SOURCE :- BBC NEWS
అదొక మామూలు హత్యలాగే కనిపించింది.
సరిగ్గా వందేళ్ల క్రితం, అంటే 1925 జనవరి 12న వలస పాలనలో ఉన్న భారత్‌లోని బాంబే (ప్రస్తుతం ముంబయి) నగర శివారులో కారులో వెళ్తోన్న ఒక జంటపై పురుషుల ముఠా దాడి చేసింది. ఆ కారులోని పురుషుడిని కాల్చి చంపి, మహిళ ముఖాన్ని గాయపరిచారు ఆ ముఠా సభ్యులు.
అయితే, ఈ కేసులో బయటపడిన అంశాలు ప్రపంచవ్యాప్తంగా పతాక శీర్షికల్లో నిలిచాయి. ఈ కేసులోని సంక్లిష్టత దేశాన్ని పాలిస్తోన్న బ్రిటిష్ పాలకులను ఇబ్బందుల్లోకి నెట్టింది. ఓ భారతీయ రాజును గద్దె దింపింది.
వార్తా పత్రికలు, మ్యాగజీన్లు ఈ కేసు గురించి రాస్తూ, బహుశా బ్రిటిష్ ఇండియాలో నమోదైన అత్యంత సంచలనాత్మక నేరమని వర్ణించాయి.
బాధితుడు అబ్దుల్ కదీర్ బావ్లా వయసు 25 ఏళ్లు. ఆయన నగరంలో పలుకుబడి ఉన్న వస్త్ర వ్యాపారి. అతిపిన్న మున్సిపల్ అధికారి. కారులో ఆయనతో ఉన్న సహచరి పేరు ముంతాజ్ బేగమ్. ఆమె వయసు 22 ఏళ్లు. ఒక సంస్థానంలోని అంతఃపురం నుంచి పారిపోయి వచ్చిన సెక్స్ వర్కర్ ఆమె. కొన్ని నెలల ముందు నుంచి బావ్లాతో ఆమె ఉంటున్నారు.
హత్య జరిగిన సాయంత్రాన బావ్లా, ముంతాజ్ బేగమ్ మరో ముగ్గురితో కలిసి కారులో అరేబియా సముద్ర తీరంలోని మలబార్ హిల్‌కు వెళ్తున్నారు. అప్పట్లో భారత్‌లో కార్లలో తిరిగేవారు చాలా తక్కువ. కేవలం ధనికులు మాత్రమే కార్లను కలిగి ఉండేవారు.
ఇంటెలిజెన్స్ వర్గాలు, వార్తాపత్రికల కథనాల ప్రకారం, రోడ్డుపై అకస్మాత్తుగా ఒక కారు ముందుకొచ్చి వారి కారును ఢీకొట్టింది. దీంతో బావ్లా ప్రయాణిస్తోన్న కారు ఆగిపోయింది.
”ఆగంతకులు బావ్లాను దూషించి, లోపల ఉన్న మహిళను బయటకు పంపించు” అని అరిచినట్లు తర్వాత బాంబే హైకోర్టులో ముంతాజ్ బేగమ్ వాంగ్మూలం ఇచ్చారు.
ఆ తర్వాత బావ్లాను కాల్చేశారని, కొన్ని గంటల తర్వాత ఆయన మరణించారని ఆమె తెలిపారు.
గోల్ఫ్ ఆడి తిరిగొస్తున్న బ్రిటిష్ సైనికుల బృందం తుపాకీ గుండ్ల చప్పుడు విని సంఘటనా స్థలానికి చేరుకుంది. నిందితుల్లో ఒకరిని పట్టుకోగలిగింది. కానీ, దుండగులు జరిపిన కాల్పుల్లో ఒక అధికారి గాయపడ్డారు.
దుండగులు పారిపోవడానికి ముందు రెండుసార్లు, గాయపడిన ముంతాజ్ బేగమ్‌ను బ్రిటిష్ అధికారుల నుంచి లాక్కోవడానికి ప్రయత్నించారు. తర్వాత ఆమెను సైనికులు ఆసుపత్రిలో చేర్చారు.
ముంతాజ్ బేగమ్‌ను అపహరించడమే లక్ష్యంగా దుండగులు దాడికి పాల్పడి ఉంటారని వార్తా పత్రికలు పేర్కొన్నాయి. ఆమెకు ఆశ్రయం కల్పించిన బావ్లా అనేక సార్లు బెదిరింపుల్ని ఎదుర్కొన్నారు. కొన్ని నెలల క్రితం, ముంబయిలో ఒక ప్రదర్శన సమయంలో బావ్లాను కలిసిన ముంతాజ్ బేగమ్, అప్పటి నుంచి ఆయనతో కలిసి ఉంటున్నారు.
‘ద ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా’ మ్యాగజీన్ తమ పాఠకుల కోసం ముంతాజ్ బేగమ్ ప్రత్యేక ఫోటోలను ప్రచురించింది. ఆమె ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలను ప్రతిరోజూ మీడియాకు వెల్లడించేందుకు పోలీసులు ప్రణాళికలు వేస్తున్నారని మరాఠీ వార్తాపత్రిక నవకల్ పేర్కొంది.
ఈ కేసుపై బాలీవుడ్ కూడా బాగా ఆసక్తి చూపింది. నెలల వ్యవధిలో దీన్నొక సైలెంట్ మర్డర్ థ్రిల్లర్ సినిమాగా మలచాలని భావించింది.
”ఈ కేసు మామూలు మర్డర్ మిస్టరీని మించిపోయింది. ఎందుకంటే ఇది ఒక ధనవంతుడైన యువ వ్యాపారి, ఒక రాజు, మరొక అందమైన మహిళతో ముడిపడి ఉంది” అని ‘ద బావ్లా మర్డర్ కేస్: లవ్, లస్ట్ అండ్ క్రైమ్ ఇన్ కలోనియల్ ఇండియా’ అనే పుస్తక రచయిత ధవళ్ కులకర్ణి అన్నారు.
మీడియా ఊహించినట్లుగానే ఆ నిందితుల అడుగుజాడలు, దర్యాప్తు అధికారుల దృష్టిని బ్రిటిష్ మిత్రపక్షమైన, పలుకుబడి ఉన్న ఇందౌర్ సంస్థానం వైపు మరల్చాయి. ఆ సంస్థానాన్ని మహారాజా తుకోజి రావు హోల్కర్ 3 అనే హిందూ రాజు పాలించేవారు. ముస్లిం అయిన ముంతాజ్ బేగమ్, ఆయన అంతఃపురంలో ఉండేవారు.
ముంతాజ్ బేగమ్ తన అందానికి చాలా ప్రసిద్ధి పొందారు. ఆమెను నియంత్రించడానికి మహారాజా చేసిన ప్రయత్నాలు వారిద్దరి మధ్య సంబంధాలను దెబ్బతీశాయని కులకర్ణి పేర్కొన్నారు. ఆమె ఒంటరిగా కుటుంబాన్ని కలవకుండా అడ్డుకోవడం, ఎల్లప్పుడూ ఆమెపై నిఘా పెట్టడం వంటివి మహారాజా చేసేవారని పుస్తకంలో పేర్కొన్నారు.
”నాపై ఎప్పుడూ నిఘా ఉంచేవారు. నా కుటుంబీకులను, బంధువులను లేదా అతిథులను కలవడానికి వెళ్లినప్పుడు ఎవరో ఒకర్ని నాకు తోడుగా పంపించేవారు” అని కోర్టులో ముంతాజ్ బేగమ్ వాంగ్మూలం ఇచ్చారు.
ఇందౌర్‌లో ఉన్నప్పుడు ఆమె ఒక ఆడ బిడ్డకు జన్మించారు. పుట్టిన వెంటనే ఆ బిడ్డ మరణించారు.
”నా బిడ్డ చనిపోయిన తర్వాత ఇందౌర్‌లో నాకు ఉండాలనిపించలేదు. ఎందుకంటే నా బిడ్డను నర్సులే చంపేశారు” అని కోర్టులో ముంతాజ్ బేగమ్ చెప్పారు.
ఇది జరిగిన నెలల వ్యవధిలో ఆమె అక్కడి నుంచి తన తల్లి స్వస్థలమైన అమృత్‌సర్‌కు పారిపోయారు. కానీ, సమస్యలు ఆమెను వీడలేదు.
అక్కడ కూడా ఆమెను మహారాజా సంబంధీకులు గుర్తించారు. మహారాజా ఏడుస్తూ, ఆమెను తిరిగి రావాలని వేడుకున్నారని ముంతాజ్ బేగమ్ సవతి తండ్రి కోర్టులో చెప్పారు. అందుకు నిరాకరించిన ఆమె బాంబేకు వెళ్లారు. అక్కడ కూడా ఆమెపై నిఘా కొనసాగింది.
హత్య తర్వాత మీడియా ఊహించిన అంశాలే విచారణలో నిర్ధరణ అయ్యాయి. ముంతాజ్ బేగమ్‌కు ఆశ్రయం ఇస్తే తీవ్ర పర్యవసనాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని మహారాజా ప్రతినిధులు బావ్లాను హెచ్చరించారు. కానీ, ఆ హెచ్చరికల్ని ఆయన పట్టించుకోలేదు.
ఘటనా స్థలంలో సైనికులు పట్టుకున్న ఏకైక నిందితుడు షఫీ అహ్మద్ ఇచ్చిన సమాచారంతో ఇందౌర్‌లో మరో ఏడుగురిని బాంబే పోలీసులు అరెస్ట్ చేశారు.
కేసు దర్యాప్తులో ఈ హత్యతో మహారాజాకు సంబంధాలు ఉన్నట్లు వెల్లడైంది. అరెస్ట్ అయిన వారిలో ఎక్కువ మంది ఇందౌర్ సంస్థానంలో పనిచేస్తోన్నవారే. వారంతా ఏకకాలంలో సెలవుల్లో ఉన్నారు. నేరం జరిగిన సమయంలో బాంబేలో ఉన్నారు.
ఈ హత్య, బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టింది. బాంబేలో హత్య జరిగినప్పటికీ, కుట్ర చేసింది మాత్రం బ్రిటిషర్లతో పటిష్ఠ సంబంధాలున్న ఇందౌర్‌లో అని దర్యాప్తులో స్పష్టంగా తెలిసింది.
బ్రిటిష్ ప్రభుత్వానికి ఇది అత్యంత ఇబ్బందికర వ్యవహారమని ‘ద న్యూ స్టేట్స్‌మన్’ వార్తాపత్రిక పేర్కొంది.
”ఒకవేళ ఇది చిన్న రాజ్యమైతే ఎలాంటి సమస్య ఉండకపోయేది. కానీ, ఇందౌర్ శక్తిమంతమైన సంస్థానం” అని రాసింది.
బ్రిటిష్ ప్రభుత్వం ఈ హత్యలో ఇందౌర్ సంస్థానం ప్రమేయం గురించి తొలుత బహిరంగంగా మాట్లాడకుండా ఉండటానికి ప్రయత్నించింది. కానీ, ప్రైవేటుగా ఈ అంశంపై వారు చాలా చర్చించినట్లు బాంబే ప్రభుత్వం, బ్రిటిష్ ఇండియా మధ్య జరిగిన చర్చలు చూపుతాయి.
సాక్ష్యాధారాలన్నీ ఈ హత్యకు ఇందౌర్‌లోనే కుట్ర జరిగినట్లు, కిరాయి రౌడీలతో ముంతాజ్ బేగమ్‌ను అపహరించడానికి ప్రణాళిక అక్కడే రచించినట్లు చూపుతున్నాయని బ్రిటిష్ ప్రభుత్వంతో బాంబే పోలీస్ కమిషనర్ ప్యాట్రిక్ కెల్లీ చెప్పారు.
బ్రిటిష్ ప్రభుత్వంపై వివిధ వర్గాల నుంచి ఒత్తిడి పెరిగింది. బావ్లాకు చెందిన సంపన్న వర్గం మోమెన్స్ కూడా ఈ అంశాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లింది. బావ్లా మరణం పట్ల సహచర మున్సిపల్ అధికారులు సంతాపం ప్రకటించారు. ఈ హత్య వెనుక కచ్చితంగా ఏదో పెద్ద కుట్ర ఉంటుందని వారు అన్నారు.
ఈ హత్యకు సంబంధించిన సమాధానాలు కావాలని బ్రిటిష్ ఇండియా లెజిస్లేచర్ ఎగువ సభలో శాసన సభ్యులు డిమాండ్ చేశారు. బ్రిటిష్ హౌజ్ ఆఫ్ కామన్స్‌లో కూడా ఈ కేసు గురించి చర్చించారు.
ఈ హత్య దర్యాప్తును నెమ్మదిగా చేయాలంటూ దర్యాప్తుదారులపై ఒత్తిడి వచ్చిందని, పోలీస్ కమిషనర్ కెల్లీ తన ఉద్యోగానికి రాజీనామా చేస్తానంటూ బెదిరించారని మాజీ పోలీసు అధికారి రోహిదాస్ నారాయణ్ డుసర్, ఈ హత్యపై రాసిన తన పుస్తకంలో పేర్కొన్నారు.
ఈ కేసు బాంబే హైకోర్టుకు చేరింది. ప్రాసిక్యూషన్, డిఫెన్స్ తరఫున అగ్రశ్రేణి లాయర్లు నిలబడ్డారు. వారిలో ఒకరు ముహమ్మద్ అలీ జిన్నా. 1947లో భారత విభజన తర్వాత ఈయన ‘ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్’గా పేరు పొందారు.
నిందితుల్లో ఒకరు, ఇందౌర్ ఆర్మీ ఉన్నతాధికారి అయిన ఆనందరావు గంగారామ్ ఫాన్సేను జిన్నా సమర్థించారు. మరణశిక్ష పడకుండా ఆయనను కాపాడారు.
కోర్టు ఈ కేసులో ముగ్గురికి మరణశిక్ష, మరో ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. కానీ, మహారాజాను బాధ్యుడిగా చేయడంలో ఆగిపోయింది.
”దాడి చేసిన వారి వెనుక ఎవరు ఉన్నారో కచ్చితంగా మేం సూచించలేం” అని ఈ విచారణకు నేతృత్వం వహించిన జస్టిస్ ఎల్సీ క్రంప్ అన్నారు.
”ఇందౌర్ మహారాజా వద్ద పదేళ్ల పాటు ఆ మహిళ ఉన్నంత మాత్రానా ఆమెను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారంటూ ఇందౌర్ వైపు వేలెత్తి చూపడం సమంజసం కాదు” అని జడ్జి తీర్పులో పేర్కొన్నారు.
ఈ కేసు ప్రాముఖ్యత కారణంగా బ్రిటిష్ ప్రభుత్వం వీలైనంత త్వరగా మహారాజాపై చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. విచారణ కమిషన్‌ను ఎదుర్కోవడం లేదా గద్దె దిగిపోవాలంటూ రెండు ఎంపికలను మహారాజాకు సూచించారని భారత పార్లమెంట్‌కు సమర్పించిన పత్రాల్లో పేర్కొన్నారు.
సింహాసనాన్ని వదిలేయాలని మహారాజా నిర్ణయించుకున్నారు.
”నా కుమారుడి కోసం నా సింహాసనాన్ని వదులుకుంటున్నాను. మలబార్ హిల్ కేసులో నాపై వచ్చిన ఆరోపణలపై తదుపరి విచారణ జరుగదని అనుకుంటున్నా” అని బ్రిటిష్ ప్రభుత్వానికి రాసిన లేఖలో మహారాజా పేర్కొన్నారు.
గద్దె దిగిన తర్వాత మహారాజా మరో వివాదానికి కేంద్ర బిందువు అయ్యారు. తన కుటుంబం, కమ్యూనిటీ ఇష్టాలకు వ్యతిరేకంగా ఒక అమెరికా మహిళను ఆయన వివాహం చేసుకున్నారు.
ఆమె హిందువుగా మారిన తర్వాతే ఈ వివాహం జరిగినట్లు బ్రిటిష్ హోం మంత్రిత్వ శాఖ రిపోర్టు తెలుపుతోంది.
మరోవైపు, ముంతాజ్ బేగమ్‌కు హాలీవుడ్ ఆఫర్లు రావడంతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం అమెరికా వెళ్లారు. తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)