SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, SRI CITY
క్యాడ్బరీ, డైరీ మిల్క్, ఫైవ్ స్టార్…ఈ చాక్లెట్ల గురించి తెలియని వారు దాదాపు ఉండరు. ఇలాంటి ఖరీదైన చాక్లెట్ల తయారీలో ప్రధానంగా వాడే కోకో గింజలు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వెళ్తుంటాయి.
భారత్‌లో కోకో పంటను ఎక్కువ విస్తీర్ణంలో పండించేది.. కోకో ఉత్పత్తులను ఎగుమతి చేసేది ప్రధానంగా గోదావరి జిల్లాలేనని ట్రేడర్లు చెప్తున్నారు.
అంతర్జాతీయ కంపెనీలతో పాటు దేశీయ చాక్లెట్ కంపెనీలకు కోకో ఉత్పత్తులను ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, పార్వతీపురం మన్యం జిల్లాల రైతులు అందిస్తుంటారు.
అయితే, అంతర్జాతీయంగా ధరలు ఎక్కువగా ఉన్నా, తమ దగ్గర మాత్రం తక్కువకే కొనుగోలు చేస్తున్నారని, సరైన రేటు ఇవ్వడం లేదని ఆంధ్రప్రదేశ్‌లోని కోకో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, ఎక్కువమంది వ్యాపారులను ఇందులో ఇన్వాల్వ్ చేసి పోటీ పెంచడానికి ప్రయత్నిస్తామని ఏపీ ఉద్యానవన శాఖ చెబుతోంది.


అసలేమిటీ కోకో సాగు..
ఏపీలోని కోస్తా జిల్లాల్లో కొబ్బరి, ఆయిల్‌పామ్ వంటి ఉద్యాన పంటల్లో అంతర పంటగా సాగు చేసేందుకు కోకోను అనువైనదిగా గుర్తించారు.
ఈ పంటకు ఆకురాల్చే గుణం ఎక్కువ. దీంతో భూమిలో సేంద్రీయ పదార్థం పెరగడం వల్ల ప్రధాన పంటల ఉత్పాదకత పెరుగుతుంది. కలుపు సమస్య తగ్గుతుంది.
చీడపీడల ఉధృతి తక్కువగా ఉండే ఈ పంటను ప్రధాన పంటకు తోడుగా సాగు చేస్తుంటారని ఏపీ ఉద్యానవనశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్. రంగాచార్యులు బీబీసీకి తెలిపారు.
కోకో ఉత్పత్తిలో ఇండోనేషియా, నైజీరియా, కామెరూన్, ఐవరీ కోస్ట్, ఘనా, బ్రెజిల్ దేశాలు అగ్రస్థానంలో ఉన్నాయి. నీటి వనరులు పుష్కలంగా ఉన్న ప్రాంతాల్లో ఈ పంట సాగవుతుంది.
”భారత్‌లో తొలుత కేరళలో ఈ పంట సాగు చేయడం మొదలుపెట్టారు. 1992లో ఆంధ్రప్రదేశ్‌లోని అప్పటి తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో కొబ్బరి అంతర పంటగా దీన్ని వేయడం ప్రారంభించారు. ఇది లాభసాటి అని రైతులు గుర్తించడంతో మిగిలిన జిల్లాలో సాగు చేస్తూ వస్తున్నారు” అని పాతికేళ్లకి పైగా కోకో సాగు చేస్తున్న డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పోతాయలంక గ్రామానికి చెందిన ముత్యాల వెంకటస్వామి నాయుడు, ఏలూరు జిల్లా గంగన్నగూడెంకి చెందిన రైతు గణేశ్ బీబీసీకి తెలిపారు.

కోకో పంటను ఏయే కంపెనీలు తీసుకుంటాయంటే..
ఏపీలో పండించిన కోకోను ప్రధానంగా మొదట క్యాడ్బరీస్ సంస్థ కొనుగోలు చేస్తూ వచ్చింది. పదిహేనేళ్ల కిందట క్యాడ్బరీస్ను అమెరికాకు చెందిన క్రాఫ్ట్ ఫుడ్స్ సంస్థ కొనుగోలు చేసింది. ఆ తర్వాత 2012లో ఈ సంస్థకి చెందిన కోకో విభాగం మొత్తం..మాండలెజ్ ఇంటర్నేషనల్‌గా రూపాంతరం చెందింది.
ఏపీలోని శ్రీసిటీలో 2016 ఏప్రిల్ 25న ఈ సంస్థను నెలకొల్పారు. అప్పటి నుంచి ఆ సంస్థ సిబ్బందే నేరుగా రైతుల నుంచి కోకో పంటను కొనుగోళ్లు చేస్తున్నారు. ఏపీలో అధిక శాతం కోకో ఉత్పత్తులు ఈ మాండలెజ్ సంస్థకే వెళ్తుంటాయి.
రాష్ట్రంలో కోకో రైతుల నుంచి నేరుగా పంటను కొనుగోళ్లు చేయడంతో పాటు సాగు పెంపుకోసం రైతులకు సహకరిస్తుంటామని ఆ సంస్థ ప్రతినిధి రవికుమార్ బీబీసీకి తెలిపారు.
మొక్కలను పంపిణీ చేయడం, సాగు పెంపుకు అవసరమయ్యే టెక్నికల్ గైడెన్స్ కూడా తామే అందించి పంటను కొంటామని ఆయన చెప్పారు.
ఏటా 80 నుంచి 85శాతం పంట జనవరి- జూన్ మధ్య, 15 నుంచి 20శాతం పంట జూలై- అక్టోబర్ మధ్య కోతకు వస్తుంది. దిగుబడిలో 80శాతం రైతుల నుంచి నేరుగా మాండలెజ్ సంస్థ సేకరిస్తుండగా, మిగిలినదాన్ని చిత్తూరులో ఉన్న డీపీ చాక్లెట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, కర్ణాటకలోని క్యాంప్కో, హైదరాబాద్‌లోని లోటస్, జిందాల్, మోర్డే వంటి కంపెనీలు ట్రేడర్ల ద్వారా కొనుగోలు చేస్తుంటాయి.

ఫొటో సోర్స్, SRI CITY
రాష్ట్రంలో ఎంత పంట సాగవుతోంది?
ఏపీలో కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమగోదావరి తూర్పుగోదావరి, అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో సుమారు 74 వేల ఎకరాల్లో ఈ పంట సాగు చేస్తున్నారు. ఏటా సుమారు 12 వేల టన్నుల ఉత్పత్తి వస్తోంది.
ఎకరాకు సగటు 400 నుంచి 500 కిలోల గింజలు వస్తాయి. దేశంలో కోకో పంట ఉత్పత్తిలో ఏపీ వాటా 35% వరకు ఉంటుందని ఉద్యానవనశాఖ అధికారి తెలిపారు.
‘‘దేశం మొత్తం మీద రెండు లక్షల 70వేల ఎకరాల్లో ఈ పంట సాగవుతుండగా ఒక్క ఏపీలోనే దాదాపు 36శాతం సాగవుతోంది. దిగుబడుల పరంగా చూస్తే జాతీయ స్థాయిలో 35వేల టన్నుల దిగుబడి వస్తుండగా అందులో 12వేల టన్నులు మన రాష్ట్రం నుంచి వస్తున్నాయి’’ అని ఉద్యానవన శాఖ అధికారి రంగాచార్యులు తెలిపారు.

ఫొటో సోర్స్, SRI CITY
డిమాండ్‌తో పోలిస్తే ఉత్పత్తి చాలా తక్కువ
కోకోకు ఉన్న డిమాండ్‌తో పోలిస్తే ఉత్పత్తి తక్కువగానే ఉంటోంది. దేశీయంగా సుమారు లక్ష టన్నుల కోకో బీన్స్ అవసరం ఉండగా ఉత్పత్తి 35వేల టన్నులే.
65శాతం ఉత్పత్తిని కోకో పౌడర్, బటర్ రూపంలో దిగుమతి చేసుకుంటున్నామని అంబాజీపేటలోని డాక్టర్ వైఎస్సార్ హార్టీకల్చర్ యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్త ఎ.కిరీటి బీబీసీకి వెల్లడించారు.

ఫొటో సోర్స్, ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం
ఇప్పుడు రాష్ట్రంలో రైతుల ఆందోళన ఎందుకు?
కోకో సాగులో దేశంలో ఏపీ అగ్రస్థానంలో ఉన్నా కోకో రైతులు మాత్రం గిట్టుబాటు ధర కోసం కొన్ని నెలలుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కిలో కోకో గింజల ధర రూ.400 నుంచి రూ.500 లోపు ఉంటోంది.
అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం రూ.750 నుంచి రూ.1000 వరకు ధర పలుకుతోంది. ఆ మేరకు తమకు కూడా ధర చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ధర చెల్లించి రైతుల నుంచి మాండలెజ్ కంపెనీ కొనుగోళ్లు చేయాలని ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి కె. శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గుంటూరు ఉద్యాన శాఖ కమిషనర్ కార్యాలయం ముందు ఇటీవల ధర్నా చేపట్టారు.

అధికారులేమంటున్నారు?
రైతుల ఆందోళనపై మాండలెజ్ ప్రతినిధి బీబీసీతో మాట్లాడారు.
‘‘రెండేళ్ల కిందటి వరకు కిలో కోకో గింజల ధర రూ.250 నుంచి రూ.300 వరకే ఉండేది. గత ఏడాది అంతర్జాతీయంగా తక్కువ దిగుబడుల కారణంగా ఏపీలోని కోకో గింజలకు డిమాండ్ వచ్చింది. అందుకే గత ఏడాది రూ. 800 నుంచి రూ. 1050 వరకు ధర పలికింది. ఈ ఏడాది మళ్లీ హెచ్చుతగ్గులు అవుతున్నాయి. కానీ రైతులు గతేడాది రేటును డిమాండ్ చేయడంతో సమస్య వచ్చింది’’ అని సదరు ప్రతినిధి చెప్పారు.
అంతర్జాతీయంగా ధరల హెచ్చుతగ్గులను గమనిస్తున్నట్లు ఉద్యానవనశాఖ అధికారి రామ్మోహన్ బీబీసీతో చెప్పారు.
‘‘దీనిపై అధ్యయనం చేసే బాధ్యతను బెంగళూరుకి చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్కి అప్పగించాం. ప్రస్తుతం మాండలెజ్ కంపెనీయే ప్రధానంగా రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేస్తోంది. మిగిలిన కంపెనీలు కొనుగోళ్లు చేసేలా కూడా ఉద్యానవనశాఖ ఆహ్వానిస్తోంది. ఇప్పటివరకు కొనుగోళ్లలో ప్రభుత్వ జోక్యం లేదు. కానీ, వచ్చే ఏడాది నుంచి ఈ కొనుగోళ్ల ప్రక్రియను కనీసం మానిటరింగ్ చేయాలని భావిస్తున్నాం” అని చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)