SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Meenakshi Raghavan
కేరళకు చెందిన మీనాక్షి రాఘవన్ అనే 82 ఏళ్ల మహిళ కలరిపయట్టు అనే యుద్ధ కళను నేర్పిస్తున్నారు. ఈ బాధ్యత నుంచి రిటైర్ అయ్యే ఉద్దేశం లేదని చెబుతున్నారామె.
“నేను చనిపోయే వరకు కలరిని సాధన చేస్తూనే ఉంటాను” అని మీనాక్షి చెప్పారు.
కలరిని ప్రాక్టీస్ చేస్తున్న అత్యంత వృద్ధ మహిళ మీనాక్షేనని చాలామంది భావిస్తారు.
కేరళలో సుమారు 3,000 సంవత్సరాల కిందట కలరిపయట్టు (కలరి అంటే యుద్ధభూమి, పయట్టు అంటే పోరాటం) ప్రారంభమైంది. ఇండియాలో ఇది ఒక పురాతన యుద్ధ కళ.
ఈ కళను పోరాటం కోసం మాత్రమే నేర్చుకోరు. బలం, క్రమశిక్షణ, ఆత్మరక్షణ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి కూడా సహాయపడుతుంది.
మీనాక్షిని కేరళలోని ఆమె స్వస్థలం వడకరలో ప్రేమగా ‘మీనాక్షి అమ్మ’ అని పిలుస్తారు. కేరళలో సుప్రసిద్ధులైన కొందరు కలరి యోధులకు వడకర పుట్టినిల్లు.
మీనాక్షి అప్పుడప్పుడు ఇతర నగరాల్లో షోలు కూడా ఇస్తుంటారు. ఎక్కువ సమయం ఆమె తన సొంత కలరి స్కూల్లో ట్రైనింగ్‌లోనే గడుపుతారు.
మీనాక్షి భర్త రాఘవన్ 1950లో ఈ స్కూలును ప్రారంభించారు. రోజూ ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఆమె ట్రైనింగ్ ఇస్తుంటారు.
“దాదాపు 50 మంది విద్యార్థులకు రోజూ నేర్పిస్తాను. నా నలుగురు పిల్లలు కూడా మా నుంచే కలరి నేర్చుకున్నారు” అని మీనాక్షి చెప్పారు.


ఫొటో సోర్స్, Meenakshi Raghavan
కలరిపయట్టులో ఏం నేర్పిస్తారు?
కలరిపయట్టులో నాలుగు దశలుంటాయి. దానిని నేర్చుకోవడానికి సమయం, ఓపిక చాలా అవసరం.
శిక్షణ మెయిపట్టుతో ప్రారంభమవుతుంది. ఇందులో ఆయిల్ మసాజ్, శరీరాన్ని బలంగా, సరళంగా మార్చడానికి వ్యాయామాలు ఉంటాయి.
విద్యార్థులు రెండేళ్ల తర్వాత కోల్తారి (కర్రల పోరాటం), తరువాత అంగథారి (ఆయుధ పోరాటం), చివరకు వెరుంకై నేర్చుకుంటారు. ఈ దశలో విద్యార్థులు తమ చేతులతోనే పోరాడతారు. కలరిపయట్టును పూర్తిగా నేర్చుకోవడానికి ఐదు సంవత్సరాలు పడుతుంది.
శ్వాస పద్ధతులు, మర్మశాస్త్రలాంటి విధానాలను కలరిపయట్టు నుంచే కుంగ్‌ఫూ స్వీకరించి ఉండొచ్చని వినోద్ కడంగల్ అనే కలరి గురువు అభిప్రాయపడ్డారు.
భారతీయ బౌద్ధ సన్యాసి బోధిధర్మ 6వ శతాబ్దంలో ఈ క్రీడను చైనాకు తీసుకెళ్లి షావోలిన్ సన్యాసులకు నేర్పించాడనే ఒక వాదన ఉంది. కుంగ్‌ఫూపై దీని ప్రభావం ఉందని చెబుతారు.

ఫొటో సోర్స్, Getty Images
మీనాక్షి ‘కలరి’ ప్రయాణం ఎలా మొదలైంది?
75 సంవత్సరాల కిందట కలరి కోసం ఎర్రటి మట్టి వేదిక (ఎరీనా) మీద శిక్షణ తీసుకున్న మొదటి రోజును మీనాక్షి ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు.
“నాకప్పుడు ఏడేళ్లు, డాన్స్ అంటే చాలా ఇష్టం. నా గురువు వీపీ రాఘవన్ మా నాన్నతో మాట్లాడి, కలరిపయట్టు నేర్పించాలని సూచించారు” అని మీనాక్షి చెప్పారు.
మీనాక్షి గురువు రాఘవన్ కేరళలోని థియ్య కమ్యూనిటీకి చెందినవారు. తక్కువ కులానికి చెందినవారు కావడంతో కలరి పాఠశాలల్లో ప్రవేశం నిరాకరించారు. దీంతో ఆయన, సోదరులు సొంతంగా స్కూలును ప్రారంభించారు. ఆ సమయంలో రాఘవన్‌కు 15 సంవత్సరాలు.
“కలరి నేర్చుకోవడంలో అమ్మాయిల పట్ల వివక్ష ఉండేది కాదు. అప్పట్లో అన్ని కేరళ పాఠశాలల్లో శారీరక విద్య తప్పనిసరి. కానీ మేం యుక్తవయస్సుకు వచ్చిన తర్వాత శిక్షణ వద్దనుకునేవారు” అని మీనాక్షి అన్నారు.
అయితే, మీనాక్షి తండ్రి ఆమెకు యుక్త వయసు చివరి వరకు శిక్షణకు మద్దతు ఇచ్చారు. 17 ఏళ్ల వయసులో మీనాక్షి తన గురువు రాఘవన్‌తో ప్రేమలో పడ్డారు, వివాహం చేసుకున్నారు. ఇద్దరు కలిసి వందల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. కొందరి దగ్గర ఫీజు కూడా తీసుకునేవారు కాదట.
“ఆ సమయంలో చాలామంది పిల్లలు పేద కుటుంబాలకు చెందినవారే” అని మీనాక్షి చెప్పారు.
వారి ట్రైనింగ్ స్కూల్ ప్రధానంగా విరాళాల ద్వారానే నడిచింది. అదనపు ఆదాయం కోసం రాఘవన్ టీచర్‌గా కూడా పనిచేశారు. 2007లో ఆయన మరణించిన తర్వాత, మీనాక్షి కలరి స్కూల్ బాధ్యతలు తీసుకున్నారు.

ఫొటో సోర్స్, Meenakshi Raghavan
‘అమ్మే నాకు బలమైన ప్రత్యర్థి’
మీనాక్షికి రిటైర్ అయ్యే ఆలోచన లేదు. కానీ, ఏదో ఒక రోజు పెద్ద కుమారుడు సంజీవ్‌కు తమ ట్రైనింగ్ స్కూలును అప్పజెప్పాలని అనుకుంటున్నారామె.
62 ఏళ్ల సంజీవ్ కూడా వారి స్కూల్లో ట్రైనింగ్ ఇస్తుంటారు. తన తల్లి నుంచి విద్య నేర్చుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని, ఆమె ఇప్పటికీ ఈ యుద్ధకళలో తనకు గట్టి పోటీ ఇస్తుంటారని సంజీవ్ అంటున్నారు.
కలరి గురువుగా మీనాక్షి వడకర పట్టణంలో పాపులర్. మేం ఆమెతో మాట్లాడుతుండగా ముగ్గురు రాజకీయ నాయకులు ఆమెను అవార్డుల కార్యక్రమానికి ఆహ్వానించేందుకు వచ్చారు.
“అమ్మా, మమ్మల్ని ఆశీర్వదించండి” అంటూ వారిలో ఒకరు చేతులు జోడించి అడిగారు.
“నన్ను ఆహ్వానించినందుకు థ్యాంక్స్. నేను వస్తాను” అని మీనాక్షి బదులిచ్చారు.
మీనాక్షి విద్యార్థులు ఆమె గురించి చాలా గొప్పగా చెబుతారు. వారిలో చాలామంది కేరళలోని వివిధ ప్రాంతాలలో సొంతంగా కలరి స్కూళ్లను నడుపుతున్నారు.
“ఆమె మహిళలకు స్ఫూర్తి. విద్యార్థుల పట్ల ప్రేమ, శ్రద్ధను చూపుతారు. కలరి నేర్పే విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు” అని ఆమె పూర్వ విద్యార్థులలో ఒకరైన కేఎఫ్ థామస్ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)