SOURCE :- BBC NEWS

కొత్త పే కమిషన్

ఫొటో సోర్స్, Getty Images

44 నిమిషాలు క్రితం

దాదాపు 1.15 కోట్ల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూర్చే ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలిపింది.

2026 నాటికి ఈ సంఘం తన నివేదికను సమర్పించనుంది. దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు రెండు వారాలు మాత్రమే సమయం ఉంది. ఇదే సమయంలో 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఈ కమిషన్ సిఫార్సులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సాయుధ దళాల ఉద్యోగులకు కూడా వర్తిస్తాయి.

వార్తాసంస్థ పీటీఐ కథనం ప్రకారం.. కొత్త వేతన సంఘం సిఫార్సుల మేరకు దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, 65 లక్షల మంది పెన్షనర్ల పెన్షన్లు గణనీయంగా పెరుగుతాయని భావిస్తున్నారు.

ఈ నిర్ణయం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. “ప్రభుత్వ ఉద్యోగులు దేశ అభివృద్ధి కోసం పని చేస్తారు. వేతనాలు, పెన్షన్లను పెంచడం వలన వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి, దేశంలో వస్తు వినియోగం కూడా పెరుగుతుంది” అని అన్నారు.

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఏడవ వేతన సంఘం ప్రకారం జీతాలు, పెన్షన్లు పొందుతున్నారు. దీని సిఫార్సులు 2016 జనవరి 1 నుంచి అమలులోకి వచ్చాయి. ఏడవ వేతన సంఘం కాలపరిమితి 2026లో ముగుస్తుంది.

ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్

ఫొటో సోర్స్, Getty Images

కేంద్ర ఉద్యోగుల జీతం ఎంత పెరుగుతుంది?

వేతన సంఘం ప్యానెల్‌ను నియమించనున్నారు. వచ్చే 11 నెలల్లో ఆ కమిషన్ తన సిఫార్సులను ప్రభుత్వానికి సమర్పించనుంది. ఇది ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను సిఫారసు చేస్తుంది. దీని ఆధారంగా వేతనాలు, పెన్షన్లలో పెరుగుదల లేదా సవరణ ఉంటుంది.

ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అంటే ఏంటి?

సవరించిన మూల వేతనం(బేసిక్ పే), పెన్షన్‌ను లెక్కించడానికి ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనే గుణకం ఉపయోగిస్తారు. ప్రస్తుతం బేసిక్ పెన్షన్ రూ.30,000 కాగా.. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.5గా నిర్ణయిస్తే, సవరించిన బేసిక్ పెన్షన్ రెండున్నర రెట్లు పెరిగి రూ.75,000కి చేరుతుంది. ఏడో వేతన సంఘం సమయంలో కార్మిక సంఘాలు జీతాలకు 3.68 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను డిమాండ్ చేయగా, ప్రభుత్వం 2.57గా నిర్ణయించింది.

ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్‌ కథనం ప్రకారం.. అప్పుడు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57గా నిర్ణయించడంతో కేంద్ర ఉద్యోగుల కనీస బేసిక్ పే రూ.7,000 నుంచి రూ.18,000కి పెరిగింది. కనీస పెన్షన్ రూ.3,500 నుంచి రూ.9,000కి పెరిగింది. సర్వీసులో ఉన్న ఉద్యోగుల గరిష్ఠ వేతనం నెలకు రూ.2.50 లక్షలుగా, గరిష్ఠ పెన్షన్ నెలకు రూ.1.25 లక్షలుగా నిర్ణయించారు.

8వ వేతన సంఘం ద్వారా కనీసం 2.86 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను ఆశిస్తున్నట్లు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ కొంతకాలం కిందట చెప్పింది. అదే జరిగితే ప్రభుత్వోద్యోగుల కనీస బేసిక్ వేతనం రూ.51,480కి పెరగనుండగా, కనీస పెన్షన్ రూ.9,000 నుంచి రూ.25,740కి పెరగనుంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
పింఛను సదుపాయం

ఫొటో సోర్స్, Getty Images

పెన్షనర్లకు ప్రయోజనం ఎంత?

8వ వేతన సంఘం కేంద్ర ప్రభుత్వం పరిధిలోని పెన్షనర్లకు ఎంతో మేలు చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. టీమ్‌లీజ్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణేందు ఛటర్జీ ఎకనామిక్ టైమ్స్‌తో మాట్లాడుతూ.. “వేతనం పెరుగుదలకు అనుగుణంగా పెన్షన్ కూడా పెరుగుతుంది. అది 2.5 నుంచి 2.8 రెట్లు ఉంటుంది. ప్రస్తుత కనీస పెన్షన్ రూ. 9,000గా ఉంది. అది 22,500 నుంచి 25,200 వరకు పెరగవచ్చు” అని అన్నారు.

జీతం, పెన్షన్ పెంపుపై ఇది కేవలం అంచనా మాత్రమే. కానీ ఇప్పటి వరకు సగటున చూస్తే పెన్షన్ పెంపు 20 నుంచి 30 శాతం మధ్య ఉండే అవకాశం ఉందని అంటున్నారు.

ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు నిర్ణయం పట్ల ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)