SOURCE :- BBC NEWS

ఇరాన్, ఇజ్రాయెల్, ఖమేనీ

ఫొటో సోర్స్, EPA-EFE/Shutterstock

ఒక గంట క్రితం

”ప్రస్తుత ఇజ్రాయెల్-ఇరాన్ సంక్షోభ సమయంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని హత్య చేయాలన్న ఇజ్రాయెల్ ప్రణాళికను అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ‘అది అంత మంచి ఆలోచన కాదు’ అంటూ తిరస్కరించారు” అని అమెరికా మీడియా తెలిపింది.

తమ ఉనికికి ప్రమాదకరమైన ఇరాన్ అణ్వస్త్ర సామర్థ్యాలను దెబ్బతీయడమే తాజా దాడుల లక్ష్యమని ఇజ్రాయెల్ ప్రకటించినప్పటికీ, దాడుల వల్ల ఇరాన్‌లో ప్రభుత్వం మారొచ్చని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చెప్పారు.

తమ నాయకులకు వ్యతిరేకంగా పోరాడాలని అంతకుముందు ఆయన ఇరాన్ ప్రజలకు నేరుగా పిలుపునిచ్చారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఇరాన్, ఇజ్రాయెల్, ఖమేనీ

ఫొటో సోర్స్, Anadolu/Getty Images

మతగురువు నుంచి సుప్రీం లీడర్ వరకు..

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఎవరు? ఆయనకు దేశంలో ఎలాంటి అధికారాలు ఉన్నాయి? దేశ రాజకీయాల్లో ఆయన కుటుంబం ఎలాంటి పాత్ర పోషిస్తుంది వంటివి తెలుసుకుందాం.

1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత, దేశంలో రెండో సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ.

1989 నుంచి ఈ పదవిలో ఉన్నారు. ఈయన అధికారంలో లేని సమయం ఇరాన్ యువతకు తెలియదు.

ఇరాన్ అధికార వ్యవహారాలన్నింటికీ ఈయనే కేంద్రం. ప్రభుత్వ విధానాలకు సంబంధించిన ఏ వ్యవహారాన్నయినా ఈయన వీటో చేయగలరు. ప్రభుత్వ అధికారులను స్వయంగా ఎంపిక చేయగలరు.

ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ సహా మిలిటరీ కమాండర్ ఇన్ చీఫ్‌గా ఉండడం కూడా ఆయన్ను మరింత శక్తివంతుడిని చేస్తుంది.

అజ్ఞాతవాసం, జైలు జీవితం..

ఇరాన్‌లో రెండో అతిపెద్ద నగరమైన మషాద్‌లో, 1939లో ఆయన పుట్టారు.

మొత్తం 8 మంది సంతానంలో ఈయన రెండోవారు. ఇరాన్‌లో ఆధిపత్యవర్గమైన షియా ముస్లిం శాఖలో ఈయన తండ్రి మధ్యస్థాయి మతగురువు.

చిన్నవయసులోనే ఖురాన్‌ను లోతుగా అధ్యయనం చేసిన ఖమేనీ 11 ఏళ్లకే మతగురువు అయ్యారు.

ఆ సమయంలో అనేక మతనాయకుల తరహాలోనే ఈయన పనితీరు రాజకీయం, ఆధ్యాత్మికం మేళవింపుగా ఉండేది.

ఇరాన్ షాల విమర్శకుల వర్గంలో ఖమేనీ చేరారు. ఇస్లామిక్ విప్లవం వల్ల షా చక్రవర్తి పదవీచ్యుతులయ్యారు.

చాలా సంవత్సరాల పాటు ఖమేనీ అజ్ఞాత జీవితం, జైలు జీవితం గడిపారు. షా పాలనలో రహస్య పోలీసులు ఆయన్ను ఆరుసార్లు అరెస్టు చేశారు.

1979 ఇస్లామిక్ విప్లవం వచ్చిన ఏడాది తర్వాత, రాజధాని తెహ్రాన్‌లో శుక్రవారం ప్రార్థనల నాయకునిగా ఖమేనీ నిమమితులయ్యారు. అనంతరం 1981లో అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.

86 ఏళ్ల వయసులో అయతొల్లా ఖమేనీ మరణం తర్వాత, 1989లో ఆయన వారసుడిగా ఖమేనీని మతపెద్దలు ఎంపిక చేశారు.

ఇరాన్, ఇజ్రాయెల్, ఖమేనీ

ఫొటో సోర్స్, NurPhoto/Getty Images

ఖమేనీ కుమారుడు మొజ్‌తబా..

అలీ ఖమేనీ చాలా అరుదుగా విదేశాలకు వెళ్తారు. మధ్య తెహ్రాన్‌లోని ఓ భవనంలో భార్యతో కలిసి ఆయన సాధారణ జీవితం గడుపుతున్నట్టు సమాచారం.

తోటపని, కవిత్వాన్ని ఇష్టపడే ఖమేనీ.. యువకుడిగా ఉన్నప్పుడు పొగతాగేవారు. ఇరాన్‌లో మతపరమైన కార్యక్రమాల్లో ఉండేవారు దీనిని అసాధారణంగా భావిస్తారు. 1980లలో తనపై జరిగిన హత్యాయత్నం వల్ల ఆయన కుడిచేయి పనిచేయదు.

ఈయన భార్య పేరు మన్‌సొరే ఖొజాస్తెహ్ బగెర్జాదే. వారికి నలుగురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు సహా ఆరుగురు సంతానం.

ఖమేనీ కుటుంబం మీడియాలో కానీ, బహిరంగంగా కానీ కనిపించడం చాలా అరుదు.

అయితే, ఆయన నలుగురు కొడుకుల్లో రెండో వాడైన మొజ్‌తబా ప్రభావంతమైన వ్యక్తిగా చెబుతారు. తండ్రి చుట్టూ ఉన్న అధికారిక వర్గాల్లో కీలకపాత్ర కారణంగా ఆయన అందరికీ తెలుసు.

ఇస్లామిక్ రిపబ్లిక్ సీనియర్ అధికారుల పిల్లలు ఎక్కువగా ఉండే తెహ్రాన్‌లోని అలావి హై స్కూల్‌లో మొజ్‌తబా చదువుకున్నారు.

సంప్రదాయ మతనాయకుల్లో ప్రముఖులు ఘోలమ్-అలీ హద్దాద్-అదెల్ కుమార్తెను పెళ్లి చేసుకున్నారు.

మతపెద్దగా మారకముందే, ఖోమ్‌లో సెమినరీ చదువుల కోసం ప్రణాళిక వేసుకుంటున్న సమయంలో ఆయన వివాహం జరిగింది. ఇరాన్‌లో ప్రముఖ షియా సెమినరీ అయిన ఖోమ్ సెమినరీలో 30 ఏళ్ల వయసులో సాధారణ మతపరమైన చదువులు చదవడం ప్రారంభించారు.

2000 సంవత్సరం మధ్యనాటికి రాజకీయ వర్గాల్లో మొజ్‌తబా ప్రాబల్యం బాగా పెరిగింది. అయినప్పటికీ, ఈ విషయం మీడియాకు పెద్దగా తెలియదు.

2004లో జరిగిన వివాదాస్పద అధ్యక్ష ఎన్నికల్లో మొజ్‌తబా పేరు వెలుగులోకి వచ్చింది. ప్రముఖ అభ్యర్థుల్లో ఒకరైన మెహ్ద్ కర్రౌబి అయతొల్లా ఖమేనీని ఉద్దేశించి బహిరంగంగా లేఖ రాశారు. పరిస్థితులు మహమూద్ అహ్మదినెజాద్‌కు అనుకూలంగా మారడంలో తెరవెనక మొజ్‌తబా కీలక పాత్ర పోషించారని ఆరోపించారు.

2010 నుంచి ఇరాన్‌లో అత్యంత ప్రభావంతమైన వ్యక్తుల్లో ఆయన ఒకరిగా ఉన్నారు. తన వారసునిగా ఖమేనీ ప్రాధాన్యత ఇచ్చే అభ్యర్థి మొజ్‌తాబా అని సన్నిహితవర్గాలు అంటుంటాయి. అయితే, అధికారిక వర్గాలు మాత్రం దీన్ని ఖండిస్తాయి.

అలీ ఖమేనీ రాజు కాదు.. తన కుమారుడికి తేలిగ్గా కిరీటాన్ని అందించలేరు. అయినప్పటికీ తండ్రి ఆంతరంగిక వర్గాల్లో మొజ్‌తాబా కీలకమైన వ్యక్తి. ఇందులో సుప్రీం నాయకుని కార్యాలయం కూడా ఉంది.

ఇరాన్, ఇజ్రాయెల్, ఖమేనీ

ఫొటో సోర్స్, AFP/Getty Images

మిగిలిన కుమారులు ఏం చేస్తున్నారు?

పెద్ద కొడుకు ముస్తఫా ఖమేనీ. సంప్రదాయ మతాధికారి అజీజొల్లాహ్ ఖోస్వాఘ్ కుమార్తెను ముస్తఫా పెళ్లి చేసుకున్నారు.

1980లలో ఇరాన్-ఇరాక్ యుద్ధ సమయంలో ముస్తఫా, మొజ్‌తాబా ఇద్దరూ పోరాటంలో పాల్గొన్నారు.

అలీ ఖమేనీ మూడో కొడుకు మసౌద్, ఆయన 1972లో పుట్టారు. ఖోమ్ సెమినరీ సంప్రదాయ టీచర్ల అసోసియేషన్‌తో అనుబంధంగా ఉన్న ప్రసిద్ధ మతాధికారి మొహ్సేన్ ఖరాజీ కుమార్తె, మాజీ దౌత్యవేత్త మొహమ్మద్ సదేగ్ ఖరాజీ సోదరి అయిన సుసాన్ ఖరాజీని మసౌద్ వివాహం చేసుకున్నారు.

మసౌద్ ఖమేనీ రాజకీయాల వర్గాలకు దూరంగా ఉన్నారు. ఆయన గురించి ప్రజలకు తెలిసింది తక్కువ.

అయతొల్లా ఖమేనీ రచనలు, కార్యకలాపాలను పర్యవేక్షించే ప్రధాన ప్రచార విభాగ కార్యాలయానికి మసౌద్ మాజీ అధిపతి. తండ్రి జీవిత చరిత్ర, జ్ఞాపకాలను సంకలనం చేసే బాధ్యత కూడా ఆయన తీసుకున్నారు.

చిన్న కుమారుడు మేసమ్1977లో పుట్టారు. తన ముగ్గురు సోదరుల్లాగే ఆయన కూడా మతాధికారి.

ఆయన భార్య పేరు మీడియాకు తెలియదు. ఆమె మహమూద్ లోలాచియన్ కుమార్తె. ఆయన 1979 విప్లవానికి ముందు విప్లవాత్మక మతాధికారులకు ఆర్థికంగా మద్దతు అందించిన ప్రముఖ సంపన్నుడు. ప్రభావవంతమైన వ్యాపారి.

మేసమ్ తన సోదరుడు మసౌద్‌తో కలిసి తండ్రి రచనల సంరక్షణ, ప్రచురణ కార్యాలయంలో పనిచేశారు.

ఇరాన్, ఇజ్రాయెల్, ఖమేనీ

ఫొటో సోర్స్, Getty Images

ఇద్దరు కుమార్తెలు

ఖమేనీ కుమార్తెల గురించి ప్రజలకు చాలా తక్కువ తెలుసు.

బుష్రా, హోడా కుటుంబంలో చిన్నవారు. ఇద్దరూ 1979 విప్లవం తర్వాత పుట్టారు.

బుష్రా 1980లో పుట్టారు. ఖమేనీ కార్యాలయంలో చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా ఉన్న ఘోలామ్‌ హుస్సేన్ (మొహమ్మద్) మొహమ్మది గోల్పయెగని కుమారుడు మొహమ్మద్-జావద్ మొహమ్మది గోల్పాయెగనీని వివాహం చేసుకున్నారు.

సుప్రీం లీడర్ సంతానంలో అందరికంటే చిన్నదైన హోడా 1981లో జన్మించారు. ఆమె ఇమామ్ సాదిక్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న మెస్బా అల్-హోడా బాఘేరి కనిని వివాహం చేసుకున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)