SOURCE :- BBC NEWS

దిల్లీ, ఇండిగో, ఇండిగో సంక్షోభం, విమానయాన రంగం, భారత్

ఫొటో సోర్స్, Getty Images

భారత్‌లో 15 ఏళ్ల కిందట జరిగిన ఓ విమాన ప్రమాదంలో 158 మంది మరణించారు. పైలట్ కునుకు తీయడమే ఈ ప్రమాదానికి కారణమని దర్యాప్తులో తేలింది.

పదమూడేళ్ల కోర్టు కేసు తరువాత, పైలట్ల అలసటను తగ్గించేందుకు రూపొందించిన నిబంధనలు అమలు దశకు చేరుకున్నాయి.

కానీ, ఒక విమానయాన సంస్థలకు ఈ నిబంధనల అమలు నుంచి 2026 ఫిబ్రవరి 10 వరకు మినహాయింపునిచ్చారు.

గత కొద్ది రోజులుగా వేలాది ఇండిగో విమానాలు రద్దు కావడం, భారత విమానయాన రంగం తీవ్ర సంక్షోభంతో సతమవుతున్నట్లు కనిపిస్తున్న నేపథ్యంలో దేశంలో అతిపెద్ద ఆపరేటర్ అయిన ఇండిగో విమానాలు.. వాటిలో ప్రయాణించే వారి భద్రతపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అసలు ఈ సంక్షోభానికి బాధ్యులెవరనేది అర్థం చేసుకునే ముందు, ఈ సమస్య నేపథ్యాన్ని తెలుసుకుందాం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
దిల్లీ, ఇండిగో, ఇండిగో సంక్షోభం, విమానయాన రంగం, భారత్

ఫొటో సోర్స్, Getty Images

పైలట్ల అలసట సమస్య

ఈ కథ 2010 మేలో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంతో మొదలైంది. దుబయ్ నుంచి వస్తున్న విమానం మంగళూరు ఎయిర్‌పోర్డులో ల్యాండింగ్ అవుతూ కూలిపోయింది. ఈ ప్రమాదంలో 158 మంది మరణించారు.

దీనిపై విచారణ జరిగింది. నిద్రమత్తులో ఉన్న పైలట్టే ఈ ప్రమాదానికి బాధ్యుడని దర్యాప్తు నివేదిక తేల్చింది.

విమానాన్ని నడుపుతున్న సెర్బియా పైలట్ మూడు గంటల విమాన ప్రయాణంలో ఎక్కువ సేపు నిద్రపోవడం వల్ల దిక్కుతోచని స్థితిలో ఉన్నట్లు దర్యాప్తు నివేదిక పేర్కొంది.

పైలట్ల అలసట ప్రయాణికుల భద్రతకు ముప్పుగా ఎలా మారిందనే అంశం చర్చకు దారితీయడం బహుశా భారత దేశంలో అదే మొదటిసారి.

ప్రమాదం జరిగిన రెండేళ్ల తరువాత 2012లో, దేశంలో విమానాల షెడ్యూల్స్ పైలట్లు ఎక్కువ కష్టపడాల్సిన విధంగా రూపొందుతున్నాయని, అందువల్ల విమాన ప్రయాణ భద్రత ప్రమాదంలో పడుతోందంటూ అనేక పైలట్ ఆర్గనైజేషన్లు దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి.

పైలట్ల అలసటను తగ్గించడానికి అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం నిబంధనలను అమలు చేయాలని పైలట్ ఆర్గనైజేషన్లు డిమాండ్ చేశాయి.

2024 జనవరిలో, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా కొత్త డ్యూటీ రూల్స్‌ను ప్రవేశపెట్టింది.

విమానయాన సంస్థలు 2025 జులై, నవంబర్ మాసాల్లో వీటిని రెండు దశలుగా అమలు చేయాల్సి ఉంది.

దాదాపు 13 ఏళ్ల న్యాయ పోరాటం తర్వాత దిల్లీ హైకోర్టు పైలట్ డ్యూటీ టైం లిమిటేషన్ (ఎఫ్‌డీటీఎల్) కొత్త రూల్స్ అమలుకు మార్గం సుగమం చేయడంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆ కోర్టు కేసు ముగిసింది.

ఈ నిబంధనల మొదటి దశలోని 15 నిబంధనలను ఈ ఏడాది జులై 1 నాటికి అమలు చేయాల్సి ఉంది. మిగిలిన ఏడు నిబంధనలు రెండో దశలో నవంబర్ 1 నాటికి అమలు కావాల్సి ఉంది.

దిల్లీ, ఇండిగో, ఇండిగో సంక్షోభం, విమానయాన రంగం, భారత్

ఫొటో సోర్స్, Getty Images

ఇండిగో సంక్షోభం మొదలు

దిల్లీ, ముంబయి, కోల్‌కతా లాంటి ప్రధాన విమానాశ్రయాలలో ఇండిగో విమానాల ఆలస్యం, రద్దు గురించి ప్రయాణికులు మొదటిసారి ఫిర్యాదు చేసిన డిసెంబర్ 2 నుంచి ఇండిగో సంక్షోభం మొదలైంది.

తరువాత కొన్నిరోజులపాటు పరిస్థితి మరింత దిగజారింది. నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన ఎఫ్‌డీటీఎల్ రూల్స్ కారణంగా పైలట్ల కొరత, నిర్వాహణపరమైన అంతరాయాలతో వేలాది విమానాలు రద్దయ్యాయి.

ఎఫ్‌డీటీఎల్ రూల్స్ పైలట్ల డ్యూటీ టైం, విమానాల డ్యూటీ టైం, విమానాల టైం లిమిట్స్, విశ్రాంతి సమయాలను నిర్ధరిస్తాయి.

ఈ కొత్త నిబంధనల ప్రకారం, పైలట్లకు వారానికి 36 గంటలుగా ఉన్న విశ్రాంతి సమయం 48 గంటలకు పెరిగింది. అలాగే, రాత్రివేళ విమానాల ల్యాండింగ్‌లను నియంత్రిస్తూ, గతంలో ఆరుగా ఉన్న రాత్రివేళ ల్యాండింగ్స్‌ను రెండుకు కుదించారు.

ఈ నిబంధనలు పైలట్ల అలసటను తగ్గించడానికి రూపొందించినవి. కానీ ఈ నిబంధనలను అమలు చేయడానికి ఇండిగో ముందస్తుగా సిద్ధం కాలేదని ఆరోపణలు వచ్చాయి. దీనివల్ల తగిన విశ్రాంతి తీసుకున్న పైలట్లు అందుబాటులో లేకుండా పోయారు. దీంతో సగానికి పైగా విమానాలు ఎగరలేకపోయాయి. ఫలితంగా దేశంలో అతిపెద్ద విమానయాన సంక్షోభం తలెత్తింది.

మిగిలిన ప్రధాన విమానయాన సంస్థలైన ఎయిర్ ఇండియా తాము నిబంధనలను అమలు చేశామని చెప్పగా, ‘‘తాము పూర్తిగా నిబంధనలు అమలు చేసే పరిస్థితిలో లేమని’’ ఇండిగో అంగీకరించింది.

దిల్లీ, ఇండిగో, ఇండిగో సంక్షోభం, విమానయాన రంగం, భారత్

ప్రభుత్వం ఏం చేసింది?

డిసెంబరు 4న, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్‌ నాయుడు ఇండిగో సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు. దీనికి సంబంధించి మంత్రిత్వ శాఖ విడుదల పత్రికా ప్రకటన విడుదల చేసింది. ‘‘తలెత్తిన పరిస్థితులపై విమానయాన సంస్థ స్పందించిన తీరుపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారని అందులో పేర్కొన్నారు.

‘‘సమావేశంలో రద్దయిన విమానాల సమాచారాన్ని ఇండిగో అందజేసింది. సిబ్బంది డ్యూటీల కేటాయింపులో సవాళ్లు, సవరించిన ఎఫ్‌డీటీఎల్ రూల్స్‌ అమలు, వాతావరణ అడ్డంకులను ఈ అంతరాయాలకు కారణంగా పేర్కొంది’’ అని ఆ ప్రకటనలో మంత్రిత్వ శాఖ తెలిపింది.

“కొత్త నిబంధనల అమలుకు అవసరమైనంత సమయం ఉందని మంత్రి స్పష్టం చేశారు” అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

ఒక రోజు తరువాత, డిసెంబర్ 5న, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మరో పత్రికా ప్రకటన విడుదల చేసింది, “డీజీసీఏ ఎఫ్‌డీటీఎల్ రూల్స్‌ను తక్షణమే నిలిపివేస్తోంది. ప్రయాణికుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం, ముఖ్యంగా వృద్ధులు, విద్యార్థులు, రోగులు, తమ అత్యసర పనుల కోసం విమాన ప్రయాణంపై ఆధారపడిన వారి కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు’’ పేర్కొంది. గగనతల భద్రతపై రాజీపడలేదని మంత్రిత్వ శాఖ తెలిపింది.

కానీ అది నిజంగా అలానే ఉందా?

దిల్లీ, ఇండిగో, ఇండిగో సంక్షోభం, విమానయాన రంగం, భారత్

ఫొటో సోర్స్, Getty Images

‘ప్రయాణికుల జీవితాలతో ఆడుకోవడమే’

కొత్త ఎఫ్‌డీటీఎల్ నిబంధనల అమలును నిలిపివేసిన తరువాత, ఎయిర్ లైన్ పైలట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ చర్య ఏవియేషన్ సైన్స్ ఆధారంగా అలసట తగ్గింపు ప్రమాణాలను అమలు చేయడానికి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధమని పేర్కొంది.

నిబంధనల నుంచి ఇండిగోకు మినహాయింపు ఇవ్వడంపై ప్రముఖ విమానయాన నిపుణులు సంజయ్ లాజర్ మాట్లాడుతూ” నిబంధనల అమలును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు మీరు రూల్స్ పాటించనివారికి చెబుతున్నారు. ఈ మినహాయింపు ఎలా ఇచ్చారో, దర్యాప్తులో ఏం బయటపడుతుందో చూడాలి. ఇది మిమ్మల్ని మళ్లీ పాత వ్యవస్థకే తీసుకెళ్లింది” అన్నారు.

“కొత్త నియమాల అమలును నిలిపివేయడమంటే విమానాలు ఆగిపోతాయని కాదు . కొత్త నిబంధనలు జారీ చేసిన తర్వాత కూడా గత రెండేళ్లుగా పాత నిబంధనలు అమలులో ఉన్నాయి. కానీ, ఈ మినహాయింపు కేవలం ఒక కంపెనీకి మాత్రమే ఇచ్చారు. ఇది పోటీని తప్పుదారి పట్టిస్తుంది. ఇది సరికాదు. ఇది ఇండిగో అనుభవిస్తున్న ప్రత్యేక హోదా కొనసాగుతున్నట్లు చూపుతోంది” అన్నారు.

ఇండిగో కొత్త రూల్స్‌కు ఎందుకు సిద్ధం కాలేదు?

గత ఏడాది జనవరి నుంచి కొత్త నిబంధనలపై చర్చ జరుగుతుంటే ఇండిగో నిబంధనల అమలుకు ఎందుకు సిద్ధం కాలేకపోయిందనేది ఇక్కడ ప్రశ్న.

సంజయ్ లాజర్ మాట్లాడుతూ, “వారు ఈ కొత్త నిబంధనలను పాటించకూడదని భావించినట్టున్నారు. నేనీ మాట బాధ్యతతోనే అంటున్నాను. ఎందుకంటే, వారికి 22 నెలల సమయం లభించింది. అంటే, దాదాపుగా రెండేళ్ల సమయం. సివిల్ ఏవియేషన్ రిక్వైర్‌మెంట్స్ 2024లో జారీ అయ్యాయి. ఈ విషయం అప్పటికే కోర్టులో ఉంది. కాబట్టి వారికి రిక్రూట్‌మెంట్‌కు చాలా సమయం ఉంది. వారు మే-జూన్ 2025 వరకు రిక్రూట్ చేసుకున్నారు. కానీ, అవసరమైన నిబంధనలను పూర్తిగా పాటించాల్సిన అవసరం లేదని వారు నిర్ణయించుకున్నారు. కొత్త నిబంధనల రెండో దశను ఇంకొంత సమయం ముందుకు నెట్టొచ్చని భావించారు. వారు దానిని తేలికగా తీసుకున్నారు. కొత్త నిబంధనల అమలు వాయిదా వేస్తారని, లేదా ఆలస్యం అవుతుందని వారు నమ్మకంగా ఉన్నారని నేను అనుకుంటున్నా. “

ఈ విషయంపై ఇండిగో అభిప్రాయం తెలుసుకోవడానికి బీబీసీ ప్రయత్నించింది. రాతపూర్వక ప్రశ్నలను పంపింది. ఈ కథనాన్ని ప్రచురించే సమయానికి ఇండిగో ఇంకా స్పందించలేదు.

దిల్లీ, ఇండిగో, ఇండిగో సంక్షోభం, విమానయాన రంగం, భారత్

ఫొటో సోర్స్, Getty Images

ఇండిగో సంక్షోభానికి బాధ్యులెవరు?

డిసెంబర్ 9, మంగళవారం నాడు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు తన ఎక్స్‌ పోస్టులో, “ఇండిగో రూట్ల సంఖ్యను తగ్గించాల్సిన అవసరాన్ని మంత్రిత్వ శాఖ పరిగణనలోకి తీసుకుందని, దీనివల్ల విమానయాన కార్యకలాపాలు గాడినపడటంతోపాటు విమానాల రద్దవడాన్ని తగ్గిస్తుంది” అని రాశారు.

ఇండిగో మొత్తం రూట్లలో 10 శాతం తగ్గింపు ఉత్తర్వులు జారీ చేశామని, అయినప్పటికీ ఇండిగో మునుపటిలాగే అన్ని గమ్యస్థానాలకు విమానాలు నడుపుతుందని రాశారు.

“గత వారం, ఇండిగోలో అంతర్గత లోపాలు, సిబ్బందికి డ్యూటీల కేటాయింపు, విమాన షెడ్యూళ్లు, తగిన సమాచారం ఇవ్వకపోవడం వంటివి ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించాయి. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది. అవసరమైన చర్యలు తీసుకుంటాం” అని ఆయన అందులో రాశారు.

ఇండిగో గత కొన్ని రోజులుగా పలుమార్లు క్షమాపణలు చెప్పింది. విమానాల రద్దుకు వాతావరణం బాలేకపోవడం, ప్రణాళిక లోపాలు, ఎఫ్‌డీటీఎల్ రూల్స్ అమలులో లోపాల వంటి అనూహ్య పరిస్థితులే కారణమని పేర్కొంది.

అదే సమయంలో, ఈ వ్యవహారంలో ఇప్పటివరకూ ప్రభుత్వ వైఖరిని పరిశీలిస్తే.. ఈ మొత్తం సంక్షోభానికి ఇండిగోను బాధ్యులుగా చేసినట్లు కనిపిస్తోంది.

అంతిమంగా, ఈ సంక్షోభానికి అసలెవరు బాధ్యులు?

దీనికి చాలా మంది జవాబు చెప్పాల్సి ఉంటుందంటున్నారు సంజయ్ లాజర్.

“పౌర విమానయాన శాఖ మంత్రి దోషి కాకపోయినా ఆయన బాధ్యత వహిస్తారు. ఇండిగో పొడిగించిన షెడ్యూల్‌ను ఆమోదించిన అదే జాయింట్ డైరెక్టర్ జనరల్ ఇప్పుడు షోకాజ్ నోటీసు జారీ చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇండిగో పైలట్లను పర్యవేక్షించని అదే చీఫ్ ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్‌స్పెక్టర్ ఇప్పుడు వారి శిక్షణను పర్యవేక్షిస్తున్నారు. వీరిపై ప్రభుత్వం సీవీసీ లేదా సీబీఐ దర్యాప్తు ఎందుకు నిర్వహించలేదు? ప్రతిస్థాయిలో మంత్రిత్వ శాఖ కుమ్మక్కైనట్లు స్పష్టంగా కనిపిస్తోంది. వీరందరూ బాధ్యులేనని భావిస్తున్నా.”

” ఈ వ్యవహారానికి పూర్తి బాధ్యత పౌర విమానయాన మంత్రిదే” అని కెప్టెన్ మోహన్ రంగనాథన్ అన్నారు.

“వాళ్లు కోర్టు జారీ చేసిన తప్పనిసరి భద్రతా నిబంధనలను విస్మరించారు. విశ్రాంతి, సెలవుల నిబంధనలను వాయిదా వేశారు. ఇది కోర్టు ధిక్కారం కూడా” అన్నారు.

“నిబంధనలను ఉల్లంఘించినందుకు, షెడ్యూల్‌ను తారుమారు చేసి ఇండిగో తప్పు చేసింది. తమకు తగినంత సిబ్బంది లేరని తెలిసి వారు ఇటీవల శీతాకాలపు షెడ్యూల్‌ను సమర్పించారు. వారు అప్పటికే సిబ్బంది కొరతను ఎదుర్కొంటున్నారు. అయినా శీతాకాలపు షెడ్యూల్‌కు విమానాలు కేటాయించారు. డీజీసీఏ ఈ షెడ్యూల్‌ను ఆమోదించింది. కాబట్టి ఒకరు మాత్రమే కాదు, ముగ్గురూ దోషులే. అందరూ సమాన బాధ్యత వహించాల్సిందే” అన్నారు.

దిల్లీ, ఇండిగో, ఇండిగో సంక్షోభం, విమానయాన రంగం, భారత్

ఫొటో సోర్స్, Getty Images

ఇతర విమానయాన సంస్థలపై ఎందుకు ప్రభావం పడలేదు?

అసలు పెద్ద ప్రశ్న ఏంటంటే.. కొత్త ఎఫ్‌డీటీఎల్ నిబంధనల వల్ల ఇండిగో ఎయిర్‌లైన్స్‌ సంక్షోభానికి గురైతే, ఇవే నియమాలు ఇతర విమానయాన సంస్థలను ఎందుకు ప్రభావితం చేయలేదు?

దీన్ని అర్థం చేసుకోవడానికి ముందు కొన్ని గణాంకాలను చూడటం ముఖ్యం.

ఇండిగోలో 434 విమానాలను నడపడానికి 5,085 మంది పైలట్లు ఉన్నారు. మరోవైపు ఎయిర్ ఇండియాలో 191 విమానాలను నడపడానికి 6,350 మంది పైలట్లు ఉన్నారు.

ఎయిర్ ఇండియాలో ఇండిగో కంటే సగం కంటే తక్కువ విమానాలు ఉన్నాయని స్పష్టమవుతోంది. కానీ, పైలట్లు ఎక్కువ మంది ఉన్నారు.

కొత్త ఎఫ్‌డీటీఎల్ నిబంధనలు ఎయిర్ ఇండియాపై ఎందుకు ప్రతికూల ప్రభావం చూపలేదని ఆ సంస్థను బీబీసీ ప్రశ్నించింది.

ఈ వార్తను ప్రచురించే సమయానికి ఎయిర్ ఇండియా నుంచి అధికారిక స్పందన రాలేదు.

అయితే, అనేక సవాళ్లు ఉన్నప్పటికీ ఎయిర్ ఇండియా తన రోస్టరింగ్ సాఫ్ట్వేర్ వ్యవస్థను నవంబర్ 1కి రెండున్నర నెలల ముందు కొత్త ఎఫ్‌టీఎల్ ప్రమాణాలకు అనుగుణంగా పునర్నిర్మించిందని పేరు బయటపెట్టకూడదనే షరతుపై కంపెనీ సీనియర్ ఉద్యోగి ఒకరు చెప్పారు.

‘‘నవంబర్ 1 గడువుకు 15 రోజుల ముందు అక్టోబర్ మధ్యలో కొత్త ఎఫ్‌టీఎల్ నిబంధనల ప్రకారమే ఎయిర్ ఇండియా పైలట్ రోస్టర్లను విడుదల చేసింది. గత మూడేళ్లలో వేలాది మంది పైలట్లను నియమించుకోవడం ద్వారా తగినంత మంది పైలట్లను కూడా ముందుగానే అందుబాటులో ఉంచుకుంది’’ అని ఆ సీనియర్ ఉద్యోగి చెప్పారు.

సంజయ్ లాజర్ ప్రకారం, ఇతర విమానయాన సంస్థలు ముందుంగానే పైలట్లను నియమించుకోవడం వల్ల వాటిపై ఎలాంటి ప్రభావం పడలేదు.

“ఆకాశ వద్ద ఉన్న పైలట్లు తమకు తక్కువ డ్యూటీలు పడుతున్నాయని ఫిర్యాదు చేస్తున్నారు, నిబంధనల అమలుకు చాలా ముందే ఆకాశ పైలట్లను నియమించుకోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. ఇక ఎయిర్ ఇండియా పూర్తి సర్వీస్ క్యారియర్. ఇండిగో కంటే చాలా బలమైన నిర్మాణం కలిగి ఉంది. అయితే ఇండిగో తక్కువ ధరల నమూనాలో పనిచేస్తుంది’’ అన్నారు.

“ఉదాహరణకు, ఇండిగో ప్రతి విమానానికి ఐదు లేదా ఆరుగురు పైలట్లతో పనిచేస్తే, ఎయిర్ ఇండియా ఒక విమానానికి దాదాపు ఏడు‌న్నర పైలట్లతో పనిచేస్తోంది. ఇప్పుడు ఇండిగో వద్ద 400 విమానాలు ఉన్నాయనుకుంటే, ఈ తేడా మొత్తం వెయ్యి పైలట్లకు చేరుతుంది. అంటే రెండు కంపెనీలకూ ఒకే సంఖ్యలో ఎయిర్‌బస్ 320 విమానాలు ఉన్నా, ఈ పోలిక ఇదే విధంగా ఉంటుంది. ఎయిర్ ఇండియా, ఇతర ఎయిర్‌లైన్స్‌ సమయానికి నియామకాలు జరపడంతో వారి వద్ద అదనంగా పైలట్లు ఉన్నారు . ఇండిగో మాత్రం ఖర్చును తగ్గించడానికి ఉద్యోగులతో ఎక్కువ పని చేయించుకోవడానికి ప్రయత్నించింది. కొంతవరకైతే సరే. కానీ దీనికీ ఒక హద్దు ఉంటుంది’’ అన్నారు.

కెప్టెన్ రంగనాథన్ మాట్లాడుతూ, “వారి (ఇతర విమానయాన సంస్థలు) వద్ద తగినంత సిబ్బంది ఉన్నారు. షెడ్యూల్ నిబంధనల ప్రకారం జరుగుతుంది. కానీ, ఇండిగో అలా చేయలేదు. కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. ఇటీవలి సంక్షోభం వల్ల ప్రభావితమైన వ్యక్తులు దేశీయ ప్రయాణికులే తప్ప అంతర్జాతీయ ప్రయాణికులు కాదు. అంతర్జాతీయంగా ఇండిగో విమానాలు ప్రభావితం కాలేదు. ఎయిర్ లైన్స్‌ను శిక్షించాలంటే దేశీయ ప్రయాణికులకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇండిగో అంతర్జాతీయ విమాన అనుమతిని ఆరు నెలల పాటు రద్దు చేసి, దేశీయ విమానాలకు ఆ పైలట్లను, విమానాలను మోహరించి ఇక్కడ సమస్యను పరిష్కరించండి. కానీ, ఇండిగోపై చర్యలు తీసుకునే ధైర్యం ప్రభుత్వానికి లేదు కాబట్టి అలా చేయలేదు’’ అన్నారు.

దిల్లీ, ఇండిగో, ఇండిగో సంక్షోభం, విమానయాన రంగం, భారత్

ఫొటో సోర్స్, Getty Images

ఇకపై పరిస్థితేంటి?

అప్పులు, పెరుగుతున్న ఇంధన ఖర్చుల కారణంగా గత 15 ఏళ్లలో జెట్ ఎయిర్‌వేస్, కింగ్ ఫిషర్, గోఎయిర్ వంటి అనేక భారతీయ విమానయాన సంస్థలు మూతపడ్డాయి. ఇవి మూతపడ్డాక ఇండిగో త్వరగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. చిన్న నగరాలకు, కొత్త రూట్లలో విమానాలను నడపడం ప్రారంభించింది. మారుతున్న వాతావరణం ఇండిగోకు బాగా కలిసొచ్చింది. దశాబ్దాలుగా ఏ భారతీయ విమానయాన సంస్థ సాధించలేనంత మార్కెట్ వాటాను పొందింది.

కానీ, ఇటీవలి సంక్షోభం ఇండిగో భవిష్యత్తుపై ప్రశ్నలను లేవనెత్తింది.

ఇటీవలి విమాన అంతరాయాలు ఇండిగో ప్రణాళిక, పర్యవేక్షణ, వనరుల నిర్వహణలో ప్రధాన లోపాలను వెల్లడించాయని ప్రఖ్యాత రేటింగ్ ఏజెన్సీ మూడీస్ తెలిపింది.

తక్కువ ఖర్చుతో కూడిన ఇండిగో కార్యకలాపాలు సాధారణ సమయాల్లో బాగానే ఉన్నాయి, కానీ నిబంధనలలో మార్పులకు స్పందించే శక్తి లేదు, ఇది వ్యవస్థ రీసెట్ కు దారితీసింది డిసెంబర్ 5న సుమారు 1,600 విమానాలను రద్దు చేసిందని మూడీస్ తెలిపింది.

తన విమాన సేవలను పునరుద్దరించినట్టు ఇండిగో డిసెంబర్ 9న తెలిపింది. నెట్‌వర్క్‌లో స్వల్ప మార్పులు ఉన్నప్పటికీ వెబ్‌సైట్‌లో చూపిన విమానాలన్నీ యథావిధిగా నడుస్తాయని పేర్కొంది.

డిసెంబర్ 10 నాటికల్లా తన నెట్‌వర్క్‌లోని 138 స్టేషన్లకు 1800 విమానాలను నడుపుతున్నట్టు ఇండిగో డిసెంబర్ 9న తెలిపింది. మొత్తం 1900 విమానాలు నడపాలని యోచిస్తోంది.

ప్రస్తుతం భారతదేశ విమానయాన మార్కెట్లో ఇండిగో వాటా 65 శాతం.

భవిష్యత్తులో ఈ పరిస్థితి తలెత్తకుండా నిరోధించడానికి ఏం చేయాలి?

ఇండిగో వంటి సంక్షోభం మళ్లీ జరగకుండా చూసుకోవాలంటే, ఒక కంపెనీ మాత్రమే ఆధిపత్యం చెలాయించేలా మార్కెట్‌ ఉండకూడదని సంజయ్ లాజర్ చెప్పారు.

“దేశంలో 50 శాతం రూట్లలో ఇండిగో ఏకైక ఆపరేటర్ గా ఉంది. మీరు వారి మొత్తం వాటాను 50% కంటే తక్కువకు తగ్గించనంత వరకు, సాధారణ స్థితిని పునరుద్ధరించలేరు. ఈ అధికారులపై విచారణ జరపాలి, చర్యలు తీసుకోవాలి. ఇండిగో, డీజీసీఏ, పౌర విమానయాన మంత్రిత్వ శాఖపై ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తే ఎవరు దోషులో తెలుస్తుంది. చాలా డాక్యుమెంటేషన్ సాక్ష్యాలు ఉన్నాయి. “

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)