SOURCE :- BBC NEWS

క్షిపణి పరీక్షా కేంద్రం

ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణాజిల్లా నాగాయలంకలోని క్షిపణి పరీక్షా కేంద్రం నిర్మాణం ఎప్పుడు మొదలుకానుందనే దానిపై ఇప్పటి వరకు స్పష్టత లేదు.

పధ్నాలుగేళ్ల కిందట ఆంధ్రప్రదేశ్‌కు మంజూరైన ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చడంలో ఆలస్యమైంది. ఓ దశలో గుజరాత్‌కు తరలిపోనుందనే ప్రచారం కూడా జరిగింది.

అయితే, ఆరు నెలల కిందట ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరిగిన కేంద్రమంత్రివర్గ భద్రత కమిటీ ఈ ప్రాజెక్టు ఏపీలోనే నిర్మించనున్నట్లు స్పష్టం చేయడంతో ఇక్కడి నుంచి ప్రాజెక్టు వెళ్లిపోతుందనే సందేహాలు తొలగిపోయాయి.

ఇక మిస్సైల్‌ టెస్టింగ్‌ సెంటర్‌ నిర్మాణం ఏపీలోనే కానుందనే నిర్ధరణ ఆ కమిటీ సమావేశం తర్వాత వచ్చింది. కానీ, ప్రాజెక్టు శంకుస్థాపన ఎప్పుడంటే మాత్రం దాదాపు ఆరునెలలుగా రాష్ట్ర స్థాయిలో ఎవరూ సరిగ్గా చెప్పడం లేదు. మరోవైపు డిఫెన్స్‌ వర్గాలు దీనిపై ఏమీ మాట్లాడలేమని అంటున్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఆంధ్రప్రదేశ్ గుల్లలమోద

అసలు ఏమిటీ ప్రాజెక్టు?

దేశ రక్షణ అవసరాల దృష్ట్యా ఒడిశాలోని బాలాసోర్‌కు తోడుగా మరో మిస్సైల్‌ టెస్టింగ్‌ సెంటర్‌ నిర్మాణం అవసరమని భావించిన కేంద్ర ప్రభుత్వం 2011లో ఆంధ్రప్రదేశ్‌కు ఈ ప్రాజెక్టును కేటాయించింది. అప్పట్లోనే ఈ కేంద్రం నిర్మాణానికి కృష్ణా జిల్లా దివిసీమలోని నాగాయలంక మండలం గుల్లలమోద గ్రామ పరిధిని అనువైన ప్రాంతంగా గుర్తించారు.

ఈ గ్రామం సముద్రతీర ప్రాంతం కావడం, చుట్టుపక్కల ఎనిమిది కిలోమీటర్ల పరిధిలో జనావాసాలు లేకపోవడంతో క్షిపణి ప్రయోగాలకు అనుకూలంగా ఉంటుందని నిర్ణయించారు.

మిస్సైల్స్‌ టెస్ట్‌లు చేసిన క్రమంలో శకలాలు సముద్రంలోనే పడిపోతాయనీ, ఎవరికీ ఎలాంటి ప్రమాదం ఉండదనీ పర్యావరణానికి కూడా విఘాతం ఉండబోదని అప్పట్లో నిర్ణయించారు.

ఈ క్రమంలో 2012లో ఈ ప్రాజెక్టుకు భూములను కేటాయించాల్సిందిగా డీఆర్‌డీవో అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వాన్ని కోరింది.

అయితే, ఆనాడు సమైక్యాంధ్రప్రదేశ్‌లో నెలకొన్న విభజన ఉద్యమాల నేపథ్యంలో భూములపై పాలకులు దృష్టి సారించలేదు. దాంతో దాదాపు ఐదేళ్ల పాటు ఈ ప్రాజెక్టుపై కదలిక రాలేదు.

నాగాయలంక మండలం గుల్లలమోద

2017లో భూముల కేటాయింపు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత 2017లో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు కోసం 381.61 ఎకరాల భూమిని డీఆర్‌డీవో (డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌)కు కేటాయించారు.

అయితే ఈ భూములు కేటాయించిన ప్రాంతంలో మడ అడవులు ఉండటంతో అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో నాటి ప్రభుత్వం ఆ భూములకు బదులుగా గణపేశ్వరం పరిధిలోని 381.61 ఎకరాల రెవెన్యూ భూమిని అటవీ శాఖకు అప్పగిస్తూ, జీవో 1352 ఇవ్వడంతో భూ సమస్య తొలిగింది.

ఆ తర్వాత 2017లోనే కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి తొలి దశ అనుమతులు వచ్చాయి.

2018లో సీఆర్‌జెడ్ నుంచి కూడా మినహాయింపు తీసుకున్నారు. 2019లో పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి రెండో దశ అనుమతులు లభించగా, 2020–21లో ఆ స్థలాన్ని డీఆర్‌డీవో స్వాధీనం చేసుకొని ప్రహరీని, ప్రవేశ ద్వారాన్ని, ఓ భవనాన్ని నిర్మించింది.

మళ్లీ ఆరునెలల కిందటే స్పష్టత

ప్రహరీ, భవనం నిర్మాణం తర్వాత నుంచి అంటే దాదాపు మూడేళ్లుగా ప్రాజెక్టుపై ఎలాంటి పురోగతీ లేకుండా పోయింది. దీంతో ఓ దశలో ఈ ప్రాజెక్టు గుజరాత్‌కి తరలిపోనుందనే ప్రచారం కూడా జరిగింది.

అయితే గతేడాది 2024 అక్టోబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ భద్రత కమిటీ నాగాయలంక మండలంలోని గుల్లలమోదలోనే క్షిపణి ప్రయోగ పరీక్షా స్థావరం ఏర్పాటుకు ఆమోదం తెలపడంతో ఇక ఇక్కడే ఉంటుందనే స్పష్టత వచ్చింది.

మా హయాంలో మేం ప్రయత్నించాం: వైఎస్సార్‌సీపీ

కాగా, వైఎస్సార్‌సీపీ హయాంలో 2019–24 మధ్య ప్రాజెక్టు జాప్యం, తరలిపోతుందని జరిగిన ప్రచారంపై ఆ ఐదేళ్ల పాటు అవనిగడ్డ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేగా చేసిన సింహాద్రి రమేశ్ బాబు బీబీసీతో మాట్లాడారు.

వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే డీఆర్‌డీవో స్థలాన్ని అప్పగించామని, 2021లోనే భవన నిర్మాణాలు పూర్తయ్యాయని ఆయన చెప్పారు. ఆ ప్రాజెక్టు పనులు మొదలుపెట్టాలని సంబంధిత రక్షణశాఖ అధికారులకు తనతో పాటు ఎంపీ మిథున్ రెడ్డి చాలాసార్లు విజ్ఞప్తి చేశామని తెలిపారు. కారణాలు తెలియదు కానీ, పనులు మాత్రం మొదలు కాలేదని రమేశ్ బాబు తెలిపారు.

పనులు ఎవరి హయాంలో జరిగినా ఆ ప్రాంతానికి మేలు జరిగితే చాలని ఆయన అన్నారు.

కీలకమైన క్షిపణుల పరీక్షలు ఇక్కడే..

ఈ కేంద్రం నిర్మాణం పూర్తయితే ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే కీలకమైన క్షిపణుల పరీక్షలు ఇక్కడి నుంచే చేస్తారు.

అలాగే డీఆర్‌డీవో ఆవిష్కరించే అనేక రకాల మిస్సైల్స్‌ను పరీక్షిస్తారు.

దూరప్రాంతాలను లక్ష్యంగా చేసుకునే బాలిస్టిక్‌ మిస్సైల్స్‌తో పాటు క్రూజ్‌ మిస్సైల్స్, యాంటీ మిస్సైల్స్‌ సిస్టమ్స్‌ వంటివి పరీక్షిస్తారు.

మిస్సైల్‌ గైడెన్స్‌ సిస్టమ్స్, ప్రొపల్షన్‌ సిస్టమ్స్‌తో పాటు అనేక కీలక సాంకేతిక విభాగాలు ఇక్కడ ఏర్పాటు చేస్తారు.

మిస్సైల్స్‌ను పరీక్షించిన సందర్భంలో డేటాను విశ్లేషించేందుకు కంప్యూటర్‌ ఆధారితంగా సిమ్యులేషన్‌ వ్యవస్థలనూ ఉపయోగించుకుంటారు.

ఈ మేరకు ఇక్కడ టెస్టింగ్‌ అవసరాలకు సంబంధించిన యూనిట్లను, బ్లాక్‌లను నిర్మించాల్సి ఉంది. కాగా, డీఆర్‌డీవో చైర్మన్‌గా 2021లో ఇక్కడికి వచ్చి పరిశీలించిన ప్రస్తుత రక్షణశాఖ సలహాదారు సతీశ్ రెడ్డిని ఈ విషయమై బీబీసీ సంప్రదించింది.

పనుల మొదలుపై స్పష్టత వచ్చిన తర్వాత వివరంగా మాట్లాడతాననీ, మొత్తంగా క్షిపణి పరీక్షా కేంద్రం నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంత రూపురేఖలే మారిపోతాయని ఆయన అన్నారు.

నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, PMO

మోదీ అమరావతి టూర్‌లో శంకుస్థాపన ఉంటుందా?

వాస్తవానికి ఈ ఏడాది తొలినాళ్లలో జనవరిలో ప్రధాని మోదీ విశాఖపట్నం పర్యటన సందర్భంలోనే ఆయనతో వర్చువల్‌గా ఈ కేంద్రానికి శంకుస్థాపన చేయించడానికి అన్ని ఏర్పాట్లు చేశామనీ, అయితే చివరి నిమిషంలో రద్దు అయిందని మచిలీపట్నం ఆర్డీవో స్వాతి బీబీసీకి తెలిపారు.

అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టు కావటంతో ఆయనే స్వయంగా వచ్చి శంకుస్థాపన చేస్తారని, అందువల్లనే అప్పుడు వాయిదా పడిందన్న సమాచారం తమకు వచ్చిందని ఆర్డీవో చెప్పారు.

ఈ నెలలో అమరావతి పునర్మిర్మాణ పనులకు మోదీ వస్తే అప్పుడేమైనా ఇక్కడికి కూడా వస్తారా.. లేదంటే అక్కడి నుంచే వర్చువల్‌గా శంకుస్థాపన చేస్తారా? అనే దానిపై తమకు ఇంకా స్పష్టత లేదని ఆర్డీవో పేర్కొన్నారు.

దివిసీమ అభివృద్ధి: మండలి బుద్ధప్రసాద్

ఈ ప్రాజెక్టుతో దివిసీమ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌ బీబీసీతో అన్నారు.

ఈ ప్రాజెక్టు తరలిపోతుందన్న ప్రచారంతో ఆందోళన చెందామని కానీ, ఇక్కడే నెలకొల్పుతారని గత అక్టోబర్‌లో స్పష్టత రావడంతో ఎప్పుడు శంకుస్థాపన చేస్తారా అని ఎదురు చూస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఎప్పుడు పనులు మొదలు పెడతారనే దానిపై ఇంకా స్పష్టత లేదని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి బీబీసీతో అన్నారు.

ప్రాజెక్టు రాకతో ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెంది, ఎంతోమందికి జీవనోపాధి లభిస్తుందని బాలశౌరి అన్నారు.

ప్రాజెక్టుకు సంబంధించిన ఏ సమాచారం కూడా ఇప్పుడు మీడియాకి ఇవ్వలేమని కల్నల్‌ సమీర్‌ శర్మ బీబీసీతో అన్నారు.

కాగా, విశాఖ డీఆర్‌డీవో (రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ), ఎన్‌ఎస్‌టీఎల్‌ (నేవల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నలాజికల్‌ లేబొరేటరీ) అధికారులు ఈ విషయంపై మాట్లాడేందుకు సుముఖత చూపలేదు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)