SOURCE :- BBC NEWS

Hyderabad, Murder, హత్య, క్రూర ప్రవర్తన, పోలీసులు, ఇన్‌స్టా‌గ్రామ్

హెచ్చరిక : ఈ కథనంలో కలచివేసే అంశాలు ఉన్నాయి.

ఏడునెలల గర్భిణి అయిన భార్యను భర్త దారుణంగా చంపేశాడు. దిండుతో మొహాన్ని అదిమిపెట్టి, ఆమె పొట్టపై కూర్చోవడంతో గర్భస్రావమై తల్లీబిడ్డా ఇద్దరూ చనిపోయారని పోలీసులు చెప్పారు.

హైదరాబాద్‌లో ఈ దారుణం జరిగింది. నిండుచూలాలైన భార్యపై అనుమానంతో భర్త చేసిన ఈ పని దిగజారిపోతున్న మానవ సంబంధాలను వేలెత్తి చూపుతోంది. కుటుంబ వ్యవస్థ క్షీణించడం, అనుమానాలు, ఆర్థిక తగాదాలే ఇలాంటి నేరాలకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయని మానసిక నిపుణులు చెబుతున్నారు .

Hyderabad, Murder, హత్య, క్రూర ప్రవర్తన, పోలీసులు, ఇన్‌స్టా‌గ్రామ్

ఫొటో సోర్స్, KushaigudaPolice

అసలేం జరిగిందంటే…

హైదరాబాద్ కుషాయిగూడలోని నాగార్జున నగర్‌లో ఓ ఇంటి నుంచి జనవరి 18న తీవ్ర దుర్వాసన వస్తోందని పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే కుషాయిగూడ పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. లోపలకు వెళ్లి చూసిన పోలీసులు ఓ గర్బిణి హత్యకు గురైనట్టుగా గుర్తించారు. దీంతో కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలి పేరు స్నేహ. ఆమె భర్త పేరు సచిన్ సత్యనారాయణ అని పోలీసులు చెప్పారు.

ఈ కేసులో సచిన్ సత్యనారాయణపై అనుమానం వచ్చి, అతనిని అదుపులోకి తీసుకున్నట్టు కుషాయిగూడ ఇన్‌స్పెక్టర్ అంజయ్య బీబీసీతో చెప్పారు. నిందితుడి వాంగ్మూలం, దర్యాప్తులో తేలిన అంశాల ఆధారంగా స్నేహను భర్త సత్యనారాయణే చంపినట్టుగా గుర్తించామని తెలిపారు.

బీబీసీ న్యూస్ తెలుగు
Hyderabad, Murder, హత్య, క్రూర ప్రవర్తన, పోలీసులు, ఇన్‌స్టా‌గ్రామ్

ఫొటో సోర్స్, Getty Images

ఇన్‌స్టాలో పరిచయం, పెళ్లి..

స్నేహ,సత్యనారాయణకు ఇన్‌స్టాలో పరిచయం ఏర్పడి, ఆ పరిచయం ప్రేమగా మారి, పెళ్లికి దారితీసిందని ఇన్‌స్పెక్టర్ అంజయ్య బీబీసీకి వివరించారు.

హైదరాబాద్ కాప్రాలోని గాంధీనగర్‌కు చెందిన ఠాగూర్ స్నేహ(21)కు కాచిగూడకు చెందిన అతిపాముల సచిన్ సత్యనారాయణతో 2021లో ఇన్‌స్టా‌గ్రామ్‌లో పరిచయం ఏర్పడింది.

2022లో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లికి అమ్మాయివైపు వాళ్లు ఒప్పుకోగా.. అబ్బాయి వైపువాళ్లు అంగీకరించలేదని పోలీసులు చెప్పారు. పెళ్లయిన కొత్తలో సచిన్ ఒక ప్రైవేటు కంపెనీలో డెలివరీ బాయ్ గా పనిచేసేవాడు. తర్వాత ఆ ఉద్యోగాన్ని వదిలేశాడు. 2023లో సచిన్, స్నేహ దంపతులకు పిల్లాడు జన్మించాడు.

”సచిన్ ఉద్యోగం లేకపోగా పనిలేకుండా తిరిగేవాడు.డబ్బుల కోసం పిల్లవాడిని అమ్మకానికి పెట్టాడు. దీనిపై స్నేహ ఫిర్యాదు మేరకు కుషాయిగూడ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది” అని చెప్పారు ఇన్‌స్పెక్టర్ అంజయ్య.

పిల్లవాడిని అమ్మకుండా పోలీసులు అడ్డుకుని, తల్లికి అప్పగించారు. తర్వాత ఆ పిల్లవాడు అనారోగ్యం కారణంగా చనిపోయినట్లుగా పోలీసులు చెబుతున్నారు.

ఈ విషయమై సచిన్, స్నేహ మధ్య గొడవలు జరిగి దూరంగా ఉన్నారు. అయినా స్నేహ అప్పుడప్పుడు సచిన్‌ను కలుసుకునేదని పోలీసులు చెప్పారు. ఈ నేపథ్యంలో కిందటేడాది డిసెంబరు నుంచి సచిన్, స్నేహ నాగార్జుననగర్‌లో గది అద్దెకు తీసుకుని నివసిస్తున్నారని పోలీసులు వివరించారు.

Hyderabad, Murder, హత్య, క్రూర ప్రవర్తన, పోలీసులు, ఇన్‌స్టా‌గ్రామ్

ఫొటో సోర్స్, Getty Images

భార్యపై అనుమానం

స్నేహ ప్రస్తుతం ఏడు నెలల గర్భిణి. తాము దూరంగా ఉంటున్నప్పటికీ భార్యకు గర్భం వచ్చిందనే అనుమానంతో ఆమెను చంపాలని సచిన్ నిర్ణయించుకున్నాడని పోలీసులు చెప్పారు.

”జనవరి 16వ తేదీ తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో స్నేహ నిద్రిస్తుండగా మొహంపై దిండుతో గట్టిగా అదిమాడు. ఆమె కడుపుపై కూర్చుని గొంతు పిసికి చంపేందుకు ప్రయత్నించాడు.” అని ఇన్‌స్పెక్టర్ అంజయ్య బీబీసీకి వివరించారు. సత్యనారాయణ స్నేహ పొట్టపై కూర్చోవడంవల్ల ఆమెకు గర్భస్రావమైంది. తీవ్ర రక్తస్రావమై బయటకు వచ్చిన పిండంతోపాటు, స్నేహ కూడా చనిపోయిందని పోలీసులు తెలిపారు. ఈ హత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు సచిన్ ప్రయత్నించినట్టు పోలీసులు గుర్తించారు.

”వంటగదిలోని గ్యాస్ సిలిండర్ తీసుకువచ్చి ఓపెన్‌చేసి, మంట పెట్టి పారిపోయాడు. గ్యాస్ సిలిండర్ పేలినట్లుగా చూపించాలని ప్రయత్నించాడు. కానీ, గ్యాస్ అయిపోవడంతో అతని పథకం పారలేదు.” అని చెప్పారు పోలీసులు.

నిందితుడు సచిన్ సత్యనారాయణ కాచిగూడలో ఉన్నట్లుగా గుర్తించిన పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని విచారించగా, హత్య విషయం వెలుగులోకి వచ్చింది. అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Hyderabad, Murder, హత్య, క్రూర ప్రవర్తన, పోలీసులు, ఇన్‌స్టా‌గ్రామ్

మనుషుల్లో ఎందుకీ స్వభావం?

ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య.. పైగా ఏడు నెలలచూలాలు.. ఆమెను భర్తే కర్కశకంగా చంపడంతో, మనుషుల ప్రవర్తన మారుతోందా అనే చర్చ సాగుతోంది.

అనుమానంతో భార్యను భర్త చంపడం, భర్తను భార్య చంపడం వంటి ఘటనలు ఈ మధ్యకాలంలో చూస్తున్నామని చెప్పారు ఉస్మానియా వర్సిటీ సైకాలజీ ప్రొఫెసర్ స్వాతి.

”అనుమానం ఉంటే వాటిని నివృత్తి చేసుకోవాలి. అందుకు ఎన్నో పద్ధతులున్నాయి. అంతేకానీ, చంపేంతగా ప్రవర్తన ఉండకూడదు.” అని అన్నారామె.

సొంతవాళ్లనే అతికిరాతకంగా చంపేంత కసి, స్వభావానికి వేర్వేరు కారణాలుంటాయంటారు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ సైకాలజీ ప్రొఫెసర్ మీనా హరిహరన్.

”ముఖ్యంగా కుటుంబ వ్యవస్థ, బంధాలు రోజురోజుకూ క్షీణిస్తున్నాయి. గతంలో ఉమ్మడి కుటుంబాలుండేవి. దానివల్ల ఏవైనా ఒడుదొడుకులు వచ్చినా, కుటుంబం అనే చెట్టు గట్టిగా ఉండేది కనుక బంధాలను నిలబెట్టేది. ఇప్పుడు పాశ్చాత్య సంస్కృతి ప్రభావం వల్ల ఉమ్మడి కుటుంబ వ్యవస్థ లేకపోవడంతో ఏదైనా సమస్య తలెత్తితే, పరిష్కరించుకునే తత్వం తగ్గిపోయింది. దానివల్ల గొడవలు ముదురుతున్నాయి.” అని చెప్పారు.

నేరం చేసేందుకు దగ్గర వ్యక్తా లేదా దూరపు వ్యక్తా అనే విషయాలతో సంబంధం లేదన్నారు ప్రొఫెసర్ స్వాతి.

”మనిషి ప్రవర్తనను ముందే గుర్తించాలి.అనుమానించడం, వేధించడం వంటివి జరుగుతుంటే వెంటనే కుటుంబ సభ్యులకు తెలియజేయాలి.ఈ తరహా నేరాలనేవి అప్పటికప్పుడు వచ్చే ఆలోచన కాదు, ముందు నుంచి మనస్తత్వం మారుతూ వస్తుంది.” అని చెప్పారు.

Hyderabad, Murder, హత్య, క్రూర ప్రవర్తన, పోలీసులు, ఇన్‌స్టా‌గ్రామ్

ముందుగానే గుర్తించాలి..

నేరం చేస్తే వెంటనే కఠిన శిక్ష పడుతుందని సమాజంలో భయం రావాల్సిన అవసరం ఉందని మీనా హరిహరన్ చెప్పారు.

”ఆర్థిక సమస్యలతో గొడవలు ఉండవచ్చు. కానీ, మనకు వచ్చే సంపాదనలో దేనికెంత ఖర్చు చేయాలనే ప్రణాళిక ఉండాలి. మన అవసరాలు తెలియకుండా ఖర్చు చేస్తే కచ్చితంగా ఆర్థిక ఇబ్బందులు తప్పవని గుర్తించాలి.” అని చెప్పారు.

నేరం చేసేందుకు ప్రయత్నించే వ్యక్తిని కొన్ని లక్షణాలతో గుర్తించవచ్చని ప్రొఫెసర్ స్వాతి చెప్పారు.

”రోజూ వారీగా మనకు కనిపించే వ్యక్తిత్వంలో మార్పు రావడం, చిన్న విషయాలకే కోప్పడటం, వేధింపులు, బెదిరింపులు.. ఇలా రకరకాలుగా తెలుస్తుంటాయి.చాలా సందర్భాల్లో తెలిసిన వ్యక్తే కదా ఏం చేయరులే అని వదిలేస్తుంటారు. అది చివరికి తీవ్ర నేరాలకు దారితీస్తుంటుంది.” అని వివరించారామె.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)