SOURCE :- BBC NEWS

ఆస్ట్రేలియా, కుక్క పిల్ల కోసం వెదుకులాట

ఫొటో సోర్స్, Facebook/Kangala Wildlife Rescue

ఆస్ట్రేలియా అడవుల్లో తప్పిపోయిన డాక్స్‌హుండ్ జాతికి చెందిన చిన్న కుక్కను 500 రోజుల తర్వాత ప్రాణాలతో గుర్తించారు. అది ఆరోగ్యంగానే ఉంది.

ఆస్ట్రేలియా సముద్ర తీర ప్రాంతంలో ఉన్న కంగారూ ఐలండ్‌లో వాలెరీ అనే ఈ కుక్క తప్పిపోయింది. దీన్ని కనిపెట్టేందుకు రేయింబవళ్లు వెతికామని కంగాలా వైల్డ్ లైఫ్ రెస్క్యూ అనే సంస్థ తెలిపింది.

వాలెరీ యజమానులు 2023 నవంబర్‌లో ఓ క్యాంపుకు తీసుకెళ్లినప్పుడు అది తప్పిపోయింది.

జార్జియా గార్డ్‌నర్, ఆమె బాయ్ ఫ్రెండ్ జాషువా ఫిష్‌లాక్…తాము క్యాంపు చేసినచోట చిన్న బోనులో వాలెరీని వదిలేసి చేపలు పట్టడానికి వెళ్లారు.

వాళ్లు తిరిగొచ్చేసరికి అది కనిపించకుండా పోయింది.

అలా వెళ్లిపోయి, తీవ్రమైన ఎండలు, విషపూరిత పాములు ఉన్న ఆ అటవీ ప్రాంతంలో 529 రోజులు గడిపింది. గార్డ్‌నర్ టీ షర్ట్‌ను ఎరగా ఉపయోగించి కుక్కను కనిపెట్టింది రెస్క్యూ టీమ్.

“కొన్ని వారాలపాటు నిరంతరం ప్రయత్నించి వాలెరీని క్షేమంగా పట్టుకోగలిగాం. అది బలంగా, ఆరోగ్యంగా ఉంది” అని కంగాలా వైల్డ్ లైఫ్ రెస్క్యూ తన సోషల్ మీడియా పోస్ట్‌లో వెల్లడించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

వాలెరీ కోసం వలంటీర్లు 1,000 గంటల పాటు వెతికారని, 5వేల కిలోమీటర్లకు పైగా దూరాన్ని కవర్ చేశారని కంగాలా వెల్లడించింది.

కుక్కను వెతికేందుకు సర్వైలెన్స్ కెమెరాలతో పాటు, బోనును కూడా ఏర్పాటు చేశారు.

గార్డ్‌నర్ టీ షర్టు, వాలెరీ ఆడుకునే బొమ్మల్ని కూడా ఉపయోగించారు.

వాలెరీ బోనులో చిక్కుకున్న తర్వాత తాను గార్డ్‌నర్ దుస్తులు ధరించి దాని దగ్గరకు వెళ్లానని, అది మామూలుగా అయ్యే వరకు అక్కడే కూర్చున్నానని కంగాలా డైరెక్టర్ లిసా కర్రన్ చెప్పారు.

వాలెరీ తప్పిపోయిన తొలినాళ్లలో కొంతమంది క్యాంపర్లు, అది ఓ పార్క్ చేసిన కారు కింద ఉండటాన్ని గుర్తించారు.

అయితే అపరిచితులను చూసి అది పొదల్లోకి పారిపోయిందని వాషింగ్టన్ పోస్ట్ తన కథనంలో తెలిపింది.

కొన్ని నెలల తర్వాత, ఐలండ్‌లో ఉంటున్న వారు తాము వాలెరీ మెడకున్న గులాబీ రంగు కాలర్ లాంటిదాన్ని చూసినట్లు చెప్పడం కంగాలా మరో డైరెక్టర్ జేరెడ్ కర్రన్‌ను ఆశ్చర్యపరిచింది.

ఆస్ట్రేలియా, కుక్క పిల్ల కోసం వెదుకులాట

ఫొటో సోర్స్, facebook.com/kangalarescue/

వాలెరీని రక్షించే ప్రక్రియ ‘రోలర్ కోస్టర్’లా ఎలా మలుపులు తిరుగుతూ వచ్చిందో వివరిస్తూ 15 నిముషాల వీడియోను లిసా, జేరెడ్‌లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

వాలెరీ బోనులోకి వచ్చి అక్కడ ప్రశాంతంగా ఉండే వరకు తాము ఎదురు చూస్తూ ఉన్నామని, అది మరోసారి పారిపోకుండా ఉండేందుకే అలా చేశామని జేరెడ్ కర్రన్ చెప్పారు.

“అది సరిగ్గా మూలకు వెళ్లింది. నేను బటన్ నొక్కాను. అది చక్కగా పని చేసింది’’ అని ఆయన అన్నారు. కుక్క పిల్లను పట్టుకోవడానికి ఈ టీమ్ రిమోట్‌తో పని చేసే బోనును వాడింది.

సుదీర్ఘ అన్వేషణతో వాలెరీని కాపాడిన తర్వాత గార్డ్‌నర్ సోషల్ మీడియాలో “ఎవరిదైనా పెంపుడు జంతువు తప్పిపోతే, కొంత బాధ ఉంటుంది. అయితే ఎప్పుడూ ఆశలను వదులుకోకండి” అని పోస్ట్ చేశారు.

“కొన్నిసార్లు మంచి వాళ్లకు మంచి జరుగుతుంది” అని ఆమె అందులో రాశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)