SOURCE :- BBC NEWS
”వచ్చే విద్యా సంవత్సరం (2025–26) నుంచి ఇంటర్ మొదటి సంవత్సరంలో బోర్డు పరీక్షలు రద్దు చేసి, కళాశాల అంతర్గత (ఇంటర్నల్) పరీక్షలుగా మార్చాలని భావిస్తున్నాం. ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలను మాత్రం పూర్తిగా బోర్డు ద్వారా నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తాం.’’
‘‘ప్రస్తుతం దేశంలో చాలా రాష్ట్రాల బోర్డులు ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు నిర్వహించడం లేదు. అత్యధిక రాష్ట్రాల్లోని యూనివర్సిటీల్లో ప్రవేశాలకు కూడా ఇంటర్ సెకండియర్ పరీక్షలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మన రాష్ట్రంలో కూడా ఇంటర్ విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఈ మార్పులను ప్రతిపాదిస్తున్నాం.”
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రతిపాదించిన అంశాలివి.
అయితే, ఇంటర్ బోర్డు చేసిన ఈ ప్రతిపాదనలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులపై ఒత్తిడి విషయంలో దీనిని ఆశావహంగానే చూడొచ్చని కొందరు అంటుంటే, ఇది సెకండియర్‌లో విద్యార్థులపై ఒత్తిడిని పెంచే అవకాశం ఉందని మరికొందరు విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.
కృతికా శుక్లా ఏం చెప్పారంటే..
‘‘నేషనల్ కరికులమ్ ఫ్రేమ్‌వర్క్–2023ను అనుసరించి ఇంటర్మీడియెట్ విద్యలో సంస్కరణల అమల్లో భాగంగానే ఈ మార్పులు ప్రతిపాదించాం.
ఇప్పటికే ఈ విద్యా సంవత్సరం(2024–25) నుంచి పదో తరగతిలో పాఠశాల విద్యాశాఖ ఎన్‌సీఈఆర్‌టీ (నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసర్చ్ అండ్ ట్రైనింగ్) పుస్తకాలను ప్రవేశపెట్టింది.
ఆ క్రమంలో 2025–26 విద్యా సంవత్సరంలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులపై ఎలాంటి ఒత్తిడి లేకుండా ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్య పుస్తకాలనే ప్రవేశపెడతాం. అలాగే, 2026–27లో చదివే ఇంటర్ సెకండియర్ విద్యార్థులకూ ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్ పుస్తకాలనే ప్రవేశపెడతాం.
ఫస్టియర్ పబ్లిక్ పరీక్షలను తొలగించడం ద్వారా జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడానికి సమయం ఉండడమే కాకుండా, కీలకాంశాలపై విద్యార్థులు పట్టు సాధించేందుకు వీలుంటుందనేది మా అభిప్రాయం.’’ అని కృతికా శుక్లా చెప్పారు.
సిలబస్‌లోనూ మార్పులు..
‘‘రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ విద్య సిలబస్‌లో గత కొన్నేళ్లుగా ఎలాంటి సవరణలూ జరగలేదు.
2012లో సైన్సు సబ్జెక్టుల్లో, 2014లో ఆర్ట్స్ సబ్జెక్టుల్లో, 2018లో భాష పాఠ్యాంశాల్లో మార్పులు జరిగాయి.
ఇప్పుడు నీట్–జేఈఈ వంటి జాతీయ స్థాయి పరీక్షల సిలబస్‌కు అనుగుణంగా విద్యార్థులు పోటీపడేందుకు ప్రస్తుత సిలబస్‌లో
సవరణలు చేయాలని భావిస్తున్నాం.
వచ్చే విద్యాసంవత్సరం నుంచి కొత్త సిలబస్‌ను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నాం.’’ అని కృతికా శుక్లా తెలిపారు.
మార్కులు కూడా..
‘‘అంతర్గత మార్కుల విధానాన్ని తీసుకురావాలని భావిస్తున్నాం.
ఇకపై ప్రతి సబ్జెక్టులో ఇంటర్నల్ మార్కులతో పాటు ప్రాక్టికల్స్ తప్పనిసరి చేస్తాం
పరీక్షల్లో మల్టిపుల్ ఛాయిస్ ఒక్క మార్కు ప్రశ్నలను ప్రతిపాదించాలని భావిస్తున్నాం.
ఎనిమిది మార్కుల వ్యాసరూప ప్రశ్నల స్థానంలో ఐదు లేదు లేదా ఆరు మార్కుల ప్రవేశప్రశ్నలు పెట్టాలని యోచిస్తున్నాం.
జాతీయ విద్యా విధానం–2020 మార్గదర్శకాల ప్రకారం విశ్లేషణ, విమర్శనాత్మక ఆలోచన, సమస్య పరిష్కారంపై నైపుణ్యం కోసం ఈ మార్కుల కేటాయింపు విధానంలో మార్పులను ప్రతిపాదిస్తున్నాం.
బైపీసీ గ్రూపులో ఐదు సబ్జెక్టులకు 500 మార్కులు కాగా, ఇందులో 370 మార్కులు థియరీకి 130 మార్కులు ప్రాక్టికల్స్‌కి ఇస్తారు
ఎంపీసీ గ్రూపులో 380 మార్కులు థియరీకి 120 మార్కులు ప్రాక్టికల్స్‌కి ఇస్తారు.
ఆర్ట్స్ గ్రూపుల్లో ఐదు సబ్జెక్టులకు 500 మార్కులు కాగా, ప్రతి సబ్జెక్ట్‌కి 100 మార్కులు. ఇందులో 80 మార్కులు థియరీకి, 20 మార్కులు ప్రాక్టికల్స్ లేదా ప్రాజెక్టు వర్క్‌కి కేటాయిస్తారు.
అన్ని గ్రూపులకు ఐచ్చికంగా ఎంచుకునే ఆరో సబ్జెక్టుకు మార్కులు ఎన్ని అనేది ఇంకా నిర్ణయించలేదు.’’ అని కృతికా శుక్లా చెప్పారు.
సలహాలు, సూచనలకు 26 వరకూ గడువు
అలాగే, ఇంటర్ బోర్డు విద్యామండలి చేసిన ఈ ప్రతిపాదనలపై విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు తమ సలహాలు, సూచనలు ఇవ్వాలని మండలి కార్యదర్శి శుక్లా విజ్ఞప్తి చేశారు. ఇంటర్ బోర్డు పేర్కొన్న ఈమెయిల్ ఐడీ (biereforms@gmail.com)కి పంపాలని కోరారు.
విద్యావేత్తల భిన్నాభిప్రాయాలు..
ఇంటర్ బోర్డు పెట్టిన ప్రతిపాదనలను ఆశావహ దృక్పథంతో చూస్తే మేలు చేసేవిగానే అనిపిస్తున్నాయని ఏపీ ఎయిడెడ్ జూనియర్ కాలేజీల లెక్చరర్ల సంఘం నేత చావా రామారావు బీబీసీతో చెప్పారు.
”ఎందుకంటే, దేశంలో తెలుగు రాష్ట్రాల్లో మినహా ఎక్కడా జూనియర్ ఇంటర్ పబ్లిక్ పరీక్షలు జరగడం లేదు. ఇంటర్ సెకండ్ ఇయర్‌పైనే దృష్టి పెట్టి నీట్, జేఈఈతో పాటు ఇతర పోటీ పరీక్షలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలో మన విద్యార్థులు ఇప్పటి వరకు కాస్త వెనుకబడి ఉన్నారనే చెప్పాలి. ఇప్పుడు ఈ మార్పులతో పోటీ పరీక్షల్లో మన విద్యార్థులు కూడా సులువుగా ర్యాంకులు కొట్టొచ్చు. వాస్తవానికి ఇది మా ప్రాథమిక అభిప్రాయం. ప్రతిపాదనలపై పూర్తిస్థాయి చర్చల తర్వాతే అభిప్రాయానికి తుదిరూపు వస్తుంది” అని రామారావు అన్నారు.
”ఫస్టియర్ పరీక్షలు ఎత్తివేయడంతో ఒత్తిడి తగ్గుతుందని భావించినా మొత్తం భారం సెకండియర్‌పై పడితే విద్యార్థులు తట్టుకుంటారా? సెకండియర్ పరీక్షలతో పాటు పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలు కూడా రెండేళ్ల సిలబస్‌పైనే ఉంటాయి, అలాంటప్పుడు ఫస్టియర్ పరీక్షలు ఎత్తివేస్తే ప్రయోజనం ఏమిటి? అనే కోణంలోనూ ఆలోచిస్తున్నాం” అని ఏలూరు జిల్లా ఎస్‌ఎఫ్‌ఐ కార్యదర్శి లెనిన్ బీబీసీతో అన్నారు.
”విద్యార్థులు, తల్లిదండ్రులతో పాటు బోధన చేసే అధ్యాపకుల ఆమోదంతోనే ఇంటర్ బోర్డు కొత్త సిలబస్, పరీక్షలపై నిర్ణయం తీసుకోవాలి. విద్యలో నాణ్యత పోకుండా, విద్యాభ్యాసంలో పట్టుపోకుండా ప్రభుత్వ నిర్ణయం అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి” అని పల్నాడు జిల్లా మాచర్ల కళాశాల జూనియర్ లెక్చరర్ కె.రత్నకుమారి బీబీసీ వద్ద తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
’40 ఏళ్ల కిందట రెండేళ్లకోసారి పరీక్షలు.. కానీ’
”ఇంటర్ విద్యలో పెద్ద మార్పు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రధానంగా మూడు మార్పులు చేయాలని చూస్తోంది.
ఒకటి.. ఇంటర్‌లో స్టేట్ సిలబస్ తీసి సెంట్రల్ సిలబస్ పెట్టడం.. రెండోది సైన్స్, మ్యాథ్స్ మార్కుల్లో మార్పులు, మూడోది ఇంటర్ ఫస్టియర్ పబ్లిక్ పరీక్ష ఎత్తివేత.. ఇవి చాలా కీలకమైన మార్పు.
దాదాపు పది లక్షల మంది విద్యార్థుల భవితవ్యాన్ని నిర్దేశించే మార్పులు కదా.. అలాంటి ప్రతిపాదనలు చేసే ముందైనా మేథావులు, విద్యారంగ ప్రముఖులు, ప్రజాప్రతినిధులతో చర్చించకుండా ఎలా ప్రకటనలు చేస్తారు?” అని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ లక్ష్మణరావు ప్రశ్నించారు.
”ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు తీసివేయడం సరికాదు. ఒకేసారి రెండేళ్లకి పెట్టే బదులు ఏయేడు పరీక్షలు ఆ సంవత్సరం పెడితేనే విద్యార్థులకు భారం లేకుండా ఉంటుంది. సిలబస్ మార్చుకోండి, అంతేకానీ పరీక్షలు మాత్రం ప్రతి సంవత్సరం నిర్వహించాలి.”
”40 ఏళ్ల కిందట రెండేళ్లకు ఒకేసారి పరీక్ష పెట్టేవాళ్లం, అప్పట్లో విద్యార్థులు ఇబ్బందిపడ్డారు. ఇప్పుడు మళ్లీ అలాంటి ఇబ్బందులు రాకుండా ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు యథావిధిగా కొనసాగిస్తేనే మంచిదని నా అభిప్రాయం” అని ఎమ్మెల్సీ లక్ష్మణరావు బీబీసీతో అన్నారు.
”ఇంటర్ బోర్డు ప్రతిపాదనల్లో ప్లస్‌లు, మైనస్‌లు రెండూ ఉన్నాయి. విద్యార్థులకు ఫస్టియర్ పరీక్షల స్ట్రెస్,స్ట్రెయిన్ తగ్గుతుందన్న మాట వాస్తవమే, అయితే పరీక్షలు ఉండవు కదా అని సీరియస్‌గా తీసుకోరు. రెండో ఏడాది వచ్చేసరికి ఒత్తిడి పెరుగుతుంది.కాకపోతే ఫస్టియర్ నుంచి సీరియస్‌గా చదివే విద్యార్థులకు మేలే” అని తిరుపతిలోని ఓ కార్పొరేట్ కళాశాల ఏజీఎంగా పని చేస్తున్న సీనియర్ అధ్యాపకులు బీబీసీతో అన్నారు.
ప్రజల నుంచి వచ్చే అభిప్రాయాలతో పాటు వారందరి సూచనలు, సలహాలు తీసుకున్న తర్వాతే బోర్డు నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్సీ లక్ష్మణరావు అభిప్రాయపడ్డారు.
ఆ తర్వాతే నిర్ణయం..
”ప్రతిపాదనలు వెబ్‌సైట్‌లో ఉంచాం. అభిప్రాయాలకు ఓ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చాం.. ఈనెల 26 వరకు గడువుంది. అన్ని వర్గాల వారూ తమ సూచనలు, సలహాలు చెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.
అన్ని అభిప్రాయాలను పరిశీలించి విద్యార్థులకి మేలు చేసే విధంగా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలానే నిర్ణయం తీసుకుంటాం” అని బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా గురువారం బీబీసీతో అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)