SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Nine
విషపూరితమైన పుట్టగొడుగులను భోజనంలో కలిపి ముగ్గురు బంధువులను హత్య చేశారని, మరొకరు తీవ్ర అనారోగ్యంపాలు కావడానికి కారణమయ్యారని ఓ ఆస్ట్రేలియన్ మహిళపై అభియోగాలు నమోదయ్యాయి. అయితే, వీటిలో కొన్నింటిని పోలీసులు వెనక్కి తీసుకున్నారు ప్రాసిక్యూటర్లు.
దీంతో తన భర్తను హత్య చేయడానికి ప్రయత్నించారనే ఆరోపణలపై ఎరిన్ ప్యాటర్సన్ విచారణను ఎదుర్కోవలసిన అవసరం లేదు.
అయితే, ఆమె ఇప్పటికి నాలుగు అభియోగాలను ఎదుర్కొంటున్నారు. మూడు హత్య అభియోగాలు, ఒకటి హత్యాయత్నం.
అయితే, ఈ ఆరోపణలపై స్పందించిన ఆమె, తాను నిర్దోషినని, జరిగింది ఒక ప్రమాదమని ఆమె అన్నారు.
బుధవారం విక్టోరియా సుప్రీంకోర్టులో ఆమె విచారణ ప్రారంభం అయింది.

జూలై 2023లో ఎరిన్ ప్యాటర్సన్ వడ్డించిన భోజనం తిని ఆస్పత్రి పాలైన కొన్ని రోజుల తర్వాత ముగ్గురు వ్యక్తులు మరణించారు.
వీరిలో ప్యాటర్సన్ మాజీ అత్తమామలు 70 ఏళ్ల డాన్ ప్యాటర్సన్, 70 ఏళ్ల గెయిల్ ప్యాటర్సన్, గెయిల్ సోదరి 66 ఏళ్ల హీథర్ విల్కిన్సన్ ఉన్నారు.
హీథర్ భర్త, 68 ఏళ్ల ఇయాన్ విల్కిన్సన్ కొన్ని వారాలపాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుని ప్రాణాలతో బయటపడ్డారు.
తీవ్ర అనారోగ్యానికి గురై ప్రాణాలతో బయటపడిన ఇయాన్ విల్కిన్సన్ చెప్పినదాని ప్రకారం, నాలుగు పెద్ద బూడిద రంగు డిన్నర్ ప్లేట్లు, ఒక చిన్న లేత నారింజ రంగు ప్లేటు ఉన్నాయని ప్రాసిక్యూషన్ చెబుతోంది.
మిగతా వారందరూ పెద్ద బూడిద రంగు డిన్నర్ ప్లేట్లలో ఉన్న ఆహారం తిన్నారు. ఎరిన్ ప్యాటర్సన్ చిన్న ప్లేట్‌లో ఉన్నది తిన్నారని నానెట్ రోజర్స్ చెప్పారు.
వాళ్ళు ప్రసాదంగా భావించి భోజనాన్ని తిన్నారు. ఇయాన్, హీథర్ విల్కిన్సన్ తమ ప్లేట్‌లో ఉన్నదంతా తిన్నారు.
గెయిల్ ప్యాటర్సన్ సగం తిని మిగిలిన భాగాన్ని భర్త డోనాల్డ్‌కు ఇచ్చారు.
ఆయన తన ప్లేట్‌లో ఉన్నదానితోపాటు, గెయిల్ ఇచ్చినదాన్ని కూడా తిన్నారు.
ఎరిన్ ప్యాటర్సన్ ఎండబెట్టిన పుట్టగొడుగులను దాచిపెడుతున్నానని చెప్పినదానిపై కూడా కోర్టులో విచారణ జరిగింది.
వంటలో ఉపయోగించే పుట్టగొడుగుల పరిమాణాన్ని తగ్గించడానికి ఫుడ్ డీహైడ్రేటర్‌ను ఉపయోగించడం గురించి ప్యాటర్సన్ ఫేస్‌బుక్ గ్రూపులలో పోస్ట్ చేశారని ప్రాసిక్యూటర్ నానెట్ రోజర్స్ జ్యూరీకి తెలిపారు.

ఫొటో సోర్స్, Supplied
ఈ పుట్టగొడుగులు కొన్న షాపులను తనిఖీ చేయనున్న ఆరోగ్య అధికారులు…
ఆమె తన స్థానిక వూల్‌వర్త్స్ నుండి కొన్నింటిని కొనుగోలు చేశారని, మిగిలిన వాటిని మెల్‌బోర్న్ శివారులోని ఒక ఆసియా కిరాణా దుకాణం నుంచి ఎండబెట్టిన పుట్టగొడుగులు తెచ్చానని కోర్టుకు తెలిపారు. అయితే తనకు సరిగ్గా గుర్తులేదు అని కూడా చెప్పారు.
ప్యాటర్సన్ సూచించిన శివారు ప్రాంతాలలోని ఆసియా కిరాణా సామాగ్రిని లేదా పండ్లు, కూరగాయల అమ్మకందారులను సందర్శించడానికి ఆరోగ్య పరిశోధకులు బయలుదేరారని ప్రాసిక్యూటర్లు చెబుతున్నారు.
ఆమె కొనుగోలు చేసినట్టుగా బ్యాంక్ స్టేట్‌మెంట్‌లో ఎటువంటి ఆధారాలు లేవని, బహుశా ఆమె నగదు ఉపయోగించి ఉంటానని అధికారులకు చెప్పిందని కోర్టుకు తెలిపారు.

ఫొటో సోర్స్, Supplied
అబద్ధం చెప్పానని ఒప్పుకున్న ఎరిన్
‘‘ డీహైడ్రేటర్‌ను పారేశానని ఆమె అబద్ధం చెప్పారు. దానికి గిల్టీగా ఫీల్ అవుతున్నానని అంగీకరించారు’’ అని డిఫెన్స్ న్యాయవాది కాలిన్ మాండీ అన్నారు.
“కానీ డీహైడ్రేటర్‌లో పుట్టగొడుగుల ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పుడు..దాని గురించి ఎందుకు అబద్ధం చెప్పిందో ఆలోచించండి”
తాను ఎప్పుడూ పుట్టగొడుగుల కోసం వెతకలేదని పోలీసులకు అబద్ధం చెప్పానని కూడా ఎరిన్ ప్యాటర్సన్ అంగీకరించారు.
ఆమె పుట్టగొడుగుల కోసం వెతికారు, కానీ ఉద్దేశపూర్వకంగా విషపు పుట్టగొడుగుల కోసం వెతికాను అనడాన్ని ఆమె ఖండించారు.

ఈ కేసులో ఉద్దేశమే ప్రధాన సమస్య – న్యాయమూర్తి
ప్యాటర్సన్ వారికి వడ్డించిన భోజనంలో విషపు పుట్టగొడుగులు ఉండటం వల్ల ముగ్గురు వ్యక్తులు మరణించారని, నాలుగో వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురయ్యారని డిఫెన్స్ అంగీకరిస్తోందని న్యాయవాది మాండీ అన్నారు.
ఆమె నిర్దోషి అని ఆయన వాదించారు. ‘‘ఈ కేసు అంతా ఎరిన్ ప్యాటర్సన్ ఉద్దేశ్యం గురించే’’ అని ఆయన అన్నారు.
‘‘ఆమె ఉద్దేశం చంపడమా లేక తీవ్ర అనారోగ్యం కలిగించడమా అనేది ప్రధాన సమస్య’’ అని న్యాయమూర్తి క్రిస్టోఫర్ బీల్ వ్యాఖ్యానించారు.
ఎరిన్ ప్యాటర్సన్ ఉద్దేశపూర్వకంగా తన అతిథులకు విషపూరితమైన ఆహారాన్ని వడ్డించలేదని డిఫెన్స్ వాదిస్తోంది.
“ఆ రోజు ఎవరికీ హాని కలిగించాలని ఆమె అనుకోలేదు…జరిగింది ఒక విషాదం, భయంకరమైన ప్రమాదం” అని ఆయన అన్నారు.
ఈ కేసు విచారణ కొనసాగుతోంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS