SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
“ఓపీటీ తీసేస్తే ఇంత దూరం వచ్చి, ఇంత ఖర్చు పెట్టి చదువుకుని ప్రయోజనం ఏముంటుంది! ఓపీటీ రద్దు బిల్లు పాస్ అయితే చాలామంది విద్యార్థులు ఇబ్బందుల్లో పడతారు. ఏం జరుగుతుందోనని కంగారుగా ఉంది” – ప్రవీణ
” అమెరికా వచ్చి చదువుకుని అత్యాధునిక సాంకేతికత గురించి తెలుసుకోవడం, ఆ పనిలో అనుభవం సాధించడం అనేది ప్రతీ విద్యార్థికి ఉండే కల. ఓపీటీ ఆ అవకాశాన్ని కల్పిస్తుంది. ఓపీటీని రద్దు చేయడమంటే అదొక పీడకల” – అహ్మద్
అమెరికాలో ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) రద్దు యోచనపై అక్కడ చదువుకుంటున్న తెలుగు విద్యార్థులైన ప్రవీణ, అహ్మద్‌లు చెబుతున్న మాటలివి.
‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ నినాదంతో పదవిలోకి వచ్చిన డోనల్డ్ ట్రంప్ ఇమిగ్రేషన్‌పై కఠిన విధానాలను అవలంబిస్తున్నారు.
అందులో భాగంగా ఇటీవలే ఓపీటీని రద్దు చేస్తామంటూ చట్ట సభలో బిల్లు ప్రవేశపెట్టారు. అసలేంటి ఈ ఓపీటీ? విద్యార్థులు ఎందుకు భయపడుతున్నారు? దీనిని రద్దు చేస్తే ఏమవుతుంది?.


ఫొటో సోర్స్, Getty Images
ఓపీటీ అంటే ఏంటి?
ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) అంటే అమెరికా వెళ్లి చదువుకునే విద్యార్థులకు చదువు పూర్తవ్వగానే దానికి సంబంధించిన పనిలో అనుభవం పొందేందుకు ఇచ్చే ఒక అవకాశం.
బ్యాచిలర్స్ లేదా మాస్టర్స్ కోసం అమెరికా వెళ్లే విద్యార్థులకు ఎఫ్-1 వీసా ఇస్తారు. చదువు పూర్తయిన వెంటనే అదే వీసా మీద 12 నెలల పాటు అక్కడే ఉండి ఉద్యోగం చేసేందుకు అవకాశం ఇస్తుంది ఓపీటీ.
చదువు పూర్తయిన 90 రోజుల్లోగా ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (ఈఏడీ) కోసం దరఖాస్తు పెట్టుకోవాలి. అది పొందిన వెంటనే ఒక సంవత్సరానికి వర్క్ పర్మిట్ లభిస్తుంది. ఈ ఏడాది పాటు విద్యార్థులు ఉద్యోగం చేయవచ్చు లేదా ఇంటర్న్‌షిప్, వలంటీర్లుగా కూడా చేయవచ్చు.
అయితే, ఎస్‌టీఈఎం (STEM అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమేటిక్స్) సబ్జెక్టులు చదివిన విద్యార్థులకు ఏడాది తరువాత మరో 24 నెలలు అంటే రెండేళ్లు ఓపీటీకి అనుమతి ఉంటుంది.
ఈ 36 నెలల్లోగా హెచ్1బీ వీసా స్పాన్సర్ చేసే ఉద్యోగం వెతుక్కుని, లాటరీలో వీసా వచ్చేస్తే అమెరికాలోనే ఉంటూ ఉద్యోగం కొనసాగించవచ్చు. లేకపోతే 36 నెలల తరువాత స్టూడెంట్స్ వీసా పూర్తిగా రద్దు అవుతుంది. విద్యార్థులు స్వదేశాలకు తిరిగివెళ్లిపోవాలి.
ఎస్‌టీఈఎంలో లేని విద్యార్థులు అంటే ఆర్థికశాస్త్రం, చరిత్ర, ఇంగ్లిష్ లిటరేచర్ మొదలైన సబ్జెక్టులు చదువుకునే వాళ్లకి మాత్రం ఒక్క ఏడాది మాత్రమే ఓపీటీ ఉంటుంది. ఈలోగా వాళ్లు హెచ్1బీ ఉద్యోగాలు వెతుక్కోవాలి.

ఫొటో సోర్స్, Getty Images
ఓపీటీ రద్దు చేయడమెందుకు?
అన్ని రంగాల్లోనూ ‘అమెరికా ఫస్ట్’ అనే దృక్పథంతో ముందుకు సాగుతామంటోంది ట్రంప్ ప్రభుత్వం. అందులో భాగంగా, ఇటీవలే “ఫెయిర్‌నెస్ ఫర్ హై-స్కిల్డ్ అమెరికన్స్ యాక్ట్” (H.R.2315) పేరుతో ఓపీటీని రద్దు చేయాలనే బిల్లును చట్టసభలో ప్రవేశపెట్టారు రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు పాల్ గోసార్.
ఉపాధి రంగంలో అమెరికా పౌరులకే ప్రాధాన్యత ఉండాలని, ఓపీటీ వల్ల ఉన్నత నైపుణ్యాలు కలిగిన అమెరికన్లకు పోటీ పెరుగుతోందని రిపబ్లికన్లు వాదిస్తున్నారు.
ఓపీటీ కింద ఉన్నవారు తక్కువ జీతానికైనా పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు. వారికి దీర్ఘకాలిక ప్రోత్సహాకాలు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. పైగా వాళ్లు ఎఫ్-1 వీసా మీద ఉంటారు కాబట్టి కంపెనీలకు పన్ను మినహాయింపులు ఉంటాయి. అందుకని, కంపెనీలు ఓపీటీ కింద ఉన్న విద్యార్థులకు ఉద్యోగావకాశాలు ఇవ్వడానికి మొగ్గు చూపుతున్నాయని, దీనివల్ల అమెరికన్లకు ఉపాధి తగ్గిపోతోందని వారు అంటున్నారు.
ట్రంప్ ప్రభుత్వం గత పాలనలో కూడా ఓపీటీ, హెచ్1బీ వీసాల వల్ల అమెరికన్లకు అవకాశాలు తగ్గిపోతాయన్న ఆందోళన వ్యక్తం చేసింది. ఈసారి నేరుగా బిల్లు ప్రవేశపెట్టింది.
విద్యార్థులు ఏమంటున్నారు?
ఓపీటీ రద్దు బిల్లుపై అమెరికాలో చదువుకుంటున్న పలువురు తెలుగు విద్యార్థులతో బీబీసీ న్యూస్ తెలుగు మాట్లాడింది.
“ఇక్కడ రెండేళ్ల మాస్టర్స్ డిగ్రీలో మేం చాలా నేర్చుకుంటాం. ఆ చదువు అంతా ఈ దేశానికి సంబంధించిన జ్ఞానం, ఇక్కడి వనరులు, అవకాశాలు, ఇక్కడి ఉదాహరణలతో నిండి ఉంటుంది. నేర్చుకున్నదంతా ప్రాక్టికల్‌గా ఎలా ఉపయోగపడుతుందో తెలియాలంటే ఇక్కడే ఉద్యోగం చెయ్యాలి. హెచ్1బీ ఎప్పుడు వస్తుందో తెలీదు. ఓపీటీ ఒక్కటే చదువుకున్న ఫీల్డ్‌లో కొంత అనుభవం గడించడానికి అవకాశం ఇస్తుంది. అదీ లేకపోతే ఇంత దూరం వచ్చి వృథా” అంటున్నారు ప్రవీణ.
ఆంధ్రప్రదేశలోని కడప జిల్లాకు చెందిన ప్రవీణ ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్(యూఎంబీసీ)లో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ చేస్తున్నారు.
“ఓపీటీ రద్దు అంతర్జాతీయ విద్యార్థులకు మంచిది కాదు. ఎందుకంటే, వాళ్లు అమెరికాకు చదువుతో పాటు ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లే అత్యాధునిక సాంకేతికతల మీద పని చేయాలనే ఆశతో వస్తారు. ఆ అవకాశాన్ని తీసేస్తే విద్యార్థులకు నిరాశే.” అని అన్నారు అహ్మద్.
హైదరాబాద్ నివాసి అయిన అహ్మద్ వాషింగ్టన్ డీసీలో ఉన్న కేథలిక్ యూనివర్సిటీ ఆఫ్ అమెరికాలో డాటా అనలిటిక్స్‌లో మాస్టర్స్ చదువుకుంటున్నారు.
బ్యాచిలర్స్ లేదా మాస్టర్స్ చదువుకోవడానికి అమెరికా వచ్చే విద్యార్థులు ఈ మూడేళ్లు లేదా రెండేళ్లకు అయ్యే ఖర్చులు సొంతంగా భరించాలి. చాలామంది లోన్ తీసుకుంటారు. ఇక్కడ వచ్చే ఉద్యోగానుభవంతో లోన్ త్వరగా తీరే అవకాశాలు ఉంటాయని భావిస్తారు.
” రెండేళ్లు చదవాలంటే సుమారు 40 వేల డాలర్లు (సుమారు రూ. 34 లక్షలు) ఖర్చు అవుతుంది. ఎక్కువమంది విద్యార్థులు లోన్ పెట్టుకుని వస్తారు.” అన్నారు ప్రవీణ.
అహ్మద్ కూడా ఇదే మాట చెప్పారు.
“రెండేళ్లకు యూనివర్సిటీ ఫీజే రూ. 30 లక్షలు (36 వేల డాలర్లు). సొంత ఖర్చులకు మరో రూ. 17 లక్షల వరకూ అవుతుంది. నాకు స్కాలర్‌షిప్ వచ్చింది, అందుకే ఫీజు రూ. 43 లక్షల నుంచి రూ. 30 లక్షలకి తగ్గింది. క్యాంపస్‌లో పార్ట్ టైం జాబ్స్ చేస్తుంటాను. వాటివల్ల నా ఖర్చులకు కొంత వస్తుంది. నేను ఇక్కడకు వచ్చినప్పుడు లోన్ తీసుకుని వచ్చాను. డిగ్రీ చేసి జాబ్ చేయకుండా వెనక్కి వెళ్లిపోతే ఇబ్బందే.” అన్నారు.
అమెరికాలో కొంతకాలం పనిచేసి భారత్ తిరిగివెళితే అక్కడ ఉద్యోగావకాశాలు పెరుగుతాయని, అలా కాకుండా కోర్సు పూర్తవ్వగానే స్వదేశం వెళితే వెంటనే ఉద్యోగం రాదని ప్రవీణ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
‘లోన్ తీసుకొని వచ్చా’
అమెరికాలో కోర్సు రెండేళ్లే కానీ మేం ఓపీటీతో కలుపుకుని ఐదేళ్ల లెక్క వేసుకుని ఇక్కడకి వస్తాం అంటున్నారు నల్గొండకి చెందిన మహేశ్. ఆయన కూడా డాటా అనలిటిక్స్‌లో మాస్టర్స్ చేస్తున్నారు.
“కేవలం రెండేళ్లకి రూ. 35 లక్షలు ఖర్చు పెట్టుకుని రాలేం కదా. కోర్సు అవ్వగానే ఇండియా వెళ్లిపోతే నెలకి లక్ష, రెండు లక్షల జీతంతో ఉద్యోగాలు రానే రావు. 50-60 వేల జీతంతో మొదలెట్టాలి. అలా అయితే 35-40 లక్షల లోను ఎప్పటికి తీరుస్తాం? మూడేళ్లు అమెరికాలో ఉద్యోగం చేస్తే లోను తీర్చడానికి కొంత వెసులుబాటు ఉంటుంది. ఇండస్ట్రీలో అనుభవమూ వస్తుంది. దాంతో ఇండియా వస్తే ఆ లెక్కే వేరు” అన్నారు మహేశ్.

ఫొటో సోర్స్, Getty Images
“ఇప్పుడున్న వాళ్లకైనా ఓపీటీ ఉంచాలి”
దివ్య (పేరు మార్చాం) న్యూయార్క్‌లోని బింఘంటన్ యూనివర్సిటీలో మాస్టర్స్ పూర్తిచేసి ప్రస్తుతం ఓపీటీ పీరియడ్‌లో ఉద్యోగం చేస్తున్నారు. ఇప్పటికే అమెరికా వచ్చి చదువుకుంటున్న వాళ్లకి ఓపీటీ రద్దుచేస్తే చాలా అన్యాయం జరిగినట్టేనని ఆమె అభిప్రాయపడ్డారు.
“మాస్టర్స్ చేసి స్వదేశానికి వెళ్లిపోతే లాభం లేదు. భారతదేశంలో ఇప్పుడు ఎంటెక్ లేదా ఎంఎస్‌కి పెద్ద విలువ లేదు. అక్కడి కంపెనీలు కూడా ఉద్యోగానుభవాన్నే చూస్తాయి.” అన్నారు దివ్య.
భవిష్యత్తులో అమెరికాలో వచ్చే విద్యార్థులకు ఓపీటీ ఉండదు అన్న నియమం పెడితే, ఇక్కడకు రావాలో వద్దో వాళ్లు నిర్ణయించుకుంటారనీ, కానీ, ఇప్పటికే వచ్చేసిన వాళ్లను రెండేళ్లల్లో వెనక్కి పొమ్మనడం అన్యాయమని ఆందోళన వ్యక్తం చేశారామె.

ఫొటో సోర్స్, Getty Images
‘దుర్వినియోగం చేసేవారూ ఎక్కువే’
ఓపీటీ అంటే చాలామందికి సరైన అవగాహన లేదని, కొంతమంది దుర్వినియోగం చేస్తున్నారని జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీలో ఫిజిక్స్ ప్రొఫెసర్ అరుణ్ అన్నారు.
“ఓపీటీ ఉద్దేశం డిగ్రీ చదువుకున్న ఫీల్డ్‌లో ఉద్యోగానుభవం సంపాదించడం. చాలామంది చదువుకున్న సబ్జెక్ట్ వేరు, ఓపీటీలో చేసే ఉద్యోగం వేరు. ఖాళీగా ఉండకుండా హెచ్1బీ స్పాన్సర్ చేసే ఉద్యోగం వచ్చేవరకు ఏదో ఒకటి చెయ్యాలి కాబట్టి ఏదో ఒక కంపెనీలో వలంటీర్‌గానైనా చేరిపోతారు. కొంతమంది ఫేక్ సర్టిఫికెట్లు కూడా పెడతారు. జాబ్ రాకుండా వీసా స్టేటస్ నిలుపుకోవాలంటే ఏదో ఒక పని చేస్తున్నట్టు చూపించాలి కాబట్టి నకిలీ సర్టిఫికెట్లు తెస్తారు.” అని వివరించారు ప్రొఫెసర్ అరుణ్.
అమెరికా వచ్చి చదువుకుని ఓపీటీ పీరియడ్ తరువాత వెనక్కి వెళ్లిపోయేవారే ఎక్కువని, హెచ్1బీ వచ్చి ఇక్కడే ఉద్యోగంలో నిలదొక్కుకున్నవాళ్లు తక్కువేనని ఆయన చెప్పారు.
” మూడు లక్షలమంది విద్యార్థులు చదువుకోవడానికి వస్తే హెచ్1బీ వీసాలు 65 వేలే ఉంటాయి. అంటే మిగిలినవారంతా ఇంటికి వెళ్లిపోవల్సిందే. ఓపీటీ ఉంచినా అందరికీ జాబ్స్ వచ్చేస్తాయన్న గ్యారంటీ లేదు” అన్నారు అరుణ్.
అయితే, నిజాయితీగా ప్రయత్నం చేసే విద్యార్థులు మాత్రం ఓపీటీ రద్దు వల్ల నష్టపోతారని ప్రొఫెసర్ అరుణ్ అభిప్రాయపడ్డారు.
“ముందూ వెనకా ఆలోచించకుండా వచ్చేస్తున్నారు. ఇక్కడకు వచ్చి కోర్సులో చేరాక, అది చదవలేక ఇబ్బందులు పడతారు. సొంతంగా ఉద్యోగం తెచ్చుకోలేరు. ఓపీటీలో మూడేళ్ల పాటు అక్కడా ఇక్కడా పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ కొంత సంపాదిస్తారు. చదువుకున్న చదువుకి, చేస్తున్న ఉద్యోగాలకి ఏం సంబంధం ఉండదు. మూడేళ్లు అయ్యాక వీసా స్టేటస్ పోగొట్టుకోకుండా ఉండటం కోసం మళ్లీ పీహెచ్‌డీలో చేరుతారు. ఇలాంటివన్నీ చూస్తే నియమాలు కఠినంగా ఉండటం మంచిదే అనిపిస్తుంది. కానీ, దానివల్ల నిజాయితీగా ఉండేవాళ్లు కూడా నష్టపోతారు.” అని దివ్య అన్నారు.
కాగా, ఓపీటీ రద్దు బిల్లు సెనేట్‌లో పాస్ అవ్వడం కష్టమని ప్రొఫెసర్ అరుణ్ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్ నుంచి ఎంతమంది వెళ్లారు?
2024 నవంబర్‌లో ‘ఓపెన్ డోర్స్’ విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం, 2023-24లో చదువుల కోసం అమెరికా వచ్చిన అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య 11,26,690. ఇదే ఇప్పటివరకు నమోదైన గరిష్ట సంఖ్య. 2022-23తో పోల్చుకుంటే ఈ సంఖ్య 7 శాతం పెరిగింది.
ఇందులో అత్యధికంగా భారత్ నుంచి వచ్చినవారే. చైనా రెండో స్థానంలో ఉంది. 2023-24లో అమెరికాలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న వారిలో అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య 6 శాతం కాగా, అమెరికా వాణిజ్య శాఖ ప్రకారం, వీరు ఆర్థిక వ్యవస్థకు 50 బిలియన్ డాలర్లు (సుమారు 4,30,482 కోట్లు) పైగా ఆదాయాన్ని అందించారు.
వీరిలో 5,02,291 మంది మాస్టర్స్ చదువుకోవడానికి వచ్చారు. కోర్సు పూర్తయ్యాక ఓపీటీ ద్వారా ఉద్యోగంలో చేరినవారు 2,42,782. అంతకుముందు ఏడాదితో పోల్చుకుంటే వీరి సంఖ్య 22 శాతం పెరిగింది.
అంతర్జాతీయ విద్యార్థుల్లో సగానికి పైగా STEM కోర్సుల కోసం వచ్చినవారే.
భారత్‌దే మొదటి స్థానం
2023-24లో భారత్ నుంచి 3,31,602 మంది ఉన్నత విద్య అభ్యసించడానికి అమెరికా వెళ్లారు. 2009 నుంచి ఇప్పటివరకు నమోదైన అత్యధిక సంఖ్య ఇదే. 2022-23తో పోలిస్తే ఈ సంఖ్య 23 శాతం పెరిగింది. వీరిలో మాస్టర్స్ చదువుకోవడానికి వచ్చినవారే ఎక్కువ.
మాస్టర్స్ కోర్సులో చేరినవారు 1,96,567 కాగా, ఓపీటీలో చేరినవారు 97,556. ఈ సంఖ్య అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 41 శాతం పెరిగింది.
ఓపెన్ డోర్స్ నివేదికను అమెరికా విదేశీ వ్యవహారాల శాఖకు చెందిన బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ అఫైర్స్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ (ఐఐఈ) సంయుక్తంగా ప్రచురించాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS