SOURCE :- BBC NEWS
6 జనవరి 2025, 06:42 IST
హమాస్, ఇజ్రాయెల్‌ల మధ్య కాల్పుల విరమణ, బందీల విడుదల వంటి అంశాలపై ఖతార్‌లో పరోక్ష చర్చలు తిరిగి ప్రారంభమవుతున్న వేళ హమాస్ తమ వద్ద బందీగా ఉన్న 19 ఏళ్ల ఇజ్రాయెల్ అమ్మాయి వీడియో విడుదల చేసింది.
హమాస్‌తో ఇజ్రాయెల్ ప్రభుత్వం డీల్‌ను కుదుర్చుకోవాలని బందీగా ఉన్న లిరీ అల్‌బాగ్ అనే అమ్మాయి కోరుతున్నట్లుగా ఆ ఫుటేజీలో కనిపిస్తుంది.
2023 అక్టోబర్‌లో ఇజ్రాయెల్‌పై చేసిన దాడిలో గాజా సరిహద్దులోని నహల్ ఓజ్ ఆర్మీ స్థావరం నుంచి లిరీతో పాటు మరో ఆరుగురు మహిళా సైనికులను హమాస్ బందీలుగా చేసుకుంది. వీరిలో అయిదుగురు ఇంకా వారి చెరలోనే ఉన్నారు.
గాజాపై ఇజ్రాయెల్ దాడులు తీవ్రమైన నేపథ్యంలో కాల్పుల విరమణ చర్చలను పునరుద్ధరిస్తున్నట్లుగా ప్రకటన వచ్చింది. గత 24 గంటల్లో జరిగిన బాంబు దాడుల్లో 88 మంది చనిపోయారని హమాస్ ఆధ్వర్యంలోని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
గాజా నగరంలోని ఒక ఇంటిపై జరిగిన దాడిలో ఏడుగురు పిల్లలతో సహా 11 మంది చనిపోయినట్లు హమాస్ ఆధ్వర్యంలో పౌర రక్షణ సంస్థ (సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ) తెలిపింది.
శిథిలాల కింద కూరుకుపోయిన వారికోసం అక్కడి నివాసితులు వెదుకుతున్నట్లు, మృతదేహాలను కవర్లలో చుట్టి ఉంచినట్లు బయటకు వచ్చిన ఫోటోలలో కనిపించింది.
”ఒక పెద్ద పేలుడుతో మేం నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేచాం.” అని ఏఎఫ్‌పీ వార్తా సంస్థతో పొరుగున నివసించే అహ్మద్ ముసా చెప్పారు.
గత రెండు రోజుల్లో గాజా స్ట్రిప్‌లోని 100కు పైగా ‘ఉగ్రవాద స్థావరాలను’ లక్ష్యంగా చేసుకొని డజన్ల కొద్ది ‘హమాస్ ఉగ్రవాదులను’ అంతం చేశామని శనివారం ఇజ్రాయెల్ మిలిటరీ చెప్పింది.
హమాస్ విడుదల చేసిన వీడియోలో తమ కూతురును చూశాక గుండె బద్ధలైందని లిరీ అల్‌బాగ్ తల్లిదండ్రులు అన్నారు. ‘‘మీ పిల్లలు అక్కడ బందీలుగా ఉన్నట్లు భావించి దయచేసి సరైన నిర్ణయాలు తీసుకోండి’’ అని వారు ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుకు విజ్ఞప్తి చేశారు.
బందీలుగా ఉన్న వారందరినీ తక్షణమే ఇళ్లకు తీసుకురావాల్సిన అవసరాన్ని లిరీ పరిస్థితి గుర్తు చేస్తోందని ‘ద హోస్టేజెస్ అండ్ మిస్సింగ్ ఫ్యామిలీస్ ఫోరమ్’ వ్యాఖ్యానించింది. ఈ సంస్థ బందీల కుటుంబాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది.
బందీలు అందరూ ఇళ్లకు తిరిగి వచ్చేవరకు తమ అధికారుల బృందం కృషి చేస్తూనే ఉంటుందని లిరీ తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడుతూ ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాగ్ హెర్జోగ్ చెప్పారు.
హమాస్ ఇలాంటి వీడియోలు విడుదల చేయడాన్ని మానసిక యుద్ధంగా గతంలో ఇజ్రాయెల్ అధికారులు అభివర్ణించారు.
కాల్పుల విరమణ, బందీల విడుదల ఒప్పందానికి సంబంధించిన చర్చలు దాదాపు పూర్తయ్యాయని గత నెలలో పాలస్తీనా ఆధికారి ఒకరు బీబీసీతో చెప్పారు. కానీ, ఇంకా చాలా కీలక సమస్యలను పరిష్కరించాల్సి ఉందని అన్నారు.
యెమెన్ నుంచి ప్రయోగించిన ఒక క్షిపణిని అడ్డుకున్నట్లు ఇజ్రాయెల్ మిలిటరీ ఆదివారం ప్రకటించింది. హౌతీలు చేస్తోన్న వరుస దాడుల్లో ఇది తాజాది.
హైఫా నగరానికి సమీపంలోని ఒక పవర్ స్టేషన్ దిశగా హైపర్‌సోనిక్ బాలిస్టిక్ మిసైల్‌ను ప్రయోగించినట్లు హౌతీలు తెలిపారు. గాజాలో ఇజ్రాయెల్ సైనిక చర్యలకు ప్రతిస్పందనగా ప్రొజెక్టైల్స్‌తో ఫైరింగ్ మొదలుపెట్టినట్లు హౌతీ చెప్పింది.
హమాస్ 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై చేసిన దాడితో ఈ యుద్ధం మొదలైంది. హమాస్ చేసిన నాటి దాడిలో 1200 మంది చనిపోగా, 251 మంది బందీలయ్యారు.
హమాస్‌ను నాశనం చేసేందుకు ఇజ్రాయెల్ చేపట్టిన సైనిక చర్య 45,700 కంటే ఎక్కువ మందిని బలి తీసుకుందని హమాస్ ఆధ్వర్యంలో నడిచే ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఇజ్రాయెల్ మిలిటరీ దాడులతో ఉత్తర గాజాలోని మూడు ప్రభుత్వ ఆసుపత్రులు ధ్వంసం అయ్యాయని, పూర్తిగా పనికిరాకుండా పోయాయని శనివారం గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇజ్రాయెల్ మిలిటరీ అక్టోబర్ నుంచి ఉత్తర గాజాలోని కొన్ని భాగాలను దిగ్బంధనం చేసింది. 10,000 నుంచి 15,000 మంది వరకు నివసించే ఆ ప్రాంతంలోకి సహాయక సామగ్రి తరలింపును ఇజ్రాయెల్ బలగాలు బలంగా అడ్డుకుంటున్నాయని ఐక్యరాజ్యసమితి పేర్కొంది.
హమాస్ ఉగ్రవాదులకు ఆవాసంగా ఉందని ఆరోపిస్తూ బీట్ లహియాలోని కమాల్ అడ్వాన్ ఆసుపత్రి నుంచి రోగులు, వైద్య సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోవాలని గత నెల చివర్లో ఇజ్రాయెల్ మిలిటరీ ఒత్తిడి చేసింది. ఆసుపత్రి డైరెక్టర్ హుస్సమ్ అబు సఫియాను అరెస్ట్ చేసింది.
ఆసుపత్రిలోని కొంతమంది రోగులను, వైద్య సిబ్బందిని సమీపంలోని ఇండోనేసియన్ ఆసుపత్రికి తరలించడంలో సహాయపడ్డామని ఇజ్రాయెల్ పేర్కొంది. బీట్ హనూన్‌లోని ఆసుపత్రితో పాటు ఈ ఆసుపత్రిలో కూడా వైద్య సేవలు నిలిచిపోయాయని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది.
ఆసుపత్రులపై, వైద్య నిపుణులపై దాడులకు స్వస్తి పలకాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ డాక్టర్ టెడ్రోస్ పిలుపునిచ్చారు. ”గాజాలోని ప్రజలకు వైద్యం అవసరం” అని ఆయన అన్నారు.
తమ బలగాలు అంతర్జాతీయ చట్టాలకు లోబడి పనిచేస్తాయని, సామాన్య పౌరులను లక్ష్యంగా చేసుకోవని ఇజ్రాయెల్ చెబుతోంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS