SOURCE :- BBC NEWS

ఇజ్రాయెల్, ఇరాన్, అణ్వాయుధాలు, అమెరికా

ఫొటో సోర్స్, Getty Images

ఇజ్రాయెల్ ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరుతో ఇరాన్‌పై చేసిన దాడికి చాలా ప్రాధాన్యం ఉంది. గత ఏడాది ఇరాన్‌, ఇజ్రాయెల్ మధ్య రెండు సంక్షోభాలు చోటుచేసుకున్నాయి. ఈ రెండింటిటో పాటు గతంలోని ఘటనలతో పోలిస్తే ప్రస్తుత ఇజ్రాయెల్ ఆపరేషన్ కీలకమైనది.

ఇరాన్-ఇరాక్ (1980-1988) మధ్య యుద్ధం తర్వాత ఇరాన్ గడ్డపై జరిగిన అతిపెద్ద దాడి ఇది.

శుక్రవారం(జూన్ 13) ఉదయం, ఇజ్రాయెల్ వైమానిక దళం ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించిన ప్రాంతాలనే కాకుండా, ఇరాన్ గగనతల రక్షణను, బాలిస్టిక్ క్షిపణి స్థావరాలను కూడా లక్ష్యంగా చేసుకుంది.

ఇరాన్ ప్రతీకారం తీర్చుకోగల సామర్థ్యాన్ని ఇజ్రాయెల్ దాడులు తగ్గించాయి.

ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ కోసం పనిచేస్తున్న ఏజెంట్ల నెట్‌వర్క్ ఇరాన్ అణు కార్యక్రమం, సైన్యంలోని కీలక స్థావరాల గురించి కచ్చితమైన సమాచారాన్ని అందించడంలో సాయపడినట్టు తెలిసింది.

దాడుల్లో మరణించిన వారిలో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) కమాండర్-ఇన్-చీఫ్ హుస్సేన్ సలామి ఉన్నారు. ఆయన 1979 ఇస్లామిక్ విప్లవానికి గురువు. షా పాలనను అంతమొందించడంలో కీలక పాత్ర పోషించారు.

ఇజ్రాయెల్ దాడుల్లో ఐఆర్‌జీసీ వైమానిక దళాధిపతి కూడా మరణించారు.

తమ శాస్త్రవేత్తలు ఆరుగురు మరణించారని ఇరాన్ తెలిపింది.

ఇరాన్ భద్రతా వ్యవస్థ కీలకప్రాంతాలలోకి ఇజ్రాయెల్ నిఘా సంస్థ విజయవంతంగా చొచ్చుకుపోవడం ద్వారా, ఇరాన్‌లో ఎవరూ సురక్షితంగా లేరని నిరూపించింది. 78 మంది మరణించారని ఇరాన్ ప్రభుత్వ టీవీ తెలిపింది. మృతుల్లో పిల్లలు కూడా ఉన్నారని వెల్లడించింది. (ఈ సంఖ్యను బీబీసీ స్వతంత్రంగా ధృవీకరించలేదు).

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఇజ్రాయెల్, ఇరాన్, అణ్వాయుధాలు, అమెరికా

ఫొటో సోర్స్, Getty Images

ఇరాన్ నుంచే ఇరాన్‌పై దాడులు

దాడుల సమయంలో ఇరాన్ లోపలి నుంచే ఇజ్రాయెల్ మొసాద్ డ్రోన్లను ప్రయోగించ గలిగిందని తెలుస్తోంది. ఈ ఆపరేషన్ ప్రారంభ లక్ష్యం నతాంజ్‌లోని అణు కేంద్రం, ఐఆర్‌జీసీకి సంబంధించిన ప్రాంతాలు. ఇజ్రాయెల్ సైన్యం చాలా కాలంగా దీని కోసం ప్రణాళికలు వేస్తోంది.

ఇజ్రాయెల్ దాడులకు స్పందించడంలో ఇరాన్ తడబడుతోంది. ఇజ్రాయెల్ హిట్ లిస్టులో ఇంకా చాలా లక్ష్యాలు ఉండొచ్చు. వాటిలో కొన్ని పరిధికి మించినవీ ఉండొచ్చు.

ఇజ్రాయెల్, ఇరాన్, అణ్వాయుధాలు, అమెరికా

ఫొటో సోర్స్, Getty Images

ఇజ్రాయెల్ ఇప్పుడెందుకు దాడి చేసింది?

ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకోవడమే ఇజ్రాయెల్ లక్ష్యం. ఇరాన్ రహస్యంగా అణుబాంబు తయారీ తుది దశకు చేరుతోందేమోనని అనేక పాశ్చాత్య దేశాలు అనుమానిస్తున్నాయి.

అంటే అణ్వాయుధాల తయారీ మార్గం నుంచి ఇరాన్ వెనక్కి తగ్గే అవకాశం లేదు.

అయితే ఈ ఆరోపణలను ఇరాన్ ఖండిస్తోంది. తన అణు కార్యక్రమం పౌర అవసరాల కోసమేనని ఇరాన్ ఎప్పుడూ చెబుతుంటుంది. దీనికి రష్యా నుంచి సాయం పొందుతోంది. ఇది పూర్తిగా శాంతియుత ప్రయోజనాల కోసమేనన్నది ఇరాన్ గట్టిగా చేసే వాదన.

దశాబ్దానికిపైగా ఇరాన్ అణు కార్యక్రమ పురోగతిని అడ్డుకోవడానికి ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోంది. ఈ విషయంలో ఇజ్రాయెల్ అనేక విజయాలు సాధించింది కూడా. ఉదాహరణకు, ఇరాన్ శాస్త్రవేత్తలు గుర్తుతెలియనివారి చేతిలో అనుమానాస్పదంగా హత్యకు గురయ్యారు. అణు కార్యక్రమం సైనికాధిపతి బ్రిగేడియర్ జనరల్ ఫక్రిజాదేహ్ 2020లో తెహ్రాన్ సమీపంలో హత్యకు గురయ్యారు.

గతంలో, అమెరికా, ఇజ్రాయెల్ నుంచి వచ్చిన సైబర్ గూఢచారులు, యురేనియం శుద్ధి చేసే యంత్రాలలో విధ్వంసకర కంప్యూటర్ వైరస్‌ను చొప్పించడంలో విజయం సాధించారు. దీని కోడ్‌నేమ్ స్టక్స్‌నెట్. దీని వల్ల ఇరాన్ యురేనియం శుద్ధి యత్రాలు దాని నియంత్రణలో లేవు.

ఇజ్రాయెల్, ఇరాన్, అణ్వాయుధాలు, అమెరికా

ఫొటో సోర్స్, Getty Images

‘బలహీనంగా కనిపిస్తున్న ఇరాన్’

అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక బాధ్యతలను ఇరాన్ ఉల్లంఘిస్తోందని, ఈ విషయాన్ని భద్రతా మండలికి తెలియజేస్తామని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ(ఐఏఈఏ) హెచ్చరించింది.

ఇరాన్ అణువిధానంలో, కీలకమైన యురేనియం భారీ ఉత్పత్తిపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. యురేనియం ఉత్పత్తి స్థాయి 60 శాతానికి చేరింది. ఇది అణు విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి సరిపోతుంది. అయితే అణు బాంబును తయారు చేయడానికి సరిపోదు.

ఇరాన్ అణు కార్యక్రమాన్ని ఆపేందుకు 2015లో ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఒక ఒప్పందం కుదిరింది.

కానీ డోనల్డ్ ట్రంప్ దీనిని ‘ప్రపంచంలోనే అత్యంత చెత్త ఒప్పందం’ అని విమర్శించారు. ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగింది. ఇరాన్ కూడా 2018లో ఈ ఒప్పందాన్ని పాటించడం మానేసింది.

ఇరాన్ దగ్గర అణు బాంబు ఉండాలని ఇరాన్ బయటి దేశాలేవీ కోరుకోవడం లేదు. 9.5 మిలియన్ల జనాభా ఉన్న ఒక చిన్న దేశం ఇజ్రాయెల్. ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉండటం తమ మనుగడకు ముప్పు అని ఇజ్రాయెల్ నమ్ముతోంది.

ఇజ్రాయెల్‌ను నాశనం చేయాలని పిలుపునిస్తూ ఇరాన్ ప్రముఖులు చేసిన అనేక ప్రకటనలను ఇజ్రాయెల్ ప్రస్తావిస్తోంది. సౌదీ అరేబియా, జోర్డాన్, గల్ఫ్ దేశాలు ఇరాన్ ప్రస్తుత ప్రభుత్వానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఓ పొరుగుదేశంగా మాత్రమే చూస్తున్నాయి.

అయితే ఇప్పుడు ఆ దేశాలు కూడా ఈ వివాదం తమ సరిహద్దులకు వ్యాపించే ప్రమాదం గురించి ఆందోళన చెందుతున్నాయి.

ఇజ్రాయెల్‌కు ఇది కీలకమైన సమయం. ఇరాన్ ఇప్పటికే బలహీనపడింది. లెబనాన్, సిరియా, గాజాలో దాని మిత్రబలగాల ఓటమి లేదా దాదాపుగా నాశనం కావడానికి దగ్గరగా ఉండడం దీనికి కారణం. దీంతో పాటు గత ఏడాది ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఇరాన్ గగన తల రక్షణ బాగా బలహీనంగా మారింది.

ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతుంది. ఇరాన్ కొన్ని కీలకమైన యురేనియం పరికరాలను భూగర్భంలోకి తరలిస్తోందని ఇజ్రాయెల్ భయపడుతోంది.

ఇజ్రాయెల్, ఇరాన్, అణ్వాయుధాలు, అమెరికా

ఫొటో సోర్స్, Getty Images

ఏం జరగనుంది?

ఇజ్రాయెల్ ఏమి కోరుకుంటుందో స్పష్టంగా ఉంది. ఇరాన్ అణు కార్యక్రమాన్ని చాలా సంవత్సరాల వెనక్కి మళ్లించాలని లేదా పూర్తిగా నాశనం చేయాలని ఇజ్రాయెల్ ఉద్దేశం.

ఇజ్రాయెల్ సైన్యం, రాజకీయాల్లోని చాలా మంది ఈ ఆపరేషన్ ఇరాన్ నాయకత్వాన్ని బలహీనపరుస్తుందని లేదా పడగొడుతుందని భావిస్తున్నారు. ఇది ఇజ్రాయెల్‌కు ముప్పు కలిగించని కొత్త పాలన ప్రారంభానికి దారితీస్తుందన్నది వారి ఆలోచన కావచ్చు.

ఒప్పందాన్ని అంగీకరించడానికి ఇరాన్‌కు ‘రెండో అవకాశం’ ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శుక్రవారం(జూన్ 13) అన్నారు. అమెరికా, ఇరాన్ మధ్య ఆరో రౌండ్ చర్చలు ఒమన్ రాజధాని మస్కట్‌లో జరగాల్సి ఉంది. ఇవి రద్దయ్యాయి. అయితే ఇజ్రాయెల్ ఈ చర్చలకు పెద్దగా ప్రాముఖ్యం ఇవ్వడం లేదు.

యుక్రెయిన్‌తో శాంతి చర్చలకు సంబంధించి ట్రంప్‌కు తప్పుడు సమాచారం ఇచ్చిందని రష్యా ఆరోపణలు ఎదుర్కొంటోంది. అలాగే ఇరాన్ కూడా తప్పుడు సమాచారం ఇస్తోందని ఇజ్రాయెల్ భావిస్తోంది.

ఇరాన్ అనుమానిత అణ్వాయుధ కార్యక్రమాన్ని ముగించడానికి ఇదే అత్యుత్తమమైన, బహుశా చివరి అవకాశమని ఇజ్రాయెల్ నమ్ముతోంది.

“ఇజ్రాయెల్, ఇరాన్‌పై రాత్రికి రాత్రే చేసిన దాడులతో… ఇరాన్ అణు కార్యక్రమాన్ని నిలిపి వేయడానికి అధ్యక్షుడు ట్రంప్ ఒప్పందం కుదిర్చే అవకాశాలను నిర్వీర్యం చేసింది’’ అని యూరోపియన్ కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ (ఈసీఎఫ్‌ఆర్)లో సీనియర్ ఫెలో ఎలి జెరన్మాయే అన్నారు.

” చర్చలను పూర్తిగా పక్కదారి పట్టించడానికి ఈ సమయంలో పెద్ద ఎత్తున దాడులు జరిగినట్టు స్పష్టంగా తెలుస్తోంది.” అని అభిప్రాయపడ్డారు.

ఈ దాడుల్లో తమ ప్రమేయం లేదని ఇరాన్‌కు చెప్పడానికి అమెరికా ప్రయత్నించింది. కానీ ఇరాన్ పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై ప్రతీకారానికి దిగితే, అమెరికా పశ్చిమాసియాలో మరో వివాదంలో చిక్కుకునే ప్రమాదం ఉంది.

ఇజ్రాయెల్‌ను కఠినంగా శిక్షిస్తామని ఇరాన్ సుప్రీం నాయకుడు అలీ ఖమేనీ అన్నారు. కానీ నిజమేమిటంటే ఇరాన్ రెండేళ్ల కిందటి కంటే ఇప్పుడు బలహీనమైన స్థితిలో ఉంది. ప్రతీకారం తీర్చుకోవడానికి ఇరాన్‌కు అవకాశాలు కూడా పరిమితంగా ఉన్నాయి.

ఇజ్రాయెల్, ఇరాన్, అణ్వాయుధాలు, అమెరికా

ఫొటో సోర్స్, Getty Images

అణ్వాయుధ పోటీ

ఇజ్రాయెల్ ప్రయత్నాలు మరింత ప్రమాదం తెచ్చి పెట్టే అవకాశం లేకపోలేదు. ఇది అణ్వాయుధ పోటీకి తెరతీసే అవకాశం ఉంది. ఇజ్రాయెల్, అమెరికా దాడులను ఎదుర్కొనేందుకు అణ్వాయుధాలను సమకూర్చుకోవడమే పరిష్కారమని ఇరాన్ భద్రతా సంస్థలు చాలా కాలంగా వాదిస్తున్నాయి. బహుశా లిబియా, ఉత్తర కొరియా నాయకుల అనుభవాలను చూసి ఈ వాదన చేస్తున్నట్టుంది.

లిబియాలో కల్నల్ గడాఫీ 2003 లో తన సామూహిక విధ్వంసక ఆయుధాల కార్యక్రమాన్ని నిలిపివేశారు. అయితే ఎనిమిదేళ్ల తర్వాత పాశ్చాత్యదేశాల మద్దతుతో జరిగిన నిరసనల్లో హత్యకు గురయ్యారు.

కానీ అంతర్జాతీయ ఆంక్షలు ఉన్నప్పటికీ ఉత్తర కొరియా, అణ్వాయుధాలను, బాలిస్టిక్ క్షిపణులను భారీగా సమకూర్చుకుంది. దీనివల్ల ఉత్తర కొరియాపై దాడి చేసే ముందు ఎవరైనా ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది.

ఇజ్రాయెల్ ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ వల్ల ఎలాంటి నష్టం వాటిల్లినా, ఇరాన్ ప్రస్తుత ప్రభుత్వం దాని నుంచి బయటపడితే అణు బాంబు తయారీతోపాటు దాన్ని పరీక్షించడానికి కూడా వెనకాడకపోవచ్చు.

ఇదే జరిగితే, పశ్చిమాసియాలో అణ్వాయుధ పోటీ ప్రారంభం కావచ్చు. సౌదీ అరేబియా, తుర్కియే , బహుశా ఈజిప్ట్ కూడా తమకు అణ్వాయుధాలు అవసరమన్న నిర్ణయానికి రావొచ్చు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)