SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, HANDOUT
ఏడు వేలకు పైగా పాములను పట్టిన కోయంబత్తూరుకు చెందిన సంతోష్ పాము కాటుతో చనిపోయారు.
పాములను పట్టడంపై పూర్తి అవగాహన లేకపోవడం, అక్కడి పరిస్థితులను అర్ధం చేసుకోకపోవడమే ఇలాంటి మరణాలకు కారణమని పరిశోధకులు అంటున్నారు.
కోయంబత్తూరు సమీపంలోని తొండముత్తూరులోని ఒక ఇంట్లో మార్చి 17న పాము పట్టేందుకు వెళ్లిన 39 ఏళ్ల సంతోష్‌ను నాగుపాము కాటేసింది.
ఆ తర్వాత, కోయంబత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మార్చి 19 రాత్రి ఆయన మరణించారు.

చికిత్స పొందుతున్న సమయంలో గుండెపోటుకి గురై సంతోష్ మరణించారని వైద్యులు తెలిపారు.
తమిళనాడు అటవీ శాఖ చీఫ్ శ్రీనివాస్ రెడ్డి బీబీసీ తమిళ్‌తో మాట్లాడుతూ.. పాములను పట్టుకునే వారికి సరైన శిక్షణ, వారికి అవసరమైన పరికరాలను అందించడం వంటి శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

ఫొటో సోర్స్, HANDOUT
సంతోష్ మరణం తరహాలోనే, నిరుడు ఆగస్టులో కోయంబత్తూరులో మురళీధరన్ మరణించారు. మూడేళ్ల కిందట నిర్మల్ అనే వ్యక్తి పామును పట్టుకునే ప్రయత్నంలో చనిపోయారు.
కడలూరు జిల్లాలోని నెల్లికుప్పం నివాసి ఉమర్ అలీ గత ఏడాది ఏప్రిల్‌లో పట్టుకున్న పాములను అడవిలో వదులుతూ కాటుకు గురయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమలలో స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు కూడా పాముకాటుకి గురై, దాదాపు చావు అంచులవరకూ వెళ్లొచ్చారు. ఈయన ఇప్పటివరకు వేల పాములను పట్టుకున్నారు.
కోయంబత్తూరులో పాముకాటుతో మరణించిన సంతోష్ స్నేహితుడు, వన్యప్రాణుల సంరక్షణ కోసం పనిచేసే రాజన్ బీబీసీతో మాట్లాడుతూ, ”గత 20 ఏళ్లలో సంతోష్ 7000 పాములను పట్టుకుని అటవీప్రాంతంలో వదిలారు” అని చెప్పారు.
కానీ, సంతోష్ మరణం ఆయన కుటుంబాన్ని పేదరికంలోకి నెట్టింది. ఆయన ఇద్దరు కుమార్తెలలో ఒకరు వికలాంగురాలు.
”తమిళనాడు ప్రభుత్వం ఆయన కుటుంబానికి ఏదో విధంగా సాయం చేయాలి” అని రాజన్ కోరారు.

ఫొటో సోర్స్, Getty Images
పాములు పట్టడంలో గిరిజనులకు, ఇతరుల మధ్య తేడా ఏంటి?
కృష్ణగిరి కేంద్రంగా పనిచేస్తున్న గ్లోబల్ స్నేక్‌బైట్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు, ప్రధాన శాస్త్రవేత్త మనోజ్ పాముకాట్లపై పరిశోధనలో డాక్టరేట్ పొందారు. ప్రస్తుతం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్ (ఐసీఎంఆర్)తో కలిసి ఆయన పనిచేస్తున్నారు.
ఆయన మాట్లాడుతూ, ఆస్ట్రేలియాలో ప్రపంచంలోనే అత్యధిక పాముకాటు కేసులు నమోదవుతున్నప్పటికీ మరణాల సంఖ్య మాత్రం భారత్ కంటే చాలా తక్కువగా ఉందని అన్నారు.
ఆస్ట్రేలియాలో పాములను పట్టుకునే పద్ధతులు, పాము విషానికి మెరుగైన విరుగుడు మందులు ఉండడం వల్లే ఇది సాధ్యమవుతోందని ఆయన చెప్పారు.
సంప్రదాయంగా పాములు పట్టే తెగలకు, ఇతరులకు పాములు పట్టే విధానంలో చాలా తేడాలున్నాయని మనోజ్ అన్నారు.
చెంగల్పట్టు జిల్లాలోని ఇరులర్ తెగకు చెందిన మాసి సదయాన్, వడివేల్ వంటి వారిని అక్కడి ప్రభుత్వాల ఆహ్వానం మేరకు పాములు పట్టడానికి అమెరికా, థాయిలాండ్ వంటి దేశాలకు తీసుకెళ్లారు.
స్నేక్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలిచే రొములస్ విటాకర్, ‘తాను పాములు పట్టడంలో నేర్పరి’ని అన్నారు.
పాములు పట్టే ఇరులర్ సహకార సంఘం చెంగల్పట్లు జిల్లాలోని నెమ్మెళి కేంద్రంగా పనిచేస్తోంది. ఈ సంఘంలో 350 మందికి పైగా సభ్యులు ఉన్నారు.
వారు పాములను పట్టుకోవడం, వాటి నుంచి విషాన్ని సేకరించిన తర్వాత పాత పెరుంగళత్తూర్, కొత్త పెరుంగళత్తూర్, సెన్నేరి, మాంబక్కం, కాయార్, వెంబెదు వంటి అటవీ ప్రాంతాల్లో తిరిగి వదిలిపెడుతుంటారు.

ఫొటో సోర్స్, Dr.Manoj
పాముల ఫోటోలు తీయడం ఎందుకంత ముఖ్యం?
పాములు పట్టే ఇతర వ్యక్తులు ఈ తెగల మాదిరిగా అవగాహనతో వ్యవహరించడం, అక్కడి పరిస్థితులను అర్థం చేసుకోవడం, పాముకాటు వేసినప్పుడు ఏం చేయాలి వంటి విషయాలను తెలుసుకోవడం ద్వారా మరణాలను నివారించవచ్చని హెర్పటాలజిస్ట్, ఇండియన్ సెంటర్ ఫర్ రెప్టైల్ రీసర్చ్ ఎడ్యుకేషన్ అండ్ కన్జర్వేషన్ వ్యవస్థాపకులు రామేశ్వరన్ మరియప్పన్ అంటున్నారు.
పాములు పట్టుకున్నప్పుడు ఎక్కువ మంది గుమిగూడి ఫోటోలు, వీడియోలు తీయడానికి ఉత్సాహం చూపుతుంటారని, అది ఆ పాముల్లో భయానికి, కోపానికి కారణమవుతుందని, ఫలితంగా పాములు పట్టుకునేవారికి అది ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందని ఆయన అన్నారు.
రామేశ్వరన్ బీబీసీతో మాట్లాడుతూ, ”పాములను పట్టుకునే వారు పాములను రక్షించడానికి వచ్చామనే విషయంతో పాటు తమ ప్రాణాలు కూడా ముఖ్యమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి” అన్నారు.
”చిన్న పామైనా, పెద్దదైనా కాటేసిన వెంటనే ఆలస్యం చేయకుండా ఆస్పత్రికి వెళ్లాలి” అన్నారాయన.
”పాములు పట్టేవారు అనడం తప్పు. వారిని పాముల సంరక్షకులు, పాములను రక్షించేవారు అని సంబోధించాలి” అని ఆయన చెప్పారు.
పాములు పట్టేవారు అనే పదం.. పాముల గురించి కనీస అవగాహ లేనివారిని, పాములు పట్టుకోవడంలో కనీస అనుభవం లేనివారిని కూడా పాములు పట్టుకునేలా ప్రేరేపిస్తుందన్నారు రామేశ్వరన్.

ఫొటో సోర్స్, Rameswaran Mariappan
పాముకాటుకు గురైతే, అది ఏ రకమైన పామో తెలుసుకోవడానికి వెంటనే దానిని ఫోటో తీయాలని శాస్త్రవేత్త మనోజ్ సలహా ఇస్తున్నారు.
సాధారణ పింజరి రకం పాములు(రేటిల్ స్నేక్స్) మినహా ఇతర పాములు కాటువేసినప్పుడు, ఆ ప్రదేశంలో నొప్పి, వాపు, రంగుమారడం వంటి లక్షణాలు కనిపిస్తాయన్నారు.
పాముకాటుకి గురైనప్పుడు ఎలాంటి భయానికి, ఆందోళనకు గురికాకుండా వెంటనే ఆస్పత్రికి వెళ్లాలన్నారు.
ఒకవేళ ఆ వ్యక్తి భయాందోళనకు గురైతే విషం రక్తం ద్వారా వేగంగా వ్యాపిస్తుందని ఆయన చెప్పారు.
పాము పట్టుకోవడానికి వచ్చారని తెలియడంతో వెంటనే అక్కడ జనం గుమిగూడతారని, జనం అలికిడికి ఆ పాము భయంతో, కోపంతో ఉండే అవకాశం ఉంటుందని, కాబట్టి దానిని పట్టుకునే సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని రామేశ్వరన్ సూచిస్తున్నారు.
”కోయంబత్తూర్ వంటి పశ్చిమ కనుమల దిగువ ప్రాంతాల్లో కింగ్ కోబ్రాలు పెద్దసంఖ్యలో కనిపిస్తాయి. అవి కాటువేస్తే బతకడం చాలా కష్టం. ఎవరైనా కోబ్రా కాటుకి గురైతే, గంటలోపు సరైన చికిత్స అందితేనే బతికే అవకాశం ఉంటుంది” అని సైంటిస్ట్ మనోజ్ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)