SOURCE :- BBC NEWS

డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ఒక గంట క్రితం

అమెరికా 47వ అధ్యక్షుడిగా డోనల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ మధ్యాహ్నం 12 గంటలకు (భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10:30 గంటలు) ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.

విపరీతమైన చలి కారణంగా వేడుకలు క్యాపిటల్ భవనం వెలుపల కాకుండా లోపలే నిర్వహించారు. ఇదే వేదికపై జేడీ వాన్స్ ఉపాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.

అనంతరం ప్రసంగించిన ట్రంప్, అమెరికాకు స్వర్ణయుగం మొదలైందన్నారు. ఈ రోజు నుంచి అమెరికా అభివృద్ధి చెందుతుంది, గౌరవం పొందుతుంది అని ఆయన చెప్పారు.

అమెరికా-మెక్సికో సరిహద్దులో జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించే కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేస్తానని ట్రంప్ చెప్పారు. అన్ని చట్టవిరుద్ధమైన ప్రవేశాలు “తక్షణమే నిలిపివేస్తాం” అని ఆయన చెప్పారు. అక్రమ వలసదారులను తిరిగి పంపించే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభిస్తుందని ట్రంప్ ప్రకటించారు.

అమెరికా మాజీ అధ్యక్షులు

ఫొటో సోర్స్, Getty Images

హాజరైన వ్యాపార, టెక్ దిగ్గజాలు

అంతకుముందు బైడెన్, ఆయన భార్య జిల్‌లు డోనల్డ్ ట్రంప్, మెలానియాలకు శ్వేతసౌధంలోకి స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమానికి ట్రంప్ కుటుంబీకులతో పాటు దిగ్గజ కంపెనీల సీఈవోలు, అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, జార్జ్ డబ్ల్యూ బుష్, బిల్ క్లింటన్ తదితరులు హాజరయ్యారు.

టెస్లా అధినేత ఎలాన్ మస్క్, మెటా, అమెజాన్ వ్యవస్థాపకులు మార్క్ జుకర్ బర్గ్, జెఫ్ బెజోస్‌లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, ఆపిల్ కంపెనీ సీఈవో టిమ్ కుక్‌ తదితరులు హాజరయ్యారు.

మెటా, గూగుల్, అమెజాన్ అధినేతలు

ఫొటో సోర్స్, Getty Images

అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తున్న ట్రంప్‌కు బ్రిటన్ కింగ్ చార్లెస్ వ్యక్తిగతంగా అభినందనలు తెలిపారు. ఈ సందేశం యూకే, యూఎస్‌ల మధ్య చిరస్థాయిగా ఉన్న ప్రత్యేక సంబంధాలను ప్రతిబింబిస్తోందని బకింగ్‌హామ్ ప్యాలెస్ తెలిపింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
జోబైడెన్, ట్రంప్ దంపతులు

ఫొటో సోర్స్, Getty Images

చివరి రోజు బైడెన్ కీలక నిర్ణయాలు..

చివరి రోజు జో బైడెన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమెరికా వైద్య నిపుణులు డాక్టర్ ఆంథోనీ ఫౌచీ, ఆర్మీ రిటైర్డ్ జనరల్ మార్క్ మిల్లేలకు ముందస్తు క్షమాభిక్ష ప్రకటించారు.

అంతేకాదు, క్యాపిటల్ హిల్ అల్లర్ల కేసులో విచారణ జరిపిన హౌస్ కమిటీ సభ్యులతో పాటు, సాక్ష్యం చెప్పిన అధికారులకూ క్షమాభిక్ష ఆదేశాలు జారీచేశారు.

వీరిపై ట్రంప్ హయాంలో క్రిమినల్ అభియోగాలు మోపే ప్రమాదం ఉందని బైడెన్ ముందస్తుగా ఉపశమనం కల్పించారు.

బైడెన్ చివరి క్షణాల్లో తన కుటుంబ సభ్యులకు కూడా క్షమాపణలు జారీ చేశారు.

“నా కుటుంబం ఎడతెగని దాడులకు, బెదిరింపులకు గురైంది. నన్ను బాధించాలనే అలా చేశారు. ఈ దాడులు ముగుస్తాయని అనుకోవడం లేదు” అని జో బైడెన్ ఒక ప్రకటనలో తెలిపారు.

“అందుకే జేమ్స్ బి బైడెన్, సారా జోన్స్ బైడెన్, వాలెరీ బైడెన్ ఓవెన్స్, జాన్ టి ఓవెన్స్, ఫ్రాన్సిస్ డబ్ల్యూ బైడెన్‌లను క్షమించడానికి రాజ్యాంగం ప్రకారం నా అధికారాన్ని అమలు చేస్తున్నాను” అని తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)