SOURCE :- BBC NEWS
2 గంటలు క్రితం
మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో మూడు గ్రామాల ప్రజలు భయాందోళనలతో జీవిస్తున్నారు. ఈ గ్రామంలో కొంతమందికి హఠాత్తుగా బట్టతల వస్తోంది. దీంతో ఆ గ్రామాల ప్రజలు కలవరపడుతున్నారు.
బుల్దానా జిల్లాలోని షెగావ్ తాలుకాలో ఉన్న బోంగావ్, కల్వాడ్, కతోరా గ్రామాల ప్రజలు జుట్టు రాలే సమస్యను ఎదుర్కొంటున్నారు.
ఈ సమస్యకు కారణమేమిటో తెలుసుకోవడానికి స్థానిక ఆరోగ్య శాఖ సర్వే నిర్వహించింది.
ఒకసారి జుట్టు రాలడం మొదలైతే కేవలం కొద్ది రోజులలోనే పూర్తిగా బట్టతల వచ్చేస్తోందని గ్రామస్థులు చెప్పారు.
ఆయా గ్రామాలలో 50 నుంచి 55 మంది జుట్టురాలే సమస్య బారినపడ్డారని వైద్యారోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు.
ముందుగా తలపై దురద మొదలవుతోంది. తరువాత జుట్టు రాలడం మొదలై, మూడు నాలుగు రోజులకే బట్టతల వచ్చేస్తోందని బాధితులు అధికారులకు తెలిపారు.
ఈ సమస్యకు కారణం ఏంటో ఇంకా తెలియలేదు.
స్థానిక వైద్యులు వీరికి ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు.
బాధితులు ఏమంటున్నారు?
షెగావ్ తాలూకాలోని మూడు గ్రామాలలో ప్రధానంగా ఈ సమస్య కనిపిస్తోందని వైద్యాధికారులు చెప్పారు. చాలామంది ప్రజలు ఈ సమస్య గురించి ఫిర్యాదు చేశాక ఓ చర్మవ్యాధి నిపుణుడు, ఇతర డాక్టర్లు బోంగావ్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు నిర్వహించారు.
పరీక్షల కోసం తలపై చర్మం శాంపిళ్లను ఇచ్చిన కొంతమంది తమ అనుభవాలను తెలిపారు.
కొన్నిరకాల షాంపూలను వాడిన తరువాత ఈ సమస్య కనిపించిందని కొందరు చెప్పగా, వైద్య పరీక్షల ఫలితాలు వచ్చేదాకా స్పష్టమైన కారణం చెప్పలేమని డాక్టర్లు అంటున్నారు.
వాంఖడే గ్రామీణ ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న డాక్టర్ బాలాజీ అదార్ బీబీసీతో మాట్లాడుతూ.. ”ఈ గ్రామాలకు చెందిన ఏడెనిమిది మందిని పరీక్షించాను. మిగతావారు ముందుకు రాలేదు. నేను పరీక్షించిన వారి తలపైన కొన్ని మచ్చలు కనిపించాయి. వారికి తలంతా దురదగా ఉంది” అని చెప్పారు.
”90 శాతం మంది తమకు తలపై దురదగా ఉందని చెప్పారు. వీరి తలపై నుంచి మూడు మిల్లిమీటర్ల మేర చర్మాన్ని తొలగించి పరీక్షలకు పంపాం. ఫలితాలు వచ్చిన తరువాత తగిన చికిత్స అందిస్తాం. నా వైద్య జీవితంలో ఇలాంటి సమస్యను చూడటం ఇదే మొదటిసారి. అందుకే పరీక్షా ఫలితాలు వచ్చేదాకా ఏమీ చెప్పలేం. తరచుగా ఇలాంటి సమస్యలు కుటుంబ సభ్యులందరూ ఒకే దువ్వెన, ఒకే టవల్ వాడటం వల్ల వస్తుంటాయి” అని తెలిపారు.
తలపై మచ్చ.. ఆపై దురద
”పది రోజుల కిందట నాకు జట్టు రాలడం మొదలైంది. ఓ తెల్లని షాంపూ వాడిన తరువాత ఇలా అయింది. దానివల్లే నా జుట్టు రాలిపోయింది. దీనికి మరో కారణం ఉందని అనుకోవడం లేదు. మా గ్రామంలో ఇటువంటి సమస్య ఇంతకుముందు ఎప్పుడూ లేదు” అని బోంగావ్కు చెందిన దిగంబర్ ఎలమె చెప్పారు.
”మా గ్రామంలో 25 మంది దాకా ఈ సమస్యతో బాధపడుతున్నారు. ముందుగా తలపై మచ్చలా వచ్చి దురద మొదలవుతుంది. తరువాత జుట్టు రాలడం మొదలవుతుంది. నాకు బట్టతల వచ్చినట్టుగా తలపై బోలెడు ఖాళీ ఏర్పడింది. కానీ ఇప్పుడు మళ్లీ జుట్టు పెరుగుతోంది. డాక్టర్లు ఇంకా దీనికి కారణమేమిటో కనుక్కోలేదు. మా గ్రామం నుంచి నీటి నమూనాలను తీసుకువెళ్లి పది రోజులైనా ఇంకా రిపోర్టులు రాలేదు” అని దిగంబర్ తెలిపారు.
”జుట్టు రాలడం మొదలయ్యాక పూర్తిగా రాలిపోవాలని కొందరు కోరుకుంటున్నారు. బట్టతల వచ్చాక తలపై దురద, మచ్చలు తగ్గిపోయి జుట్టు మళ్లీ పెరుగుతోంది” అని ఒక బాధితుడు చెప్పారు.
జుట్టు రాలిపోయిన తరువాత బట్టతల సమస్యను ఎదుర్కొన్న మారుతి ఎలమె మాట్లాడుతూ.. ”ఎనిమిది నుంచి పది రోజులపాటు జుట్టు రాలే సమస్యతో బాధపడ్డా. విపరీతమైన దురద కారణంగా తలను బాగా గోకడంతో నెత్తురు కూడా వచ్చేది. ఆ సమయంలో ఊడిపోయిన జుట్టుతో నా చేయి నిండిపోయేది” అని చెప్పారు.
”ఇప్పుడు దురద తగ్గిపోయింది. మళ్లీ జుట్టు పెరుగుతోంది. ఒకసారి జుట్టు మొత్తం రాలిపోయాక నాకు ఎటువంటి సమస్యా ఎదురుకాలేదు. నేను ఎటువంటి షాంపూలు వాడను. ఇది నీళ్ల కారణంగా జరిగి ఉండచ్చేమో… ఎవరికి తెలుసు? ఇలా ఎందుకు జరుగుతోందో డాక్టర్లే చెప్పాలి. గ్రామంలో ఈ సమస్యతో 20 మందికి పైగా అవస్థ పడుతున్నారు” అని మారుతి తెలిపారు.
నీటిలో నైట్రేట్ శాతం పెరగడమే కారణమా?
బోంగావ్లో సేకరించిన నీటి నమూనాలను పరీక్షించిన తరువాత బుల్దానా జిల్లా ఆరోగ్యాధికారి డాక్టర్ అమోల్ గీథే మాట్లాడుతూ.. ”ప్రాథమిక పరిశీలన తరువాత మేం నీటి నమూనాలను పూర్తి స్థాయి పరీక్షల కోసం పంపాం. సహజంగా లీటరు నీటిలో నైట్రేట్ శాతం పది మిల్లీ గ్రాముల లోపు ఉండాలి. కానీ మేం పంపిన నీటిలో లీటరుకు 54 మిల్లీ గ్రాములు ఉంది” అని చెప్పారు.
”నీటిలో ఆర్సెనిక్, లెడ్ ఎంత ఉందో తెలుసుకోవడానికి నీటిని పుణెకు పంపాం. ఫలితాలు రావడానికి పది రోజుల సమయం పడుతుంది. నీటిలోని ఈ గాఢమైన రసాయనాల కారణంగానే ప్రజలలో వివిధ రకాల వ్యాధులు కనిపిస్తాయి” అని డాక్టర్ అమోల్ గీథే చెప్పారు.
జుట్టు రాలడం గురించి గీథే మాట్లాడుతూ.. ”నీటిలోని రసాయనాలే జుట్టు రాలడానికి కారణమా అనే విషయం ఇప్పుడే చెప్పలేం. ఫంగల్ ఇన్ఫెక్షన్ కారణంగా ఇలా జరుగుతున్నట్టు భావిస్తున్నాం. ప్రత్యేకంగా ఈ గ్రామాలలో మాత్రమే ఈ సమస్య ఎందుకు తలెత్తుతోందనే విషయాన్ని పరిశోధించాలి. జుట్టు రాలిన వారికి తిరిగి మొలుస్తోంది” అని తెలిపారు.
”ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఈ గ్రామాలలోని మహిళలు చాలా భయపడిపోతున్నారు. కానీ మేం వారికి పరిస్థితులను వివరించాం. ఈ గ్రామాల ప్రజలు నీటిని వడగట్టుకుని తాగాలి. కలుషిత నీరు తాగడం వల్ల చాలా రకాల వ్యాధులు వస్తాయి. ప్రస్తుతానికైతే ఈ నీరు తాగడానికి పనికివచ్చేదే అని నాకు ఓ రిపోర్టు వచ్చింది” అని గీథే చెప్పారు.
ఇంట్లో ఒకరికి మొదలైతే…
బోంగావ్ గ్రామంలో మంచినీటి నిల్వలు తక్కువ. దీని గురించి సర్పంచ్ రమా పాటిల్ థార్కర్ మాట్లాడుతూ.. ”మా గ్రామంలో గత పది రోజులుగా ఓ వింత వ్యాధి వ్యాపిస్తోంది. ముందుగా కుటుంబంలో ఒక వ్యక్తి దీని బారినపడుతున్నారు. తరువాత కుటుంబం మొత్తానికి సోకుతోంది. వారి జుట్టు రాలిపోతోంది” అని చెప్పారు.
”దీనివల్ల గ్రామమంతటా భయాందోళనలు నెలకొన్నాయి. గ్రామంలో 20 మందికి పైగా బట్టతల వచ్చేసింది. ఒకసారి జట్టురాలడం మొదలైందంటే ఐదారు రోజుల్లో పూర్తిగా బట్టతల వచ్చేస్తోంది. దీనిపై మేం ఆరోగ్య విభాగానికి లేఖ రాశాం. మా గ్రామం ఉప్పునీటి నిల్వల ప్రాంతంలో ఉంది. అందుకే గ్రామంలో మంచినీరు లేదు. మంచినీటి కోసం ట్యాంకర్లును తెప్పించుకుంటాం. ఉప్పునీటి కారణంగా చాలామంది కిడ్నీ వ్యాధుల బారినపడుతున్నారు” అని ఆయన వివరించారు.
షెగావ్ తాలుకాలోని మూడు గ్రామాల ప్రజలు ఈ సమస్య గురించి ఫిర్యాదులు చేశాక బుల్దానా జిల్లా ఆరోగ్యాధికారి అమోల్ గీథే ఆ గ్రామాలను సందర్శించారు. ప్రాథమికంగా ఫంగల్ ఇన్ఫెక్షన్ కారణంగా ఈ సమస్య తలెత్తే అవకాశం ఉందని చెప్పారు.
జుట్టు రాలిపోతుందేమోననే భయం ఈ గ్రామాలలో ఉన్నా, కొంతమంది సమస్య తీవ్రత తగ్గుతోందని చెప్పారు. ఈ జుట్టు రాలిపోవడం కరోనాలాంటి వైరస్వల్ల వ్యాపిస్తోందని కొందరు, ఫలానా కంపెనీ షాంపూ వాడటం వల్లే ఇలా జరుగుతోందని కొందరు గ్రామస్థులు మాట్లాడుకుంటున్నారు. ఏది ఏమైనా ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని వైద్యాధికారులు చెబుతున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)