SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Bangalore News Photos
3 నిమిషాలు క్రితం
కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ హత్యలో ఆయన భార్య, కూతురిపై ఆరోపణలు వస్తున్నాయి.
ఓం ప్రకాశ్ కొడుకు కార్తికేశ్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.
తన తల్లి పల్లవి, సోదరి కృతి డిప్రెషన్‌తో బాధపడుతున్నారని ప్రతి రోజూ తన తండ్రితో వాళ్లు గొడవ పడేవారని కార్తికేశ్ చెప్పారు.
‘‘నా తండ్రి హత్యలో వారిద్దరి ప్రమేయం ఉందని నేను బలంగా నమ్ముతున్నా’’ అని కార్తికేశ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

‘బయటివాళ్లెవరూ ఇంట్లోకి రాలేదు’
68 ఏళ్ల ఓం ప్రకాశ్ 2015 నుంచి 2017 వరకు కర్ణాటక డీజీపీగా పనిచేశారు.
ఆయన 1981 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి.
”తల్లీకూతుళ్లిద్దరినీ పోలీసు స్టేషన్‌లో ప్రశ్నించాం. వాళ్లు చెప్పిన ప్రతి విషయాన్నీ పరిశీలిస్తున్నాం. వాళ్లనింకా అరెస్టు చేయలేదు. వాళ్ల ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను కూడా పరిశీలిస్తున్నాం” అని బెంగళూరు ఏసీపీ వికాస్ కుమార్ బీబీసీతో చెప్పారు.
”ఆయన భార్యగానీ, కూతురు గానీ నేరాన్ని అంగీకరించలేదు. వాళ్లలో ఎవరో ఒకరికి.. లేదంటే ఇద్దరికీ ఈ హత్యలో ప్రయేమముందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఆ సమయంలో బయటి వ్యక్తులెవరూ అక్కడికి రాలేదు’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ పోలీసు అధికారి బీబీసీతో అన్నారు.
”వారి వైవాహిక జీవితంలో సమస్యలున్నాయన్నది నిజం. నా భార్య సహా మా కొలీగ్స్‌లోని చాలా మంది భార్యలతో పల్లవి ఈ విషయాన్ని ఎప్పుడూ చెబుతుండేవారు. అయితే ఇలా జరగడం మాత్రం చాలా ఆశ్చర్యం కలిగించింది” అని పేరు చెప్పడానికి ఇష్టపడని మరో మాజీ డీజీపీ బీబీసీతో చెప్పారు. ఓం ప్రకాశ్ ఈ మాజీ డీజీపీ దగ్గర జూనియర్ ఐపీఎస్ అధికారిగా పనిచేశారు.
రిటైర్డ్ డీజీపీ స్థాయి అధికారి భార్యకు ఫోన్ చేసి ఓం ప్రకాశ్ హత్య గురించి పల్లవి చెప్పడంతో పోలీసులకు విషయం తెలిసింది.
ఆ అధికారే హత్య గురించి పోలీసులకు చెప్పారు.

ఫొటో సోర్స్, ANI
కొడుకు ఫిర్యాదులో ఏముంది?
”నిన్ను చంపేస్తానంటూ మా అమ్మ వారం నుంచి మా నాన్నను బెదిరిస్తున్నారు. మా నాన్న తన సోదరి సరితా కుమారికి ఇంటికి వెళ్లారు. ఏప్రిల్ 18న కృతి.. అక్కడికి వెళ్లి మా నాన్నను మా ఇంటికి తిరిగి రావాలంటూ ఒత్తిడి చేశారు” అని కార్తికేశ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఓం ప్రకాశ్ తన కుటుంబంతో కలిసి మూడంతస్తుల ఇంట్లో ఉంటారు. ఓం ప్రకాశ్, ఆయన భార్య గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంటారు. కార్తికేశ్, ఆయన భార్య ఫస్ట్ ఫ్లోర్‌లో, కృతి మూడో అంతస్తులో నివసిస్తున్నారు.
ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో ఇంట్లో నేలపై తన తండ్రి పడిపోయి ఉన్నారని పక్కింటి వ్యక్తి నుంచి ఫోన్ వచ్చే సమయానికి కార్తికేశ్ గోల్ఫ్ కోర్స్ దగ్గర ఉన్నారు.
దాదాపు ఆరు గంటల సమయానికి కార్తికేశ్ ఇంటికి చేరుకున్నారు.
”పోలీసులు, జనాలు మా ఇంటి చుట్టూ ఉన్నారు. మా నాన్న శరీరం చుట్టూ రక్తం ఉంది. ఆయన తల దగ్గర కత్తి, బాటిల్ ఉన్నాయి” అని కార్తికేశ్ చెప్పారు.
హత్యకు ముందు ఏమన్నా గొడవ జరిగిందా అన్న ప్రశ్నకు ”దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది” అని ఒక పోలీసు అధికారి చెప్పారు.

ఫొటో సోర్స్, ANI
హోం మంత్రి ఏమన్నారు?
”ప్రాథమిక సమాచారం ఆధారంగా ప్రకాశ్ భార్య నేరానికి పాల్పడ్డారని భావిస్తున్నాం. దర్యాప్తు కొనసాగుతోంది. అన్ని విషయాలు తెలియడానికి మరికొంత సమయం పడుతుంది” అని కర్ణాటక హోం మంత్రి జి పరమేశ్వర చెప్పారు.
2015లో డీజీపీగా ఉన్నప్పుడు ప్రకాశ్ తనతో కలిసి పనిచేశారని పరమేశ్వర గుర్తు చేసుకున్నారు.
”ఆయన చాలా మంచి అధికారి. మంచి వ్యక్తి. ఇలా జరిగి ఉండాల్సింది కాదు. దర్యాప్తులోనే అన్ని విషయాలు తెలుస్తాయి” అని పరమేశ్వర అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)