SOURCE :- BBC NEWS

నిద్రలేమి, మహిళలు, ఉద్యోగం, ఇంటిపని

ఫొటో సోర్స్, Getty Images

  • రచయిత, కీర్తి రావత్
  • హోదా, బీబీసీ ప్రతినిధి
  • 3 మే 2025

“నేను గర్భవతిగా ఉన్నప్పుడు, ఇంటి పనులు, నా భర్త బాగోగులు, నా ఉద్యోగం అన్నీ ఒకేసారి చూసుకోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి, నాకు సరిగ్గా నిద్ర పట్టడం లేదు. ఇప్పటికీ, నేను నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నాను” అని దిల్లీ నివాసి అయిన బెనజీర్ హీనా చెప్పారు. ఇప్పుడామె ఒంటరి తల్లి. ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు.

ఇలా నిద్ర సమస్యలతో బాధపడుతున్న మహిళ, తల్లి బెనజీర్ ఒక్కరే కాదు.

ఇటీవల గ్లోబల్ హెల్త్ టెక్నాలజీ కంపెనీ రెస్‌మెడ్ నిద్రపై ఒక సర్వేను విడుదల చేసింది. ఈ సర్వే ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది సరైన నిద్ర లేకపోవడం అనే సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.

పురుషుల కంటే స్త్రీలే నిద్ర సమస్యలతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారని ఆ సర్వే వెల్లడించింది. ఈ సర్వే ప్రకారం, సగటున పురుషులు వారానికి 4.13 రోజులు సరిగ్గా నిద్రపోగలుగుతున్నారు. కానీ, మహిళలు వారంలో 3.83 రోజులు మాత్రమే సరిగ్గా నిద్రపోగలుగుతున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

నిద్రపై పనిఒత్తిడి ప్రభావం

ప్రతి ఒక్కరూ కనీసం ఏడు గంటలు నిద్రపోవాలని అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్ సూచించింది. నిద్రసమస్యలతో బాధపడేవారు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఉన్నప్పటికీ చాలా మంది ఈ ఏడుగంటల నిద్ర పోగలుగుతున్నారు. అయితే వారంలో దాదాపు మూడు రాత్రులు సరిగ్గా నిద్రపోలేని వారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు.

‘రెస్‌మెడ్’ ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం, నిద్రలేమితో బాధపడుతున్న వారిలో 22 శాతం డాక్టర్ వద్దకు వెళ్లరు. అసలు ఆ సమస్యను పట్టించుకోరు. నిద్రలేమి బాధితుల సంఖ్య అమెరికా, జపాన్, సింగపూర్‌లలో 33 శాతం ఉండగా ఆస్ట్రేలియాలో 41 శాతం ఉంది.

ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన ఈ సర్వే ప్రకారం, 29 శాతం ప్రజలు వారానికి మూడు రోజులు లేదా అంతకంటే ఎక్కువ సార్లు సరిగ్గా నిద్రపోలేకపోతున్నారు. 34 శాతం నిద్రలేమి సమస్య(ఇన్సోమ్నియా) తో బాధపడుతున్నారు.

ఒత్తిడి (57%), ఆందోళన (46%), ఆర్థికపరమైన ఒత్తిళ్లు (31%) ప్రజలు నిద్రసమస్యలు ఎదుర్కోవడానికి కారణాలుగా తేలింది.

ఒత్తిడి కారణంగా నిద్ర సమస్యలు ఎదుర్కొంటున్న దేశాలలో భారత్ ముందువరుసలో ఉంది. ఈ సర్వే ప్రకారం, 69 శాతం భారతీయులు సరిగ్గా నిద్రపోలేకపోతున్నారు.

సింగపూర్‌లో 65 శాతం, థాయిలాండ్‌లో 65 శాతం, దక్షిణ కొరియాలో 67 శాతం ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు.

జనరేషన్ జెడ్‌కు చెందిన వారిలో ప్రపంచవ్యాప్తంగా 53% యువత విశ్రాంతి లేదా నిద్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు.

నిద్రలేమి, మహిళలు, ఉద్యోగం, ఇంటిపని

ఫొటో సోర్స్, Getty Images

స్త్రీలు తక్కువ నిద్రపోవడానికి కారణాలేంటి?

పురుషుల కంటే స్త్రీలే నిద్ర సమస్యలతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారని కూడా రెస్‌మెడ్ గ్లోబల్ స్లీప్ సర్వే వెల్లడించింది.

లౌబరో యూనివర్సిటీ స్లీప్ రీసర్చ్ సెంటర్ అధ్యయనం ప్రకారం, రోజంతా అనేక పనుల్లో తలమునకలై ఉండే మహిళలకు పురుషుల కన్నా ఎక్కువ, మంచి నిద్ర అవసరం.

ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న బెన్‌జీర్ తన నిద్ర సమస్యల గురించి బీబీసీతో మాట్లాడారు.

”ఉద్యోగం చేసే మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ ఉంటుంది. కానీ, ఆఫీసుతో పాటు ఇంటి బాధ్యతా మహిళలపైనే పడుతుంది. అందుకే ఉద్యోగం చేసే మగవారితో పోలిస్తే జాబ్ చేసే మహిళల్లో నిద్ర సమస్యలు ఎక్కువగా ఉంటాయి” అని ఆమె అన్నారు.

మహిళల ఆరోగ్యం, నిద్రపై స్లీప్ మెడిసిన్‌లో ఒక అధ్యయనం ప్రచురితమైంది. పీరియడ్స్ సమయంలో స్త్రీలు నిద్రలేమి సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటున్నారని ఈ అధ్యయనంలో తేలింది.

గర్భధారణ సమయంలో హార్మోన్ల మార్పుల కారణంగా స్త్రీలు నిద్రపోయే సమయం, నిద్రపోయే విధానంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు.

మెనోపాజ్ సమయంలో నిద్ర సమస్యలు చాలా సాధారణమని, 51 శాతం మహిళలపై దీని ప్రభావం ఉందని పరిశోధనలో తేలింది.

హార్మోన్ల మార్పులు మహిళల నిద్రను ఎలా ప్రభావితం చేస్తాయనేదానిపై గైనకాలజిస్ట్ డాక్టర్ సరితా శ్యామ్‌సుందర్‌తో బీబీసీ మాట్లాడింది.

పీరియడ్స్ సమయంలో ఈస్ట్రోజెన్ (స్త్రీ హార్మోన్), ప్రొజెస్టెరాన్ హార్మోన్ స్థాయి తగ్గుతుందని డాక్టర్ సరిత చెప్పారు. ప్రతి నెలా పీరియడ్స్ సమయంలో ఇలాంటి హార్మోన్ల మార్పులు సంభవిస్తాయన్నారు.

“కొన్నిసార్లు పీరియడ్స్ నిర్దిష్ట తేదీకి ముందు లేదా తర్వాత వస్తాయి. కొన్నిసార్లు పీరియడ్స్ సమయంలో చాలా రక్తం బయటకు వెళ్తుంది. ఇది రక్తహీనతకు కూడా దారితీస్తుంది. దీంతో మహిళలు అలసిపోతారు. ఇది వారి నిద్రపై ప్రభావం చూపిస్తుంది” అని ఆమె తెలిపారు.

పీరియడ్స్ సమయంలో కడుపు నొప్పి కూడా మహిళల నిద్రను చాలా ప్రభావితం చేస్తుందని డాక్టర్ సరితా శ్యామ్‌సుందర్ అన్నారు.

నిద్రలేమి, మహిళలు, ఉద్యోగం, ఇంటిపని

ఫొటో సోర్స్, Getty Images

భారతదేశంలో పెరుగుతున్న స్లీప్ డివోర్స్ కేసులు

తమ సంబంధాన్ని నిలబెట్టుకోవడానికి, చాలా మంది తమ భాగస్వామికి దూరంగా ప్రత్యేక గదిలో పడుకోవడం మంచిదని భావిస్తారు. భారతదేశంలో చాలా జంటలు ఈ పద్ధతిని అవలంబిస్తున్నాయి. ఈ విధానాన్ని స్లీప్ డైవోర్స్ అంటారు.

ప్రపంచ వ్యాప్తంగా 30,026 మందిపై ఈ సర్వే చేశారు.

గ్లోబల్ హెల్త్ టెక్నాలజీ కంపెనీ రెస్‌మెడ్ స్లీప్ డివోర్స్‌పై ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం, దాదాపు 18 శాతం మంది భార్యాభర్తలు రాత్రి వేళ విడివిడిగా నిద్రపోతున్నారు.

ఈ నివేదిక ప్రకారం, స్లీప్ డివోర్స్ కేసులు అత్యధికంగా నమోదైన దేశం భారత్. భారత్‌లో దాదాపు 78 శాతం కొన్నికొన్ని సార్లు తమ భాగస్వామికి దూరంగా వేరుగా నిద్రపోతారు.

అమెరికా, బ్రిటన్‌లలో కూడా జంటలు స్లీప్ డివోర్స్ పద్ధతిని అవలంబిస్తున్నాయి. ఈ రెండు దేశాల్లో, 50 శాతం ఎప్పుడూ కలిసి నిద్రపోతారు, మిగిలిన 50 శాతం జంటలు కొన్నిసార్లు విడివిడిగా నిద్రపోతున్నాయి.

స్లీప్ డివోర్స్‌పై మనస్తత్వవేత్త డాక్టర్ పూజాశివమ్ జెట్లీతో బీబీసీ మాట్లాడింది.

కొందరు నిద్రపోయే సమయాలు, పద్ధతులు కొన్నిసార్లు వారి భాగస్వాముల కంటే భిన్నంగా ఉంటాయని పూజాశివమ్ అన్నారు. ఈ కారణాల వల్ల పెళ్లయిన కొంత కాలం తర్వాత భార్యాభర్తలు ఈ పద్ధతులను అవలంబిస్తున్నారు.

”ప్రజలు తమ వ్యక్తిగత అవసరాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇలా చేయడం ద్వారా తమ భాగస్వామిపై తమకు ఎలాంటి ప్రతికూల భావాలు ఉండవని వారు భావిస్తారు” అని పూజాశివమ్ అభిప్రాయపడ్డారు.

మహిళలు తగినంత నిద్రపోకపోవడానికి స్లీప్ డివోర్స్ ఒక ముఖ్యమైన కారణమని డాక్టర్ పూజాశివమ్ అన్నారు.

ఉద్యోగం, ఇంటి నిర్వహణ బాధ్యతలు రెండింటినీ నిర్వహించాల్సిన ఒత్తిడి… మహిళల్లో నిద్రపోలేకపోవడానికి కారణమన్నారు.

అదే సమయంలో స్లీప్ డివోర్స్ అర్థం ప్రతి సంబంధంలో భిన్నంగా ఉంటుందని కూడా చెప్పారు.

“సమస్యలు రాకుండా ఉండడానికి పెళ్లయిన జంటలు ఈ పద్ధతిని అవలంబిస్తున్నట్లయితే, ఇది చాలా అనారోగ్యకరమైనది. భార్యాభర్తలు ఒకరితో ఒకరు సమయం గడపడం కూడా చాలా ముఖ్యం” అని సూచించారు.

నిద్రలేమి, మహిళలు, ఉద్యోగం, ఇంటిపని

ఫొటో సోర్స్, Getty Images

నిద్రపై ఉద్యోగ సమస్యల ప్రభావం..

మన ఉద్యోగంలో బాగా రాణించాలంటే మంచి నిద్ర చాలా ముఖ్యం. మనం సరిగ్గా నిద్రపోకపోతే, అది మన పనిపై ప్రభావం చూపుతుంది.

అమెరికన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ కమిటీ ఆన్ స్లీప్ మెడిసిన్ అండ్ రీసర్చ్ ప్రకారం, మనం అస్సలు నిద్రపోనప్పుడు మన మెదడు ఎలా పనిచేస్తుందో మనం ప్రతిరోజూ ఆరు గంటలు లేదా అంతకంటే తక్కువ సమయం నిద్రపోతే, అలాగే పనిచేయడం ప్రారంభిస్తుంది.

తగినంత నిద్రపోని వారు, అది తమ పనిపై నిద్రలేమి ప్రభావం ఎంతగా ఉందో గ్రహించలేకపోవడం అత్యంత ఆశ్చర్యకరమైన విషయం.

మహిళలు ఉద్యోగంలో పురుషుల కంటే ఎక్కువగా కష్టపడి పనిచేయాల్సి వస్తోందని, ఇది వారి నిద్రపై ప్రత్యక్ష ప్రభావం చూపుతోందని మనస్తత్వవేత్త డాక్టర్ పూజాశివమ్ చెప్పారు.

70 శాతం ఉద్యోగులు తమ కెరీర్‌లో కనీసం ఒక్కసారైనా నిద్రలేమి కారణంగా సెలవు తీసుకున్నారని స్లీప్ సర్వేలో తేలింది.

ఇది పని చేసే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది.

నిద్రలేమి కారణంగా అనారోగ్య సెలవు తీసుకున్నట్టు 71శాతం ఉద్యోగులు అంగీకరించారు.

తమ యజమానులు తమ నిద్ర, ఆరోగ్యం గురించి శ్రద్ధ వహిస్తారని భారత్‌లో 80 శాతం ఉద్యోగులు భావిస్తున్నారు.

ఫ్రాన్స్, జర్మనీ, హాంకాంగ్, బ్రిటన్‌లలో 60 శాతం కంటే ఎక్కువ మంది ఉద్యోగులు తమ నిద్ర గురించి బాస్ పట్టించుకోరని భావిస్తున్నారు.

తనకు అనారోగ్యంగా ఉన్నప్పుడు కొన్నిసార్లు సెలవు దొరకడం కష్టమవుతుందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ మహిళ బీబీసీతో చెప్పారు. ఆమె ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. నిజానికి, కొన్నిసార్లు ఆమె అనారోగ్యం కారణంగా సెలవు అడిగితే, ఆమెకు ఉద్యోగం వదిలి వెళ్లమన్న సమాధానం కూడా ఎదురైంది.

”తల్లులైన మహిళలకు వేరే ఉద్యోగం దొరకడంలో చాలా ఇబ్బందులు ఉంటాయి. వారికి ఉద్యోగం ఇవ్వడానికి ఎవరూ ఇష్టపడరు. అందుకే వేరే ఉద్యోగం వెతుక్కోవాలనుకున్నా కొన్నిసార్లు సాధ్యం కాదు” అని ఆమె అన్నారు.

నిద్ర లేకపోవడం వల్ల తనకు మైగ్రేషన్ సమస్యలు కూడా మొదలయ్యాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

SOURCE : BBC NEWS