SOURCE :- BBC NEWS
- రచయిత, కేటీ వాట్సన్
- హోదా, ఆస్ట్రేలియా ప్రతినిధి
-
3 జనవరి 2025
డార్విన్ హార్బర్‌లో చీకటి పడుతోంది. ప్రభుత్వ రేంజర్ కెల్లీ మొసళ్లను బంధించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఇటీవలే భారీ వరదలు వచ్చాయి. మేం ప్రయాణిస్తున్న పడవ ఇంజన్ ఆపేయడంతో అది శబ్దం చేయకుండా వెళ్తోంది.
మేం ఆస్ట్రేలియాలోని నార్తర్న్ టెరిటరీలో ఉన్నాం.
ఇక్కడ లక్షకు పైగా ఉప్పునీటి మొసళ్లు ఉన్నాయని అంచనా. ప్రపంచంలో మరెక్కడా ఒకే ప్రాంతంలో ఇన్ని మొసళ్లు లేవు.
నార్తర్న్ టెరిటరీ రాజధాని డార్విన్. చుట్టూ బీచ్‌లు, పొడి నేలలు ఉన్న చిన్న తీరప్రాంత నగరం ఇది.
మీరు నార్తర్న్ టెరిటరీకి వస్తే అక్కడ నీరు ఉన్న ప్రతిచోటా మొసళ్లు ఉంటాయని వెంటనే తెలుసుకుంటారు.
సాల్టీస్ అని స్థానికులు పిలుచుకునే ఈ ఉప్పునీటి మొసళ్లు 50 ఏళ్ల కిందట వేట కారణంగా అంతరించే దశకు చేరుకున్నాయి.
రెండో ప్రపంచ యుద్దం తర్వాత మొసళ్ల చర్మంతో వ్యాపారం వల్ల వేట తీవ్రమై వాటి సంఖ్య 3వేలకు పడిపోయింది.
అయితే 1971లో వేట నిలిపివేసిన తర్వాత వాటి సంఖ్య వేగంగా పెరగడం మొదలైంది.
అవి ఇప్పుడు రక్షిత జంతువుల జాబితాలో ఉన్నాయి, వాటికి ఎలాంటి ప్రమాదం లేదు.
సాల్ట్ వాటర్ మొసళ్ల సంఖ్య ఇప్పుడు భారీగా పెరిగిపోయింది. దీంతో ప్రజల భద్రత దృష్ట్యా వాటి సంఖ్యను తగ్గించాల్సి వస్తోంది.
“ప్రజల కంటే మొసళ్ల సంఖ్య ఎక్కువగా పెరుగుతున్నప్పుడు ఇలాంటి పరిస్థితులే వస్తాయి” అని మొసళ్ల నిపుణుడు ప్రొఫెసర్ గ్రాహమ్ వెబ్ చెప్పారు.
“అలాంటప్పుడు రాజకీయ నాయకులు రంగంలోకి దిగి మొసళ్ల సమస్యను పరిష్కరిస్తామని చెబుతారు” అని ఆయన అన్నారు.
నార్తర్న్ టెరిటరీలో వేడిగా ఉండే ఉష్ణోగ్రతలు మొసళ్ల ఆవాసానికి చక్కగా సరిపోతాయి.
ఆగ్నేయాసియాలోని కొన్ని ప్రాంతాలు పశ్చిమ ఆస్ట్రేలియాలోని నార్తర్న్ క్వీన్స్‌లాండ్‌లో ఉప్పునీటిలో ఉండే మొసళ్ల సంఖ్య ఎక్కువగా ఉంది.
మొసళ్లలో కొన్ని జాతులు అంతగా హానికరం కావు, అయితే ఉప్పు నీటిలో ఉండే మొసళ్లు మాత్రం చాలా దూకుడుగా ఉంటాయి.
ఆస్ట్రేలియాలో మొసళ్ల కారణంగా ప్రాణాంతక ఘటనలు జరగడం అరుదు. కానీ, జరిగిన సందర్భాలున్నాయి.
నిరుడు 12 ఏళ్ల బాలికను మొసళ్లు పట్టుకున్నాయి. నార్తర్న్ టెరిటరీలో 2018 తర్వాత అది తొలి మరణం.
మొసళ్లతో జీవనం
ఇవిన్ అతని సహచరులకు ఇది పని ఒత్తిడి ఎక్కువగా ఉండే సమయం.
మొసళ్లు గుడ్లు పెట్టే సీజన్ మొదలైంది. ఈ సీజన్‌లో అవి ఒక చోట నుంచి మరొక చోటకు మారుతుంటాయి.
వారంలో అనేక సార్లు ఇవిన్ అతని బృందం నీటిలో ఉంటారు. డార్విన్ చుట్టు పక్కల 24 ‘క్రొకడైల్ ట్రాప్’లను నిరంతరం పర్యవేక్షిస్తుంటారు.
ఈ ప్రాంతం చేపలవేటకు ప్రసిద్ది చెందినది. అలాగే కొంతమంది ధైర్యవంతులైన గజ ఈతగాళ్లకు కూడా.
హార్బర్ నుంచి బయటకు తీసుకువచ్చిన మొసళ్లను చంపేస్తారు. ఎందుకంటే వాటిని వేరే ప్రాంతంలో వదిలేసినా అవి తిరిగి హార్బర్‌కే వస్తాయి.
“ప్రజలను రక్షించడం మా బాధ్యత” అని ఇవిన్ చెప్పారు. ఆయన రెండేళ్లుగా ఈ ఉద్యోగం చేస్తున్నారు. అంతకు ముందు పోలీస్ అధికారిగా పని చేశారు.
“మేం ప్రతి మొసలిని పట్టుకోం. అయితే వీలైనన్ని ఎక్కువ మొసళ్లను హార్బర్ నుంచి బయటకు తీసుకువస్తాం. అందువల్ల ప్రజలకు వాటితో సమస్య ఉండదు” అని ఇవిన్ చెప్పారు.
ఇందులో మొదటి అంశం స్థానికులకు మొసళ్ల గురించి అవగాహన కల్పించడం.
నార్తర్న్ టెరిటరీ ప్రభుత్వం స్కూళ్లలో “బి క్రాక్‌వైజ్” అనే పేరుతో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా మొసళ్ల ఆవాసాల సమీపంలో ఉండే ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో బోధిస్తారు.
ఇది ఎంతగా విజయవంతం అయిందంటే ఫ్లోరిడా, ఫిలిప్పీన్స్ కూడా ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని ఆలోచిస్తున్నాయి.
“మేం మొసళ్లు ఉండే దేశంలో జీవిస్తున్నాం. అందుకే నీరు ఉన్న ప్రాంతంలో సురక్షితంగా ఎలా ఉండాలనేది నేర్చుకుంటున్నాం” అని ఈ కార్యక్రమ నిర్వహకురాలు నటాషా హాఫ్‌మన్ చెప్పారు.
“మీరు పడవలో ప్రయాణిస్తూ చేపలు పడుతూ ఉంటే, మొసళ్లు కూడా అక్కడ ఉన్నాయని గుర్తుంచుకోవాలి. అవి మాటు వేసి దాడి చేసే జంతువులు. వేట కోసం అవి చాలా ఓపిగ్గా వేచి చూస్తాయి. ఆహారం లభించే అవకాశం ఉందని భావిస్తే, దాడి చేస్తాయి” అని ఆమె వివరించారు.
నార్తర్న్ టెరిటరీలో మొసళ్లను చంపే కార్యక్రమం పెద్ద ఎత్తున ఏమీ చేపట్టలేదు. అవి రక్షిత జీవుల జాబితాలో ఉండడమే దానికి కారణం.
అయినప్పటికీ ప్రభుత్వం నిరుడు పదేళ్ల మొసళ్ల నిర్వహణ ప్రణాళికకు ఆమోదం తెలిపింది.
దాని ప్రకారం ఏడాదికి 1200 వరకు మొసళ్లకు చంపేందుకు అనుమతులిచ్చారు.
మొసళ్లలో ఏదైనా మనుషులకు ముప్పుగా మారుతుందని ఇవిన్ టీమ్ భావిస్తే వాళ్లు దాన్ని వెంటనే అక్కడ నుంచి తొలగిస్తారు.
గతేడాది 12 ఏళ్ల బాలిక చనిపోయినప్పుడు నార్తర్న్ టెరిటరీ నాయకురాలు ఇవా లాలర్ మొసళ్ల సంఖ్య తగ్గించే చర్యలు చేపట్టాలన్నారు.
ప్రస్తుతం ఇక్కడ ఉప్పునీటి మొసళ్లు 2.50 లక్షలు ఉన్నాయి.
పెద్ద వ్యాపారం
మొసళ్ల సంఖ్య ఎంత ఉండాలనే దానిపై వివాదం ఉండవచ్చు, అయితే మొసలి చర్మం కొనుగోలు చెయ్యడానికి వచ్చే పర్యటకులకు నార్తర్న్ టెరిటరీ పెద్ద వరం.
అడిలైడ్ నదిలో మొసళ్లకు ఆహారం వేసేటప్పుడు అది అందుకోవడానికి అవి పైకి ఎగరడాన్ని చూసేందుకు పర్యటకులు అక్కడకు వస్తుంటారు.
విలియమ్స్‌కు చిన్నప్పటి నుంచి మొసళ్లంటే ఇష్టం. వాటి వల్ల చాలా అవకాశాలు ఉన్నాయని ఆయన నమ్ముతారు.
“పదేళ్లలో పర్యటకుల సంఖ్య బాగా పెరిగింది” అన్నారాయన.
మొసళ్ల వేటపై నిషేధం విధించడంతో వాటిని పెంచడం అనేది ఆర్థికంగా లాభసాటి అంశంగా మారింది.
నార్తర్న్ టెరిటరీలో ప్రస్తుతం లక్షన్నర మొసళ్లను పెంచుతున్నట్లు అంచనా.
లూయి విటన్, హెర్మిస్ లాంటి ఫ్యాషన్ సంస్థలు మొసళ్ల పెంపకంలో పెట్టుబడులు పెట్టాయి. హెర్మిస్ తయారు చేసిన బిర్కిన్ 35 క్రాక్ హ్యాండ్ బ్యాగ్ 4.26 కోట్ల రూపాయల వరకు ఉంటుంది.
“మొసళ్లను పెంచేందుకు ప్రభుత్వం వాణిజ్యపరమైన ప్రోత్సహకాలు ఇస్తోంది” అని మిక్ బర్న్స్ చెప్పారు.
నార్తర్న్ టెరిటరీలో ఆయన విలాసవంతమైన బ్రాండ్లకు చెందిన సంస్థలతో కలిసి పని చేస్తుంటారు.
డార్విన్ శివార్లలో ఆయన ఆఫీసు ఉంది. మొసళ్ల చర్మంతో ఆయన ఒక ఫ్లోర్ మొత్తాన్ని అలంకరించారు.
బర్న్స్‌కు డార్విన్ నుంచి 500 కిలోమీటర్ల దూరంలో అర్న్‌హెమ్ ల్యాండ్ వద్ద వ్యవసాయ క్షేత్రం ఉంది. అక్కడ ఆయన స్థానిక మూలవాసీ రేంజర్లతో కలిసి మొసలి గుడ్లను పొదిగిస్తారు. ఆ మొసళ్ల చర్మాన్ని విలాసవస్తువుల పరిశ్రమకు అమ్ముతుంటారు.
మొసళ్లను వ్యవసాయ క్షేత్రాల్లో బందించి పెంచడంపై జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS