SOURCE :- BBC NEWS

అసద్ పాలన అంతమయిన తర్వాత తనకు భయం పోయిందన్న రెనె

ఇది ఆయన నాయనమ్మకు చెందిన వస్తువు. ఏదో ప్రత్యేకమైనది. ఆయన చేతుల్లో అది ఉంది. ఆయన వేళ్ల చుట్టూ దాన్ని తిప్పుతున్నారు. అలా తిప్పుతూ ఏదో గుర్తుతెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దానిలో అనేక రంగులు కనిపిస్తున్నాయి.

రెనె మ్యూజిక్ బాక్స్ తెరిచారు. సంగీతం వాయించడం ప్రారంభించారు. చాలా కాలం కిందట డమాస్కస్‌లోని ఆయన సిటింగ్ రూమ్‌లో కూర్చుని విన్నది అదే పాట.

”నా ఇంట్లో నాకు మిగిలింది ఇదొక్కటే” అని ఆయన చెప్పారు.

ఈ యువకుడికి సంబంధించినది ప్రతిదీ మృదుత్వం ఉట్టిపడేలా ఉంటుంది. రెనె షెవన్ ఎత్తు తక్కువ.. సన్నాగా ఉంటారు. సౌమ్యంగా మాట్లాడతారు.

ఆయనకు అనేక విషయాలు గుర్తొస్తున్నాయి. బషర్-అల్-అసద్ పాలన ముగిసిపోవడం ఆయనకు సంతోషాన్ని కలిగిస్తోంది.

సిరియా జైళ్లల్లో నెలల తరబడి గడిపిన జ్ఞాపకాలు తలచుకుంటే ఆయన గుండె పగిలిపోతుంది.

‘అక్కడ ఓ మహిళ ఉండేవారు. ఇప్పటికీ ఆమె ముఖం నాకు గుర్తుంది. ఓ మూలన నిల్చుని ఆమె వేడుకుంటోంది. వాళ్లు ఆమెపై అత్యాచారం జరిపారు.

అక్కడ ఒక అబ్బాయి ఉండేవాడు.15 నుంచి 16 ఏళ్ల వయసుంటుంది. వాళ్లు ఆయనపై అత్యాచారం చేస్తుంటే ఆ బాలుడు అమ్మా..అమ్మా అంటూ తల్లిని తలుచుకునేవాడు’ అని రెనె గుర్తుచేసుకున్నారు.

‘నాపైనా అత్యాచారం చేశారు, లైంగికంగా వేధించారు’ అని రెనె చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
సొంత దేశం బాట పట్టిన సిరియన్లు

ఫొటో సోర్స్, Getty Images

భయంతో వణికిపోతూ…

పన్నెండేళ్ల కిందట నేను తొలిసారి రెనెను కలిశాను. ఆయన అప్పుడే సిరియా నుంచి పారిపోయి వచ్చారు.

అప్పుడు నా ఎదురుగా కూర్చున్నారు. వణుకుతున్నారు. కళ్ల నుంచి నీరు కారుతోంది. కెమెరాకు ముఖం చూపించడానికి భయపడుతున్నారు.

ప్రజాస్వామ్య అనుకూల ప్రదర్శనలో పాల్గొన్నందుకు సిరియా సీక్రెట్ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఆయన గే అని కూడా వారికి తెలుసు.

వారిలో ముగ్గురు రెనెపై అత్యాచారం జరిపారు. వదిలిపెట్టాలని రెనె ప్రాథేయపడినా వినలేదు వారు.

”నా మాట ఎవరూ వినిపించుకోలేదు. నేను ఒంటరిగా ఉన్నా” అని 2012 నాటి విషయాలను ఆయన గుర్తుచేసుకున్నారు.

స్వేచ్ఛ కోసం డిమాండ్ చేసినందుకు తనకు లభించింది ఇదేనని వారు చెప్పారని.. మరో అధికారి రోజూ తనను కొట్టేవారని.. ఆరు నెలల పాటు అలా వేధింపులు కొనసాగాయని రెనె చెప్పారు.

సిరియాలో బషర్ -అల్-అసద్ పాలన అంతమైన తర్వాత డమాస్కస్‌లోని జైలు నుంచి ఖైదీలు స్వేచ్ఛగా నడిచివస్తున్న దృశ్యాలు టీవీలో చూసిన తర్వాత రెనెకు తాను జైళ్లో ఉన్నప్పటి సంగతులు గుర్తొచ్చాయి.

”నేనిప్పుడు జైల్లో లేను. ఇక్కడే ఉన్నా. కానీ సిరియాలో ఉన్నవాళ్ల ఫొటోల్లో నన్ను నేను చూసుకుంటున్నా. వాళ్లను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్లు నన్ను రేప్ చేయడం, చిత్రహింసలకు గురిచేయడంతో పాటు గతంలో నేను పడ్డ అన్ని బాధలూ గుర్తొచ్చాయి” అన్నారు రెనె.

రెనె ఏడుస్తుండడంతో మేం కాసేపు ఇంటర్వ్యూ చేయడం ఆపాం. కొన్ని నిమిషాల తర్వాత ఆయన తేరుకున్నారు.

ఒక గ్లాసు మంచినీళ్లు తాగిన తర్వాత ఆయన సంభాషణ కొనసాగించారు.

కెమెరాకు ముఖం చూపించడానికి ఇప్పుడెందుకు అంగీకరించారని నేను ఆయన్ను అడిగాను.

‘ఇకనుంచి నేను ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అసద్ శరణార్థిగా రష్యాకు వెళ్లిపోయారు. సిరియాలోని నేరస్థులందరూ పారిపోయారు. సిరియా తిరిగి దేశప్రజలందరికీ దక్కింది” అని ఆయన బదులిచ్చారు.

”స్వేచ్ఛ, సమానత్వం ఉన్న మనుషుల్లా మేం జీవిస్తామన్న ఆశ కలుగుతోంది. నేను ఒక సిరియన్‌ను, డచ్‌ను, ఎల్జీబీటీని అని గర్వంగా చెబుతున్నాను అని రెనె అన్నారు.

సిరియాలో జైలు

ఫొటో సోర్స్, Reuters

సిరియా భవిష్యత్తు ఎలా ఉండనుంది?

అయితే దీనర్థం స్వలింగ సంపర్కునిగా సిరియాలో జీవించడంపై ఆయన నమ్మకంతో ఉన్నారని కాదు.

అసద్ పాలనలో హోమోసెక్సువాల్సిటినీ నేరంగా పరిగణించేవారు.

సిరియా కొత్త పాలకులకు కూడా చాందస మూలాలున్నాయి. స్వలింగ సంపర్కులపై హింసకు దిగడం, వారిని విచారించడం వంటి పనులు చేశారు.

”పోరాటంలో సిరియాకు చెందిన ఎల్జీబీటీలు చాలా మంది ఉన్నారు” అని రెనె చెప్పారు.

పోరాటంలో భాగమై వారు ప్రాణాలు కోల్పోయారు. కేవలం ఎల్జీబీటీ అయినందుకు, పోరాటంలో భాగమైనందుకు గత పాలనలో వారిని చంపారు.

మార్పు విషయంలో తాను వాస్తవికంగా ఆలోచిస్తున్నానని రెనె నాతో చెప్పారు.

సిరియా నుంచి పారిపోయి పొరుగు దేశాలైన లెబనాన్, జోర్డాన్, టర్కీతో పాటు దూరంగా ఉన్న యూరప్‌ దేశాలలో తలదాచుకున్న 60 లక్షలమంది సిరియన్లలో రెనె ఒకరు.

అసద్ పాలన ముగియడంతో చాలా యూరప్ దేశాలు ఇప్పటికే సిరియన్లకు ఆశ్రయం కల్పించే అప్లికేషన్లను స్వీకరించడం లేదు. అయితే ఇది తొందరపాటు చర్యని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు విమర్శిస్తున్నాయి.

అసద్ పాలన ముగియడంపై విదేశాల్లోని సిరియన్ల సంతోషం

విదేశాల్లోని సిరియన్లు ఏమంటున్నారు?

జర్మనీలో పదిలక్షలమంది సిరియన్లు ఉండొచ్చని అంచనా. వారిలో వికలాంగురాలైన ఓ కుర్దిష్ బాలికను 2015 ఆగస్టులో నేను మొదటిసారి కలుసుకున్నా. ఆమె పేరు నుజీన్.

గ్రీక్ ఐలాండ్ లెస్బోస్ చేరుకున్న వేలాదిమంది అక్కడ ఉన్నారు.

సెర్బియా, క్రొయేషియా, స్లొవేనియా, ఆస్ట్రియా మీదుగా ప్రయాణించి నుజీన్ అక్కడికి చేరుకున్నారు.

ఉత్తర సిరియా నుంచి యూరప్ చేరుకునేందుకు ఆమె తన సోదరి వీల్ చైర్‌ నడిపిస్తుండగా నుజీన్ పర్వతాలు, నదులు, సముద్రాల మీదుగా ప్రయాణించారు.

”నేను వ్యోమగామి కావాలనుకుంటున్నా. గ్రహాంతరవాసిని కలుసుకోవచ్చేమో, నేను రాణిని కలవాలనుకుంటున్నా” అని ఆమె చెప్పారు.

ఓ మురికి రోడ్డుపై నేను ఆమె పక్కన కూర్చున్నా. ఆ మధ్యాహ్నం వేడిలో వందలాదిమంది నిరాశ్రయులు అలిసిపోయి అక్కడున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆమె ఆశాభావం, మాట్లాడుతున్నవిధానం చాలా ప్రభావవంతంగా అనిపించాయి.

అమెరికా టీవీ కార్యక్రమాలు చూస్తూ ఆ బాలిక అనర్గళంగా ఇంగ్లిష్ మాట్లాడడం నేర్చుకుంది.

నుజీన్ అలెప్పోలో పెరిగారు. యుద్ధం తీవ్రమైన తర్వాత ఆమె దేశం వీడారు.

ఇప్పుడు అసద్ పాలన అంతమవడంతో ఆమె సంతోషంగా ఉన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)