SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
ఒక గంట క్రితం
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్ పర్యటనలో ఉన్న సమయంలోనే జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యటకులపై దాడి జరిగింది.
దౌత్యపరంగా అత్యంత కీలక సమయంలో ఈ దాడి జరిగింది.
అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత్ రావడానికి ఒక్కరోజు ముందు 2000 సంవత్సరం మార్చి 20న అనంత్‌నాగ్‌లోని చిత్తీసింగ్‌పొరాలో 36 మంది సిక్కులను ‘పాకిస్తాన్ బేస్డ్ మిలిటెంట్లు’గా ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు ఊచకోత కోశారు.
ఈ దాడి గురించి భారత పర్యటనలో ఉన్న క్లింటన్‌తో అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయీ నేరుగా చర్చించారు. ఈ దాడిలో పాకిస్తాన్ ప్రమేయముందని వాజపేయీ క్లింటన్‌తో ప్రస్తావించారు.
ఆ తర్వాత రెండేళ్లకు 2002 మే 14న అప్పటి అమెరికా అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ క్రిస్టినా రోకా పర్యటన సందర్భంలో కూడా కాలూచక్‌లో మరోసారి మిలిటెంట్లు దాడికి పాల్పడ్డారు.
ఆ ఘటనలో.. పౌరులు ప్రయాణిస్తున్న బస్సుపై కొందరు సాయుధులు కాల్పులు జరిపారు. ఆ తర్వాత ఆర్మీ ఫ్యామిలీ క్వార్టర్లపై దాడి చేశారు. ఈ దాడిలో 23 మంది మరణించగా వారిలో 10 మంది చిన్నారులు. 34 మంది గాయపడ్డారు.
ఈ దాడులన్నీ అమెరికాకు చెందిన కీలక నేతలు భారత్‌లో పర్యటిస్తున్నప్పుడే జరిగాయి.

అంతర్జాతీయంగా దృష్టిని ఆకర్షించేందుకు ‘మిలిటెంట్ గ్రూప్స్’ ఇలాంటి సందర్భాలను ఉపయోగించుకుంటున్నాయన్న వాదన ఉంది.
కాగా భారత్ పర్యటనలో ఉన్న జేడీ వాన్స్ తాజ్‌మహల్‌ను సందర్శించారు. పహల్గాం దాడి గురించి తెలిసిన వెంటనే ఆయన తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.
”ఈ దాడిపై మేం చేయగలిగిన, అవసరమైన సాయమంతా చేస్తాం” అని వాన్స్ చెప్పారు. తాను ప్రధాని మోదీతో మాట్లాడుతానని తెలిపారు.

ఫొటో సోర్స్, Amit Shah/X
”టెర్రర్‌కు తలవంచేది లేదు” – అమిత్‌షా
పహల్గాంలో జరిగిన దాడిలో చనిపోయిన వారికి కేంద్ర హోం మంత్రి అమిత్‌షా నివాళి అర్పించారు. ఈ దాడి నుంచి బయటపడ్డ బాధితులను హోం మంత్రి బుధవారం కలుసుకున్నారు.
”ప్రియమైనవారిని కోల్పోయిన బాధను మాటల్లో చెప్పలేం” అని షా అన్నారు.
దాడి చేసిన వారిని అసలు వదిలిపెట్టబోమని అమిత్‌షా బాధిత కుటుంబాలకు హామీ ఇచ్చారు.
”టెర్రర్ ముందు భారత్ తలవంచదు” అని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో తన హ్యాండిల్‌లో రాశారు.
అమిత్ షాను కలుసుకున్నప్పుడు కొందరు బాధితులు కన్నీళ్లు పెట్టుకున్న వీడియోలను న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ పోస్టు చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
‘మాకు సంబంధం లేదు’
కాగా పహల్గాం దాడిలో తమ దేశానికి ఎలాంటి ప్రమేయం లేదని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు.
ఈ దాడిని భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వదేశ తిరుగుబాటుగా వర్ణించిన ఆయన, దాడికి పాకిస్తాన్‌ను నిందించడం చాలా తేలికని అన్నారు.
అమర్‌నాథ్ యాత్ర దారిలో ముఖ్యమైన పట్టణం పహల్గాం
అమర్‌నాథ్ యాత్రకు అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గాం ముఖ్యమైన ప్రాంతం.
అమర్‌నాథ్ గుహలోని మంచు లింగాన్ని దర్శించుకునేందుకు ఈ ఆధ్యాత్మిక యాత్ర పహల్గాం నుంచి ప్రారంభమవుతుంది.
యాత్రికులకు పహల్గాం బేస్ క్యాంప్. పర్వతాలలోంచి నడక మార్గంలో, గుర్రాలపై 32 కి.మీ.ల మేర ప్రయాణించి యాత్రికులు అమర్‌నాథ్‌ను చేరుకుంటారు.
జులై 3న ఈ యాత్ర ప్రారంభం కాబోతుంది. 39 రోజుల పాటు ఈ యాత్ర సాగుతుంది. ఈ యాత్రకు కొన్ని నెలల ముందు పర్యటకులపై ఈ దాడి జరిగింది.
పర్యటకులను లక్ష్యంగా చేసుకుని దాడి జరగడం అరుదైనప్పటికీ, అంతకుముందు యాత్రికుల మార్గాన్ని లక్ష్యంగా చేసి దాడులు జరిగాయి.
2000లో నువాన్ బేస్ క్యాంప్‌పై దాడి జరిగినప్పుడు 32 మంది మరణించారు. 2002లో చందన్‌వరీ బేస్ క్యాంప్‌పై దాడిలో 11 మంది చనిపోయారు. 2017లో యాత్రికులతో వెళ్తున్న బస్సుపై దాడి చేయడంతో 8 మంది మృతి చెందారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)