SOURCE :- BBC NEWS

ఆస్ట్రేలియా, సిడ్నీ, బీచ్, కాల్పులు, పోలీసులు, యూదులు

ఫొటో సోర్స్, Darrian Traynor/Getty Images

ఒక గంట క్రితం

ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలోని బోన్డీ బీచ్ లో జరిగిన కాల్పుల్లో 12 మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మరో 11మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరు పోలీసు అధికారులు కూడా ఉన్నారు. ఈ సంఘటనను ఉగ్రవాదుల దాడిగా పోలీసులు చెప్పారు.

కాల్పులు జరిపిన వారిలో ఓ సాయుధుడిని పోలీసులు హతమార్చగా, మరో అనుమానితుడి పరిస్థితి విషమంగా ఉంది.

బీచ్‌కు సమీపంలో హనుకా కార్యక్రమం జరుగుతోందని, కనీసం 200 మంది హాజరయ్యారని బీబీసీ రిపోర్టర్ తెస్సా వాంగ్ చెప్పారు, అయితే ఈ సంఘటన ఈ హనుకా ఈవెంట్‌కు సంబంధం ఉందా లేదా అనే విషయాన్ని పోలీసులు నిర్థరించలేదు.

నల్లదుస్తులు ధరించిన ఇద్దరు వ్యక్తులు బీచ్‌ వైపు ఓ బ్రిడ్జీ పై నుంచి తుపాకులతో కాల్పులు జరుపుతున్నట్టు ఓ వీడియోలో కనిపిస్తోంది. అందులో అనేకసార్లు కాల్పుల శబ్దాలు, వెనుక పోలీసు సైర్లను వినిపిస్తున్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఆస్ట్రేలియా ప్రధాని

‘ఇది దారుణమైన యూదు వ్యతిరేకత’

బోన్డీ బీచ్‌లో జరిగిన కాల్పుల ఘటనను ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీజ్ తీవ్రంగా ఖండించారు. ఈ దాడిని ఆయన ‘‘దారుణమైన యూదు వ్యతిరేకత (యాంటీ సెమిటిజం) నుంచి పుట్టిన చర్య”*గా అభివర్ణించారు.

ఈ ఘటన ఆస్ట్రేలియన్లపై ఉద్దేశపూర్వకంగా జరిపిన దాడిగా పేర్కొంటూ, ఆనందంగా ఉండాల్సిన రోజున ఈ హింసాత్మక ఘటన చోటు చేసుకోవడం అత్యంత దురదృష్టకరమన్నారు.

“ఇది మా దేశ హృదయాన్ని కుదిపేసిన దారుణమైన యూదు వ్యతిరేక హింసాత్మక ఉగ్రవాద చర్య” అని ప్రధాని ఆల్బనీజ్ అన్నారు.

ఇలాంటి నీచమైన హింసకు, ద్వేషానికి ఆస్ట్రేలియాలో ఎక్కడా చోటు లేదని ఆయన స్పష్టం చేశారు

ఆస్ట్రేలియా, సిడ్నీ, బీచ్, కాల్పులు, పోలీసులు, యూదులు

ప్రత్యక్ష సాక్షులేమంటున్నారు?

కాల్పులు జరుగుతున్నప్పుడు తన పిల్లలతో కలిసి బీచ్‌లో హనుకా కార్యక్రమంలో ఉన్నానని ప్రత్యక్ష సాక్షి ఒకరు బీబీసీతో చెప్పారు.

కాల్పుల తర్వాత తన పిల్లలతో కలిసి అక్కడి నుంచి పారిపోయానని తెలిపారు.

“నేను ఎప్పటిలానే నా పని అయిపోయిన తర్వాత మధ్యాహ్నం బోన్డీ బీచ్‌కు వచ్చాను. అప్పుడు నాకు వరుసగా కాల్పుల మోత వినిపించింది. దాదాపు 20 సార్లు కాల్పులు జరిగాయనుకుంటున్నా” అని బీబీసీ కోసం బోండే నుంచి రిపోర్టింగ్ చేస్తున్న టాబీ విల్సన్ అన్నారు.

”మొదట్లో ఎవరూ పెద్దగా భయపడలేదు. బహుశా టపాసులు పేలుళ్లని వారు భావించారు.

కానీ మాకు ఉత్తరాన ఉన్న రెండు బీచ్‌లు టామరామ, బోన్డీ మీదుగా హెలికాప్టర్లు చక్కర్లు కొట్టడం చూసినప్పుడు ఏదో జరిగిందని మాకు అర్థమైంది. తరువాత కాల్పుల గురించి తెలుపుతూ నిరంతరాయంగా మెసేజులు వచ్చాయి” అని ఆమె అన్నారు.

న్యూసౌత్ వేల్స్ పోలీస్ కమిషనర్ మాల్ లాన్యన్

పోలీసులు ఏం చెబుతున్నారు?

ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్ పోలీస్ కమిషనర్ మాల్ లాన్యన్ తెలిపిన వివరాల ప్రకారం, స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6.47 గంటల సమయంలో బోన్డీ బీచ్‌లోని ఆర్చర్ పార్క్ ప్రాంతంలో కాల్పులు జరిగినట్లు పోలీసులకు అనేక ఫిర్యాదులు అందాయి. ఆర్చర్ పార్క్ అనేది బోన్డీ బీచ్ వద్ద ఉన్న ఒక విశాలమైన పచ్చిక మైదానం.

ఈ కాల్పుల ఘటనలో కనీసం 12 మంది మృతి చెందగా, మరో 29 మందిని వివిధ ఆస్పత్రులకు తరలించినట్లు కమిషనర్ లాన్యన్ ధ్రువీకరించారు. గాయపడిన వారిలో ఇద్దరు పోలీసు అధికారులు కూడా ఉన్నారు. వారి పరిస్థితి విషమంగా ఉందని ఆయన చెప్పారు.

ఈ దశలో దాడి చేసినవారి గురించి ఎలాంటి సమాచారం విడుదల చేయడానికి తాను సిద్ధంగా లేనని కమిషనర్ లాన్యన్ స్పష్టం చేశారు. దర్యాప్తు ప్రారంభ దశలోనే ఉందని పేర్కొన్నారు.

అలాగే, ఈ ఘటనలో మూడో వ్యక్తి ఉన్నాడా లేదా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. “ఏ అంశాన్నీ విస్మరించం. ప్రతి కోణాన్ని లోతుగా పరిశీలిస్తాం” అని ఆయన అన్నారు.

ఈ ఘటన హనుకా పండుగ మొదటి రోజున జరగడం, దాడిలో ఉపయోగించిన ఆయుధాల స్వభావం, ఘటనాస్థలిలో లభించిన ఇతర వస్తువులు దర్యాప్తుకు కీలకంగా మారాయని కమిషనర్ తెలిపారు. ఘటనకు కారణమైన వ్యక్తికి సంబంధించిన కారులోఓ పేలుడు పరికరం లభ్యమైందని వెల్లడించారు.

దాడి చేసినవారిలో ఒకరి పేరును సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారన్న ప్రశ్నకు స్పందిస్తూ, ఆ విషయంపై తనకు కూడా అవగాహన ఉందన్నారు. అయితే ప్రజలు సంయమనం పాటించాలని కోరారు.

“ఇది ప్రతీకారానికి సమయం కాదు. పోలీసులు తమ విధిని నిర్వర్తించేందుకు అవకాశం ఇవ్వాల్సిన సమయం” అని ఆయన అన్నారు.

ప్రస్తుతం ఇంకా ప్రమాదం ఉందా అన్న ప్రశ్నకు ఆయన నేరుగా సమాధానం ఇవ్వలేదు. అయితే, పోలీసులు దాడి చేసిన ఇద్దరి గురించి స్పష్టంగా తెలుసుకున్నారని చెప్పారు.

ఈ ఘటనపై ఉగ్రవాద నిరోధక విభాగం ఆధ్వర్యంలో విస్తృత దర్యాప్తు జరుగుతుందని కమిషనర్ మాల్ లాన్యన్ చెప్పారు. “ఏ కోణాన్నీ వదలకుండా పూర్తిగా విచారణ చేస్తాం” అని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ఈ దాడికి సంబంధించిన రెండో నిందితుడు ప్రస్తుతం ఆస్పత్రిలో విషమ పరిస్థితిలో చికిత్స పొందుతున్నాడని తెలిపారు. దాడి చేసిన మరో వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు ఇప్పటికే వెల్లడించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)