SOURCE :- BBC NEWS

అటారీ బోర్డర్

ఫొటో సోర్స్, Getty Images

పహల్గాం తీవ్రవాద దాడి తర్వాత ఏప్రిల్ 23న భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ విలేఖరుల సమావేశం నిర్వహించారు.

ఈ దాడి తర్వాత ప్రభుత్వం తీసుకున్న ఐదు ముఖ్యమైన నిర్ణయాలను ఆయన వివరించారు. వాటిలో పంజాబ్‌లోని ‘అటారీ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్’ను వెంటనే మూసివేస్తున్నట్లు ప్రకటించడం ముఖ్యమైన నిర్ణయం.

ఈ నిర్ణయాలను భద్రతా వ్యవహారాల క్యాబినెట్‌లో కమిటీ సమావేశంలో తీసుకున్నారు.

ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ప్రధాని నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, ANI

ఇప్పటి వరకు సరైన పత్రాలతో అటారీ చెక్ పోస్ట్ ద్వారా భారతదేశంలోకి ప్రవేశించిన వారు మే 1 లోపు పాకిస్తాన్‌కు తిరిగి వెళ్లాలని సీసీఎస్ నిర్ణయాలు పేర్కొన్నాయి.

అయితే, ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ వ్యవహారాల్లో ఎక్కడా కూడా పాకిస్తాన్ పేరును ప్రస్తావించలేదు భారత ప్రభుత్వం.

పహల్గాం దాడితో ‘సరిహద్దు ఆవలి వారికి’ సంబంధాలు ఉన్నాయని పేర్కొంది.

పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ

ఫొటో సోర్స్, https://x.com/ForeignOfficePk

అటారీ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ద్వారా వ్యాపారం

భారత ప్రభుత్వంలో సీసీఎస్ ( క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ) సమావేశం తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వంలో ఒక సమావేశం నిర్వహించింది.

భారత్‌తో వ్యాపార సంబంధాలన్నింటిని పూర్తిగా తెంచేసుకుంటున్నట్లు, మూడో దేశం ద్వారా జరిగే ట్రేడింగ్‌ను కూడా నిలిపేస్తున్నట్లు పాకిస్తాన్ వెల్లడించింది.

వ్యాపారం నిలిపివేత నిర్ణయంతో రెండు దేశాల మధ్య వాణిజ్యం ఎలా ఉంటుంది, ఎవరు ఎవరికి ఏం అమ్ముతున్నారు, ప్రభుత్వాల నిర్ణయాల ఫలితం ఎలా ఉండబోతోంది? అన్నది చర్చనీయాంశంగా మారింది.

పాకిస్తానీ పౌరులు

ఫొటో సోర్స్, Getty Images

అటారీ చెక్ పోస్ట్‌ను ‘అటారీ ల్యాండ్ పోర్ట్’ అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలో తొలి ‘ల్యాండ్ పోర్టు’.

అమృత్‌సర్‌కు ఇది సుమారు 28 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ల్యాండ్ పోర్ట్ పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌లతో భూమార్గం ద్వారా వాణిజ్యం నిర్వహించడానికి భారత్‌కున్న ఏకైక పోర్టు.

అధికారిక గణాంకాలను పరిశీలిస్తే, 2023-24 సంవత్సరంలో, అటారీ నుంచి దాదాపు రూ.3,886 కోట్ల విలువైన ట్రేడ్ జరిగింది. అలాగే, దీని ద్వారా 71, 563 మంది రెండు దేశాల మధ్య సరిహద్దు దాటారు.

ఈ సంఖ్య 2017-18 సంవత్సరంలో ఎక్కువగా ఉంది. ఆ కాలంలో, దాదాపు రూ.4,148 కోట్ల విలువైన వ్యాపారం జరిగింది. 80,314 మంది ఈ మార్గాన్ని ఉపయోగించి సరిహద్దు దాటారు.

తాజాగా రెండు ప్రభుత్వాల నిర్ణయాల కారణంగా, వస్తువుల, ప్రజల రాకపోకలు రెండూ ఆగిపోతాయి.

మరి అఫ్గానిస్తాన్ ‌నుంచి వచ్చే వస్తువుల పరిస్థితి ఏంటి? వాటిని వేరే విధంగా భారతదేశానికి తీసుకువస్తారా? అన్నదానిపై ఇంకా అనిశ్చితి ఉంది.

2021 సంవత్సరంలో, అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్లు అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అంతకు ముందే, భారత్, అఫ్గానిస్తాన్‌ల మధ్య వాణిజ్యాన్నిప్రోత్సహించడంలో భాగంగా వాయుమార్గం ద్వారా వస్తువుల తరలింపు మొదలైంది.

భారతదేశం, అఫ్గానిస్తాన్ మధ్య వాణిజ్యం కొనసాగుతోందని 2023లో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ అన్నారు. ఇరాన్‌లో ఉన్న చాబహార్ ఓడరేవు కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తోంది.

పహల్గాం దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం ప్రభావం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడానికి, పంజాబ్‌కు చెందిన కొంతమంది వ్యాపారవేత్తలతో బీబీసీ మాట్లాడింది.

వ్యాపారం

ఫొటో సోర్స్, Getty Images

‘సముద్ర మార్గం ద్వారా వాణిజ్యాన్ని పెంచాలి’

బాదిష్ జిందాల్ లూథియానాకు చెందిన ‘వరల్డ్ ఎమ్ఎస్ఎమ్ఈ ఫోరం’ అధ్యక్షుడు.

ఆయన చెప్పినదాని ప్రకారం, భారతదేశపు ఎగుమతులు ఎక్కువగా సముద్ర మార్గం గుండానే పాకిస్తాన్‌కు చేరుకుంటాయి, అటారీ చెక్ పోస్ట్ ద్వారా కాదు.

“భారతదేశం అఫ్గానిస్తాన్ నుంచి దిగుమతి చేసుకునే డ్రై ఫ్రూట్స్ ఇకపై అటారీ చెక్ పోస్ట్ ద్వారా రాకపోవచ్చు. మనం వాటి కోసం ఇకపై ఎక్కువ ధర చెల్లించాల్సి రావచ్చు. కానీ తీవ్రవాద కార్యకలాపాలను అరికట్టడానికి ప్రభుత్వం పాకిస్తాన్‌పై ఒత్తిడి తీసుకురావాలని మేం కోరుకుంటున్నాం” అని జిందాల్ అన్నారు.

అటారీ చెక్ పోస్ట్

ఫొటో సోర్స్, Getty Images

రాజ్‌దీప్ ఉప్పల్ భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) అమృత్‌సర్ జోన్ మాజీ అధ్యక్షులు.

“భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి మేం కట్టుబడి ఉన్నాం. ఏదేమైనా, 2019 నుంచి, అక్కడి నుంచి (అటారీ) భారతదేశం, పాకిస్తాన్ మధ్య వాణిజ్యం పెద్దగా జరగడం లేదు. భారతదేశానికి చేరుతున్నది అఫ్గానిస్తాన్‌ నుంచి వచ్చే వస్తువులే. అవి పాకిస్తాన్ ద్వారా వస్తున్నాయి” అని ఆయన బీబీసీతో చెప్పారు.

“అఫ్గానిస్తాన్, మధ్య ఆసియా దేశాలతో సముద్ర మార్గాల ద్వారా వాణిజ్యాన్ని పెంచుకోవాలన్నది నా సూచన” అని ఆయన అన్నారు.

మందులు

ఫొటో సోర్స్, Getty Images

గణాంకాలు ఏం చెబుతున్నాయి?

ఈ సంవత్సరం భారత ప్రభుత్వ అధికారిక డేటాను పరిశీలిస్తే, ఈ సంవత్సరం ఇప్పటి వరకు భారత్ రూ. 3,833 కోట్లకు పైగా విలువైన వస్తువులను ఎగుమతి చేసింది. పాకిస్తాన్‌ నుంచి ఏ వస్తువునూ దిగుమతి చేసుకోలేదు. ఈ డేటా ప్రకారం, మందులు, పంచదార, ఆటో మొబైల్ విడిభాగాలు వంటి వాటిని భారత్ ఎగుమతి చేస్తుంది.

2023-24 సంవత్సరంలో, భారతదేశం రూ.10,096 కోట్ల విలువైన వస్తువులను పాకిస్తాన్‌కు ఎగుమతి చేయగా, రూ.25 కోట్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంది.

2018-19, 2020-21 మధ్య వాణిజ్యంలో స్థిరమైన క్షీణత తర్వాత, గత కొన్ని సంవత్సరాలుగా రెండు దేశాల మధ్య వాణిజ్యం పెరిగింది.

అయినప్పటికీ, ఇప్పుడు అఫ్గానిస్తాన్‌ కాకుండా, దక్షిణాసియాలోని మిగతా దేశాలతో పోల్చితే భారత్‌తో అతి తక్కువ వాణిజ్య సంబంధాలున్న దేశం ఏదైనా ఉందా అంటే అది పాకిస్తానే.

పీయూష్ గోయల్

ఫొటో సోర్స్, ANI

ఫిబ్రవరి 2024లో, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ లోక్‌సభలో ఒక ప్రకటన చేశారు.

“ఆగస్టు 2019 లో, భారతదేశంతో ద్వైపాక్షిక సంబంధాలను తగ్గించడానికి పాకిస్తాన్ అనేక చర్యలు తీసుకుంది. వీటిలో ఒకటి భారతదేశంతో వాణిజ్యాన్ని నిలిపివేయడం. అయితే, తరువాత, భారత్ నుంచి మెడికల్ ప్రోడక్ట్స్ మాత్రమే దిగుమతి చేసుకోవడానికి అనుమతించింది పాకిస్తాన్ వాణిజ్య మంత్రిత్వ శాఖ. ఎటువంటి నిర్దిష్ట మార్గాన్ని ప్రస్తావించనప్పటికీ, సాధారణంగా అటారీ-వాఘా సరిహద్దు, కరాచీ ఓడరేవు, భారతదేశం, పాకిస్తాన్ మధ్య రెండు ప్రధాన వాణిజ్య మార్గాలు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని తిరిగి ప్రారంభించడం పాకిస్తాన్ ప్రభుత్వ బాధ్యత” అని ఆయన పేర్కొన్నారు.

లాహోర్‌, మార్కెట్

ఫొటో సోర్స్, Getty Images

నిపుణులు ఏం చెబుతున్నారు?

అనిల్ కుమార్ బాబా ‘ల్యాండ్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా’ చైర్మన్‌. ఆయన ఏం చెప్పారంటే…

“భారతదేశం నుంచి పాకిస్తాన్ చాలా తక్కువ వస్తువులను కొనుగోలు చేసేది. అటారీ నుంచి పాకిస్తాన్‌కు వెళ్లే వస్తువులు ఎక్కువగా కూరగాయలు, పండ్లు, బట్టలు మొదలైనవి. వాటి ధర ఎక్కువగా ఉండేది కాదు. మేం కొన్నిసార్లు వారి నుంచి రాళ్ళు, సిమెంట్ కొనేవాళ్ళం” అని ఆయన బీబీసీతో చెప్పారు.

“ఒకప్పుడు మందులు, అధిక విలువైన వస్తువుల రవాణా సముద్ర మార్గం ద్వారా జరిగేది. చాలా వస్తువులు భారత్ నుంచి దుబాయ్‌కి, అక్కడి నుంచి పాకిస్తాన్‌కు వెళ్లేవి. అటారీ కాకుండా ఇతర మార్గాలు తెరిచి ఉండే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే వాటి అవసరం భారత్ కంటే పాకిస్తాన్‌కే ఎక్కువ” అని ఆయన అంటున్నారు.

“అటారీ మూసివేత ప్రభావం ముఖ్యంగా పాకిస్తాన్‌లోని సాధారణ పౌరులపై పడుతుంది. సాధారణంగా, భారత్, పాకిస్తాన్ మధ్య నేరుగా విమానాలు లేనప్పుడు, వేలమంది ప్రజలు కాలినడకన అటారీ నుంచి సరిహద్దు దాటేవారు. ఆ చెక్ పోస్ట్ మూసివేయడం అంటే వస్తువులు, ప్రజలు ఒకరి దేశానికి ఒకరు వెళ్లడం ఖరీదైన వ్యవహారంగా మారుతుంది. ఎక్కువ టైమ్ కూడా పడుతుంది.”

“అధికారిక మార్గాలలో అడ్డంకుల కారణంగా, భారత్, పాకిస్తాన్ మధ్య అంచనా వేసిన రూ. 85,000 కోట్ల విలువైన వాణిజ్యం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఇ) లేదా సింగపూర్ ఎయిర్ లైన్స్ ద్వారా తిరిగి ఎగుమతి చేస్తున్నారు. పాకిస్తాన్ ఈ మార్గం ద్వారా భారతదేశం నుంచి అనేక ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటుందని చెబుతారు. మరోవైపు, భారతదేశం పాకిస్తాన్ నుంచి హిమాలయన్ పింక్ సాల్ట్, ఖర్జూరం, ఆప్రికాట్లు, బాదంలను కూడా దిగుమతి చేసుకుంటోంది. ఇవి మూడో దేశం ద్వారా ఇక్కడికి వస్తాయి. సరిహద్దు మూసివేయడం వల్ల అధికారిక వాణిజ్యం ఆగిపోతుంది, కానీ డిమాండ్ ఆగదు” అని అనిల్ కుమార్ బాబా చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)