SOURCE :- BBC NEWS

స్మార్ట్ మీటర్లు

ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం ఒక కోటి 98 లక్షల 55 వేల 726 విద్యుత్‌ కనెక్షన్లకు (వ్యవసాయేతర కనెక్షన్లకు) స్మార్ట్‌ మీటర్లను బిగించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది.

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, రాష్ట్రంలోని అన్ని కేటగిరీల విద్యుత్‌ కనెక్షన్లకు స్మార్ట్‌ మీటర్లను బిగించేందుకు అదానీ ఎలక్ట్రిసిటీ సొల్యూషన్స్‌ సంస్థ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో ఇళ్లతో పాటు పరిశ్రమలు, ఇతర కమర్షియల్‌ కనెక్షన్లు కూడా ఉన్నాయి.

ఇప్పటికే వాణిజ్య సంస్థలు, పరిశ్రమలు, ప్రభుత్వ కార్యాలయాలకు స్మార్ట్‌ మీటర్ల బిగింపు ప్రక్రియ మొదలు కాగా, త్వరలోనే ఇళ్లకి కూడా ఆ మీటర్లు బిగించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా గత నెలాఖరులో గుంటూరులో కొన్ని ఇళ్లకు స్మార్ట్‌ మీటర్లను బిగించగా, స్థానికుల నుంచి నిరసన రావడంతో తాత్కాలికంగా ఆ ప్రక్రియను నిలిపివేశారు.

అయితే, త్వరలోనే అందరికీ అవగాహన కల్పించి ఇళ్లకి స్మార్ట్‌ మీటర్లను అమర్చుతామని విద్యుత్‌ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

బీబీసీ తెలుగు వాట్సాప్ చానల్
ఆంధ్రప్రదేశ్, విద్యుత్ స్మార్ట్ మీటర్లు

ఏసీఈఆర్‌సీకి డిస్కమ్‌ల ప్రతిపాదనలు..

ప్రీ పెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లను వినియోగదారులందరి ఇళ్లకు అమర్చే విషయమై ఇప్పటికే ఏపీఈఆర్‌సీ(ఆంధప్రదేశ్‌ విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్‌)కు రాష్ట్రంలోని విద్యుత్‌ పంపిణీ సంస్థలు(డిస్కమ్‌‌లు) ప్రతిపాదనలు సమర్పించాయి. వార్షిక ఆదాయ నివేదిక (అగ్రిగేట్‌ రెవెన్యూ రిక్వైర్‌మెంట్‌ – ఏఆర్‌ఆర్‌)లోనే ఈ విషయాన్ని ప్రస్తావించాయి.

2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డిస్కమ్‌లు గతేడాది చివర్లోనే ఏఆర్‌ఆర్‌లను సమర్పించాయి. హయ్యర్‌ లోడ్‌ వినియోగదారులతో పాటు, ఎల్‌టీ టారిఫ్‌లోని అందరు వినియోగదారులకు స్మార్ట్‌ మీటర్లను బిగించనున్నట్లు రాష్ట్రంలోని మూడు డిస్కమ్‌లు(ఏపీఈపీడీసీఎల్, ఎస్‌పీడీసీఎల్, సీపీడీసీఎల్‌) ఆ ప్రతిపాదనల్లో పేర్కొన్నాయి.

అందుకు అనుమతి ఇవ్వాలని ఏపీఈఆర్‌సీని డిస్కమ్‌లు కోరాయి.

వ్యవసాయ పంపు సెట్లకు మినహా మిగిలిన అందరు వినియోగదారులకు టైమ్‌ ఆఫ్‌ డే టారిఫ్‌ను సమర్థవంతంగా వినియోగించడానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయినట్లు డిస్కమ్‌లు తెలిపాయి.

ఆంధ్రప్రదేశ్, విద్యుత్ స్మార్ట్ మీటర్లు, ప్రీ పెయిడ్ మీటర్లు

పాత ప్రతిపాదనలే అంటున్న కూటమి ప్రభుత్వం..

స్మార్ట్‌ మీటర్ల వినియోగానికి సంబంధించి నిరుడు జనవరి 10న, మే 7న.. అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే ప్రతిపాదనలను సమర్పించినట్లు తాజాగా ఈఆర్‌సీకి అందజేసిన నివేదికలో డిస్కమ్‌లు పేర్కొన్నాయి.

అయితే, ఈ ప్రతిపాదనలను అప్పట్లో టీడీపీ వ్యతిరేకించింది. కానీ, టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి ప్రభుత్వం కూడా తాజాగా అవే ప్రతిపాదనలను మళ్లీ సమర్పించింది. దీనిని వినియోగదారులందరికీ వర్తింపజేయడంతో పాటు డిమాండ్‌ను బట్టి టారిఫ్‌ను మార్చేందుకు ఈఆర్‌సీ అనుమతి కోరింది.

గతేడాది తమ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత 2024 జూలై 1న, కేంద్ర ఆదేశాల మేరకు ఎల్‌టీ వినియోగదారులకు కూడా స్మార్ట్‌మీటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఏఆర్‌ఆర్‌లో పేర్కొంది.

విద్యుత్ స్మార్ట్ మీటర్లు, ప్రీ పెయిడ్ మీటర్లు

వ్యవసాయ సర్వీసులకు మినహాయింపు?

కేంద్ర ప్రభుత్వ విద్యుత్‌ శాఖ ప్రతిపాదిత రీవ్యాంప్డ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సెక్టార్‌ స్కీమ్‌ (ఆర్‌డీఎస్‌ఎస్‌)లో భాగంగా 2025 మార్చి నాటికి దేశమంతటా అన్ని రాష్ట్రాలూ స్మార్ట్‌‌ విద్యుత్‌ మీటర్లను వినియోగించాలని కేంద్రం ఇచ్చిన ఆదేశాల మేరకే తాము డిస్కమ్‌లకు మార్గదర్శకాలను ఇచ్చామని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని 18.58 లక్షల వ్యవసాయ సర్వీసులకు కూడా స్మార్ట్‌ మీటర్లను అమర్చాలని గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

అయితే, వ్యవసాయం కోసం వినియోగించే మోటార్లకు స్మార్ట్‌ మీటర్లను బిగించే ప్రసక్తే లేదని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. గత ప్రభుత్వం తెచ్చిన ప్రతిపాదనలను ఎత్తివేస్తున్నామని గత నవంబర్‌ నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆయన ప్రకటించారు.

విజయవాడలో ఏపీఈఆర్‌సీ చేపట్టిన బహిరంగ విచారణలో ఏపీఈఆర్‌సీ చైర్మన్‌ ఠాకూర్‌ సింగ్‌ కూడా ఇదే విషయం చెప్పారు.

అలాగే, వ్యవసాయ మోటార్లకు స్మార్ట్‌ మీటర్ల బిగింపును పక్కనబెట్టిన ప్రభుత్వం.. తొలిదశగా రాష్ట్రంలోని మూడు డిస్కంల పరిధిలోని అన్ని జిల్లాల్లో పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలోనూ స్మార్ట్‌ మీటర్లను అమరుస్తోంది.

గత మూడు నెలల నుంచి ఈ ప్రక్రియ మొదలుపెట్టగా, తాజాగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా స్మార్ట్‌ మీటర్లను బిగిస్తున్నారు. తాగునీటి పథకాలు, వీధి దీపాలు, స్థానిక సంస్థలు, పంచాయతీ కార్యాలయాలకు కూడా వీటిని బిగిస్తున్నారు.

విద్యుత్ స్మార్ట్ మీటర్లు, ప్రీపెయిడ్ మీటర్లు

గృహ విద్యుత్ కనెక్షన్ల మాటేమిటి? గుంటూరులో ఏమైంది?

రాష్ట్రంలోని గృహ విద్యుత్‌ అవసరాలకు సంబంధించి ప్రస్తుతమున్న మీటర్ల స్థానంలో స్మార్ట్‌ మీటర్లను ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు.

ఈక్రమంలోనే గత డిసెంబర్‌ నెలలో గుంటూరు నగరం ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు సమీపంలోని సుందరయ్య నగర్‌‌లో, 16 ఇళ్లకు విద్యుత్‌ పాత మీటర్లు తొలగించి వాటి స్థానంలో స్మార్ట్‌ మీటర్లు బిగించారు. ఆ ఇళ్లలో విద్యుత్‌ రాయితీ పొందుతున్న దళితులు, బలహీన వర్గాలకు చెందిన వారి ఇళ్లే ఎక్కువున్నాయి.

ఆ కాలనీలోని మిగిలిన దాదాపు 300 ఇళ్లకు బిగిస్తుండగా.. స్థానికులు ప్రతిఘటించడంతో మిగిలిన ఇళ్లకు మీటర్లు పెట్టకుండా సిబ్బంది వెనక్కితగ్గారు.

అయితే, అప్పటికే బిగించిన 16 ఇళ్లకు కూడా తొలగించి పాత మీటర్లే పెట్టాలని స్థానికులు, సీపీఎం నేతలతో కలిసి విద్యుత్‌ ఎస్‌ఈ కార్యాలయం వద్ద దశలవారీగా ఆందోళనలు నిర్వహించడంతో ఎట్టకేలకు వాటిని కూడా తొలగించి, మళ్లీ ఆ స్థానంలో పాత మీటర్లు బిగించారు.

ఆంధ్రప్రదేశ్, విద్యుత్ స్మార్ట్ మీటర్లు, ప్రీ పెయిడ్ మీటర్లు

ప్రీపెయిడ్ విధానమేమీ కాదు..

గుంటూరులో స్మార్ట్‌‌ మీటర్ల తొలగింపు ఘటనపై సీపీఎస్‌పీడీసీఎల్‌ గుంటూరు ఎస్‌ఈ కేవైఎల్‌ మూర్తి బీబీసీతో మాట్లాడారు.

”సుందరయ్య కాలనీలో స్మార్ట్‌మీటర్ల ఏర్పాటుపై వ్యతిరేకత రావడంతో తొలగించిన విషయాన్ని ఉన్నతాధికారులకు వివరించాం. కొంతకాలం వేచిచూస్తాం. తర్వాతైనా ఆ మీటర్లు బిగించాల్సిందే. ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి, వాటి ఉపయోగాలపై అవగాహన కల్పించి మళ్లీ స్మార్ట్‌ మీటర్లు అమరుస్తాం” అని ఆయన చెప్పారు.

ప్రభుత్వం కొన్నివర్గాలకు బిల్లుల్లో ఇస్తున్న రాయితీలు స్మార్ట్‌ విద్యుత్‌ మీటర్ల కారణంగా పోతాయనే భయాందోళనలు ఉన్నాయని, అలాంటి అనుమానాలు అక్కర్లేదని గుంటూరు ఎస్‌ఈ తెలిపారు.

”ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 16 లక్షల 26 వేల 973 మంది విద్యుత్‌ వినియోగదారులు ఉన్నారు. తొలిదశలో ఆగస్టు నుంచి ప్రభుత్వ కార్యా లయాలకు సంబంధించి 31,594 స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు ప్రారంభించి, పూర్తి కూడా చేశాం. ప్రస్తుతం కేటగిరి–2కు సంబంధించి వాణిజ్య వినియోగదారులైన 1,59,356 మందికి చెందిన వ్యాపార సంస్థలకు అమరుస్తున్నాం. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే 13 లక్షల 607 మంది గృహ విద్యుత్‌ వినియోగదారుల ఇళ్లకు స్మార్ట్‌ మీటర్లను ఏర్పాటు చేస్తాం” ఏలూరు సర్కిల్‌ ఏపీఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ పి.సాల్మన్‌రాజు బీబీసీతో చెప్పారు.

”స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటుతో బిల్లులు రెట్టింపవుతాయన్న ఆందోళన అవసరం లేదు. గతంతో మాదిరిగానే విద్యుత్‌ బిల్లులు వస్తాయి. ప్రీ పెయిడ్‌ విధానం ఉండదు. మారుతున్న కాలానికి అను గుణంగానే స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేస్తున్నాం” అని సాల్మన్‌ రాజు తెలిపారు.

విద్యుత్ స్మార్ట్ మీటర్లు

ఫొటో సోర్స్, Getty Images

స్మార్ట్‌ మీటర్లు ఎందుకు?

కొత్త టెక్నాలజీకి అనుగుణంగా అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు ఉన్న మీటర్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెబుతున్నారు డిస్కమ్‌ల అధికారులు.

”విద్యుత్‌ వినియోగానికి సంబంధించి సిబ్బంది ప్రతి నెలా వచ్చి రీడింగ్‌ తీయాల్సిన అవసరం ఉండదు. ఆన్‌లైన్‌ ద్వారా మానిటరింగ్‌ కేంద్రానికి మీటర్‌ రీడింగ్‌ చేరుతుంది. ఎన్ని యూనిట్లు వాడారు? ఎంత బిల్లు చెల్లించాలి? అన్న వివరాలు సంబంధిత వినియోగదారుని మొబైల్‌ ఫోన్‌కు మెసేజ్‌ ద్వారా తెలియజేస్తారు.

గడువులోగా బిల్లు చెల్లించకపోతే మానిటరింగ్‌ కేంద్రం నుంచే స్మార్ట్‌ మీటర్‌ ద్వారా విద్యుత్‌ సరఫరాను నిలిపివేసే అవకాశం ఉంటుంది. లైన్‌మెన్‌ ఇళ్లకు వచ్చి ఫ్యూజులు తీసుకెళ్లాల్సిన పనివుండదు.

విద్యుత్‌ సరఫరా నిలిచిపోతే ఎక్కడ, ఎందుకు నిలిచిపోయిందో స్మార్ట్‌ మీటర్‌ ద్వారా వెంటనే మానిటరింగ్‌ కేంద్రానికి సంకేతాలు వస్తాయి. సిబ్బంది నేరుగా అక్కడకు వెళ్లి సమస్యను పరిష్కరిస్తారు” అని డిస్కంల అధికారులు చెబుతున్నారు.

ప్రస్తుతం ప్రీ పెయిడ్‌ విధానం ఏదీ లేదని, పాత మీటర్ల స్థానంలో అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు ఉన్న మీటర్లు బిగించడం తప్ప వేరే ప్రమాదమేమీ లేదని సీపీఎస్‌పీడీసీఎల్‌ గుంటూరు ఎస్‌ఈ కేవైఎల్‌ మూర్తి చెప్పుకొచ్చారు.

బీబీసీ తెలుగు, ప్రీ పెయిడ్ మీటర్లు

ఈ స్మార్ట్ మీటర్లపై వైఎస్సార్సీపీ ఏమంటోంది?

అప్పట్లో కేంద్రంతో జరిగిన ఒప్పందం మేరకే స్మార్ట్ మీటర్లు పెట్టాలని నిర్ణయించినట్లు మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత గుడివాడ్ అమర్నాథ్ బీబీసీతో చెప్పారు.

”అవును.. అప్పట్లో కేంద్ర ప్రభుత్వంతో జరిగిన ఒప్పందంలో భాగంగానే మా ప్రభుత్వ హయాంలో స్మార్ట్ మీటర్లను పెట్టాలని నిర్ణయించాం. అప్పట్లో మా ప్రభుత్వం ఒక్కటే కాదు దేశంలోని చాలా రాష్ట్రాలతో ఈ ఒప్పందం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే” అన్నారు అమర్నాథ్.

మరి అప్పుడు వ్యతిరేకించిన టీడీపీ ఇప్పుడెలా స్మార్ట్ మీటర్లను బిగిస్తోందని ఆయన ప్రశ్నించారు.

టీడీపీ వాదనేంటి?

”స్మార్ట్ మీటర్ల ఏర్పాటు అనేది గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్రంతో చేసుకున్న ఒప్పందం. అన్ని రాష్ట్రాలతో ఉన్న ఒప్పందంలో భాగంగానే అది జరిగింది. మేము అప్పుడు వ్యతిరేకించిన మాట నిజమే. అందుకే మేం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ పెంపు సెట్లకు స్మార్ట్ మీటర్లను బిగించేది లేదని స్పష్టంగా ప్రకటించాం” అని టీడీపీ అధికార ప్రతినిధి శివరాం ప్రసాద్ బీబీసీతో మాట్లాడుతూ చెప్పారు.

వైఎస్సార్సీపీ హయాంలో అయితే వ్యవసాయ పంపు సెట్లకు కూడా స్మార్ట్ మీటర్లు పెట్టాలని నిర్ణయించారని, ఇప్పుడు ఆ ప్రతిపాదనను పూర్తిగా తీసేశామని ఆయన అన్నారు.

”అలాగే ఇళ్లకు, పరిశ్రమలకు, వాణిజ్య సంస్థలకు బిగించే స్మార్ట్ మీటర్లలో ప్రీపెయిడ్ విధానం లేకుండా చేశాం. ఇప్పటి మీటర్ల స్థానంలో బిగించే స్మార్ట్ మీటర్లతో మిగిలిన అన్ని ప్రయోజనాలు చేకూరుతాయి కానీ ప్రీపెయిడ్ విధానం మాత్రం కచ్చితంగా ఉండదు. ప్రజలకు మోయలేనంత భారం కలిగించకుండా చూడడమే మా ముందున్న బాధ్యత” అని శివరాం ప్రసాద్ అన్నారు.

ఆంధ్రప్రదేశ్, విద్యుత్ స్మార్ట్ మీటర్లు, ప్రీ పెయిడ్ మీటర్లు

భవిష్యత్తులో భారమే: సీపీఎం

వ్యవసాయ మీటర్లకు స్మార్ట్‌ మీటర్లు బిగించబోమని మంత్రి గొట్టిపాటి స్వయంగా అసెంబ్లీలో చేసిన ప్రకటన, ఏపీఈఆర్‌సీ బహిరంగ విచారణలో చైర్మన్‌ ఠాకూర్‌ సింగ్‌ ప్రకటనల్లో స్పష్టత లేదని సీపీఎం అంటోంది.

వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు ప్రతిపాదన ఉపసంహరించుకున్నట్టు డిస్కమ్‌లు ఇచ్చిన ప్రతిపాదనల్లో ఎక్కడా లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చిగురుపాటి బాబూరావు బీబీసీతో అన్నారు.

అందుకోసం కొనుగోలు చేసిన 2 లక్షల స్మార్ట్‌ మీటర్లు ఏం చేస్తారు? ఎత్తివేసే ప్రతిపాదన ఈ ఒక్క ఏడాదికేనా? మళ్లీ వచ్చే ఏడాది తెరపైకి తెస్తారా? వంటి అంశాలపై స్పష్టత ఇవ్వాలని బాబూరావు డిమాండ్‌ చేశారు.

ఇప్పటికప్పుడు చేయకపోయినా భవిష్యత్‌లో తప్పకుండా విద్యుత్‌ బిల్లుల చెల్లింపును మొబైల్‌ ఫోన్ల తరహాలో ప్రీపెయిడ్‌ రీచార్జీని అమలు చేస్తారని సీపీఎం నేతలు ఆరోపిస్తున్నారు.

ప్రస్తుతం ప్రతినెలా విద్యుత్‌ సిబ్బంది మీటర్‌ రీడింగ్‌ తీసిన తరువాత పక్షం రోజుల్లో బిల్లు చెల్లించే వెసులుబాటు ఉంది.

”స్మార్ట్‌ మీటర్లను అందుబాటులోకి తీసుకొచ్చిన తరువాత వినియోగదారులు ముందుగానే కార్డు ద్వారా డబ్బులు చెల్లించాలి. వినియోగించిన విద్యుత్‌కి సరిపడా డబ్బులు అయిపోతే వెంటనే రీచార్జి చేసుకోవాల్సి వస్తుంది. ఇది ప్రజలపై భారమే”అని సీపీఎం నేత బాబూరావు ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం దీనిపై కచ్చితమైన ప్రకటన చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)