SOURCE :- BBC NEWS

ఏలియన్స్, అంతరిక్షం, గ్రహాలు

కొన్ని శాస్త్రీయ ఆవిష్కరణలు మన జ్ఞానాన్ని పెంపొందిస్తాయి. ఈ అనంత విశ్వం గురించి, అందులో మనమెక్కడున్నాం అనే విషయాల్లో మన ఆలోచనలను కూడా సమూలంగా మార్చేస్తాయి.

స్పేస్‌క్రాఫ్ట్ మొట్టమొదటిసారి భూమి చిత్రాలను పంపిన క్షణం అలాంటిదే. ఇప్పుడు, సముద్ర జీవరాశి వల్ల భూమిపై ఏర్పడే వాయువు (గ్యాస్) వంటి ఆనవాళ్లు K2-18b అనే మరో గ్రహంపై గుర్తించారనే వార్త కూడా అలాంటి మరో క్షణానికి దగ్గరగా ఉన్నామని చెబుతోంది.

ఈ విశ్వంలో మానవులు ఏకాకులు కాదని, గ్రహాంతరవాసుల (ఏలియన్స్‌) నిజమైన ఉనికిని గుర్తించే క్షణం ఇంకా ఎంతో దూరంలో లేదని ఈ పరిశోధన బృందానికి నాయకత్వం వహించిన సైంటిస్ట్ చెబుతున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

”ప్రాథమిక ప్రశ్నలపరంగా చూస్తే ఇది చాలా పెద్ద విషయమే. కాకపోతే, మనం వాటికి సమాధానాలు చెప్పగలిగే దశలో ఉన్నామనుకోవచ్చు” అని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రానమీకి చెందిన ప్రొఫెసర్ నిక్కు మధుసూధన్ అన్నారు.

అయితే, అది మరిన్న ప్రశ్నలను లేవనెత్తవచ్చు. మరో గ్రహంపై జీవరాశి మనుగడ ఉందని తేలితే, అది మానవ జాతిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? వంటి ప్రశ్నలను రేకెత్తించవచ్చు.

అంతరిక్షం, ఏలియన్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫ్లయింగ్ సాసర్లు, సైన్స్ ఫిక్షన్ ఏలియన్స్

మన పూర్వీకులు చాలాకాలం కిందటే గ్రహాంతర వాసుల కథలను సృష్టించారు. అంగారక గ్రహం ఉపరితలంపై ఒక సరళ రేఖ కనిపిస్తున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు 20వ శతాబ్దం ప్రారంభంలో భావించారు. ఇది, మనకి దగ్గర్లోని మరో గ్రహం అత్యాధునిక నాగరికతతో విలసిల్లుతుండొచ్చనే ఊహాగానాలను రేకెత్తించింది. అది గాల్లో ఎగిరే సాసర్లు, లిటిల్ గ్రీన్ ఏలియన్స్ వంటి సైన్స్ ఫిక్షన్ సంస్కృతికి దారితీసింది.

కానీ దశాబ్దాల తర్వాత, ఇప్పుడు మరో గ్రహంపై జీవరాశి మనుగడ ఉందని ”ఇంతకుముందెన్నడూ లభ్యం కానంత బలమైన ఆధారాలు” చెబుతున్నది అంగారకుడి గురించో, లేక శుక్రుడి గురించో కాదు. ట్రిలియన్ మైళ్ల దూరంలో, మరో నక్షత్రం చుట్టూ తిరుగుతున్న వేరే గ్రహం గురించి.

గ్రహాంతర వాసుల ఉనికిపై జరిపే పరిశోధనలో మనం ఎక్కడ చూస్తున్నామనే విషయం తెలుసుకోవడమే అసలు సవాల్‌.

ఇటీవలి వరకు, జీవరాశి మనుగడకు సంబంధించి నాసా దృష్టంతా అంగారక గ్రహంపై ఉంది.

కానీ, 1992లో మన సౌర వ్యవస్థకు ఆవల, మరో నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్న గ్రహాన్ని కనుగొన్నప్పటి నుంచి ఈ ధోరణిలో మార్పు మొదలైంది.

దూరంగా ఉన్న నక్షత్రాల చుట్టూ కూడా వేరే ప్రపంచాలు ఉండొచ్చని ఖగోళ శాస్త్రవేత్తలు అనుమానించినప్పటికీ, అప్పటివరకూ దానికి ఎలాంటి రుజువులూ లేవు. ఆ తర్వాతి నుంచే మన సౌరవ్యవస్థ ఆవల దాదాపు 6000 గ్రహాలను గుర్తించారు.

మన సౌర వ్యవస్థలోని గురుడు, శని వంటి వాయువులతో నిండిన గ్రహాలు కూడా వాటిలో ఉన్నాయి. అలాగే, జీవనాధారంగా భావించే నీటిజాడకు అనువైన అతి చల్లని, అతి వేడి గ్రహాలు కూడా ఉన్నాయి.

కానీ, వీటిలో చాలావరకూ ఖగోళ శాస్త్రవేత్తలు ”గోల్డిలాక్స్ జోన్” అని పిలిచే ప్రాంతంలో ఉన్నాయి, ఈ దూరం జీవరాశి మనుగడకు అనువైనదిగా భావిస్తారు. మన గెలాక్సిలోనూ వేల సంఖ్యలో ఉండొచ్చని మధుసూదన్ విశ్వసిస్తున్నారు.

అంతరిక్షం, ఖగోళ శాస్త్రం, గ్రహాలు

ఫొటో సోర్స్, NASA

అత్యాధునిక సాంకేతికత

ఎక్సోప్లానెట్లుగా పిలిచే వీటిని కనుగొనే క్రమంలో, శాస్త్రవేత్తలు వాటి వాతావరణ రసాయన కూర్పును విశ్లేషించే పరికరాలను అభివృద్ధి చేయడం ప్రారంభించారు.

సుదూర ప్రాంతాల్లోని ఆయా వాతావరణాలలోంచి ప్రసరించే నక్షత్ర కాంతిని సంగ్రహించి, అందులో భూమిపై జీవుల ద్వారా మాత్రమే ఉత్పత్తయ్యే అణువుల రసాయన ఆనవాళ్ల కోసం అధ్యయనం చేయడమే దీని ఉద్దేశం. వీటినే బయోసిగ్నేచర్లు అని పిలుస్తారు.

K2-18b గ్రహంపై గ్యాస్‌ను గుర్తించిన నాసాకి చెందిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్(జేడబ్ల్యూఎస్‌టీ) ఇప్పటివరకూ రూపొందించిన అత్యంత శక్తివంతమైన స్పేస్ టెలిస్కోప్.

2021లో దీని ప్రారంభ సమయంలోనే, జీవరాశి అన్వేషణలో మానవాళి తుది అంచులకు చేరిందన్న ఉత్సాహం కలిగించింది.

అయితే, జేడబ్ల్యూఎస్‌టీకి కూడా పరిమితులు ఉన్నాయి. అవేంటంటే, భూమి లాంటి చిన్న చిన్న గ్రహాలను లేదా మాతృ నక్షత్రాలకు సమీపంలో ఉండే గ్రహాలను ఇవి గుర్తించలేవు. కాబట్టి 2030లలో హాబిట్యువల్ వరల్డ్స్ అబ్జర్వేటరీ (హెచ్‌డబ్ల్యూవో – ఇది నెక్ట్స్ జనరేషన్ స్పేస్ టెలిస్కోప్)ని ప్లాన్ చేస్తోంది, ఇది భూమి లాంటి గ్రహాల వాతావరణాలను గుర్తించి, నమూనాలు సేకరించగలదు.

దశాబ్దం తర్వాత, యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీకి చెందిన ఎక్స్‌ట్రీమ్‌లీ లార్జ్ టెలిస్కోప్ (ఈఎల్‌టీ) కూడా అందుబాటులోకి రానుంది. దీనితో చిలీ ఎడారిపైన ఆకాశాన్ని మరింత స్పష్టంగా చూసేందుకు వీలవుతుంది.

ఇది ఇప్పటివరకూ అందుబాటులో ఉన్న పరికరాల కంటే అతిపెద్ద అద్దంతో ఉంటుంది, దాని వ్యాసం 39 మీటర్లు. దీని సహాయంతో మునుపటి పరికరాల కంటే మరింత దగ్గరగా గ్రహాల వాతావరణాలను చూడొచ్చు.

నాసా, అంతరిక్షం, ఖగోళ శాస్త్రం

ఫొటో సోర్స్, NASA

మరిన్ని ఆవిష్కరణలు

K2-18b గ్రహం చుట్టూ ఉన్న వాతావరణంలో బయోసిగ్నేచర్లను కనుగొన్నట్లు నిరూపించేందుకు వచ్చే రెండేళ్లలో తగినంత సమాచారం తమ వద్ద ఉండాలని ప్రొఫెసర్ మధుసూదన్ ఆశిస్తున్నారు. అయితే, ఆయన తన లక్ష్యాన్ని సాధించినప్పటికీ, మరో గ్రహంపై జీవరాశి ఉందన్న విషయం అందరూ పండగ చేసుకునేంత పెద్దది కాకపోవచ్చు.

వేడుకలకు బదులు, బయోసిగ్నేచర్లను నిర్జీవ మార్గాల ద్వారా ఉత్పత్తి చేయొచ్చా? అనే మరో బలమైన శాస్త్రీయ చర్చకు నాంది పలుకుతుంది.

అయితే, మరిన్ని వాతావరణాల నుంచి మరిన్ని నమూనాలను సేకరిస్తే, వాటి బయోసిగ్నేచర్లకు ఇదే కారణమనే ప్రత్యామ్నాయ వివరణలను కనుక్కోవడంలో రసాయన శాస్త్రవేత్తలు విఫలమైతే, అప్పుడు శాస్త్రీయ ఏకాభిప్రాయం క్రమంగా ఇతర గ్రహాలపై జీవరాశి మనుగడ ఉందనే దిశగా మారుతుందని స్కాట్లాండ్‌కి చెందిన ఆస్ట్రోనామర్ రాయల్, ఎడిన్‌బర్గ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ కేథరీన్ హేమాన్స్ అన్నారు.

”టెలిస్కోప్‌లపై ఎక్కువ సమయం గడపడం వల్ల, వాతావరణ రసాయన కూర్పుల గురించి ఖగోళ శాస్త్రవేత్తలకు మరింత స్పష్టత వస్తుంది. ఇది జీవరాశి అని కచ్చితంగా మీకు తెలియకపోవచ్చు. కానీ, ఎక్కువ డేటా సేకరించినట్లయితే, అందులోనూ ఈ ఒక్క గ్రహానికి సంబంధించినది మాత్రమే కాకుండా వివిధ వాతావరణాలకు సంబంధించినదైతే, దానికి మరింత బలం చేకూరుస్తుందని భావిస్తున్నా.”

అంతరిక్షం, ఖగోళ శాస్త్రం, గ్రహాలు

ఫొటో సోర్స్, SPL

పెద్దగా ప్రభావం చూపని చిన్నచిన్న సాంకేతికతల అభివృద్ధి క్రమంలోనే వరల్డ్ వైడ్ వెబ్ ఆవిర్భవించింది. అదేవిధంగా, మానవాళి చరిత్రలోనే అత్యంత శాస్త్రీయ, సాంస్కృతిక, సామాజిక పరివర్తన జరిగిందని ప్రజలకు అర్థమవుతుంది.

అలాగే, వివిధ స్పేస్‌క్రాఫ్ట్‌లు పంపిన సమాచారం మేరకు, మన సౌర వ్యవస్థలోనూ జీవరాశి మనుగడ, లేదా గతంలో మనుగడ సాగించిందనేందుకు శాస్త్రీయ అవకాశాలు పెరిగాయి. అందువల్ల, వివిధ మిషన్లు వాటి ఆనవాళ్ల కోసం శోధించే పనిలో ఉన్నాయి.

యూరోపియన్ యూనియన్, చైనా, నాసా వంటి సంస్థలు వివిధ గ్రహాలపై జీవరాశి మనుగడకు సంబంధించిన ఆధారాలు కనుగొనే మిషన్లపై పనిచేస్తున్నాయి.

నాసా, కేంబ్రిడ్జ్, లండన్, అంతరిక్షం

ఫొటో సోర్స్, Cambridge University

జీవరాశి ఉందని గుర్తించినా..

ఒకవేళ సాధారణ జీవరాశి ఉందని నిర్ధరించినా, గెలాక్సీలో అలాంటి జీవరాశి చాలా సాధారణమని భావిస్తున్నారు ప్రొఫెసర్ మధుసూదన్. ”కానీ, ఆ సాధారణ జీవరాశి నుంచి సంక్లిష్ట జీవరాశిగా పరిణామం చెందడం పెద్ద విషయం. అదే మరో పెద్ద ప్రశ్న కూడా. అదెలా జరిగింది? దానికి కారణమైన పరిస్థితులు ఏంటి? అవి మనకు తెలియదు. ఆ తర్వాత, తెలివితేటల వైపు పరిణామం చెందడం మరో పెద్ద విషయం” అన్నారు.

వేరే గ్రహంపై సాధారణ జీవరాశి కంటే, తెలివైన జీవరాశి ఆవిర్భవించడం చాలా అరుదని రాయల్ ఆస్ట్రోనామికల్ సొసైటీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రాబర్ట్ మాసే అంటున్నారు.

”భూమిపై జీవరాశి ఆవిర్భావాన్ని గమనిస్తే, అది చాలా సంక్లిష్టంగా ఉంటుంది. బహుళ కణ జీవం ఆవిర్భవించి, అది విభిన్న జీవరూపాలుగా పరిణామం చెందడానికి చాలా కాలం పట్టింది.”

ఈ పరిణామక్రమం సాధ్యం కావడానికి భూమిపై ఏముంది అనేది కూడా పెద్ద ప్రశ్న. భూమిపై ఉన్నట్లు అవే పరిస్థితులు, పరిమాణం, సముద్రాలు, భూభాగాల ఇలాంటివి ఇతర గ్రహాలపై కూడా అవసరమా? లేదా అవేవీ లేకపోయినా జరుగుతుందా?

అంతరిక్షం, నాసా, కేంబ్రిడ్జ్

ఫొటో సోర్స్, Getty Images

”ఇతర గ్రహాలపై జీవరాశి కోసం శాస్త్రవేత్తలు ఇంత తీవ్రంగా అన్వేషించిన సందర్భాలు గతంలో లేవు. ఇలాంటి సాధనాలు కూడా లేవు. ఈ రంగంలో పనిచేస్తున్న చాలామందికి ఇతర గ్రహాలపై ఏలియన్స్ ఉంటే అనేదానికంటే, ఇతర గ్రహాలపై ఏలియన్స్‌ను ఎప్పుడు కనుగొన్నారనేదే ముఖ్యమని విశ్వసిస్తారు. ఏలియన్స్‌ ఆవిష్కరణ భయానికి బదులు ఆశ కల్పిస్తుంది” అని ప్రొఫెసర్ మధుసూదన్ అన్నారు.

”మనం ఆకాశం వైపు చూసినప్పుడు, భౌతికంగా కనిపించే వస్తువులు, నక్షత్రాలు, గ్రహాలతో పాటు విశాలమైన ఆకాశం కూడా కనిపిస్తుంది. దాని సామాజిక పరిణామాలు అపారమైనవి. విశ్వం వైపు నుంచి మనల్ని మనం చూసుకున్నప్పుడు , అది మనలో భారీ పరివర్తన తీసుకొస్తుంది.”

”ఇది మనల్ని మనం చూసుకునే విధానం, ఇతరులను చూసే విధానం వంటి విషయాలను సమూలంగా మార్చేస్తుంది. భాష, రాజకీయ, భౌగోళిక అడ్డంకులు తొలగిపోతాయి. మనందరం ఒకటేనని గ్రహించినప్పుడు, అందరినీ దగ్గర చేస్తుంది” అని ఆయన అన్నారు.

”ఇది మానవ పరిణామ క్రమంలో మరో అడుగు అవుతుంది.”

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)