SOURCE :- BBC NEWS

couple

ఫొటో సోర్స్, Getty Images

‘లైఫ్ ఈజ్ షార్ట్, హేవ్ యాన్ అఫైర్’ (జీవితం చిన్నది, ఒక సంబంధం పెట్టుకోండి) – టొరంటోకి చెందిన యాష్లే మాడిసన్ డేటింగ్ వెబ్‌సైట్ ట్యాగ్ లైన్ ఇది.

పెళ్లయినవారు మాత్రమే సభ్యులుగా ఉండే ఈ వెబ్‌సైట్‌లో 2 కోట్ల మంది యూజర్లు ఉన్నట్లు ఫోర్బ్స్ వ్యాసం పేర్కొంది.

ఇందులో సగానికి మంది పైగా మహిళలే ఉన్నారని ఈ వ్యాసం తెలిపింది. ఇది 2020 నాటి డేటా.

ఈ డేటింగ్ వెబ్‌సైట్‌లో మొత్తం 53 దేశాలకు చెందిన వారు ఉండగా, అందులో భారత్ 10వ స్థానంలో ఉందని 2018లో ఈ వెబ్‌సైట్ వెల్లడించినట్లు పత్రికల్లో ప్రచురితమైంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
వివాహేతర  బంధాలు

ఫొటో సోర్స్, Getty Images

ఇప్పుడిదంతా ఎందుకు?

వివాహేతర సంబంధాలను ప్రోత్సహించే ఒక వెబ్ సైట్, దాని సభ్యత్వం, వీటితో పాటు మహిళలు సభ్యత్వం ఎక్కువగా ఉండటంతో పాటు, భారత్ 10వ స్థానంలో ఉండటం నన్ను ఆశ్చర్యానికి, ఆలోచనకు గురి చేశాయి.

ఇది నిజమేనా అనిపించింది. దీంతో పాటు, టెక్నాలజీ బంధాలను బలపరుస్తోందా? బలహీనపరుస్తోందా? కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉన్న మహిళలు కూడా కుటుంబానికి అవతల స్నేహాన్ని, ప్రేమను వెతుక్కుంటున్నారా? ఇలా ఎందుకు జరుగుతోంది? బంధాలకు నిర్వచనాలను సోషల్ మీడియా మారుస్తోందా?

ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలనిపించి ఇలాంటి బంధాల్లో ఉన్న కొందరితో మాట్లాడాను.

‘ఆయనెప్పుడూ ఫోన్‌లో రహస్యంగా మెసేజెస్ చూసుకుంటూ ఉంటారు. ఎవరితోనో తెలియదు. కొన్ని ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు మాట్లాడుతూ ఇంటి బయటకు లేదా బాల్కనీలోకి నడుచుకుంటూ వెళ్లిపోతారు. ఎవరని అడిగితే ఆఫీస్ కొలీగ్స్, ఫ్రెండ్స్ అంటారు. ఆఫీస్ కొలీగ్స్‌తో సీక్రెట్ గా మాట్లాడే విషయాలేం ఉంటాయో అర్థం కాదు. నాకు తెలియని కొత్త ఫ్రెండ్స్ ఎవరో కూడా అంతు పట్టదు.

వాళ్ళ పేర్లు చెప్పరు. గట్టిగా అడిగితే ఎప్పుడూ అనుమానిస్తావు అంటూ విసుక్కుంటారు, కోపం చూపిస్తారు. ఆయన ఫోన్ పాస్‌వర్డ్ నాకు తెలియదు” అని 40 ఏళ్ల ప్రణతి (పేరు మార్చాం) చెప్పారు.

ఆమెకు అవతల మాట్లాడుతున్న అమ్మాయి ఆఫీస్ కొలీగ్ కాదనే అనుమానం ఉంది. కానీ, తన దగ్గర బలమైన ఆధారాలేం లేవు. మౌనంగా ఏడుస్తూ ఉంటుంది. గట్టిగా నిలదీస్తే గొడవలు, రభస. ఎందుకొచ్చిన గొడవంటూ తన పిల్లల్ని చూసుకుంటూ కాలం గడిపేస్తోంది. ఇదొక స్నేహితురాలి ఆవేదన.

couple

ఫొటో సోర్స్, Getty Images

‘మాది ఆత్మబంధం’

ముంబయికి చెందిన 47 ఏళ్ల రష్మి (పేరు మార్చాం) తన సోల్ స్నేహితుడి గురించి, వాళ్ల మధ్య ఉన్న బంధం గురించి చాలా గర్వంగా మాట్లాడారు.

వీళ్లిద్దరికీ ఎలా పరిచయమైంది? ఎన్నేళ్లుగా ఆ పరిచయం కొనసాగుతోంది?

“నాకు ఒక కంపెనీలో ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తి సోషల్ మీడియాలో పరిచయమయ్యారు. ఆయన్ను ఉద్యోగం కోసం రిఫర్ చేయమని అడిగాను. ఆయన తన హోదా ఉపయోగించి ఉద్యోగం నాకు వచ్చేలా చేశారు. నేను ఆయన ఆఫీసులోనే మరో డిపార్ట్ మెంట్‌లో ఉద్యోగంలో చేరాను.

నాకు మాత్రమే కాదు, నా భర్త వ్యాపారం కూడా నష్టాల్లో నడుస్తోందని చెప్పడంతో ఆయనకు కూడా మరో సంస్థలో ఉద్యోగం ఇప్పించారు. అప్పటికి నాకు ఆ ఉద్యోగం చాలా అవసరం. నా కుటుంబాన్ని ఆదుకున్నారని అనిపించింది” అని రష్మి వివరించారు.

“ఆయన మీద అభిమానం, కృతజ్ఞత భావం ఏర్పడింది. ఫోన్ నంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం. వాట్సాప్‌లో మెసేజ్‌లు చేసుకోవడం మొదలైంది. నెమ్మదిగా రోజూ ఫోన్‌లో మాట్లాడటం, నా గురించి చెప్పడం, ఆయన గురించి వినడం, ఇలా ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది.

ఇలా ఏడాదిన్నర గడిచిన తర్వాత ఉద్యోగ రీత్యా హైదరాబాద్ నుంచి ముంబయికి బదిలీ అయి వచ్చాం. కానీ, ఆయనతో మాటలు మాత్రం ఆపలేదు. ఆయనంటే పిచ్చి ప్రేమ. మా బంధం పెళ్లి వరకు దారి తీయదని తెలుసు. కలిసి బతకలేమని కూడా తెలుసు. ఆయన తన కుటుంబాన్ని వదిలిపెట్టి నా కోసం రారని కూడా తెలుసు.

నా ప్రతి చిన్న సంతోషాన్ని, దుఃఖాన్ని ఆయనతో పంచుకుంటాను. ఆయన ఓపికగా వింటారు. ఆయన నా పట్ల చూపించే ప్రేమ అంటే ఇష్టం. ఆయన మాట్లాడే మాటలు ఇష్టం. ఆయన నా కోసం సమయాన్ని ఇవ్వడం ఇష్టం.

మా ఇద్దరిదీ ఒక ఆత్మ బంధం. ఆయన్ను నా ప్రేమికుడిలా ఊహించుకుంటాను. ఆయనకు నేను ‘ఐ లవ్ యూ’, ‘ఐ మిస్ యూ’ అని చెబుతాను. ఆయన ఇప్పటి వరకూ ‘ఐ లవ్ యూ’ అని నాకు చెప్పలేదు. కానీ, ఆయన మౌనంగా నన్నే ప్రేమిస్తున్నారని అనిపిస్తుంది” అని చెప్పారు రష్మి.

ఇలా వీరి బంధం ఆరేళ్లుగా కొనసాగుతోంది.

మీ భర్తతోనే మీ భావాలను పంచుకోవచ్చు కదా అని నేనడిగాను.

“నా కబుర్లను వినే ఓపిక ఆయనకు లేదు. నా భర్త, నేను రెండు వేర్వేరు ధ్రువాల్లా ఒకే ఇంట్లో కలిసి ఉంటాం. మాకో అమ్మాయి కూడా ఉంది. నా భర్తకు “ఐ లవ్ యూ” అని చెప్పేంత ప్రేమ నిజంగా నాకు లేదు. మనసులో లేని ప్రేమను చెప్పలేను” అని స్పష్టంగా చెప్పారు రష్మి.

ఇదంతా మీ భర్తను మోసం చేస్తున్నట్లు కాదా అని ప్రశ్నిస్తే, “నేను సంతోషంగా ఉండే హక్కు నాకు లేదా? నేనేమీ ఎవరితోనూ శారీరక సంబంధం పెట్టుకోలేదు కదా? నా భర్తతో నాకు ఎలాంటి సంబంధం లేదు. మా ఇద్దరి మధ్యా మాటలు కూడా ఉండవు. సమాజానికి మాత్రమే మేం భార్యాభర్తలం, ఇంట్లో కాదు అంటూ నిట్టూర్పు విడిచారు.”

online relation ships

ఫొటో సోర్స్, Getty Images

శృంగార రహిత బంధాలు

ఆన్ లైన్ లో కలిసినవారిలో కేవలం మూడొంతుల్లో ఒక వంతు మంది మాత్రమే పెళ్లి వరకు వెళ్తున్నారని అంటూ, చాలా మంది ప్లేటోనిక్ (శృంగార రహిత) బంధాల్లో ఉంటున్నట్లు డీఈ పాల్ అధ్యయనాలను ఉటంకిస్తూ టెడ్ టాక్ లో డాక్టర్ మిషెల్ పేర్కొన్నారు.

మిషెల్ మానవ ప్రవర్తన, టెక్నాలజీ, ఆన్ లైన్ బంధాలపై విస్తృతంగా అధ్యయనం చేశారు.

ప్లేటోనిక్ బంధాల్లో రొమాన్స్, సెక్స్ లాంటివేవీ ఉండవు, కానీ ఒకరంటే ఒకరికి చెప్పలేని ప్రేమ, గౌరవం ఉంటుంది. ఒకరినొకరు ఆరాధిస్తూ ఉంటారు.

“ఇలాంటి బంధాలు ఏర్పడటంలో టెక్నాలజీ దోహదం చేస్తోంది. ఆన్ లైన్ మాధ్యమాల్లో ఉండే ప్రైవసీ దృష్ట్యా తమ బంధం నలుగురి కళ్లలో పడదు అనే ధీమాతో ఇలాంటి బంధాల్లో అడుగుపెడుతూ ఉంటారు” అని హైదరాబాద్ కు చెందిన సైకాలజిస్ట్ మృదుల అక్కి అన్నారు.

“బయట చేయలేని పనులు ఆన్‌లైన్‌లో చేయడం సులభంగా ఉంటుంది. కానీ వీటితో పొంచి ఉన్న ప్రమాదాలు ఊహించరు. సరదాగా మొదలైన బంధం ఎక్కడికైనా దారి తీయవచ్చు. వివాహేతర సంబంధాలకు దారి తీయవచ్చు.

జీవితంలో కొత్తగా ప్రేమ దొరకడం, అవతలి వ్యక్తి చేసే ఒక రకమైన మెప్పుకోలు, గుర్తింపు ఉద్విగ్నత కలిగిస్తాయి. ఇవొక వ్యసనంగా మారిపోతాయి” అని మృదుల అన్నారు.

online relation ships

ఫొటో సోర్స్, Getty Images

ఆనందమా? ప్రేమా?

టెక్నాలజీ ద్వారా చిన్న చిన్న డోసుల్లో డోపమైన్ (ఆనందాన్ని) తీసుకుంటూ నిజమైన బంధాల్లో వచ్చే ఆక్సిటోసిన్ (ప్రేమను) మర్చిపోతున్నామని “అవుట్ ఆఫ్ టచ్ హౌ టూ సర్వైవ్ యాన్ ఇంటిమసీ ఫెమైన్” పుస్తక రచయత, అమెరికాకు చెందిన డాక్టర్ మిషెల్ డ్రుయిన్ అంటారు.

ఈమె మానవ సంబంధాలు, కమ్యూనికేషన్ పై టెక్నాలజీ ప్రభావం గురించి పరిశోధనలు చేశారు.

“ఆన్ లైన్ బంధాల్లో ఏర్పడే మానసిక బంధం వైవాహిక బంధంలో నమ్మకాన్ని తగ్గిస్తుంది. వీళ్లు కలిసి ఎంత కాలం బంధాన్ని కొనసాగించగలరనేది నిజానికి చాలా పెద్ద ప్రశ్న. నిజ జీవితానికి, వర్చువల్ ప్రపంచానికి చాలా తేడా ఉంటుంది. ఈ సంభాషణలు మితిమీరిన లైంగిక సంభాషణలు, సంబంధాలకు దారి తీస్తే వాటి పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి” అని మృదుల హెచ్చరించారు.

“ప్రతి నిత్యం ఎవరో పొగడాలి, గుర్తించాలి అనే తాపత్రయం వ్యక్తులను తమ బాధ్యతల నుంచి తప్పుకునేలా చేస్తుంది. కుటుంబంతో, స్నేహితులతో గడిపే విలువైన సమయాన్ని దూరం చేస్తుంది. వర్చువల్ బంధాలు ఎక్కడికి దారి తీస్తాయో తెలియదు… ముఖ్యంగా ఇద్దరికీ వేరువేరు కుటుంబాలు ఉన్నప్పుడు. ఇవి ఎప్పటికైనా ఆందోళన కలిగించేవే” అని మృదుల ముగించారు.

ఆన్ లైన్ ప్రేమలు

ఫొటో సోర్స్, Getty Images

‘మీ భార్యకూ బాయ్‌ఫ్రెండ్ ఉంటే?’

చాలా మంది అమ్మాయిలతో స్నేహం ఉన్న హైదరాబాద్‌కు చెందిన 55 ఏళ్ల వినయ్ కుమార్ (పేరు మార్చాం) తో నేను మాట్లాడాను.

గర్ల్ ఫ్రెండ్స్ తో మాట్లాడాల్సిన అవసరం ఏముంది అని అడిగాను. తప్పేముందని ఆయన ఎదురు ప్రశ్నించారు.

చిన్న చిన్న సహాయాలు చేయడంతో వాళ్లు తనపై ప్రేమ చూపిస్తే నా తప్పెలా అవుతుందని నవ్వారు.

“నాకు స్నేహంలో జెండర్ తేడా లేదు. వాళ్లకు ఏదైనా అవసరమైతే సహాయం చేయడం నా తత్వం. నా స్వభావం చూసి నాతో ప్రేమలో పడితే అది నా తప్పెలా అవుతుంది” అని ప్రశ్నించారు.

“నా భార్యకు నేనెటువంటి అన్యాయం చేయలేదు. నాకు చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారనే విషయం ఆమెకి కూడా తెలుసు. నాపై తనకి నమ్మకముంది” అన్నారు.

మరి మీ భార్యకు కూడా ఇలాగే బాయ్ ఫ్రెండ్స్ ఉంటే మీరు ఆమోదిస్తారా? అని అడిగాను.

“ఆమోదించలేకపోవచ్చు” అని సమాధానం వచ్చింది.

మరి మీకొక న్యాయం, తనకొక న్యాయమా? అని ప్రశ్నించినప్పుడు, “ఎవరితోనూ మాట్లాడవద్దని నేను తనను శాసించలేదు. మాట్లాడాలనుకుంటే తన ఇష్టం” అని అన్నారు.

“99 శాతం మంది పురుషులు తాము చేసే పనిని తమ భార్య చేస్తే ఆమోదించరు. తమ భార్య తమకు మాత్రమే సొంతం అనుకుంటారు. ఇది పితృస్వామ్య ధోరణి” అని మృదుల అన్నారు.

“ఆన్ లైన్ లో ప్రేమలో పడటం చాలా సులభం. మనుషులు ప్రేమ, ఆప్యాయతలను మరొకరి నుంచి కోరుకోవడం సహజం. ఈ బంధాలు ఒక్క సోషల్ మీడియాకు మాత్రమే పరిమితం కాదు. ఆఫ్ లైన్‌లో కూడా ఉంటాయి. ఇలా భాగస్వామికి తెలియకుండా మరొకరితో మాట్లాడటం, సంతోషాన్ని పొందడం మోసం అనో, తప్పు అనో నిర్వచించలేం” అని డాక్టర్ మిషెల్ డ్రుయిన్ ఒక టెడ్ ఎక్స్ టాక్ లో అన్నారు.

‘ఆన్‌లైన్ ఫ్లర్టింగ్‌ను ఇష్టపడుతున్నారు’

“భారత్ లో వివాహం, వివాహేతర సంబంధాలు, మారుతున్న సాంస్కృతిక పరిస్థితులపై ఫ్రాన్స్ కు చెందిన గ్లీడీన్ యాప్ ఒక సర్వే నిర్వహించింది. టైర్ 1, టైర్ 2 నగరాల్లో 25-50 ఏళ్ల మధ్య వయసులో ఉన్న 1503 మంది వివాహితులు ఇందులో భాగమయ్యారు.

సర్వేలో పాల్గొన్నవారిలో 60 శాతం మంది వినోదం కోసం వివాహేతర సంబంధాల్లో ఉంటున్నట్లు, అందులో 46 శాతం మంది పురుషులు ప్లేటోనిక్ సంబంధాల కోసమే బంధాల్లో ఉన్నట్లు ఆ సర్వేలో తెలిసింది. ఈ యాప్ వివాహేతర సంబంధాల కోసం డేటింగ్‌ను ప్రోత్సహిస్తుంది.

36 శాతం మంది మహిళలు, 35 శాతం మంది పురుషులు ఆన్ లైన్ ఫ్లర్టింగ్ చేయడాన్ని ఇష్టపడుతున్నారని.. అదేమీ పెద్ద తప్పుగా భావించడం లేదని ఈ సర్వే ఫలితాలు వెల్లడించాయి” అని ఇండియా టుడే (మార్చ్ 2024) కథనం పేర్కొంది.

గ్లీడీన్ యాప్‌లో ఉన్న కోటి మంది యూజర్లలో 20% మంది భారత్ నుంచే అని ఎకనమిక్ టైమ్స్ (జనవరి 2023) కథనం పేర్కొంది.

వివాహేతర సంబంధాలు క్రిమినల్ నేరం కాదంటూ సుప్రీం కోర్టు సెక్షన్ 497ను రద్దు చేసిన తర్వాత ఈ యాప్ 2017లో ఇండియన్ మార్కెట్‌లోకి అడుగుపెట్టింది.

“సోషల్ మీడియా అందరికీ అందుబాటులో ఉండటంతో ఆన్‌లైన్ సంబంధాలను ఏర్పరచుకోవడంలో అది ప్రముఖ పాత్ర పోషిస్తోంది. అయితే, ఇలాంటి సంబంధాలు ఒక్కోసారి బంధాలను బలపర్చడానికి బదులు మరింత సంక్లిష్టం చేస్తాయి” అని ‘హౌ ఇంటర్నెట్ అండ్ సోషల్ మీడియా ఎఫెక్ట్ అండ్ షేప్ రొమాంటిక్ రిలేషన్ షిప్స్’ అనే అంశం పై లండన్ కు చెందిన బ్రసెల్స్ క్యాపిటల్ యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనం పేర్కొంది.

రొమాంటిక్ బంధాల కోసం భారతీయులు డేటింగ్ యాప్స్, వెబ్‌సైట్ ల కన్నా సోషల్ మీడియాపై ఎక్కువగా ఆధారపడతారని డిజిటల్ సెక్యూరిటీ కంపెనీ మెకాఫీ రొమాన్స్ స్కామ్స్ 2025లో విడుదల చేసిన సర్వే తెలిపింది.

ఇండియన్ జర్నల్ ఆఫ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ 2020 లో ప్రచురించిన ఒక అధ్యయనంలో 35% మంది బంధాల కోసం ఆన్ లైన్ డేటింగ్ యాప్స్‌ను వాడుతున్నట్లు తెలిసింది.

online dating

ఫొటో సోర్స్, Netflex

ఈ ఆటలో ఓడిపోయేది ఎవరు?

ఆన్‌లైన్ బంధాల కోసం నిజమైన బంధాలను వదులుకున్న ఉదాహరణలు కూడా ఇటీవల వార్తల్లో కనిపించాయి.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్ కు చెందిన 20 ఏళ్ల బాదల్ బాబు రెండేళ్ల కిందట సోషల్ మీడియాలో పరిచయమైన పాకిస్తానీ అమ్మాయి కోసం అక్రమంగా సరిహద్దులు దాటి జైలు పాలైనట్లు 2025 ఫిబ్రవరిలో వార్తలు వచ్చాయి.

జమ్ముకశ్మీర్ కు చెందిన ఒక వివాహిత ఫేస్‌బుక్‌లో కలిసిన ఒక వ్యక్తి కోసం భర్త దగ్గర నుంచి రూ.5 లక్షలు దొంగిలించి ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీకి వచ్చినట్లు 2025 జనవరిలో వార్తాకథనాలు వచ్చాయి.

ఇలాంటి కేసులు దేశవ్యాప్తంగా అనేకం రిపోర్ట్ అవుతున్నాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)