SOURCE :- BBC NEWS

థాయిలాండ్, బ్యాంకాక్, ఇథియోపియా, అడిస్ అబాబా, చైనా, ఆన్‌లైన్ స్కాములు, పిగ్ బుచరింగ్, సుడాన్, కెన్యా, మానవ అక్రమ రవాణా

  • రచయిత, అమాన్యుయెల్ యెల్కల్
  • హోదా, బీబీసీ ప్రతినిధి
  • 2 జనవరి 2025

ముబారక్ జమాల్‌కు 26 ఏళ్లు. ఇథియోపియా దేశస్థుడు. మెరుగైన జీవితం కోసం సాగించిన తన అన్వేషణ, మియన్మార్‌లో సైబర్ బానిసల శిబిరంలో చిక్కుకుపోతుందని ఆయనెప్పుడూ ఊహించలేదు.

ఇథియోపియాలోని సెంట్రల్ ఒరోమియా ప్రాంతంలో ఉండే తన కుటుంబానికి అండగా నిలిచేందుకు ప్రైవేట్ కాలేజ్‌లో సాగుతున్న ఎకనామిక్స్‌ డిగ్రీని మధ్యలో వదిలేశారాయన. థాయిలాండ్‌లో నెలకు 1500 డాలర్ల ( సుమారు రూ. 1.28 లక్షలు) జీతం ఇచ్చే మంచి ఉద్యోగాలు ఉన్నాయని తెలియడంతో, ఆ అవకాశం అందుకోవాలని అనుకున్నారు.

“ఆ జాబ్ ఏంటో తెలుసుకునేందుకు నేనెక్కువగా ప్రయత్నించలేదు” అని ఆయన అంగీకరించారు. అబ్ది అనే రిక్రూటింగ్ ఏజంట్, ఈ పనిని త్వరగా పూర్తి చేస్తానని ఆయనకు హామీ ఇచ్చారు. ఐదు రోజుల్లో ముబారక్ ఇథియోపియా రాజధాని అడిస్ అబాబా నుంచి బ్యాంకాక్‌ బయల్దేరారు.

మరో ఇథియోపియన్‌తో కలిసి 2023 సెప్టెంబర్‌లో ఆయన బ్యాంకాక్ చేరుకున్నారు. థాయిలాండ్‌ చేరుకోగానే వారి ఆశలు ఆవిరయ్యాయి.

హామీ ఇచ్చిన ఉద్యోగం కాకుండా, అబ్ది వాళ్లను బస్సులో థాయిలాండ్‌ ఉత్తర సరిహద్దుల్లో చియాంగ్‌ రాయ్ పట్టణానికి పంపించారు. అక్కడ నుంచి వారిని అక్రమంగా లావోస్ తరలించారు. వారం రోజుల అయోమయం తర్వాత మళ్లీ థాయిలాండ్ తీసుకొచ్చారు. అక్కడ నుంచి బస్సులో థాయిలాండ్-మియన్మార్ సరిహద్దుల్లో ఉన్న మే సాట్ పట్టణానికి తీసుకెళ్లారు.

మే సాట్ చేరుకున్న తర్వాత, అక్రమంగా తీసుకొచ్చిన ఆరుగురు ఇథియోపియన్లను చైనీయులు అదుపులోకి తీసుకున్నారు. ఇథియోపియన్లను మోయ్ నది గుండా పడవలో మియన్మార్‌లోకి తీసుకొచ్చారు. చీకటి పడిన తర్వాత అక్కడ నుంచి ఒక క్యాంపుకు తరలించారు.

బీబీసీ న్యూస్ తెలుగు
థాయిలాండ్, బ్యాంకాక్, ఇథియోపియా, అడిస్ అబాబా, చైనా, ఆన్‌లైన్ స్కాములు, పిగ్ బుచరింగ్, సుడాన్, కెన్యా

ఫొటో సోర్స్, Maxar Technologies 2024

‘జియోవ్ కే’ క్యాంప్

ముబారక్‌ పీడకల అక్కడే మొదలైంది. అతనితో పాటు అతని సహచరులు ఉన్న క్యాంపు చట్టబద్దమైనది కాదు. అగ్నేయాసియాలో నేర ముఠాలు నడుపుతున్న అనేక మోసపూరిత క్యాంపుల్లో అది కూడా ఒకటి.

ఈ క్యాంపులను నిర్వహిస్తున్న క్రిమినల్ గ్యాంగులు మానవ అక్రమ రవాణాతో పాటు ఆన్‌లైన్‌లో సెక్స్ పేరుతో మోసాలు, మనీ లాండరింగ్ లాంటి ఇతర అక్రమాలకు పాల్పడుతుంటాయని ఐక్యరాజ్య సమితి డ్రగ్స్ అండ్ క్రైమ్ విభాగానికి చెందిన కార్యాలయం తెలిపింది.

వీటిని మొదట ఇక్కడ ఉన్న చైనీయులు నిర్వహించేవారు. తర్వాత ఇది ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. సబ్ సహారన్ ఆఫ్రికన్ దేశాల నుంచి మనుషుల్ని అక్రమంగా తరలించి ఈ స్కాముల్లో పని చేయిస్తున్నారు.

“క్యాంపుకు వచ్చిన రోజు రాత్రి, మేమంతా షాక్‌లో ఉన్నాం. అందుకే మేము ఏమీ మాట్లాడుకోలేదు. వాళ్లు ఏం చెబితే అది చేశాం” అని ముబారక్ గుర్తు చేసుకున్నారు.

ఆన్‌లైన్ మోసాల కోసం మియన్మార్‌లోనే కనీసం లక్ష 20వేల మందిని బలవంతంగా తరలించినట్లు ఐక్యరాజ్య సమితి మానవహక్కుల విభాగానికి చెందిన హై కమిషనర్ తెలిపారు.

ఇందులో ఆఫ్రికన్ దేశాలైన ఇథియోపియా, యుగాండా,కెన్యా, సూడాన్ దేశస్థులు ఉన్నారు. ఇథియోపియా నుంచి థాయిలాండ్ వచ్చేవారికి వీసా ఆన్ అరైవల్ సదుపాయం ఉండటం, నేరుగా విమానాలు ఉండటంతో ఇందులో ఎక్కువమంది ఇథియోపియన్లు చిక్కుకుపోతున్నారు.

జియోవ్ కే క్యాంపుకు చేరుకున్న తర్వాత వారి ఫోన్లు, పాస్‌పోర్టులు తీసుకున్నారు. ఇథియోపియన్లను అక్కడే ఉన్న కంటెయినర్లలోకి పంపించారు. ఒక్కో కంటెయినర్‌లో 12 నుంచి 15 మందిని ఉంచేవారు.

ఆన్‌లైన్‌లో మోసాలు చెయ్యడంలో టెక్నిక్కుల గురించి 15 రోజుల పాటు ‘శిక్షణ’ ఇచ్చేవారని ముబారక్ చెప్పారు.

థాయిలాండ్, బ్యాంకాక్, ఇథియోపియా, అడిస్ అబాబా, చైనా, ఆన్‌లైన్ స్కాములు, పిగ్ బుచరింగ్, సుడాన్, కెన్యా

ఫొటో సోర్స్, Getty Images

పిగ్ బుచరింగ్

శిక్షణలో భాగంగా ‘పిగ్ బుచరింగ్’ అని పిలిచే రొమాన్స్‌ స్కామ్‌కు సంబంధించి టెక్నిక్కులు నేర్పేవారు.

ఈ విధానంలో బాధితులు కష్టపడి దాచుకున్న సొమ్మును కొల్లగొట్టేందుకు నమ్మకం కలిగేలా వ్యవహరిస్తారు.

తనను మొదట తుర్కియే, పాకిస్తాన్, సౌదీ అరేబియాలోని కొందరు బాధితులతో అలీసియా అనే మహిళ పేరుతో మాట్లాడమని చెప్పినట్లు ముబారక్ తెలిపారు.

ఈ స్కామును వివిధ దశల్లో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఇందులో ‘అలీసియా’ ఒక సక్సెస్‌ఫుల్ బిజినెస్ వుమన్‌గా కనిపిస్తుందని ముబారక్ చెప్పారు.

తాను వాట్సాప్ ద్వారా తనకు కేటాయించిన వ్యక్తులతో ముందుగానే రాసిచ్చిన స్క్రిప్టు ప్రకారం మాట్లాడతానని అన్నారు. ముబారక్ మాట్లాడిన తర్వాత బాధితుల్ని నమ్మించేందుకు మోడల్స్ నేరుగా రంగంలోకి దిగి వీడియో కాల్ చేస్తారు.

ముందుగా, అమెజాన్ లాంటి కంపెనీలకు నకిలీ కంపెనీలు రూపొందించి అందులో కొద్ది మొత్తాల్ని పెట్టుబడిగా పెట్టాలని అడుగుతారు. వారికి లాభాలు చూపించి ఆ డబ్బును విత్‌డ్రా చేసుకునే అవకాశం కలిపిస్తారు. అలా వారికి నమ్మకం కలిగిస్తారు.

తర్వాతి దశలో, బాధితుల్ని ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టేలా ప్రోత్సహిస్తారు. కొన్నాళ్లకు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టినప్పుడు, వాటిని విత్‌డ్రా చేసుకునే అవకాశం లేకుండా చేస్తారు.

ఏం జరిగిందో వాళ్లు తెలుసుకునే సమయానికి వాళ్లు దాచుకున్న సొమ్ముతో పాటు ఇళ్లు, కార్లలాంటి వాటిని నష్టపోతారు.

థాయిలాండ్, బ్యాంకాక్, ఇథియోపియా, అడిస్ అబాబా, చైనా, ఆన్‌లైన్ స్కాములు, పిగ్ బుచరింగ్, సుడాన్, కెన్యా

క్రూరమైన శిక్షలు

ఈ స్కాముల్లో వాళ్లు చెప్పినట్లు చెయ్యడానికి నిరాకరించినా, ఆశించినంత సొమ్ము సంపాదించి పెట్టకపోయినా, వారిని దారికి తెచ్చేందుకు క్యాంపు లీడర్లు హింసాత్మకంగా ప్రవర్తించేవారు.

“ఒకసారి నన్ను దారుణంగా కొట్టారు. నేను స్పృహ కోల్పోయాను. నన్ను నేను కాపాడుకునేందుకు వారితో గొడవ పడ్డాను. దాంతో వాళ్లు కరెంట్ షాకులిచ్చి చిత్రహింసలు పెట్టారు” అని ముబారక్ గుర్తు చేసుకున్నారు.

క్యాంప్ నిర్వాహకుల్లో కొంతమందికి లీడర్లుగా ప్రమోషన్ ఇచ్చి వాళ్లను వారి దేశానికి చెందిన వారికి నాయకుడిగా నియమిస్తారు. ఇథియోపియా నుంచి వచ్చిన వ్యక్తి తమను గమనిస్తూ ఉండేవాడని ముబారక్ గుర్తు చేసుకున్నారు. “అతనికి కోపం వస్తే, వెంటనే మిమ్మల్ని శిక్షిస్తాడు” అని చెప్పారు.

తనకు పెట్టిన టార్గెట్ 5 వేల డాలర్లు సంపాదించడంలో వరుసగా విఫలం కావడంతో దారుణంగా దారుణంగా కొట్టారని ముబారక్ చెప్పారు. నిద్ర పోనివ్వలేదనీ, ఒక చీకటి గదిలో పడేసి క్యాంపు వదిలి వెళ్లాలంటే 5 వేల డాలర్లు చెల్లించాలని ఆదేశించారనీ వెల్లడించారు.

అతని కుటుంబం తాము పెంచుకుంటున్న పశువుల్ని, పండించిన ధాన్యాన్ని అమ్మి 4,500 డాలర్లు చెల్లించి అతనిని ఆ క్యాంపు నుంచి విడిపించింది.

థాయిలాండ్, బ్యాంకాక్, ఇథియోపియా, అడిస్ అబాబా, చైనా, ఆన్‌లైన్ స్కాములు, పిగ్ బుచరింగ్, సుడాన్, కెన్యా

ప్రాణాలతో బయటపడ్డ బాధితుడి కథ

ముబారక్‌ను తర్వాత విడుదల చెయ్యడంతో స్వచ్ఛంద సంస్థల సాయంతో ఆయన తిరిగి ఇథియోపియా వచ్చారు. అయితే క్యాంపుల్లో జరిగిన దారుణాలు ఆయన్ను ఇప్పటికీ వెంటాడుతున్నాయి.

“దేవుడి దయ వల్ల, నేను బతికి బయటపడ్డా” అని ముబారక్ చెప్పారు. ఆయన శరీరం మీద గాయాల తాలుకూ మచ్చల్ని చూపించారు.

ప్రస్తుతం ఆయన ఒరోమియా ప్రాంతంలో తన కుటుంబంతో కలిసి జీవిస్తున్నారు. అయితే క్యాంపుల్లో తీవ్రంగా కొట్టడం వల్ల శారీరంగా ఏ పని చెయ్యలేకపోతున్నారు. గాయాల కారణంగా శారీరకంగా బలహీనంగా కనిపిస్తున్నారు.

తాను ఉన్న క్యాంపుల్లాంటి క్యాంపుల్లో ఇంకా వేలమంది ఉన్నారని ఆయన చెప్పారు. వారు అడిగినంత సొమ్ము చెల్లించకపోతే అక్కడ నుంచి బయటపడటం అసాధ్యం. తమ కుటుంబ సభ్యులను కాపాడాలని బాధితుల కుటుంబ సభ్యులు ఇథియోపియన్ అధికారులను బతిమాలారు. అయితే అధికారుల స్పందన అంతంత మాత్రంగా ఉంది.

థాయిలాండ్, మియన్మార్‌కు సరిహద్దు ఉన్న జపాన్, భారత్‌లలోని ఇథియోపియన్ మిషన్లను బీబీసీ సంప్రదించింది. అయితే వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.

మియన్మార్‌లో చిక్కుకున్న ఇథియోపియన్లను రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆ దేశపు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి 2024 డిసెంబర్ 5న ఒక ప్రకటన విడుదల చేశారు. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఆన్‌లైన్‌లో వచ్చే ప్రకటనలు నమ్మి మోసపోవద్దని ఆయన సూచించారు.

విదేశాలలో ఉద్యోగాల గురించి ఆన్‌లైన్‌లో తాను చూస్తున్న వీడియోలలో ఇప్పటికీ అబ్ది కనిపిస్తున్నారని ముబారక్ చెప్పారు.

“క్యాంపులో నాకు జరిగినవన్నీ తరచుగా గుర్తుకు వస్తుంటాయి. అబ్దిని అరెస్ట్ చేసి శిక్ష వేస్తే చూడాలని ఉంది” అని ముబారక్ చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

SOURCE : BBC NEWS