SOURCE :- BBC NEWS

సిడ్నీలోని బోన్డీ బీచ్‌లో కాల్పులు జరుపుతున్న వ్యక్తి వెనుక నుంచి వచ్చి పట్టుకుని, తుపాకీ లాక్కుని తిరిగి గురిపెట్టిన ‘హీరో’ని 43 ఏళ్ల అహ్మద్ అల్ అహ్మద్‌గా గుర్తించారు.
బీబీసీ ధ్రువీకరించిన వీడియోలో.. అహ్మద్ తుపాకీతో కాల్పులు జరుపుతున్న వ్యక్తి వద్దకు వెనక నుంచి వెళ్లి, అతని దగ్గర నుంచి ఆయుధాన్ని స్వాధీనం చేసుకుని, ఆ తర్వాత తుపాకీని అతనికి గురిపెట్టి నిలువరించినట్టు కనిపిస్తోంది.
ఇద్దరు పిల్లల తండ్రి, పండ్ల దుకాణం యజమాని అయిన అహ్మద్ ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నారు. ఆయన చేయి, అరచేతికి బుల్లెట్ గాయాలవడంతో ఆపరేషన్ జరిగినట్లు ఆయన కుటుంబం 7న్యూస్ ఆస్ట్రేలియాకు తెలిపింది.
ఆదివారం రాత్రి జరిగిన కాల్పుల్లో 15 మంది మరణించగా , పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. హనుకా వేడుకలకు 1,000 మందికి పైగా హాజరైన సమయంలో ఈ కాల్పులు జరిగాయి. ఇది యూదు సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన “ఉగ్రవాద దాడి”గా పోలీసులు ప్రకటించారు.
“అహ్మద్ ఒక హీరో, నూటికి నూరుశాతం హీరో. ఆయనకు రెండు బుల్లెట్లు తగిలాయి. ఒకటి అతని చేతికి, మరోటి అరచేతికి. తనకి త్వరగా నయమవుతుందని ఆశిస్తున్నా. నిన్న రాత్రి నేను ఆయన్ను చూశా. బాగానే ఉన్నారు. అయితే, డాక్టర్లు ఏం చెబుతారో చూడాలి” అని అహ్మద్ బంధువు ముస్తఫా ఆదివారం రాత్రి 7న్యూస్ ఆస్ట్రేలియాతో చెప్పారు.

కాల్పులు జరిపిన వ్యక్తులు తండ్రీ కొడుకులని పోలీసులు తెలిపారు. వారిలో తండ్రి వయసు 50 ఏళ్లుకాగా కొడుకు వయసు 24 ఏళ్లు.
50 ఏళ్ల వ్యక్తి సంఘటనా స్థలంలోనే మరణించారని, 24 ఏళ్ల వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని వారు ధ్రువీకరించారు.
అహ్మద్ సాహసోపేత వీడియో ఫుటేజీ ఆన్‌లైన్‌లో వైరల్ అయింది.
పాదచారుల వంతెన దగ్గర, ఒక చెట్టు వెనుక నిల్చుని సాయుధుడు తుపాకీతో కాల్పులు జరపడం కనిపిస్తుంది.
ఆ సమయంలో ఆగి ఉన్న కారు వెనుక దాక్కున్న అహ్మద్, కాల్పులు జరుపుతున్న వ్యక్తిని వెనకనుంచి పట్టుకుని, అతని వద్దనుంచి తుపాకీ లాక్కున్నారు.
తర్వాత సాయుధుడిని కిందపడేసి, తుపాకీని అతని వైపు గురిపెట్టారు. దీంతో అతను వెనక్కితగ్గాడు.
అప్పుడు అహ్మద్ ఆయుధాన్ని కిందకి దించి, ఒక చేతిని పైకెత్తారు. అంటే, కాల్పులు జరిపింది తాను కాదని పోలీసులకు చెబుతున్నట్టు అందులో కనిపిస్తోంది.
తరువాత అదే సాయుధుడు వంతెనపై మరో ఆయుధాన్ని తీసుకెళ్లి మళ్లీ కాల్పులు జరిపాడు.
మరో దుండగుడు కూడా వంతెనపై నుంచి కాల్పులు జరుపుతూనే ఉన్నాడు. వారు ఎవరిని లేదా దేనిని లక్ష్యంగా చేసుకున్నారన్న దానిపై స్పష్టత లేదు.

“ఆయనపై నాకు గౌరవం ఏర్పడింది” – డోనల్డ్ ట్రంప్
న్యూసౌత్ వేల్స్ ప్రభుత్వాధినేత క్రిస్ మిన్స్ ఆయన్ను “నిజమైన హీరో”గా అభివర్ణించారు. అప్పటికి అహ్మద్ పేరు ఎవరికీ తెలియదు.
” ఆ వ్యక్తి నిజమైన హీరో, ఆయన ధైర్య సాహసాలు ఈరోజు ఎంతోమంది ప్రాణాలు కాపాడాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు” అని మిన్స్ మీడియా సమావేశంలో అన్నారు.
“ఇతరులకు సాయం చేయడానికి కొంతమంది ఆస్ట్రేలియన్లు అటువైపు పరుగెత్తడం చూశాం. వీరంతా నిజమైన హీరోలు, వారి ధైర్యం ప్రాణాలను కాపాడింది” అని ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ ఆల్బనీజ్ అన్నారు.
వైట్ హౌస్ క్రిస్మస్ రిసెప్షన్‌లో మాట్లాడుతూ, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ కూడా అహ్మద్‌ను ప్రశంసించారు.
“ఆయనపై నాకు గౌరవం ఏర్పడింది, నిజానికి చాలా ధైర్యవంతుడైన వ్యక్తి, ఆయన వెళ్లి కాల్పులు జరుపుతున్న వారిలో ఒకరిపై ఎదురుదాడి చేసి, చాలా మంది ప్రాణాలను కాపాడారు” అని ట్రంప్ అన్నారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS







