SOURCE :- BBC NEWS

పడిపోయిన అరటి తోట

ఫొటో సోర్స్, UGC

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎండలు తీవ్రంగా ఉండగా, మరికొన్నిచోట్ల మెరుపులు, ఉరుములు, పిడుగులతో వర్షాలు కురుస్తున్నాయి. ఈ అకాల వర్షాలతో ప్రాణ నష్టం, పంట నష్టం వాటిల్లింది.

తీవ్రమైన ఎండలు ఉండే సమయంలో వర్షాలు కురవడం అసాధారణం కానప్పటికీ ఈ ఏడాది ఎండాకాలంలో వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు బీబీసీతో చెప్పారు.

ఈ పరిస్థితి మరో రెండు, మూడు రోజులు కొనసాగుతుందన్నారు.

తెలంగాణలో నాలుగు రోజులుగా ఉదయం ఎండ, సాయంత్రం కాగానే ఈదురు గాలులతో వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

అసలు వాతావరణంలో ఇలాంటి మార్పులకు కారణాలేంటి? వేసవిలో ఏటా వర్షాలు కురవడం సాధారణమా? ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఎండాకాలం, వర్షాలు, పంటనష్టం, పిడుగులు

వాతావరణ మార్పులకు కారణాలేంటంటే…

మే నెల మొదలుకాగానే తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మరింత తీవ్రమవుతాయని అంచనాలు ఉన్న సమయంలో వాతావరణంలో ఒక్కసారిగా మార్పు కనిపించింది. ఏపీలో నాలుగు రోజులుగా పలు చోట్ల ఈదురుగాలులతో భారీ వర్షాలు కురిశాయి. వాతావరణంలో ఆకస్మిక మార్పులపై విశాఖ తుపాన్ హెచ్చరికల కేంద్రం డ్యూటీ ఆఫీసర్ శ్రీనివాస్ బీబీసీతో మాట్లాడారు.

ఆయన దీనికి ఆరు కారణాలు చెప్పారు.

1) ఉపరితల ద్రోణి, ఆవర్తనాలు: ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, బంగాళాఖాతం మీదుగా ఏర్పడే ఉపరితల ద్రోణులు, ఆవర్తనాలు తెలుగు రాష్ట్రాల వాతావరణంపై ప్రభావం చూపుతాయి. మే 1న ఝార్ఖండ్ మీదుగా ఏర్పడిన ఉపరితల ద్రోణి వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఈదురుగాలులతో భారీ వర్షాలు కురిశాయి.

2) అల్పపీడన ప్రభావం: బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలు రాష్ట్రాల్లో వర్షపాతాన్ని పెంచుతాయి. ఈ అల్పపీడనాలు తరచూ ఆకస్మిక వర్షాలు, పిడుగులు, ఈదురుగాలులకు కారణమవుతాయి

3) ఉష్ణోగ్రతల పెరుగుదల: తెలుగు రాష్ట్రాల్లో వేసవి కాలంలో సాధారణంగా ఉష్ణోగ్రతలు 42-45 డిగ్రీల సెల్సియస్‌కు చేరుతున్నాయి. ఈ అధిక ఉష్ణోగ్రతలు సాయంత్రం వేళల్లో ఆకస్మిక వర్షాలకు దారితీస్తున్నాయి.

4) స్థానిక వాతావరణ అస్థిరతలు: తెలుగు రాష్ట్రాల్లో స్థానిక వాతావరణ పరిస్థితుల కారణంగా అధిక తేమ, ఉష్ణోగ్రతల మధ్య వ్యత్యాసాలు ఏర్పడుతున్నాయి. సముద్రం నుంచి వచ్చే తేమ వాయువులు, వర్షాలు, ఈదురుగాలులను తీసుకొస్తాయి. ఇటీవల హైదరాబాద్‌లో సాయంత్రం వేళల్లో తేలికపాటి వర్షాలు పడడానికి ఇదే కారణం.

5) సముద్ర ఉష్ణోగ్రతల మార్పు: బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో తేమ స్థాయిలు పెరుగుతున్నాయి. దీనివల్ల ఆకస్మిక వర్షాలు కురుస్తాయి. అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. తుపానులు సంభవించవచ్చు

6) అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్: హైదరాబాద్, విశాఖపట్టణం, విజయవాడ వంటి నగరాల్లో పట్టణీకరణ వల్ల “హీట్ ఐలాండ్ ఎఫెక్ట్” ఏర్పడుతుంది. భవనాలు, రోడ్లు, కాంక్రీట్ నిర్మాణాలు ఉష్ణాన్ని గ్రహించి, స్థానిక ఉష్ణోగ్రతలను పెంచుతాయి, ఇది సాయంత్రం వేళల్లో ఆకస్మిక వర్షాలకు దారితీస్తుంది.

ఎండాకాలం, వర్షాలు, పంటనష్టం, పిడుగులు

ఫొటో సోర్స్, UGC

అకాల వర్షాలతో 8 మంది మృతి, భారీగా పంటనష్టం

ఏపీలో వర్షాలు కురుస్తుండటంతో పాటు పలు చోట్ల పిడుగులు పడుతున్నాయి. తిరుపతి జిల్లాలో ముగ్గురు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా జిల్లాల్లో ఒకరు చనిపోయారు. ఏలూరు జిల్లాలో పిడుగుపాటుకు ఒకరు, చెట్టు కూలి మరొకరు చనిపోయారు. ఇలా మొత్తం వర్షాలు, పిడుగుపాట్లకు 8 మంది మరణించారని విపత్తుల కేంద్రం లెక్కలు చెబుతున్నాయి.

పలు చోట్ల పంట నష్టం కూడా ఎక్కువగానే జరిగింది. వర్షాలకు ధాన్యం తడిసిపోగా, మామిడి, బొప్పాయి, అరటి పంటలు దెబ్బతిన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే మామిడి పంట చేతికి వస్తుందని అంచనా వేసినా…అది ఆలస్యమైంది. ఇప్పుడు పంట అందివస్తున్న తరుణంలో వర్షాలకు పంట నష్టం జరిగింది. నూజివీడులోనే ఏకంగా 100 ఎకరాలకు పైగా మామిడి పంటకు నష్టం జరిగింది..

చిత్తూరు జిల్లాలో అకాల వర్షాలు, ఈదురు గాలులతో మామిడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. చిత్తూరుతోపాటు పలమనేరు, బంగారుపాళ్యం, యాదమరి మండలాల్లో అకాల వర్షాలు మామిడి రైతులకు నష్టం మిగిల్చాయి.

ఇక తెలంగాణాలో భూపాలపల్లి జిల్లాలోని రెండు రోజుల క్రితం కురిసిన వర్షాలకు వరి, మొక్కజొన్న పంటలు నేలకూలగా… కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం తడిసి ముద్దయింది. జిల్లా వ్యాప్తంగా 5 వేల టన్నుల ధాన్యం తడిసిపోయినట్టు అధికారులు తెలిపారు.

మహబూబాబాద్‌, వరంగల్‌, వనపర్తి, మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలోని పంటలు దెబ్బతిన్నాయి. గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. రాష్ట్రంలో 25వేల ఎకరాల్లో పంటనష్టం జరిగినట్టు ప్రాధమికంగా అంచనా వేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరావు తెలిపారు.

ఎండాకాలం, వర్షాలు, పంటనష్టం, పిడుగులు

ఫొటో సోర్స్, UGC

ఎండాకాలంలో చల్లటి వాతావరణం

శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు నమోదయ్యాయి.

మే 4 (ఆదివారం) కాకినాడ జిల్లాలో భారీ వర్షం పడింది. కాజులూరులో 100.5 మి.మీ. చొల్లంగిపేటలో 94.5 మి.మీ. కరపలో 75.5 మి.మీ. కాకినాడలో 66.7 మి.మీల వర్షం కురిసింది. ప్రకాశం, కృష్ణా, బాపట్ల, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.

వాతావరణం చల్లగా మారడంతో పాటు పిడుగులతో కూడిన వర్షాలు ఒకవైపు కురుస్తుంటే…అదే సమయంలో కొన్ని చోట్ల మాత్రం ఎండ తీవ్రత ఎక్కువగానే కనిపించింది.

ఎండాకాలం, వర్షాలు, పంటనష్టం, పిడుగులు

ఫొటో సోర్స్, UGC

తెలంగాణలో సాయంత్రం వానలు

మే నెల ప్రారంభం నుంచి తెలంగాణాలో వాతావరణ పరిస్థితులు కూడా సాధారణంగా కంటే భిన్నంగా ఉంటున్నాయి.

ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్‌ల మీదుగా ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణ ఈ వాతావరణ మార్పు వచ్చినట్టు ఐఎండీ తెలిపింది. ఈ నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. ఖమ్మం, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. అదే సమయంలో ఉదయం వేళల్లో ఎండలు తీవ్రంగా ఉంటూ… 42 డిగ్రీల ఉష్ణోగ్రతల వరకు నమోదయ్యాయి.

మధ్యాహ్నం తర్వాత నుంచి వాతావరణం క్రమంగా చల్లబడుతూ…సాయంత్రం వేళల్లో వర్షాలు కురిశాయి. ప్రస్తుతం అదే పరిస్థితి కొనసాగుతున్నట్టు ఐఎండీ అధికారులు తెలిపారు. ఈ వాతావరణ మార్పు హైదరాబాద్‌లో స్పష్టంగా కనిపించిందని…కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీలు, గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైందని చెప్పారు.

తెలంగాణాలో భారీ వర్షాలు, గాలుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో కొత్తగా నిర్మించిన చర్లపల్లి రైల్వే స్టేషన్ పైకప్పులోని కొంత భాగం , సిద్ధిపేటలోని ఒక టోల్ గేట్ పై కప్పులు ఎరిగిపోయాయి.

ఎండాకాలం, వర్షాలు, పంటనష్టం, పిడుగులు

వచ్చే రెండు, మూడు రోజుల పాటు….

రానున్న రెండు, మూడు రోజుల పాటు వాతావరణం ఎలా ఉంటుందో విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు బీబీసీకి తెలిపారు.

”రానున్న రోజుల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్లూరి సీతారామరాజు, విజయనగరం, అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే మూడు రోజులు కొన్నిచోట్ల ఎండలు పెరుగుతాయి. మరికొన్నిచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడొచ్చు.” అని విశాఖ తుపాన్ హెచ్చరికల కేంద్రం డ్యూటీ ఆఫీసర్ శ్రీనివాస్ చెప్పారు.

ఏపీలో పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్టులు జారీ చేశారు.

వాతావరణంలో సంభవించిన ఈ ఆకస్మిక మార్పులు మరో రెండు, మూడు రోజులు కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)