SOURCE :- BBC NEWS

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, సుప్రీంకోర్టు, తెలంగాణ ప్రభుత్వం

ఫొటో సోర్స్, ugc

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద వివాదాస్పదంగా మారిన 400 ఎకరాల ‘కంచ గచ్చిబౌలి’ భూములపై సుప్రీం కోర్టు నియమించిన కేంద్ర సాధికార కమిటీ (సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ-సీఈసీ) నివేదిక కీలకంగా మారింది.

పర్యావరణపరంగా అడవికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఆ భూమికి ఉన్నాయని సీఈసీ తన నివేదికలో స్పష్టం చేసింది.

ఇన్నాళ్లూ ప్రభుత్వ రికార్డుల ప్రకారం, కంచ గచ్చిబౌలి భూములు ‘కంచ అస్తాబల్ పోరంబోకు సర్కారీ’ భూములుగా నమోదై ఉన్నాయి.

సీఈసీ ఇచ్చిన నివేదికతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగే అవకాశం కనిపిస్తోంది.

‘కంచ గచ్చిబౌలి’ భూముల వివాదంపై ఇప్పటికే సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది.

ఏప్రిల్ 16న విచారణ సందర్భంగా చెట్లను కొట్టివేసిన వంద ఎకరాల్లో పర్యావరణాన్ని ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

తదుపరి విచారణ మే 15కు వాయిదా వేసింది.

అప్పటివరకు వివాదాస్పద ‘400 ఎకరాల కంచ గచ్చిబౌలి’ భూముల్లో ఎలాంటి కార్యకలాపాలూ జరగకుండా స్టే విధించింది.

సెంట్రల్ ఎంపర్డ్ కమిటీ నివేదికపై కౌంటర్ దాఖలు చేసేందుకు సుప్రీంకోర్టు ప్రభుత్వానికి నాలుగు వారాల గడువు ఇచ్చింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, సుప్రీంకోర్టు, తెలంగాణ ప్రభుత్వం

‘122 ఎకరాల్లో చెట్లను నరికివేశారు’

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఆనుకుని ఉన్న ‘కంచ గచ్చిబౌలి’ భూములపై వివాదం రేగిన సంగతి తెలిసిందే.

దీనిపై సుప్రీంకోర్టులో కేసు నమోదు కావడంతో ఏప్రిల్ 3న విచారణ మొదలైంది. చెట్ల నరికివేతను ఆపాలంటూ స్టే ఇచ్చింది. అనంతరం కేంద్ర సాధికార కమిటీని నియమించింది.

ఏప్రిల్ 10న సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ సభ్యులు వివాదాస్పద 400 ఎకరాలను పరిశీలించి, సుప్రీంకోర్టుకు నివేదికను సమర్పించారు.

అయితే భూమికి సంబంధించిన హక్కులను తెలంగాణ ప్రభుత్వం 2024 జులైలోనే టీజీఐఐసీకి బదలాయించింది. దీంతో టీజీఐఐసీ ఈ ఏడాది మార్చి 30న ఆ ప్రదేశంలో చెట్లను నరికివేసి భూమిని చదునుచేసే పనులు మొదలుపెట్టింది.

”టీజీఐఐసీ వివరాల మేరకు 122 ఎకరాల్లో చెట్లను పూర్తిగా వేర్లతో సహా కొట్టేశారు” అని నివేదికలో సీఈసీ స్పష్టం చేసింది.

వాల్టా చట్టం 2004 ప్రకారం కొన్ని మినహాయింపులున్న చెట్లను కొట్టివేయాలంటే సెల్ఫ్ డిక్లరేషన్‌తో కొట్టివేయొచ్చు. ఇందుకు ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్‌కు ఫారం 13ఏ ఇచ్చి, నిర్దేశిత ఫీజు చెల్లిస్తే సరిపోతుందని అటవీ శాఖాధికారులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

”మార్చి 17నే టీజీఐఐసీ దరఖాస్తు చేసుకుంది. మార్చి 29న అవసరమైన పరిహారం కూడా చెల్లించింది” అని చెప్పారు.

కానీ 125 మినహాయింపు లేని చెట్లను కూడా కూల్చివేసినట్లుగా ఏప్రిల్ 3న చిలుకూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పరిశీలనలో గుర్తించారని సీఈసీ తన నివేదికలో పేర్కొంది.

”మొత్తం 1524 చెట్లను కూల్చివేయగా.. అందులో 1399 చెట్లకు వాల్టా చట్టం నుంచి మినహాయింపులున్నాయి” అని చెప్పింది.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, సుప్రీంకోర్టు, తెలంగాణ ప్రభుత్వం

ఫొటో సోర్స్, uohyd.ac.in

‘అడవి’ లక్షణాలున్న భూమి..

సీఈసీ మొత్తం 69 పేజీల నివేదికను సుప్రీంకోర్టుకు ఇచ్చింది. ఇందులో కంచ గచ్చిబౌలి భూములకు ‘అడవి’ అని చెప్పడానికి కావాల్సిన గుణం ఉందని స్పష్టం చేసింది.

”ప్రాథమిక పరిశీలన ప్రకారం, ఆ ప్రాంత సహజ లక్షణం, పర్యావరణ పరంగా అడవిని తలపిస్తోంది” అని నివేదికలో పలుమార్లు ప్రస్తావించింది.

”ఈ ఏడాది మార్చి 4న అటవీ లక్షణాలు కలిగిన భూములు గుర్తించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా చదును చేసే పనులు చేపట్టారు. వన చట్టం 2023ను పట్టించుకోకుండానే టీజీఐఐసీ చదును చేసే పనులు మొదలుపెట్టింది” అని సీఈసీ తన నివేదికలో పేర్కొంది.

అలాగే టీజీఐఐసీ కూడా డీపీఆర్ సిద్ధం చేయకుండా నేరుగా అడవి వంటి లక్షణాలు కలిగిన ఆ భూమిని చదును చేయడానికి ముందుకెళ్లిందని సీఈసీ అభిప్రాయపడింది.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, సుప్రీంకోర్టు, తెలంగాణ ప్రభుత్వం

400 ఎకరాలను తనఖా పెట్టారు

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 1975లో దాదాపు 2324 ఎకరాలను కేటాయించింది . విశాలమైన ప్రాంతం కావడంతో ఇదంతా పచ్చదనం, చెట్లతో నిండి ఉంటుంది. జింకలు, నెమళ్లు కనిపిస్తుంటాయి.

సీఈసీ తన నివేదికలో ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది.

” ఈ ప్రాంతం పర్యావరణం, పచ్చదనం పరంగా ఉన్నతంగా ఉంది. రాళ్ల అమరికలు, కుంటలు, జీవవైవిధ్యం కారణంగా అక్కడ ఏదైనా పనులు చేయాలంటే కచ్చితంగా గట్టి పరిశీలన జరగాలి. అటవీ చట్టాల ప్రకారం అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవడమైనా సరే, నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుంది.

టీజీఐఐసీ తమకు యాజమాన్య హక్కులు ఉన్నట్లుగా చెబుతున్నప్పటికీ, అన్ని అనుమతులూ తీసుకోలేదు. భూమిని మార్టిగేజ్ చేయడం కూడా ఆర్థికంగా తీవ్రమైన ఉల్లంఘనగా భావించాలి” అని చెప్పింది.

ఈ భూమిని బేకాన్ ట్రస్టీషిప్ లిమిటెడ్ పేరుతో మార్టిగేజ్ చేసి నాన్-కన్వర్టబుల్ బాండ్లు జారీ చేసినట్లుగా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏప్రిల్ 10న సీఈసీకి ఇచ్చిన నివేదిక ద్వారా స్పష్టమవుతోంది.

దీనిపై సుప్రీంకోర్టు ఏప్రిల్ 16న తన విచారణ సందర్భంగా స్పందించింది.

”భూమిని మార్టిగేజ్ చేశారా లేదా.. అనే విషయం జోలికి మేం వెళ్లదలుచుకోలేదు. మేం జీవ వైవిధ్యం గురించి మాట్లాడుతున్నాం” అని స్పష్టం చేసింది.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, సుప్రీంకోర్టు, తెలంగాణ ప్రభుత్వం

సీఈసీ సిఫార్సులేంటంటే..

ఈ భూములపై సీఈసీ తన నివేదికలో కొన్ని ప్రతిపాదనలను సుప్రీంకోర్టు ముందు ఉంచింది.

  • సుప్రీంకోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఎలాంటి పనులూ మొదలుపెట్టకూడదు.
  • క్షేత్రస్థాయి అటవీ శాఖాధికారులు, వన్యప్రాణుల నిపుణులు, పర్యావరణవేత్తలు, ఐటీ, రిమోట్ సెన్సింగ్ నిపుణులు, సర్వే సంస్థ ప్రతినిధులతో కమిటీ వేసి అటవీ తరహా ప్రాంతాలను గుర్తించాలి.
  • అటవీ చట్టం 2023 ప్రకారం పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పర్యావరణ పరంగా ఇబ్బంది లేకుండా భూములను విభజించేందుకు ప్రత్యేక నిబంధనలు రూపొందించాలి.
  • సరైన పర్యావరణ నిబంధనలు పాటించకపోవడంతోపాటు 2006నాటి పర్యావరణ ప్రభావిత అంచనా అనుమతులు కూడా తీసుకోలేదు.
  • ఈ నేపథ్యంలో టీజీఐఐసీ అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. టీజీఐఐసీకి ఇచ్చిన అనుమతిని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి రద్దు చేయాలి.
  • వివాదాస్పద 400 ఎకరాలు సహా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంతాన్ని పర్యావరణ సెన్సిటివ్ జోన్‌గా ప్రకటించి వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా వంటి సంస్థలతో సమగ్ర అధ్యయనం చేయించే వరకు అక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యకలాపాలు జరగకుండా నిరోధించాలి.
  • ఫారం 13ఏ కింద తప్పుడు ధ్రువీకరణ ఇచ్చిన టీజీఐఐసీతోపాటు భారీగా చెట్లను కొట్టేసిన కాంట్రాక్టరుపై గట్టి చర్యలు తీసుకోవాలి. అందుకు వాడిన యంత్రాలను జప్తు చేయాలి.
  • ప్రాథమికంగా భూయాజమాన్య హక్కులు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఉన్నట్లుగా తెలుస్తోంది.
  • టీజీఐఐసీ చెబుతున్నట్లుగా హక్కుల బదలాయింపు పూర్తయ్యిందా.. లేదా అనే విషయంపై లోతైన పరిశీలన జరగాలి.
  • యాజమాన్య హక్కుల గురించి సుప్రీంకోర్టులో తేలే వరకు, భూములను మార్టిగేజ్ చేయడం, లీజు, వాణిజ్య అవసరాలకు వినియోగించడంపై స్టే ఇవ్వాలి.
  • ప్రత్యేక మురుగుశుద్ధి కేంద్రాలు నిర్మించి యూనివర్సిటీ క్యాంపస్‌లోకి ప్రవహిస్తున్న మురుగునీటి పైపులైన్ల అవుట్ లెట్లు మూసివేయాలి.
  • ఆర్థిక అక్రమాలు, ఇతర ఉల్లంఘనల నేపథ్యంలో స్వతంత్ర దర్యాప్తు సంస్థతో టీజీఐఐసీ అధికారుల పాత్ర, భూమి ప్రైవేటు అవసరాల కోసం దుర్వినియోగం చేయడంపై దర్యాప్తు చేయాలి.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, సుప్రీంకోర్టు, తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వం ఏం చెబుతోంది?

సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తన నివేదికను సమర్పించారు.

400 ఎకరాల్లో పర్యావరణ అనుకూల ఐటీ పార్కు అభివృద్ధి చేయాలనేది ప్రభుత్వ ఆలోచన అని పేర్కొన్నారు.

”కంచ గచ్చిబౌలి ప్రాంతంలో 2374.02 ఎకరాల భూమి ఉంది. 2003లో అప్పటి ప్రభుత్వం స్పోర్ట్స్ కోచింగ్ అకాడమీ కోసం ఐఎంజీ భారత అకాడమీ ప్రైవేట్ లిమిటెడ్‌కు కేటాయించింది. తర్వాత కేటాయింపు రద్దు చేసింది. దీనిపై ఐఎంజీ భారత్ హైకోర్టుకు వెళ్లగా.. 2024 మేలో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది” అని ప్రభుత్వం తన నివేదికలో ప్రస్తావించింది.

“20 ఏళ్లుగా ఖాళీగా ఉండటంతో చెట్లు, పొదలు పెరిగాయి. పక్కనే హెచ్‌సీయూలో ఉండే నెమళ్లు, జింకలు అక్కడికి వస్తున్నాయి. ఈ ప్రాంతంలో చిలుకల కుంట ఉంది. దాన్ని పరిరక్షించాలని నిర్ణయం తీసుకున్నాం” అని ప్రభుత్వం స్పష్టం చేసింది.

నకిలీ చిత్రాలు, వీడియోలతో కంచ గచ్చిబౌలి భూములపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుప్రీంకోర్టుకు వివరించారు .

నకిలీ ఫొటోలు, వీడియోలుగా పేర్కొంటూ కొన్నింటిని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించింది.

అయితే, వంద ఎకరాల్లో పచ్చదనం లేదా పర్యావరణాన్ని పునరుద్ధరించేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు స్పందించారు.

”ఆ భూమి ప్రభుత్వానిదేనని గతంలోనే సుప్రీంకోర్టు చెప్పింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటిస్తాం” అని మీడియాతో జరిగిన చిట్‌చాట్‌లో చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

SOURCE : BBC NEWS