SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
హెచ్చరిక: ఈ కథనంలో కొన్ని వివరాలు మిమ్మల్ని కలచివేయొచ్చు.
కర్ణాటకలోని బెళగావి జిల్లాలో ఒక మహిళ మృతి కేసులో ఆమె భర్త, అత్తమామల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
పిల్లలు లేకపోవడంతో అత్తమామలు ఆమెను దారుణంగా హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో భర్త పాత్ర ప్రత్యక్షంగా కనిపించనప్పటికీ, ఆయనపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు.
అయితే, ఈ నేరానికి పాల్పడేందుకు అత్తమామలు అనుసరించిన విధానం, మహిళా ఉద్యమకారులను, పోలీసులను షాక్‌కు గురిచేసింది.
శనివారం 34 ఏళ్ల రేణుక సంతోష్ హోనకాండేను ఆమె అత్త జయంతి హోనకాండే, మామ కమన్నా హోనకాండే బైకుపై తమ వెంట తీసుకెళ్లినట్లు చెబుతున్నారు.

ఈ కేసులో తొలుత కర్ణాటకలోని అథణీ తాలుకాకు సమీపంలో మాల్బడి గ్రామంలో జరిగిన బైకు ప్రమాదంలో రేణుకా చనిపోయినట్లు భావించారు.
కానీ, అత్తామామలు బైకుపై నుంచి రేణుకను తోసేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిసింది. ఆమె కింద పడగా, రేణుక తలపై రాయితో కొట్టారని, చీరతో గొంతు నులిమారని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఆ వృద్ధ దంపతులు బైకు వెనుక చక్రానికి రేణుక చీరను కట్టి, సుమారు 120 అడుగుల వరకు లాక్కెళ్లారని, దీన్ని రోడ్డు ప్రమాదంలా చిత్రీకరించడానికి ప్రయత్నించారని వెల్లడించారు పోలీసులు.
రేణుక అత్తామామల వయసు 62, 64 ఏళ్లు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ హత్యలో భర్త పాత్ర ఎంత?
బీబీసీకి బెళగావి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ భీమ్శంకర్ గులేద్ చెప్పిన వివరాల ప్రకారం రేణుక హత్య జరిగిన సమయంలో భర్త సంతోష్ హోనకాండే సంఘటనా స్థలంలో లేడు. అయితే, ఈ కేసులో రేణుక అత్తమామలతోపాటు భర్త సంతోష్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకున్నారు.
”సంతోష్ ప్రమేయంపై ఆరా తీస్తున్నాం. వరకట్న నిషేధ చట్టం కింద ఆయన్ను అరెస్ట్ చేశాం. భార్య కుటుంబం నుంచి సంతోష్ ఐదు లక్షల రూపాయలను కట్నంగా డిమాండ్ చేశారు. దీనిలో, రూ.50 వేలను గత నెలలోనే తీసుకున్నారు’’ అని ఎస్పీ భీమ్ శంకర్ చెప్పారు.
పుణెలోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో సంతోష్ పనిచేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.
‘‘ఆమె కూడా తక్కువేమీ చదువుకోలేదు. సంతోష్ భార్య బ్యాచిలర్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (బీఎంఎస్) డిగ్రీ చేసి, వైద్యురాలిగా పనిచేస్తున్నారు” అని అధికారులు చెప్పారు.
పిల్లలు లేకపోవడంతో ఆమెను హత్య చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. రేణుకకు పిల్లలు లేకపోవడంతో సంతోష్ మరో పెళ్లి కూడా చేసుకున్నారని, ప్రస్తుతం ఆమె గర్భవతని కూడా తెలిపారు పోలీసులు.

ఫొటో సోర్స్, Getty Images
‘మరింత దారుణం, అమానవీయం’
గత కొన్నేళ్లుగా మహిళలపై జరిగే హింసలో అనుసరిస్తున్న ధోరణి మారిందని మహిళా ఉద్యమకారులు అంటున్నారు.
రేణుక కేసులో, ఇటీవల కొన్ని కేసుల్లోనూ అనుసరించిన విధానాలు అంతకుముందు కంటే మరింత దారుణంగా, అమానవీయంగా ఉంటున్నాయని వారు చెప్పారు.
”1997లో బెంగళూరులో మేం చదువుకున్నాం. వరకట్న వేధింపులతో ప్రతినెలా 100 మంది మహిళలు చనిపోయేవారు. వారిలో 70 శాతం మంది మహిళలు శరీరం కాలిపోవడంతోనే మరణించేవారు. నేటికీ పరిస్థితిలో పెద్ద మార్పేమీ రాలేదు. ఎందుకంటే, చట్టాలు అంత సమర్థమైనవిగా రుజువు కావడం లేదు” అని మహిళా హక్కుల సంస్థ ‘అవేక్ష’కు చెందిన డోనా ఫెర్నాండెజ్ అన్నారు.
”మహిళలు చనిపోయేలా లేదా తీవ్రంగా గాయపడేలా పురుషులు కావాలనే డ్రైవ్ చేసిన సందర్భాలు ఉండేవి. ఆ తర్వాత కట్నం తీసుకుని మరో పెళ్లి చేసుకునేవారు. కానీ, ఇప్పుడు హింసా ధోరణి మారింది” అని డోనా ఫెర్నాండెజ్ చెప్పారు.
”దారుణమైన విధానంలో హింస జరుగుతున్నట్లు బెళగావి కేసును చూస్తే అర్ధమవుతోంది. ఎందుకంటే, వారు చట్టాన్ని సీరియస్‌గా తీసుకోలేదు” అని గ్లోబల్ కన్సర్న్స్ ఇండియా అండ్ ముక్తి అలయన్స్ ఎగైనెస్ట్ హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ బాండెడ్ లేబర్ అనే సంస్థకు డైరెక్టర్‌గా పని చేస్తు బృందా అడిగే అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘చట్టం ఉంది, కానీ అమలుపైనే విమర్శలు’
”పోలీసు స్టేషన్లో ఏదైనా కేసును నమోదు చేయాలంటే సమయం పడుతుంది. ఎందుకంటే, ఆ కేసులో ఎలాంటి రెచ్చగొట్టే చర్యలకు మహిళ పాల్పడలేదని నిర్ధరించడానికి పోలీసులు ఆధారాలను సేకరించాలి. కేసు కోర్టు ముందుకు వెళ్లినప్పుడు, పోలీసులు చాలా తక్కువ ఆధారాలను మాత్రమే సమర్పిస్తారు” అని బృందా అడిగే అన్నారు.
”ఫిర్యాదు నమోదైన తర్వాత వెంటనే పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని లేదా 24 గంటల్లోగా ఆధారాలు సేకరించడం లేదని మాకనిపిస్తుంది. అలా జరగకపోతే, కోర్టులో సాకులు చెబుతారు. వారు అన్ని నిబంధనలు అనుసరించారని మనం భావించినప్పటికీ, కోర్టు సందర్భోచిత ఆధారాలను అంగీకరించదు” అని బృందా చెప్పారు.
”పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే, 498ఏ అమలుకు చెందిన నిబంధనలు కూడా మారాయి. ప్రస్తుతం తొలుత మహిళలకు కౌన్సిలింగ్ ఇస్తారు. ఆ తర్వాతనే 498ఏ (లేదా బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 85) కింద విచారించడం ప్రారంభిస్తారు. రెండో కౌన్సిలింగ్‌కు భర్త పోలీసు స్టేషన్‌కు రాకపోతే ఆ కౌన్సిలింగ్ ఫెయిల్ అని రిజిస్టర్ చేస్తారు. అప్పుడు ఆ స్త్రీ ఒంటరిది అయిపోతుంది. ఇది చాలా బాధాకరమైన విషయం” అని ఫెర్నాండెజ్ ఉదాహరణగా చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
వివిధ స్థాయిలలో ఇలాంటి కేసులను నిర్వహించడంపై పలువురు కార్యకర్తలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
2023 డిసెంబర్ వరకు భర్తల వేధింపులకు చెందిన 3005 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో, 156 మంది వరకట్న వేధింపులతో మరణించారు.
2024 ముగింపు వరకు, భర్తలు పాల్పడే హింసకు సంబంధించి 2,943 కేసులు నమోదయ్యాయి. వరకట్నం కారణంతో 110 మంది చనిపోయారు.
2025 ఏప్రిల్ నాటికి ఈ కేసుల సంఖ్య 946గా, కట్నం వేధింపులకు సంబంధించిన మరణాలు 45గా నమోదయ్యాయి.
ఇదే సమయంలో, పుణెలోని ముల్షీ ప్రాంతానికి చెందిన వైష్ణవి హగవానే మరణం కూడా చర్చనీయాంశంగా మారింది. తొలుత ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారని భావించారు.
కానీ, పోస్టుమార్టం రిపోర్టులో ఆమె శరీరంపై గాయాల మార్కులు ఉన్నట్లు గుర్తించారు. కట్నం కోసం వైష్ణవిని వేధించి, చంపేశారని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు.
ఈ కేసులో వైష్ణవి భర్త శశాంక్తోపాటు అత్తమామలు, బావ, ఆడపడుచులను పోలీసులు అరెస్ట్ చేశారు.
”కేసులు పెరుగుతున్నాయి. కానీ, శిక్షల రేటు 3 శాతం కంటే తక్కువే ఉంటుంది. మహిళకు పెళ్లయితే, అప్సర మాదిరి ఉండాలి. ఎంత చదువుకున్నా వారికవసరం లేదు. ప్రతీది కట్నంపైన, పిల్లలపైనా, ముఖ్యంగా కొడుకు కనడంపైనే ఆధారపడి ఉంటుంది. ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీరా, వైద్యురాలా లేదా ఆస్ట్రోనాటా అన్నది ఎవరికీ ముఖ్యంకాదు” అని బృందా అడిగే అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)