SOURCE :- BBC NEWS

ఒక గంట క్రితం
”నేను డాబా మీద పడుకున్నా. రెండు క్షిపణులు మా మీదుగా వెళ్లాయి. అకస్మాత్తుగా ఓ క్షిపణి భూమిని తాకింది. ఆ ప్రాంతం మొత్తం కరెంటు పోయింది. నిమిషం తర్వాత కరెంటు వచ్చింది. మరో క్షిపణి వచ్చి పడింది.
ఆ క్షిపణి తాకిన తర్వాత ఆకాశం ఎర్రగా మారింది. ఆ తర్వాత అదే తరహాలో దాదాపు నాలుగు దాడులు జరిగాయి. ఒక క్షిపణి మర్కజ్-ఐ-తైయబా మసీదుపై పడింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఏం జరిగిందో తెలుసుకోవడానికి మసీదు వైపు పరుగులు తీశారు. భారత్ దాడి చేసిందని తర్వాత అర్థమైంది”
పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్సులోని మురీద్కేకు దగ్గరలోని నంగల్ సహ్‌దన్‌కు చెందిన ఆతిఫ్ చెప్పిన మాటలివి.
పాకిస్తాన్‌పై ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత్ చేసిన దాడిని ప్రత్యక్షంగా చూసినవారిలో ఆయన ఒకరు.


‘దాడి జరగొచ్చని వారం కిందటే అనుకున్నాం’
మురీద్కేలో కొందరు ప్రత్యక్షసాక్షులతో బీబీసీ మాట్లాడింది.
”మర్కజ్-ఐ-తైయబా ప్రధాన మసీదుపై క్షిపణులు పడ్డాయి. ఆ సమయంలో మసీదులో ఓ వృద్ధుడు తప్ప ఎవరూ లేరు” అని ఆతిఫ్ బీబీసీతో చెప్పారు.
దాడి సమయంలో మసీదులో ఎవరూ లేరా? అని బీబీసీ ప్రశ్నించగా ”ఇక్కడ దాడి జరిగే ప్రమాదం ఉందని వారం కిందటే తెలుసు. ప్రజలు ఇక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ప్రాంతం ఖాళీగా ఉంది” అని ఆతిఫ్ బదులిచ్చారు.
”గతంలో సాధారణ ప్రజలందరూ మసీదు లోపలికి వెళ్లేవారు. ఆహారం కూడా దొరుకుతుంది. ఇక్కడ మామూలుగానే జనం నివసించేవారు. కానీ, ఎప్పుడైతే ఇదంతా జరిగిందో జనం అంతా ఖాళీ చేశారు” అని ఆతిఫ్ తెలిపారు.
మరో ప్రత్యక్ష సాక్షి హసన్ మాట్లాడుతూ ”ఇక్కడ మదరసా, ఆస్పత్రి, పాఠశాల ఉండేవి. రాత్రి ఎనిమిది గంటల సమయంలో సాయంత్రం ప్రార్థనల వేళ రేపటి నుంచి అన్ని పాఠశాలలు తెరుచుకోవచ్చు అని ప్రకటించారు. అందరూ స్కూల్‌కు వచ్చేవారేమో కానీ, రాత్రి సమయంలో పేలుడు జరిగింది” అని చెప్పారు.
తన ఇల్లు మురీద్కేకు రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందని ఆయన చెప్పారు. దాడుల తర్వాత అక్కడ గందరగోళం నెలకొందని, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారని, కొందరు మురీద్కే వైపు వెళ్లిపోయారని తెలిపారు.

‘ఫోన్ మాట్లాడడానికి డాబాపైకి వెళ్లాను, అకస్మాత్తుగా మిసైల్ పడింది’
నంగల్ సాహదాకు చెందిన మొహమ్మద్ బిలాల్ కూడా ప్రత్యక్ష సాక్షుల్లో ఒకరు.
”రాత్రి వేళ ఫోన్ మాట్లాడటానికి పైకి వెళ్లా. అకస్మాత్తుగా మిసైల్ పడి పేలుడు జరిగింది. ఇంట్లో నుంచి వెంటనే బయటకు వచ్చి మసీదు దగ్గరికి వెళ్లా. వరుసగా మూడు క్షిపణులు పడ్డాయి. చాలా పెద్ద పేలుడు జరిగింది” అని బిలాల్ తెలిపారు.
”ఇక్కడ స్కూళ్లు, కాలేజీలున్నాయి. హాస్టళ్లు, ఆస్పత్రి కాంప్లెక్స్ ఉంది. వాటిపై దాడి జరిగింది. మొదటి మూడు క్షిపణులు వరుసగా పడ్డాయి. ఏడు నిమిషాల తర్వాత నాలుగో మిసైల్ పడింది. ఇవన్నీ నివాసిత ప్రాంతాలు. ఇక్కడ అనేక కుటుంబాలు నివసిస్తున్నాయి. దాడిలో మసీదు కూడా దెబ్బతింది” అని మురీద్కేకు చెందిన మొహమ్మద్ యూనస్ తెలిపారు.
ముజఫరాబాద్‌లోని బిలాల్ మసీదుపై కూడా దాడి జరిగింది.
”మొదటి పేలుడు నా ఇంటి వద్ద పడినపుడు నేను గాఢనిద్రలో ఉన్నా. లేచి వెంటనే రోడ్డు మీదకు పరుగెత్తా. అప్పటికే అక్కడ చాలామంది ఉన్నారు. ఏం జరిగిందో మాకు తెలిసేలోపే మరో మూడు మిసైళ్లు వచ్చి పడ్డాయి. ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భారత్ ఈ మసీదును ఎందుకు లక్ష్యంగా చేసుకుందో నాకు తెలియదు. ఇది సాధారణ మసీదు. మేం అక్కడ రోజుకు ఐదుసార్లు ప్రార్థనలు చేస్తాం. ఆ చుట్టుపక్కల అనుమానాస్పద కార్యకలాపాలు ఎప్పుడూ చూళ్లేదు” అని స్థానికుడైన మొహమ్మద్ వాహిద్ తెలిపారు.

గ్యాస్ సిలిండర్ పేలినట్టు అనిపించింది
”అందరూ నిద్రపోతున్నారు. మా ప్రాంతంలో రాత్రి 10 నుంచి 10.30 మధ్య అందరూ నిద్రపోతారు. గ్యాస్ సిలిండర్ పేలినట్టుగా అకస్మాత్తుగా శబ్దం వినిపించింది. ఓ నిమిషం తర్వాత ఆరేడు పేలుళ్లు వినిపించాయి. అవన్నీ క్షిపణులు. మొదట మాకు ఏం జరుగుతోందో అర్ధం కాలేదు” అని ముజఫరాబాద్‌కు చెందిన అబ్దుల్ బాసిత్ చెప్పారు.
తన ఇల్లు బిలాల్ మసీదుకు దగ్గరలోనే ఉందని ముజఫరాబాద్‌కు చెందిన సఫీర్ అవాన్ చెప్పారు.
రాత్రి సమయంలో దాడి జరిగిందని, తాను ఇంట్లో నుంచి బయటకు వచ్చి చూడగా మసీదుకు మంటలంటుకున్నాయని అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)