SOURCE :- BBC NEWS

ఏపీ రాజధాని అమరావతి

అమరావతి.. ఎనిమిది నెలల కిందట చూసిన పరిస్థితి వేరు.. ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితి వేరు..

2024 సెప్టెంబరులో విజయవాడకు వరదలు వచ్చినప్పుడు బీబీసీ బృందం అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటించింది.

ఎక్కడ చూసినా ముళ్లకంప, చెట్లు ఏపుగా పెరిగి రహదారులను కమ్మేశాయి. సగం కట్టి వదిలేసిన భవనాల వైపు వెళ్లేందుకు సరైన రోడ్లు కూడా లేవు.

రాజధాని ప్రాంతంలో కీలకంగా భావించే సీడ్ యాక్సెస్ రోడ్డు రెండు వైపులా ముళ్ల చెట్లు పెరిగి, వాహనాలు వెళ్లేందుకు వీల్లేని పరిస్థితి కనిపించింది.

స్థానికులు తప్ప మిగిలిన జనసంచారం పెద్దగా ఉండేది కాదు.

ఇప్పుడు, అక్కడ అంతా హడావుడి వాతావరణం ఏర్పడింది.

ముళ్ల చెట్లన్నీ నేలకొరిగి కనిపించాయి.

సీడ్ యాక్సెస్ రోడ్డు స్వరూపం కూడా చాలావరకు మారింది. అయితే, నిర్మాణం ఇంకా అసంపూర్తిగా ఉంది.

మరోవైపు పెద్దసంఖ్యలో కార్మికులు రాజధాని నిర్మాణ పనుల్లో ఉన్నారు. వీరికోసం నిర్మాణ సంస్థలు ప్రత్యేకంగా క్యాంపులు ఏర్పాటు చేశాయి.

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన పది నెలల తర్వాత అమరావతి నిర్మాణ పనుల్లో వేగం కనిపిస్తోంది.

రాజధాని నిర్మాణ పనులు మూడేళ్లలో పూర్తి చేయాలని నిర్ణయించామని ఏపీ మున్సిపల్, అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ మంత్రి పి.నారాయణ బీబీసీతో చెప్పారు.

అయితే, రాజధాని పరిధిలో భవనాల నిర్మాణానికే పరిమితం కాకుండా మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టాలని రైతులు కోరుతున్నారు.

అలాగే మరోసారి భూములు తీసుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఏపీ రాజధాని అమరావతి

అమరావతి ఇప్పుడెలా ఉందంటే…

అమరావతి పునర్నిర్మాణ పనులను మే 2న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

మొత్తం రూ.77,249 కోట్లతో పనులను చేపడుతున్నట్లు చెప్పారు మంత్రి నారాయణ. ఇప్పటికే రూ.43 వేల కోట్ల విలువైన పనులకు టెండర్లు పూర్తి చేసి పనులు అప్పగించామని వివరించారు.

ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, విభాగాధిపతులు, గెజిటెడ్ అధికారులు, నాన్ గెజిటెడ్ అధికారుల నివాసాల కోసం జీ ప్లస్ 12 అంతస్తుల్లో నిర్మించాలనుకున్న భవనాలు పూర్తయ్యాయి.

అయితే వీటిల్లో కొన్ని ఫ్లాట్లకు అమర్చిన ఫ్యాన్లు కూడా చోరీకి గురైనట్లు కనిపించాయి.

ఫ్లాట్లన్నీ చెత్తాచెదారంతో నిండిపోయాయి. ఇప్పుడు ఈ నిర్మాణాల్లో మిగిలిన ఉన్న పనులు, పెయింటింగ్ వర్క్స్ మళ్లీ మొదలయ్యాయి.

2015 నుంచి 2019 వరకు అమరావతి నిర్మాణ పనులు కొంతమేరకు జరిగాయి. శాశ్వత భవనాలకు అప్పట్లోనే శంకుస్థాపనలు జరిగాయి.

ఏపీ సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయ సముదాయం (ఐకానిక్ టవర్లు) కు 2018 డిసెంబరు 27న ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు.

2019 ఫిబ్రవరిలో హైకోర్టు శాశ్వత భవనానికి అప్పటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ శంకుస్థాపన చేశారు.

ఇందులో ప్రభుత్వ కార్యాలయ సముదాయం, హైకోర్టు భవనాలకు పునాదుల వరకు వేసి ఉన్నాయి.

ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ చెన్నై నిపుణులతో భవనాల పటిష్టతపై అధ్యయనం చేయించాకే పనులు మొదలు పెడుతున్నామని చెప్పారు మంత్రి నారాయణ.

తాజాగా బీబీసీ అక్కడ పర్యటించినప్పుడు పునాదులకు తవ్విన భారీ గుంతలు అలాగే కనిపించాయి. వాటిల్లో పెద్దఎత్తున నీరు నిలిచి ఉంది.

ఏపీ సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయ సముదాయానికి వేసిన శిలాఫలకం కూడా ఆవిష్కరించిన వైపు పగిలిపోయి కనిపించింది.

జడ్జిల బంగ్లాలు, మంత్రులు, ప్రిన్సిపల్ సెక్రటరీల బంగ్లాలు కొన్ని పునాదులకే పరిమితం కాగా, మరికొన్ని మొదటి అంతస్తు వరకు నిర్మించి ఉన్నాయి.

‘ఇ’ సిరీస్ లోని రహదారులు, సీడ్ యాక్సెస్ రోడ్డు పూర్తి కాకపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపించింది.

మరోవైపు, నిర్మాణ పనులు మొదలవ్వడంతో పెద్దసంఖ్యలో కార్మికులు పనుల్లో నిమగ్నమై కనిపిస్తున్నారు.

ఏపీ, తెలంగాణ నుంచే కాకుండా పశ్చిమ బెంగాల్, ఒడిశా, యూపీ, బిహార్‌కు చెందిన కార్మికులు పనులలో పాల్గొంటున్నారు.

అమరావతి

ప్రకృతి వైపరిత్యాల ప్రమాదం

నిరుడు ఆగస్టు, సెప్టెంబరులో వచ్చిన వర్షాల కారణంగా అమరావతి ప్రాంతంలో భారీగా వరద నీరు చేరిందనే ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

వర్షాలు వచ్చాక నాలుగు రోజుల తర్వాత బీబీసీ అక్కడ పర్యటించినప్పుడు వర్షపునీరు నిలిచి కనిపించింది.

వరద ముంపు తప్పేలా కూడా పనులు చేస్తున్నట్లుగా అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చెబుతోంది.

పాలవాగు, కొండవీటి వాగు విస్తరణ పనులు నడుస్తున్నాయి.

10-15 మీటర్ల వెడల్పు ఉన్న పాలవాగును 105 మీటర్లకు విస్తరిస్తున్నారు. 10 మీటర్లు వెడల్పు ఉన్న కొండవీటి వాగును 175 మీటర్లకు వెడల్పు చేసి ఆధునికీకరిస్తున్నారు.

”కొండవీటి వాగుపై శాఖమూరు, నీరుకొండ, కృష్ణయ్యపాలెం వద్ద రిజర్వాయర్ల నిర్మాణం జరుగుతోంది. రూ.1500 కోట్లతో రెండు వాగులు ఆధునికీకరిస్తున్నాం” అని అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏఈ చైతన్య బీబీసీతో చెప్పారు.

దీనివల్ల భవిష్యత్తులో అమరావతి ప్రాంతంలో తాగునీటి అవసరాలకు నీరు ఉపయోగపడుతుందన్నారు.

ఈ పనులు వచ్చే వర్షాకాలం నాటికి పూర్తికాకపోతే మరోసారి భారీ వర్షాలు కురిస్తే వరద సమస్య తలెత్తే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు.

ఏపీ రాజధాని అమరావతి

కొత్తగా భూములు తీసుకునే ప్రతిపాదనపై వివాదం

2014 సెప్టెంబరు 3 – కృష్ణా నది తీరంలో విజయవాడ, గుంటూరు నగరాల మధ్య రాజధాని నిర్మించాలని తీర్మానిస్తూ ఏపీ అసెంబ్లీ బిల్లు ఆమోదించింది.

2015 ఏప్రిల్ 23 – రాజధానికి అమరావతి పేరును ఖరారు చేసింది ఏపీ ప్రభుత్వం. రాజధాని నిర్మాణానికి మొత్తం 53,748 ఎకరాలను ప్రభుత్వం నోటిఫై చేసింది.

ఇందులో 34,794 ఎకరాలను ‘ల్యాండ్ పూలింగ్ స్కీమ్’ ద్వారా ప్రభుత్వం తీసుకుంది.

వీటిలోనే నిర్మాణాలు చేపట్టింది. గతంలో ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చించి ‘తాత్కాలికం’ పేరుతో అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు నిర్మించింది.

ఇప్పుడు ‘అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్’ పేరుతో శాశ్వత నిర్మాణాలు చేపడుతోంది. రాయపూడికి సమీపంలో ఈ నిర్మాణాలు వస్తాయని ప్రభుత్వం చెబుతోంది.

తాజాగా మరోసారి భూములు తీసుకునేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.

స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీస్, హోటల్ ఇండస్ట్రీ, ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్.. ఇవన్నీ రావాలంటే మరో 30-40వేల ఎకరాలు అవసరమవుతాయని బీబీసీతో చెప్పారు మంత్రి నారాయణ.

ఈ భూములను సమీకరణ ద్వారా తీసుకోవాలా.. సేకరించాలా.. అనే దానిపై రైతుల అభిప్రాయాలు తీసుకుంటోంది ప్రభుత్వం.

ఇప్పటికే గన్నవరంలో ఎయిర్ పోర్టు ఉండగా.. అమరావతి‌లో ఎయిర్ పోర్టు ప్రతిపాదనపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

గన్నవరంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. అక్కడ విస్తరణ పనులు జరుగుతున్నాయి.

”ప్రస్తుతం ప్రభుత్వం లేదా సీఆర్డీఏ వద్ద అందుబాటులో ఉన్న నాలుగు వేల ఎకరాల భూమి మానిటైజ్ (అమ్మకం) చేయడానికే సరిపోతుంది. మరిన్ని పరిశ్రమలు, అభివృద్ధి పనులు చేయాలంటే భూములు అవసరం” అని చెప్పారు నారాయణ.

ప్రభుత్వం చెబుతున్న మాటల్లో ప్రణాళికాలోపం కనిపిస్తోందని అన్నారు ఆంధ్ర లయోలా కాలేజీ ప్రొఫెసర్ శ్రీకుమార్.

‘‘దీర్ఘకాలిక పెట్టుబడులపై ప్రభుత్వం ఆలోచన చేయాలి. భూములు అమ్మేసి డబ్బులు సమకూర్చుకుంటామంటే.. ఇలా ఎంతకాలం చేస్తారు? పదేళ్లు.. పదిహేనేళ్ల తర్వాత నిధుల కోసం ఏం చేస్తారు?’’ అని ప్రశ్నించారు.

ఏపీ రాజధాని అమరావతి, భూ సేకరణ, భూ సమీకరణ

ఫొటో సోర్స్, Getty Images

రైతుల అభ్యంతరమేంటి?

కొత్తగా భూములు తీసుకునేందుకు ప్రభుత్వం ప్రతిపాదించడంపై అమరావతి పరిధిలోని కొందరు రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే తీసుకున్న భూములను అభివృద్ధి చేసి.. తర్వాత కొత్తగా భూములు తీసుకునే విషయంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని తుళ్లూరుకు చెందిన కె.సత్యనారాయణ బీబీసీతో చెప్పారు.

“మౌలిక వసతులు కల్పించి ప్రజల నివాసానికి అనుకూలంగా మార్చాలి. మా ప్లాట్లలో రోడ్లు, కరెంటు, తాగునీరు, మురుగునీరు పోయే మార్గం, పార్కులు.. మౌలిక సౌకర్యాలు కల్పించమని కోరుతున్నాం” అని చెప్పారు సత్యనారాయణ.

అమరావతి పరిరక్షణ ఉద్యమంలో పాల్గొన్న మందడం గ్రామానికి చెందిన ప్రియాంక కూడా బీబీసీ వద్ద ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

”జనాభా రావాలి. ఎక్కడైతే జనాభా వస్తుందో అక్కడ అభివృద్ధి జరుగుతుంది. నిర్మాణాలు పెద్ద పెద్ద బిల్డింగులు కట్టడం వల్ల రాదు. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు కేటాయించిన భూముల్లో నిర్మాణాలు మొదలుపెట్టాలి” అని అన్నారు.

ఇదే విషయంపై ఆంధ్ర లయోలా కాలేజీ ప్రొఫెసర్ శ్రీకుమార్ మాట్లాడుతూ.. ”వ్యవసాయ భూముల్లో ల్యాండ్ పూలింగ్ చేయడం మంచిది కాదు. ఇప్పటికే వ్యవసాయ స్థిరీకరణ దెబ్బతింది. వ్యవసాయాన్ని సుస్థిరం చేయాలి” అన్నారు.

30శాతం రెన్యువబుల్ ఎనర్జీని వాడుకునేలా..

2015లో అమరావతి ప్రణాళికలు చేసినప్పుడే స్వయం సమృద్ధి నగరంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించింది.

2050 నాటికి అమరావతి ప్రాంతంలో 2706 మెగావాట్ల విద్యుత్ అవసరమని సీఆర్డీఏ అంచనా వేస్తోంది.

ఇందులో 30శాతాన్ని రెన్యువబుల్ ఎనర్జీ అంటే సౌర, పవన విద్యుత్ వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించినట్లుగా ఏపీ సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు బీబీసీతో చెప్పారు.

”అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తాం. మొత్తంగా 810 మెగావాట్ల విద్యుత్తును సౌర, పవన విద్యుత్ వంటి సంప్రదాయేతర వనరుల ద్వారా ఉత్పత్తి చేసేలా డిజైన్ చేస్తున్నాం” అని చెప్పారు.

ఏపీ రాజధాని అమరావతి

ఫొటో సోర్స్, UGC

అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుందా?

2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ మూడు రాజధానుల అంశం తెరపైకి తీసుకువచ్చింది.

ఆ తర్వాత అమరావతి నిర్మాణ పనులు నిలిచిపోయాయి.

ఖర్చు తగ్గించడంతోపాటు పాలన వికేంద్రీకరణ కోసం మూడు రాజధానులు అవసరమని నాటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు.

”అమరావతిపై మాకు వ్యతిరేకత లేదు. కానీ అభివృద్ధి అంతా ఒక్క చోటే కేంద్రీకృతం కాకూడదు. హైదరాబాద్‌ అనుభవాలను దృష్టిలో పెట్టుకోవాలి. అందుకే రాజధాని వికేంద్రీకరణ జరగాలి” అని 2019 డిసెంబరులో అసెంబ్లీలో ప్రకటించారు జగన్.

వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని ఆ ప్రాంత రైతులు 1631 రోజుల పాటు నిరసన ప్రదర్శనలు చేశారు. గతేడాది చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక 2024 జూన్ 12న రైతులు తమ నిరసనను విరమించారు.

ప్రస్తుతం అమరావతి ఏకైక రాజధానిగా ఉండడంపై వైసీపీ వైఖరి ఏంటనేది పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ వెల్లడించారు.

2015 సెప్టెంబరు 22న ఇచ్చిన ఆదేశాల మేరకు 8352.69 చ.కి.మీ.లుగా గుర్తించింది అప్పటి ప్రభుత్వం.

2022లో బాపట్ల, పల్నాడు రీజియన్ల పరిధిలోని 1631.96 చ.కి.మీ. పరిధిని తొలగించింది జగన్ ప్రభుత్వం. ఆ తర్వాత ప్రస్తుతం ప్రభుత్వం వచ్చాక 2024 నవంబరులో పల్నాడు, బాపట్ల ప్రాంతాలను తిరిగి అమరావతిలో కలుపుతూ 8352.69 చ.కి.మీ. పరిధిని తీసుకువచ్చింది.

అలాగే కూటమి అధికారంలోకి వచ్చాక రూ.36 కోట్లు వెచ్చించి జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టింది.

మరోవైపు, రాజధాని అంశంపై సుప్రీంకోర్టులో కేసు ఇప్పటికీ పెండింగులో ఉంది.

గతేడాది డిసెంబరులో రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని కోరుతూ అఫిడవిట్ దాఖలు చేసింది. దీనిపై సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించాల్సి ఉంది.

అమరావతి శాశ్వత రాజధానిగా ఉండే విషయం ప్రభుత్వాల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని బీబీసీతో చెప్పారు నారాయణ. తాము మాత్రం మూడేళ్లలో పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)