SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
32 నిమిషాలు క్రితం
అయిదేళ్ల తర్వాత కైలాస మానసరోవర యాత్ర మళ్లీ ప్రారంభం కాబోతుంది.
ఈ యాత్రకు వెళ్లాలనుకునేవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఈ నెల 13(2025 మే 13) వరకు దరఖాస్తు చేసుకోవచ్చని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.
తొలి యాత్ర జూన్ 30న దిల్లీ నుంచి లిపులేఖ్ మీదుగా సాగనుంది. యాత్ర నిర్వహించిన కాలంలో ఏటా సుమారు 900 మంది భారతీయులు కైలాస మానసరోవర్‌ను దర్శించుకునేవారు.
హిందూ మత విశ్వాసాల ప్రకారం.. శివుడు కైలాస మానసరోవరలో కొలువై ఉన్నట్లు చెప్తారు.
సముద్ర మట్టానికి 6,638 మీటర్ల ఎత్తులో కైలాస పర్వతం, మానసరోవర సరస్సు ఉంటాయి. బౌద్ధ, జైన మతంలోనూ వీటికి చాలా ప్రాధాన్యం ఉంది.

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
కైలాస మానసరోవర యాత్రకు సంబంధించిన నిబంధనలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఈ యాత్రకు తొలి అర్హత కచ్చితంగా భారతీయ పౌరులై ఉండడం.
సెప్టెంబర్ 1 నాటికి సుమారు ఆరు నెలల వాలిడిటీతో భారతీయ పాస్‌పోర్ట్ ఉండాలి.
ప్రస్తుత ఏడాది జనవరి 1 నాటికి వయసు 18 ఏళ్లు నుంచి గరిష్ఠంగా 70 ఏళ్ల మధ్య ఉండాలని భారత విదేశీ వ్యవహరాల మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఈ యాత్రకు అత్యంత ముఖ్యమైన, కీలకమైన విషయం బీఎంఐ.. అంటే, బాడీ మాస్ ఇండెక్స్.
25 లేదా అంతకంటే తక్కువ బీఎంఐ ఉన్నవారిని మాత్రమే ఈ యాత్రకు వెళ్లేందుకు అనుమతిస్తారు. ఈ యాత్రకు వెళ్లే వ్యక్తి శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండటం అత్యంత అవసరం.
విదేశీ పౌరులు ఈ యాత్రకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత లేదు. దీంతో పాటు, ఓవర్‌సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డు ఉన్న వారు కూడా ఈ యాత్రకు దరఖాస్తు చేసుకోలేరు.

ఫొటో సోర్స్, Getty Images
దరఖాస్తు చేసుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలేంటి?
కైలాస మానసరోవర యాత్రకు ఎంపికచేయడానికి కంప్యూటర్‌లో డ్రా తీస్తారు.
అందుకే, దరఖాస్తును పూర్తిగా నింపడం చాలా ముఖ్యం. ఒకవేళ పూర్తిగా నింపకపోతే సిస్టమ్ దరఖాస్తును పరిగణనలోకి తీసుకోదు.
దరఖాస్తు చేసేటప్పుడే, సెప్టెంబర్ 1 నాటికి కనీసం ఆరు నెలల వాలిడిటీ ఉన్న పాస్‌పోర్టు కావాలి. దాని మొదటి పేజీ, చివరి పేజీ కాపీని సమర్పించాలి.
దీంతో పాటు, యాత్రకు దరఖాస్తు చేసుకునేవారి ఫొటోను జేపీజీ ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి.
అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఒక అకౌంట్ నుంచి కేవలం రెండు దరఖాస్తులను మాత్రమే నింపాలి.
ఆ తర్వాత, పాస్‌పోర్టులో రాసిన సమాచారం ప్రకారం, ఆన్‌లైన్ దరఖాస్తును పూరించాలి.
మీ పేరును, చిరునామాను, ఇతర ఏ సమాచారాన్ని దాచిపెట్టినా యాత్రకు వెళ్లకుండా మిమ్మల్ని నిషేధించవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
ఎలా ఎంపిక చేస్తారు?
ఈ యాత్ర కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తును నింపినవారిని, డ్రా పద్ధతిలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎంపిక చేస్తుంది.
డ్రాతో పాటు ప్రయాణికుల బ్యాచ్‌ను, మార్గాన్ని కూడా నిర్దేశిస్తుంది.
డ్రా తర్వాత నమోదు చేసుకున్న ఈమెయిల్, మొబైల్ నెంబర్ ద్వారా ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేస్తుంది.
011-23088133 హెల్ప్‌లైన్ నెంబర్ ద్వారా కూడా సమాచారాన్ని పొందవచ్చు.
దరఖాస్తుదారు విదేశీ వ్యవహారాల శాఖ ఇచ్చిన తుది గడువు లోపల కుమావూ మండల్ వికాస్ నిగమ్ లేదా సిక్కిం టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు చెందిన నిర్దేశిత బ్యాంకు అకౌంట్‌లో ప్రయాణ ఫీజులను, ఖర్చులను జమ చేయాలి.
ప్రయాణ ఖర్చులను చెల్లించిన తర్వాత, దిల్లీకి చేరుకోకముందే దరఖాస్తుదారుడు ఏ బ్యాచ్‌లో వెళ్లాలనుకుంటున్నారో ధ్రువీకరించాలి. ఆ తర్వాత బ్యాచ్‌ను కేటాయించడాన్ని పరిశీలిస్తారు.
యాత్ర ప్రారంభానికి ముందు ప్రతి బ్యాచ్‌లోని వారికి వైద్యపరీక్షలు నిర్వహిస్తారు.
దీని కోసం యాత్రికులు నిర్ణీత తేదీలో దిల్లీలోని హార్ట్ అండ్ లంగ్ ఇన్‌స్టిట్యూట్ వద్ద రిపోర్టు చేయాలి. ఒకవేళ చేయకపోతే ఆ బ్యాచ్ నుంచి పేరును తీసేస్తారు.
ప్రయాణికులందరూ కలిసి వెళ్లడం, కలిసి తిరిగి రావడం తప్పనిసరి అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రయాణికులందరికి యాత్ర ప్రారంభ ప్రాంతం దిల్లీయే.
ఈ యాత్ర ప్రారంభానికి ముందు తమ వాలిడ్ పాస్‌పోర్టును, ఆరు పాస్‌పోర్టు సైజు కలర్ ఫొటోలను, రూ.100 నోటరీ చేయించిన బాండ్‌ను విదేశీ మంత్రిత్వ శాఖకు చెందిన సంబంధిత అధికారులకు ఇవ్వాలి.
అత్యవసర సమయంలో హెలికాప్టర్‌లో తరలింపు కోసం అఫిడవిట్‌ను సమర్పించాలి. ఒకవేళ మరణిస్తే చైనా భూభాగంలోనే మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు అంగీకార పత్రాన్ని ఇవ్వాలి.
ఈ డాక్యుమెంట్లలో ఏది లేకపోయినా యాత్రకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వరు.

ఫొటో సోర్స్, Krishna Adhikari
ఎంత ఖర్చవుతుంది?
రెండు మార్గాలలో (లిపులేఖ్ పాస్ (ఉత్తరఖాండ్), నథులా పాస్ (సిక్కిం)) జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కైలాస మానసరోవర యాత్రను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది.
కైలాస మానసరోవర భారత్‌లో లేదు. మార్గాన్ని బట్టి ఖర్చు మారుతుంది.
ఈసారి ఐదేళ్ల తర్వాత ఈ యాత్ర జరుగుతోంది. కోవిడ్-19తో తొలిసారి వాయిదాపడగా.. ఆ తర్వాత తూర్పు లద్దాఖ్‌లో భారత్, చైనాల మధ్య ఘర్షణలతో 2020-2024 మధ్య ఈ యాత్రను నిర్వహించలేదు.
లిపులేఖ్ మార్గంలో వెళ్తే ప్రయాణ ఖర్చు రూ.లక్ష 74 వేలు అవుతుందని అంచనా.
ఈ మార్గంలో 200 కిలోమీటర్ల ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ మార్గంలో ఐదు బ్యాచ్‌లను పంపుతారు. ఈ మార్గంలో యాత్రను పూర్తి చేసేందుకు 22 రోజులు పడుతుంది.
ఒకవేళ నథులా పాస్‌లోంచి వెళ్తే ఒక్కొక్కరికి రూ.2 లక్షల 83 వేలు ఖర్చవుతుంది.
ఈ మార్గంలో 36 కి.మీ.లు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ మార్గంలో 10 బ్యాచ్‌లు వెళ్తాయి. ఈ మార్గంలో 21 రోజుల్లో యాత్ర పూర్తవుతుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)