SOURCE :- BBC NEWS
నందలాల్ ఉత్తరప్రదేశ్‌లోని ఓ పోలీస్ స్టేషన్‌లో 34 ఏళ్ల నుంచి హోంగార్డుగా పని చేస్తున్నారు. ఓ ఫిర్యాదు ఆధారంగా అతనిని ఆజంగఢ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
1988 నుంచి రాణికిసరాయ్ పోలీస్ స్టేషన్‌లో అతని పేరు రౌడీషీటర్ల రికార్డులలో ఉందని పోలీసులు చెప్పారు. అతను తన పేరు మార్చుకుని హోంగార్డు ఉద్యోగం తెచ్చుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.
నందలాల్‌కు అతని బంధువులతో గొడవ రావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
పోలీసులు ఏం చెప్పారు?
నందలాల్ అసలు పేరు నక్డు. 1988లోనే అతని పేరు రాణికి సరాయ్ పోలీస్ స్టేషన్ రౌడీషీటర్ల జాబితాలో ఉంది. కానీ నక్డు తన పేరు మార్చుకోవడంతోపాటు ఏకంగా పోలీసు స్టేషన్‌లో హోంగార్డుగా ఉద్యోగం సంపాదించాడు.
నందలాల్ అలియాస్ నక్డు, రాణి కి సరాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్నాడని ఆజంగఢ్ ఎస్పీ హేమరాజ్ మీనా చెప్పారు.
అతను 1990 నుంచి మెహనగర్ పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. 1984, 1989 మధ్య అతనిపై అనేక కేసులు నమోదైనట్లు పోలీసులకు సమాచారం అందింది.
నందలాల్ విషయంలో పోలీసుల వ్యవహార శైలిపై సందేహాలు తలెత్తుతున్నాయి. అతనిపై కేసులు నమోదైన రాణి కి సరాయ్ పోలీస్ స్టేషన్‌కు అతను హోంగార్డుగా పనిచేస్తున్న మెహనగర్ పోలీస్ స్టేషన్‌కు మధ్య దూరం కేవలం 15 కిలోమీటర్ల మాత్రమే.
ప్రస్తుతం నందలాల్ అలియాస్ నక్డు మీద గ్యాంగ్‌స్టర్ యాక్ట్ కింద చర్యలు తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు.
రౌడీ షీట్‌లో నక్డుగా ఉన్న నందలాల్
పోలీసుల రౌడీషీట్‌లో నక్డుగా ఉన్న నందలాల్ గతం వెలుగులోకి వచ్చిన తీరు ఆసక్తిని కలిగిస్తోంది. కొన్ని రోజుల కిందట జరిగిన ఒక దాడి ఘటనతో 34 ఏళ్ల నాటి విషయాలు బయటకు వచ్చాయి
నందలాల్ మేనల్లుడు డీఐజీ వైభవ్ కృష్ణకు ఒక పిటిషన్ ఇచ్చారు. అందులో నందలాల్ పేరు పోలీసుల రికార్డుల్లో ఉందని, అతని అసలు పేరు నక్డు అని ఫిర్యాదు చేశారు.
దీంతో డీఐజీ దర్యాప్తుకు ఆదేశించారు. పోలీసుల విచారణలో నందలాల్‌గా చెలామణి అవుతున్నది నక్డు అని, అతనిపై గతంలో రౌడీ షీట్ ఉండేదని తెలియడంతో అతన్ని అరెస్ట్ చేశారు.
నిందితుడు ముందుగా తన పేరు మార్చుకుని, కొన్ని రోజులకు రికార్డులు, సర్టిఫికెట్లలో కూడా మార్పించాడని పోలీసులు గుర్తించారు. ఆ పత్రాల సాయంతో 1990లో హోంగార్డుగా ఉద్యోగం సాధించాడు.
నందలాల్ నాలుగో తరగతి వరకే చదువుకున్నాడని, అయితే నకిలీ సర్టిఫికెట్లతో హోంగార్డు ఉద్యోగం సంపాదించినట్లు ఎస్పీ హేమరాజ్ మీనా చెప్పారు. ప్రస్తుతం నక్డును జైలుకు పంపిన పోలీసులు, అతనిపై ఉన్న కేసుల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
హోంగార్డుగా అతను ఎక్కడెక్కడ పని చేశాడు, గుర్తింపును దాచి ఉంచడానికి ఇంకా ఏమేమి చేశాడనే వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు వివిధ ప్రాంతాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
నక్డుకు సంబంధించిన అన్ని అంశాలపై దర్యాప్తు కొనసాగుతుందని ఎస్పీ చెప్పారు. ఈ కేసులో పోలీసు విభాగం, హోంగార్డు విభాగంలో నిర్లక్ష్యం వహించినట్లు తేలితే, అందుకు బాధ్యులైన వారిపైనా విచారణ జరుగుతుందని ఎస్పీ అన్నారు.ప్రస్తుతం నందలాల్‌ను సస్పెండ్ చేశారు. ఈ విషయాన్ని హోంగార్డ్ విభాగానికి తెలియజేశారు.
బంధువుల తగాదాతో బయటపడ్డ రహస్యం
2024 అక్టోబర్‌లో నందలాల్ స్వగ్రామంలో అతని బంధువుల మధ్య గొడవ జరిగింది.
నక్డు మేనల్లుడు అతని గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తర్వాత మిగతా బంధువులు కూడా పోలీసులకు వాస్తవాలు వివరిస్తూ లేఖ రాశారు.
నక్డు, నందలాల్‌గా పేరు మార్చుకుని పోలీసులను ఏమార్చి 34 ఏళ్ల నుంచి హోంగార్డుగా ఉద్యోగం చేస్తున్నడని ఫిర్యాదుదారు ఆరోపించారు.
నక్డు మీద 1984లో హత్య కేసు నమోదైంది. ఆ తరువాత అనేక కేసుల్లో అతనిపై ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయి. 1988లో గ్యాంగ్‌స్టర్ యాక్ట్ కింద పోలీసులు నక్డు మీద మరో కేసు నమోదు చేశారు.
1988లో ఆజంగఢ్ జిల్లాలోని రాణికి సరాయ్ పోలీస్ స్టేషన్‌లో అతనిపై హిస్టరీ షీట్ తెరిచారు. అందులో అతని నెంబర్ 52ఏ. నాటి రికార్డులను పోలీసులు పరిశీలించారు.
ఈ వ్యవహరం వెలుగులోకి వచ్చిన తర్వాత నందలాల్‌పై గుర్తింపును దాచి మోసం చేశాడనే ఆరోపణల మీద ఐపీసీ 319(2), 318(4) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
నందలాల్‌కు ఉద్యోగం ఎలా వచ్చింది?
వ్యక్తిగత కక్షలతో నక్డు 1984లో ఓ వ్యక్తిని కాల్చి చంపాడని ఎస్పీ హేమరాజ్ మీనా తెలిపారు.
హత్య చేసిన తర్వాత నక్డు పేరు అనేక కేసుల్లో నిందితుడిగా పోలీసు రికార్డుల్లో నమోదైంది. ఇందులో దొంగతనం కేసు కూడా ఉంది.
1988-1989 నుంచి నిందితుడు పోలీసుల కళ్లు గప్పి పారిపోయాడు. తర్వాత నకిలీ పత్రాలతో హోంగార్డు ఉద్యోగం సంపాదించాడు.
నాలుగో తరగతి వరకు మాత్రమే చదివిన నందలాల్ హోంగార్డు ఉద్యోగంలో చేరేందుకు 8వ తరగతి పాసయ్యానని చెబుతూ అందుకు ఆధారంగా సర్టిఫికెట్లు సమర్పించాడు. అందులో అతని పేరు నందలాల్ సన్నాఫ్ లోకై యాదవ్ అని ఉంది.
నందలాల్‌ను ఉద్యోగంలో చేర్చుకునే సమయంలో అతని గురించి విచారించిన అధికారి ఎవరు? అతనికి క్యారెక్టర్ సర్టిఫికెట్ ఎలా జారీ చేశారనే దానిపై పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.
నందలాల్‌కు ప్రస్తుతం 57ఏళ్లు. త్వరలో అతను ఉద్యోగం నుంచి రిటైర్ కాబోతున్నాడు. అలాంటి సమయంలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
యూపీ పోలీసుల పనితీరుపై ఆరోపణలు
కొంతకాలంగా యూపీ పోలీసుల పని తీరుపై ఆరోపణలు వస్తున్నాయి. 2021లో రాష్ట్రవ్యాప్తంగా 29 మంది పోలీసుల మీద దోపిడి, తప్పుడు కేసుల్లో ఇరికించడం వంటి అభియోగాలతో కేసులు నమోదయ్యాయి.
2024లో యూపీ ప్రభుత్వం దోపిడీ వ్యవహారానికి సంబంధించి స్టేషన్ ఆఫీసర్‌తో పాటు 18 మంది పోలీసులను సస్పెండ్ చేసింది. వీరందరూ బల్లియాలో ఉద్యోగం చేసేవారు.
2020లో కాన్పూర్ సమీపంలోని బిక్రూలో గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ఎన్‌కౌంటర్‌లో డీఎస్పీతో పాటు 8 మంది ప్రాణాలు కోల్పోయారు. కొంతమంది పోలీసుల నిర్లక్ష్యం వల్లనే ఇలా జరిగిందని ఆరోపణలు వచ్చాయి.
గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబేకు వ్యక్తిగతంగా సాయం చేస్తున్నట్లు కొంతమంది పోలీసు అధికారులపై వచ్చిన ఆరోపణల మీద దర్యాప్తు జరిగింది. ఈ ఘటనకు సంబంధించి కాన్పూర్‌లోని చౌబేపూర్ పోలీస్ స్టేషన్‌లో కొంతమందిపై బదిలీ వేటు పడింది.
యూపీలో 2017 నుంచి యోగి ఆదిత్యనాధ్ దాస్ నాయకత్వంలో బీజేపీ పాలన మొదలైంది.
2017 మార్చ్ నుంచి 2024 సెప్టెంబర్ వరకు12,694 పోలీస్ ఎన్‌కౌంటర్లు జరిగాయని, ఇందులో 207 మంది చనిపోయారని ఉత్తర ప్రదేశ్ పోలీస్ విభాగం తెలిపింది.
ఈ సమయంలో 27,117 మంది నేరస్తులను పోలీసులు పట్టుకున్నారు. 6వేల మంది గాయపడ్డారు. అదే సమయంలో 1601 మంది పోలీసులకు గాయాలయ్యాయి. 17 మంది చనిపోయారు.
గత ఏడున్నరేళ్లలో ఎస్టీఎఫ్ 7వేల మంది నేరస్తుల్ని అరెస్ట్ చేసిందని, అందులో 49 మంది ఎన్‌కౌంటర్‌లో చనిపోయారని ఎస్టీఎఫ్ ఏడీజీ అమితాబ్ యష్ చెప్పారు.
ఈ నేరస్తుల మీద 10వేల రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయల రివార్డులు ఉన్నాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)