SOURCE :- BBC NEWS

ఆర్ఎన్ఎస్ కాలనీ

హైదరాబాద్ శివారులోని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆర్ఎన్ఎస్ కాలనీ భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ఈ భూములు వక్ఫ్ పరిధిలోనివి అంటూ వీటి రిజిస్ట్రేషన్‌ను అధికారులు నిరాకరిస్తున్నారు. దీనిపై 2023 మార్చిలో ఈ కాలనీతోపాటు చుట్టుపక్కల కాలనీల ప్రజలు కూడా ఆమరణ నిరాహార దీక్ష చేశారు.

వక్ఫ్ పరిధిలోంచి ఈ భూములను తొలగించి సమస్యను పరిష్కరిస్తానని అప్పట్లో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి బాండ్ పేపర్ రాసిచ్చారు. ఆ తరువాతఈ సమస్యపై రాజకీయంగానూ దుమారం రేగింది. దీన్ని పరిష్కరిస్తామని అన్ని పార్టీల నాయకులూ హామీ ఇచ్చారు.

కానీ, రెండేళ్లు గడిచినా ఇప్పటికీ సమస్య పరిష్కారం కాలేదంటున్నారు కాలనీవాసులు.

బోడుప్పల్ పరిధిలో 328 ఎకరాల వక్ఫ్ భూములున్నట్టు వక్ఫ్ బోర్డు 2018లో ప్రకటించింది.

దీంతో రెవెన్యూ, రిజి‌స్ట్రేషన్ అధికారులు ఈ భూముల రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. కానీ అప్పటికే అక్కడ కాలనీలు ఏర్పడ్డాయి. అందులో ఆర్ఎన్ఎస్ కాలనీ కూడా ఒకటి.

ఇది వక్ఫ్ భూమి అని వక్ఫ్ బోర్డు చెబుతుంటే, ఏళ్ల తరబడిగా అన్ని సౌకర్యాలు కల్పించి, అనుమతులిచ్చి ఇప్పుడు వక్ఫ్ భూమిగా రికార్డుల్లో ఉందని చెప్పడమేంటని కాలనీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

వక్ఫ్ భూముల విషయంలో ఇలాంటి వివాదాలు ఒకటి, రెండు కాదు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పదుల సంఖ్యలో కనిపిస్తుంటాయి.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ చట్టం నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో వక్ఫ్ ఆస్తులపై మరోసారి చర్చ మొదలైంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
వక్ఫ్ భూములు

తెలంగాణలో 74శాతం ఆక్రమణలపాలు

వీటిల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనూ పెద్దసంఖ్యలో భూములున్నాయి.

తెలంగాణలోని పది ఉమ్మడి జిల్లాల్లోనూ వక్ఫ్ ఆస్తులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 33,929 వక్ఫ్ ఆస్తులున్నాయి.

ఏళ్ల తరబడి పర్యవేక్షణ లేక, వక్ఫ్ బోర్డు ఆస్తులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేవారు లేకపోవడంతో భూములు కబ్జాలకు గురయ్యాయి.

తెలంగాణలో 77,538 ఎకరాల భూమి వక్ఫ్ పరిధిలో ఉన్నట్లు రాష్ట్ర వక్ఫ్ బోర్డు చెబుతోంది. వీటిల్లో 57,423 ఎకరాల భూమి కబ్జాల చెరలో చిక్కుకున్నట్లు బోర్డు స్పష్టం చేస్తోంది.

పెద్ద సంఖ్యలో వక్ఫ్ ఆస్తులున్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే ఆక్రమణలు ఎక్కువగా ఉన్నాయి.

వక్ఫ్ బోర్డ్ ప్రకారం ఇక్కడ 14,785 ఎకరాల భూములు ఉండగా.. 13,480 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయని లెక్కలు చెప్తున్నాయి.

వక్ఫ్ ఆస్తులు

ఫొటో సోర్స్, UGC

ఏపీలో..

ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు సమాచారం ప్రకారం, ఏపీలో 90వేల ఎకరాల వక్ఫ్ భూమి ఉంది. ఇందులో 30వేల ఎకరాలు కబ్జాలకు గురైనట్టు అధికారులు చెబుతున్నారు.

చిత్తూరు నగరంలో ఇక్తేదార్ అలీ ఖాన్ షహీద్ దర్గాకు 6.31 ఎకరాల భూమి ఉందని వక్ఫ్ బోర్డు చెబుతోంది. ఈ భూమిపై ఏపీ హైకోర్టులో కేసు నడుస్తోంది. అయినప్పటికీ, భూమిని తమ అధీనంలోకి తీసుకునేందుకు ప్రైవేటు వ్యక్తులు ప్రయత్నిస్తుంటారని స్థానికులు చెబుతున్నారు.

వక్ఫ్ ఆస్తుల ఆక్రమణలు మొదలైంది ఇప్పుడు కాదని, ఎన్నో దశాబ్దాలుగా ఇది జరిగిందని చెబుతున్నారు జమాతే ఇస్లామి హింద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు రఫీక్.

”లీజులకు ఇచ్చి వదిలేయడం, సరైన అజమాయిషీ లేకపోవడం.. కారణాలు ఏవైనా సరే వక్ఫ్ ఆస్తులు ఆక్రమణ చెరలో చిక్కుకున్నాయి. కేంద్రం తీసుకువచ్చిన బిల్లుతో వక్ఫ్ ఆస్తులకు రక్షణ లభిస్తుందని చెప్పడానికి లేదు. వక్ఫ్ ఆస్తులను వ్యక్తిగత ఆస్తులుగా చూడాలి. వాటిపై ప్రభుత్వం జోక్యం తగదు” అని రఫీక్ బీబీసీతో అన్నారు.

వక్ఫ్ఆస్తులు

కుదరని పొంతన

అయితే, ఇందులో రాష్ట్రాల వారీగా ఆస్తుల జాబితా పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడంతో వక్ఫ్ ఆస్తులపై స్పష్టత కొరవడింది. దీనివల్ల రికార్డుల్లో వక్ఫ్ ఆస్తులు ఉంటున్నా, క్షేత్రస్థాయిలో ఆక్రమణలకు గురవుతున్నాయని రంగారెడ్డి జిల్లాకు చెందిన పేరు వెల్లడించడానికి ఇష్టపడని ముస్లిం నేత ఒకరు బీబీసీతో చెప్పారు.

వంశి పోర్టల్ ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లో వక్ఫ్‌కు స్థిరాస్తులు 14,685, చరాస్తులు 85 ఉన్నాయి. కానీ వీటి నుంచి ఎంత ఆదాయం వస్తుందనే వివరాలు అందుబాటులో లేవు.

ఇక, వక్ఫ్ ఆస్తులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్న లెక్కల మధ్య పొంతన కుదరడం లేదు.

ఆంధ్ర‌ప్రదేశ్‌లో 14,685 వక్ఫ్ ఆస్తులుండగా, 78,229 ఎకరాల భూమి ఉన్నట్లుగా చూపిస్తోంది.

ఇందులో ఎంతమేరకు ఆక్రమణకు గురైందో కేంద్రం వెల్లడించలేదు.

వక్ఫ్ సవరణ బిల్లు, ఆస్తులు, ముస్లిం సమాజం

ఫొటో సోర్స్, Getty Images

వక్ఫ్ అంటే..

వక్ఫ్ అంటే ఇస్లాంను ఆచరించే వ్యక్తి అల్లా పేరుతో లేదా మతపరమైన లేదా దాతృత్వ ప్రయోజనాల కోసం ఇచ్చే ఏదైనా చరాస్తి లేదా స్థిరాస్తి.

ఈ ఆస్తి సమాజ ఆస్తిగా మారుతుంది. సంక్షేమం దీని ఉద్దేశం.

వక్ఫ్ చట్టంలో రెండు రకాల ఆస్తుల ప్రస్తావన ఉంది. మొదటి వక్ఫ్ అల్లా పేరుతో ఉంటుంది. అంటే అల్లాకు అంకితం చేసిన వారసత్వ హక్కులు లేని ఆస్తి. ఈ ఆస్తిని దానంగా ఇచ్చే వ్యక్తిని వకిఫ్గా పిలుస్తారు.

రెండో రకం వక్ఫ్ అలాల్ ఔలాద్. అంటే వారసులు చూసుకునే వక్ఫ్ ఆస్తి.

ఈ రెండో రకం వక్ఫ్‌కు సంబంధించి ఇటీవల కేంద్రం తీసుకువచ్చిన కొత్త చట్టంలో ఓ నిబంధన ఉంది. దీని ప్రకారం వక్ఫ్ కింద ఇచ్చే ఆస్తులపై మహిళల వారసత్వ హక్కును హరించకూడదు.

దానం చేసిన ఆస్తి వక్ఫ్ పరిధిలోకి వచ్చిన తర్వాత, జిల్లా కలెక్టర్ దానిని వితంతువులు లేదా తల్లిదండ్రులు లేని పిల్లల సంక్షేమం కోసం ఉపయోగించవచ్చు.

”వక్ఫ్ అనేది అరబిక్ పదం, దీని అర్థం ఉండడం. ఒక ఆస్తిని అల్లా పేరు మీద వక్ఫ్ చేసినప్పుడు, అది శాశ్వతంగా అల్లా పేరు మీద ఉంటుంది. దానిలో ఎలాంటి మార్పూ సాధ్యం కాదు” అని వక్ఫ్ వెల్ఫేర్ ఫోరం చైర్మన్ జావేద్ అహ్మద్ చెప్పారు.

వక్ఫ్ ఆస్తులను కొనడానికి లేదా అమ్మడానికి లేదా ఎవరికైనా బదిలీ చేయడానికి వీలు లేదు.

”మేం కోరేది ఒక్కటే 1995లో తీసుకువచ్చిన చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలి. ఆ చట్టాన్ని పటిష్టం చేయాలి” అని రఫీక్ బీబీసీతో చెప్పారు.

”వక్ఫ్ ఆస్తులను డిజిటలైజ్ చేయాలి. కోర్టులు, ట్రైబ్యునల్‌లో పెండింగు కేసులను త్వరగా పరిష్కరించాలి. సచార్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా నిర్మాణాత్మకంగా వివిధ అవసరాలకు వాడాలి” అని రఫీక్ సూచించారు.

వక్ఫ్ బోర్డుకు ఉన్న భూములు తీసుకునేందుకే కొత్త బిల్లు తీసుకువచ్చినట్లుగా ఉందని అన్నారు తెలంగాణ వక్ఫ్ బోర్డు ఛైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేన్. ఆక్రమణలలో ఉన్న భూములను వారికే కట్టబెట్టేలా కొత్త చట్టం ఉందని చెప్పారాయన.

”వక్ఫ్ బోర్డుకు సంబంధించి 80శాతం భూములు ఆక్రమణకు గురయ్యాయి.

ఆ భూములపై కలెక్టర్లకు అధికారాలు ఇవ్వడమంటే, బోర్డు పరిధిలో భూములు తీసుకోవడమే.

ఇప్పటికే కాలనీలు, ఇళ్లు ఏర్పడిన చోట ఆ భూములను కలెక్టర్ల అధికారంతో వారికి ఇచ్చేసే అవకాశం ఏర్పడుతుంది.” అని బీబీసీతో అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

SOURCE : BBC NEWS