SOURCE :- BBC NEWS

చంద్రబాబు, పవన్ కల్యాణ్

ఫొటో సోర్స్, CBN WhatsApp channel

పేదరికం లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను మార్చేందుకు పీ4 అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు తెలుగు సంవత్సరాది అయిన ఉగాదినాడు అమరావతిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.

పీ4 ‘‘ఓ గేమ్ చేంజర్’’ అని చంద్రబాబు చెప్పారు.

‘‘పీ4 అంటే – పబ్లిక్, ప్రైవేట్, పీపుల్, పార్ట్‌నర్‌షిప్‌. ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యం. జనాభాలోని అత్యంత సంపన్నులైన 10 శాతం మంది.. పేద కుటుంబాల్లో అట్టడుగున ఉన్న 20 శాతం మందికి నేరుగా సాయం చేసేందుకు ఉద్దేశించిన కార్యక్రమం ఇది.’’ అని సీఎం అన్నారు.

‘‘విరాళాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న సంపన్న వ్యక్తులను మార్గదర్శకులుగా నియమిస్తారు.. నిరుపేద లబ్ధిదారులను బంగారు కుటుంబాలుగా గుర్తిస్తారు. ప్రభుత్వం డిజిటల్‌ డాష్‌ బోర్డుల ద్వారా ఎప్పటికప్పుడు పురోగతిని గుర్తిస్తూ ఒక ఫెసిలిటేటర్‌ గా వ్యవహరిస్తుంది” అని సీఎం వెల్లడించారు.

బీబీసీ వాట్సాప్ చానల్
P4, CHANDRABABU

ఫొటో సోర్స్, UGC

గేమ్ చేంజర్ : చంద్రబాబు

పేదరిక నిర్మూలనకు పీ 4 పథకం ఓ గేమ్‌ చేంజర్‌ కానుందని, ప్రపంచానికి ఒక నమూనాగా పనిచేస్తుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

‘‘ఆగస్టు 15నాటికి ఈ కార్యక్రమానికి స్పష్టమైన రూపం తీసుకొస్తాం.. వచ్చే ఉగాది నాటికి పురోగతిని అంచనా వేస్తాం” అని చంద్రబాబు చెప్పారు.

పీ4లో భాగంగా లబ్ధిదారుల కుటుంబాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న సమాచారంతో పాటు సర్వే, గ్రామసభల ద్వారా గుర్తిస్తారు.

రాష్ట్రంలో మొత్తం 40 లక్షల కుటుంబాలు అర్హత సాధించవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే జిల్లాల్లో సర్వే చేస్తున్నారు.

COLLECTOR PRASANTHI

అనుసంధానమే ప్రభుత్వ పాత్ర

లబ్ధిదారుల ధ్రువీకరణ అనంతరం వారి వివరాలను పోర్టల్‌లో ఉంచుతారు. లబ్ధిదారుల కుటుంబాలను, సాయం అందించనున్న కుటుంబాలతో అనుసంధానించడమే పీ4 పథకంలో ప్రభుత్వం పాత్ర. అంతేతప్ప తనకు తాను నేరుగా ఎలాంటి ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించదు.

‘‘ఉదాహరణకు ఓ గ్రామంలో పేదరికంలో ఉన్న వారి వివరాలు సేకరిస్తాం. అదే విధంగా ఆ గ్రామానికే చెందిన సంపన్నులను గుర్తిస్తాం. పేదలకు సాయం చేసేందుకు ఆ సంపన్నులు ముందుకొస్తే మేం సంధాన కర్తగా వ్యవహరిస్తాం. బంగారు కుటుంబాల ఆదాయం పెంచి కెరీర్‌ రూపకల్పన చేసే బాధ్యత మార్గదర్శకులు తీసుకుంటారు” అని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి బీబీసీకి చెప్పారు.

అయితే, పీ4 కార్యక్రమ పూర్తి విధి విధానాలు, నియమ నిబంధనలు త్వరలో ఖరారు అవుతాయని అధికారులు చెబుతున్నారు.

‘ప్రభుత్వం తప్పించుకుంటోంది’

పీ4 పథకాన్ని విపక్ష వైసీపీ ప్రచార తంతుగా చెబుతుంటే, ప్రభుత్వం రాజ్యాంగ బాధ్యతల నుంచి తప్పించుకుంటోందని ఆర్థిక, విద్యావేత్తలు విశ్లేషిస్తున్నారు.

అయితే అధికార టీడీపీ నేతలు మాత్రం ఈ పథకాన్ని కచ్చితంగా గేమ్ చేంజర్ అని సమర్థిస్తున్నారు.

కూటమి ప్రభుత్వం చేపట్టిన ‘పీ4–జీరో పావర్టీ’ కార్యక్రమం చంద్రబాబు పబ్లిసిటీ స్టంట్‌ అని మాజీ మంత్రి, వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత అంబటి రాంబాబు విమర్శించారు.’

‘ పీ–4 సంగతి తర్వాత .. ఎన్నికలకు ముందు సూపర్‌ సిక్స్‌ అన్నారు. సంపదను సృష్టించి పేదలకు పంచుతామని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడి పదినెలలవుతోంది, సంపద సృష్టి లేదు, ఇప్పుడు ధనవంతులను తీసుకువచ్చి, పేదలకు మీ సంపదను పంచండి అని చెబుతున్నారు. ఇది సాధ్యమయ్యే పనేనా” అని అంబటి మీడియా వద్ద ప్రశ్నించారు.

‘‘పేదరిక నిర్మూలన చేయాల్సిన బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకుంటోందా.. ప్రభుత్వాలు ఉండగా, పేదలు వేరొకరి నుంచి సాయం ఆశించడం ఏమిటి” అని ప్రొఫెసర్‌ డాక్టర్‌ జి.ప్రియ ప్రశ్నించారు.

‘‘పేదరిక నిర్మూలన అంటే ఆ ప్రాంత ప్రజల జీవనోపాధిని మెరుగుపరచడం, ఉచిత విద్య, వైద్యంతో పాటు వారికి పని కల్పించడం. ఇటువంటి బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. . ఇప్పుడు ఇలాంటి పనులన్నీ కార్పొరేట్లకు కట్టబెడితే రేపు వాళ్లను ప్రభుత్వం ఎలా నియంత్రించగలుగుతుంది? వాళ్లు తప్పులు చేస్తే ఎలా ప్రశ్నిస్తుంది?” అని ఆమె బీబీసీతో అన్నారు.

మరింత మేలు : టీడీపీ

పీ4పై వస్తున్న విమర్శలపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కె.పట్టాభి బీబీసీతో మాట్లాడారు.

‘‘పీ4పై ముందే విమర్శలు చేయద్దు’’ అన్నారు.

‘‘రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు అర్హులైన వారందరికీ అందినప్పటికీ ఇంకా కొందరు విద్య, వైద్యం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటి వారికి సంపన్నులు సాయం చేస్తే తప్పేంటి.. ప్రభుత్వ సాయానికి వారి ఔదార్యం జత కూడుతుంది. ఇది మరింత మేలు చేస్తుంది కదా.. దీన్ని విమర్శించడం అన్యాయం అని పట్టాభి అన్నారు.

తెలుగుదేశం ప్రభుత్వం

ఫొటో సోర్స్, UGC

సూపర్ 6 హామీలు ఎంతవరకు వచ్చాయి?

ఎన్నికలకు ముందు తెలుగుదేశం, జనసేన పార్టీలు తాము అధకారంలోకి వస్తే సూపర్‌ సిక్స్‌ పథకాలు అమలు చేస్తామని హామీనిచ్చాయి. ఆ హామీలను అమలు చేయకుండా పీ4 పేరుతో కూటమి ప్రభుత్వం హడావుడి చేస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

ఎన్నికల ముందు ప్రకటించిన సూపర్ 6 పథకాలు:

1. యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు రూ. 3000 నిరుద్యోగ భృతి

2. ప్రతి ఇంటికీ ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు

3. స్కూల్‌‌కి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15000

4. ప్రతి మహిళకు నెలకి రూ. 1500

5. ప్రతి రైతుకు ఏడాదికి రూ. 20వేల ఆర్థిక సాయం

6. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

సూపర్‌ సిక్స్‌ హామీల్లో నగదు బదిలీతో ముడిపడిన పథకాలు ఐదు ఉన్నాయి. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకాన్ని మినహాయిస్తే తల్లికి వందనం, మహిళలకు ప్రతి నెలా భృతి, యువతకు నిరుద్యోగ భృతి, రైతులకు ఏటా ఆర్థిక సాయం, ఏడాదికి ఉచితంగా మూడు వంట సిలిండర్లు హామీలు..నగదు బదలీ పథకాలే.

వీటిలో గతేడాది చివర్లో ఒక సిలిండర్‌ను ఉచితంగా ప్రభుత్వం ఇవ్వగా, రెండో సిలిండర్ ఇవ్వనున్నట్టు తాజాగా పౌరసరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.

ఇక ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని త్వరలో ప్రారంభిస్తామని బడ్టెట్‌ సందర్భంగా చెప్పారు కానీ ఎప్పటి నుంచి అనేది చెప్పలేదు.

రాష్ట్రంలో 20లక్షల మంది నిరుద్యోగ యువతీయువకులకు ప్రతి నెల రూ.3వేల నిరుద్యోగ భృతి చెల్లిస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ–జనసేన హామీ ఇచ్చాయి.

18ఏళ్లు దాటిన ప్రతి మహిళకు ప్రతి నెల రూ.1500 చెల్లిస్తామని హామీ ఇచ్చాయి.

అయితే ఆర్థిక అంశాలతో ముడిపడిన ఈ హామీలకు సంబంధించిన కార్యాచరణ గత బడ్జెట్‌ ప్రసంగంలో కనిపించలేదు.

సూపర్‌ సిక్స్‌లో భాగంగా ప్రతి రైతుకు పెట్టుబడి సాయం కింద ఏటా రూ.20వేలు అందిస్తామని ఇచ్చిన ఎన్నికల హామీ మేరకు రాష్ట్రంలోని 52లక్షలమంది రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.20వేలు ఇవ్వాలంటే పదివేల కోట్ల రూపాయలకు పైగా అవసరం. బడ్టెట్‌లో అన్నదాత సుఖీభవ కోసం 6వేల 300కోట్లు మాత్రమే కేటాయించారు.

సూపర్‌ సిక్స్‌ హామీల అమలును పట్టించుకోకుండా ఇప్పుడు పీ–4 కార్యక్రమం పేరుతో ప్రభుత్వం హడావుడి చేస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

అయితే, హామీల అమలుకు కసరత్తు జరుగుతోందని త్వరలోనే అన్ని హామీలు అమలు చేస్తామని టిడిపి జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

SOURCE : BBC NEWS