SOURCE :- BBC NEWS

ఒక గంట క్రితం
”తొమ్మిదేళ్ల నుంచి 20 ఏళ్లు వచ్చే వరకు నేను ఈ విషయంలో చాలా సిగ్గుపడ్డాను, ఇబ్బంది పడ్డాను. నేను అబ్బాయిలాగే జీవించేందుకు ప్రయత్నించాను. ఇంత చేసినా నాకు తృప్తిగా అనిపించలేదు.”
అనాయా బంగర్ చెప్పిన మాటలిలి. కొన్నేళ్ల క్రితం అతను అబ్బాయి. అసలు పేరు ఆర్యన్ బంగర్. భారత్‌లో వివిధ స్థాయిల్లో జూనియర్ క్రికెట్ ఆడేవారు. అనాయా తండ్రి భారత మాజీ క్రికెటర్, మాజీ కోచ్ సంజయ్ బంగర్.
అనాయాకు హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ ఇంకా జరుగుతోంది.
ఇటీవల కొందరు క్రికెటర్లపై తీవ్ర ఆరోపణలు చేసిన తర్వాత ఆమె ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.
బీబీసీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మా ప్రతినిధి జాహ్నవి మూలేతో అనాయా తన ప్రయాణం, క్రికెటర్‌గా, ట్రాన్స్ వుమన్‌గా ఎదుర్కొన్న సవాళ్ల గురించి పంచుకున్నారు.


ఫొటో సోర్స్, Anayabangar/Instagram
ట్రాన్సిషన్ కోసం బ్రిటన్‌కు వెళ్లాలని నిర్ణయం
2022లో కరోనా లాక్డౌన్ సమయంలో అనాయా తన గుర్తింపు గురించి తల్లిదండ్రులకు స్నేహితులకు చెప్పారు.
తర్వాత, అమ్మాయిగా మారడం కోసం బ్రిటన్‌కు వెళ్లారు. అక్కడే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ తీసుకోవడం మొదలుపెట్టారు.
కానీ, దీనికోసం బ్రిటన్‌కు ఎందుకు వెళ్లారు? అని ప్రశ్నించగా అనాయా బదులిచ్చారు.
”భారత్‌లో ప్రజలు నన్ను గుర్తు పడతారు. అందుకే బ్రిటన్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నా. ఒకరోజు క్రికెట్ ప్రాక్టీస్‌కు నెయిల్ పెయింట్‌తో వెళ్లాను. అప్పుడు గోళ్ల రంగును చూసి నా తోటి ప్లేయర్లు నన్ను ఎగతాళి చేయడం మొదలుపెట్టారు.
ఆ రోజు జరిగిన ఈ చిన్న సంఘటన కారణంగా నేను లోలోపల చాలా ఒత్తిడికి గురయ్యాను. అప్పుడే క్రికెట్ వదిలేసి బ్రిటన్‌కు వెళ్లి పూర్తిగా మారిపోవాలని నిర్ణయించుకున్నా. ఈ అబద్ధపు జీవితాన్ని నేను భరించలేను. అందుకే నా కోసం ఏదైనా చేయాలనుకున్నా. అలాగే ఉండి ఉంటే నేను ఐపీఎల్ ఆడేవాడిని కావొచ్చు. కానీ, సంతోషంగా ఉండకపోయేవాడిని” అని అనాయా వివరించారు.
ట్రాన్సిషన్ తర్వాత చాలా ప్రశాంతంగా ఉందని, ముందు ఉన్నంత ఒత్తిడి లేదని అనాయా చెప్పారు.

ట్రాన్సిషన్ మొదట్లో ఎలా ఉండేది?
హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ తీసుకున్న తొలి మూడు నెలల సమయంలో తాను పురుషుల క్రికెట్ క్లబ్లో ఆడేవాడినని అనాయా చెప్పారు.
”క్లబ్ తరఫున మెరుగ్గా ఆడాలంటూ నాపై ఎప్పుడూ ఒత్తిడి ఉండేది. అన్నింటినీ ఒకేసారి మేనేజ్ చేయడం చాలా కష్టంగా ఉండేది. కానీ, రోజురోజుకు నా శరీరంలో వస్తున్న మార్పులు, వాటి ద్వారా కలిగే మానసిక ప్రశాంతత వల్ల ఈ రోజు నేను ఇక్కడ ఉన్నా” అని అనాయా అన్నారు.

ఫొటో సోర్స్, Anayabangar/Instagram
కుటుంబం, స్నేహితుల గురించి..
అనాయా అందరికంటే ముందు తన స్నేహితులకు తన గుర్తింపు గురించి చెప్పారు.
ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి వారికి ఒకట్రెండు రోజుల సమయం పట్టిందని ఆమె అన్నారు.
తన కుటుంబం గురించి మాట్లాడుతూ, ఈ విషయంలో మొదట తన తమ్ముడి నుంచి మద్దతు లభించిందని చెప్పారు.
”నా తమ్ముడు తన స్నేహితుల ముందు నన్ను అక్కా అని పిలుస్తాడు. అలా పిలవడం నాకు చాలా నచ్చుతుంది. నా గుర్తింపును అంగీకరించడానికి నా తల్లిదండ్రులు, ఇతర సభ్యులకు ఇంకాస్త సమయం పడుతుంది.
తన స్నేహితుల్లో సర్ఫరాజ్, ముషీర్ గురించి అనాయా ప్రత్యేకంగా ప్రస్తావించారు.
తన పట్ల వీరిద్దరి ప్రవర్తన ఎప్పుడూ మారలేదని, ఒకేలా ఉందని ఆమె చెప్పారు.
”నేను క్రికెట్ ఆడిన వారందరిలో ఇప్పటికీ నాకు పూర్తిగా మద్దతు ఇచ్చేది వీళ్లే” అని అనాయా తెలిపారు.

ఫొటో సోర్స్, Anayabangar/Instagram
క్రికెట్లో ట్రాన్స్‌వుమన్ పాత్ర
మహిళల క్రికెట్లో ట్రాన్స్‌వుమన్ ఆడకుండా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) విధించిన నిషేధం సరైనది కాదని అనాయా అభిప్రాయపడ్డారు.
”యుక్త వయస్సు (మేల్ ప్యూబర్టీ) దాటిన తర్వాత హార్మోన్ థెరపీ లేదా సర్జరీ ద్వారా ట్రాన్సిషన్ అయ్యే ట్రాన్స్ వుమన్కు కొన్ని ప్రయోజనాలుంటాయనే మాటతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను.
అయితే, ప్యూబర్టీ వచ్చినప్పటికీ ఇలాంటి ప్రయోజనాలు లేని ఇతర ట్రాన్స్ వుమన్ సంగతేంటి?” అని అనాయా ప్రశ్నించారు.
క్రికెట్ ప్రపంచం గురించి, తనకు ఎదురైన చెడు అనుభవాల గురించి అడిగినప్పుడు అనాయా బంగర్ ఇలా స్పందించారు.
”నేను పురుషుల క్రికెట్లో లేను. దానితో సంబంధమున్న వ్యక్తులతో కూడా నాకు సంబంధం లేదు. కాబట్టి, అక్కడ అసలేం జరుగుతుందో నాకేం తెలియదు.
కానీ, నేను న్యూడ్ ఫోటో వివాదం గురించి మాట్లాడినప్పుడు ఏం ఆశించానంటే, అలా చేసినవారు నేను మాట్లాడిన తర్వాత తాము చేసిన పని గురించి ఆలోచిస్తారని, ఇంకొకరి పట్ల అలా చేయకుండా ఉంటారని అనుకున్నా” అని అనాయా అన్నారు.
భవిష్యత్ ప్రణాళికలు
అనాయా ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో పని చేస్తున్నారు.
”నేను ఇందులోని విభిన్న అవకాశాలను అన్వేషిస్తున్నా. నెమ్మదిగా ఇన్‌ఫ్లూయన్సర్‌గా మారుతున్నా.
ఒకే చట్రంలో ఇరుక్కుపోవడం నాకిష్టం లేదు. జీవితంలో ఏం చేయాలనుకుంటున్నానో దాని గురించి మాట్లాడతాను” అని ఆమె వివరించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)