు 2024న) ఒక ‘ఖగోళ విశేషం’ జరిగింది. అక్కడ భూమిలో పాతి ఉన్న వేల ఏళ్ల నాటి మూడు నిలువురాళ్లపై సూర్యకాంతి నిట్టనిలువుగా పడిందని శాస్త్రవేత్తలు తెలిపారు.

ఏటా రెండుసార్లు అంటే జూన్ 21, డిసెంబరు 21న ఇలా జరుగుతుందని శాస్త్రవేత్త కేపీ రావు బీబీసీకి చెప్పారు.

ఆకాశంలో నక్షత్రాల ఆనవాళ్లను భూమి మీద శిలలపై చెక్కి, సూర్యకాంతి పడే వరుసలో నిలువు రాళ్లను పాతిన ప్రాచీన నాగరికతకు సాక్ష్యం ఈ ముడుమాల.

మూడు వేల ఏళ్ల కిందట ఇక్కడ రాళ్లు ఎందుకు పాతారు? అందునా సూర్యకాంతి పడే వరుసలో ఎందుకు పాతారు? నక్షత్రాలను ఎందుకు చెక్కించారు? అని తెలుసుకునే పనిలో ఉన్నారు శాస్త్రవేత్తలు.

నారాయణపేట జిల్లాలోని ముడుమాల, మురాల్ దొడ్డి గ్రామ శివార్లలో ఉంటుందీ ప్రదేశం. పదుల సంఖ్యలో నిలువు రాళ్లు, వందల సంఖ్యలో వృత్తాకారాల్లో పేర్చిన మిగతా రాళ్లు బృహత్ శిలా యుగం అంటే మెగా లిథిక్ పీరియడ్ నాటివని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈ ప్రదేశం గురించి 1935-41 మధ్య ప్రచురితమైన హైదరాబాద్ స్టేట్ జియోలాజికల్ పుస్తకాల్లో ప్రస్తావించారు. ఇది నిజాం ప్రభుత్వంలో రక్షిత స్థలాల జాబితాలో ఉంది. తరువాత 1956లో మరికొన్ని నివేదికల్లో ఇది కనిపించింది. 2003 నుంచీ దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి. దేశంలో బృహత్ శిలా యుగం నాటి అనేక ప్రదేశాలు ఉన్నప్పటికీ ఖగోళ శాస్త్ర పరంగా కూడా ప్రాధాన్యత ఉండటం వల్ల ముడుమాల మిగతా వాటికంటే ప్రత్యేకంగా నిలిచింది.

ఇక్కడ రాళ్లు ప్రధానంగా మూడు రకాలు:

ఒకటి నిలువుగా పేర్చిన రాళ్లు. ఇవన్నీ ఒకే ప్రదేశంలో ఉన్నాయి. ఒక్కో నిలువు రాయి 10-15 అడుగులు ఎత్తులో ఉంది.

ఇక రెండోది గుండ్రంగా వలయాల్లా పేర్చిన చిన్న చిన్న బండరాళ్లు. వీటినే బౌల్డర్ అలైన్‌మెంట్స్ అంటారు. అవి ప్రస్తుతం 1,500 పైనే ఉన్నాయి. ఒకప్పుడు 3,000 వరకూ ఉండేవని చరిత్రకారులు చెబుతున్నారు. గుండ్రంగా పేర్చిన ఈ గుండ్రటి రాళ్లు, నిలువు రాళ్లకు కాస్త దగ్గరలో పదుల ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి.

ఇక మూడోది ‘కప్ మార్క్స్’ అంటే చిన్న చిన్న గుంటలు చెక్కిన రాళ్లు. అవి కూడా ఇదే ప్రదేశంలో ఉన్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ముడుమాల గ్రామంలో రాళ్లు

ఆనాటి మనుషుల అంతరిక్ష పరిజ్ఞానానికి నిదర్శనమా?

దేశంలో చాలా మెగాలిథిక్ ప్రదేశాలు ఉన్నా అంతరిక్ష పరిశోధనలకు సంబంధం ఉండటం ఈ ప్రాంతం ప్రత్యేకత అని శాస్త్రవేత్తలు చెప్పారు.

”ఇక్కడ చిన్న గుండ్రటి రాళ్ల మధ్య ఒక నలుచదరంగా ఉన్న రాయి ఉంది. ఆ రాయిపై ఉన్న కప్ మార్క్స్, అర్సా మేజర్ అంటే సప్తర్షి మండలాన్ని పోలి ఉన్నాయి. తాజాగా దగ్గరలో మరో బల్లపరుపు రాయి మీద కూడా నక్షత్ర మండలాన్ని పోలిన కప్ మార్క్స్ గుర్తించాం. బహుశా ఈ స్థలం దక్షిణ ఆసియాలో అంతరిక్ష గుర్తులను చెక్కిన మొట్టమొదటి స్థలం అయి ఉండవచ్చని నా అభిప్రాయం. సప్తర్షి మండలంలోని ఏడు నక్షత్రాల ఆకారాలతో పాటూ దుబే, మిరాక్ అనే ఉత్తర దిశను సూచించే రెండు నక్షత్రాలు పోలిన గుర్తులు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇవి కనీసం 3 వేల ఏళ్ల నాటివని నా ఉద్దేశం” అని చరిత్ర పరిశోధకులు ప్రొఫెసర్ కేపీ రావు బీబీసీతో చెప్పారు.

తెలంగాణ ప్రభుత్వ హెరిటేజ్ శాఖ అధికారులు, నారాయణ పేట జిల్లా యంత్రాంగం, దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్, కేపీ రావు వంటి వారు ఏటా జూన్ 21, డిసెంబరు 21 తేదీల్లో ఇక్కడికి సూర్యకాంతి పరిశీలనకు వస్తున్నారు. 2003 నుంచీ ఇక్కడ ఈ పరిశీలనలు జరుగుతున్నాయి.

సూర్యుని పరంగా కీలకమైన ఆయతనాల్లో ఉత్తరాయణ, దక్షిణాయణ చివర తేదీలలో ఈ రాళ్లపై సూర్యకాంతి వరుస క్రమంలో పడుతోందని కేపీ రావు బీబీసీకి చెప్పారు.

ముడుమాల గ్రామం

నిజాం కాలం నుంచీ ఆ స్థలం ప్రాధాన్యత గుర్తించినప్పటికీ ఈ ప్రదేశం చాలావరకు ప్రైవేటు భూమిగానూ, కొంత ప్రభుత్వ భూమిగానూ ఉంది.

గతంలో మెట్ట వ్యవసాయం చేసినప్పుడు ఇక్కడ సమస్య రాలేదు. కృష్ణానది నుంచి లిఫ్టు ఇరిగేషన్ వచ్చిన తరువాత ఈ రాళ్లను కదిపి, సరిహద్దులకు నెట్టివేసి వరిసాగు ప్రారంభించినప్పుడు ఈ ప్రదేశం చాలావరకూ దెబ్బతింది.

తరువాత తెలంగాణ ప్రభుత్వం నిలువు రాళ్లున్న పొలాన్ని మాత్రం రైతుల నుంచి కొని, కంచె వేసింది. ఒకప్పుడు దాదాపు 80 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఈ ప్రదేశం, ఇప్పుడు 20 ఎకరాలకు కుదించుకుపోయింది.

ఈ స్థలాన్ని అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం హెరిటేజ్ శాఖతో వేద కుమార్ ఆధ్వర్యంలోని దక్కన్ హెరిటేజ్ ట్రస్ట్ అకాడమీ ఒక ఒప్పందం చేసుకుని వారితో కలిసి పనిచేస్తోంది.

ముడుమాల గ్రామం

”ఈ ప్రదేశాన్ని కాపాడటానికి ప్రభుత్వ హెరిటేజ్ శాఖ సహకారంతో మా ప్రయత్నం చేస్తున్నాం. రైతులు గుండ్రటి రాళ్లను పొలం మధ్య నుంచి సరిహద్దులుగా జరిపేశారు. 3 వేల రాళ్లలో మిగిలిన 1,500 రాళ్లను ఇప్పుడు మేం రక్షిస్తున్నాం. రెస్క్యూ, రిజునవేట్, కన్జర్వ్, రిస్టోరేషన్ ఈ నాలుగూ చేయాలి. ఇక్కడ ఇంకా పరిశోధనలు జరగాలి. హెరిటేజ్ శాఖ, ఏఎస్ఐ, ఓయూ ఆస్ట్రోనమీ విభాగం, బిర్లా సెంటర్, జీఎస్ఐ రిటైర్డ్ సైంటిస్టులు ఇలా చాలామందితో ఒక కమిటీ వేశాం. తరచూ ఆ ప్రదేశం వెళుతున్నాం. ప్రభుత్వం ఫెన్సింగ్ వేసింది. మేం కూడా కొంత ప్రొటెక్షన్ ఏర్పాటు చేశాం. అక్కడ మట్టి తవ్వకాలను, ఇతర ఆక్రమణలనూ ఆపించాం. సైట్ శుభ్రం చేయించి ఇక దురాక్రమణ జరగకుండా కాపలా పెట్టాం” అని వేదకుమార్ బీబీసీతో చెప్పారు.

”ఇక్కడ ప్రతీదీ డాక్యుమెంట్ చేస్తున్నాం. ఈ ప్రాంతం అంతా సమగ్ర సర్వే చేశాం. నేల మీద, డ్రోన్ ద్వారా ఏరియల్, అలాగే మ్యాపులు, సైంటిఫిక్ సర్వే దాదాపు 300 ఎకరాల్లో చేశాం. ఇప్పుడు పూర్తి డాక్యుమెంటేషన్ ఉంది మన దగ్గర” అన్నారు వేదకుమార్.

స్థానికులు ఈ ప్రదేశాన్ని తిమ్మప్ప రాళ్లు అని పిలుస్తారు. ఇక్కడ తిమ్మప్ప దేవుణ్ణి, ఎల్లమ్మ దేవతను ఆరాధిస్తారు. ఇక్కడకు వచ్చి మొక్కు తీర్చుకుని, అక్కడే వంట చేసుకుని భోజనం చేసి వెళుతుంటారు. తిమ్మప్ప, ఎల్లమ్మ ఆరాధన చుట్టూ అనేక కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఆ దేవతల కోసం ఇటీవల గుడులు కూడా కట్టారు. కానీ, అలాంటి చారిత్రక ప్రాధాన్య స్థలాల్లో కొత్త నిర్మాణాలు చేపట్టడం సరికాదని చరిత్రకారుల భావన.

నియోలిథిక్ స్మారక చిహ్నం

ఫొటో సోర్స్, Getty Images

శాస్త్రవేత్తల్లో భిన్నాభిప్రాయాలు

ఈ నిలువు రాళ్లు సమాధుల చిహ్నాలా కాదా అనే విషయంలో కొందరు శాస్త్రవేత్తల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఎక్కువ మంది సమాధులే అని భావిస్తున్నారు. పూర్తి స్థాయి తవ్వకాలు జరిగిన తరువాతే అసలు విషయం బయట పడే అవకాశం ఉంది.

గుండ్రంగా పేర్చిన రాళ్లేంటి? నిలువు రాళ్లేంటి అనేది మరింత స్పష్టంగా తేలాల్సి ఉంది. ఆ నిలువు రాళ్లు ఏదైనా ముఖ్యమైన ఘటన, లేదా వ్యక్తుల జ్ఞాపకార్థం కూడా కావచ్చని పలువురు శాస్త్రవేత్తలు వివిధ సెమినార్లలో అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈ రాళ్లు, ఖగోళ గుర్తుల గురించి సమగ్ర వివరాలు తెలియాలంటే ఇక్కడ తవ్వకాలు జరపాలి. తవ్వకాల కోసం ఇప్పటికే ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను అనుమతి కోరుతూ తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది.

మరోవైపు ఈ ప్రదేశానికి యునెస్కో గుర్తింపు కోసం ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి. ఇక్కడ జరిగే ప్రతి చర్యా, ప్రతి ఏర్పాటు యునెస్కో నిబంధనలకు లోబడి, ఆ ప్రకారమే చేస్తున్నారని వేదకుమార్ చెప్పారు.

ఈ ప్రదేశానికి ప్రచారం కల్పించి, ఎక్కువ మంది పరిశోధనలు చేసేలా చేయడం కోసం వాటాదారులు ప్రయత్నం చేస్తున్నారు. వేదకుమార్, కేపీ రావులు రౌండ్ టేబుళ్లు, ప్రత్యేక కరపత్రాలు, సంచికలు, ప్రజెంటేషన్లు ఇస్తున్నారు. మొరాకో, జైపూర్, ఆస్ట్రేలియా, దిల్లీల్లో వీటి గురించి మాట్లాడారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

SOURCE : BBC NEWS