SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
ఒక గంట క్రితం
పాకిస్తాన్ డ్రోన్, మిసైల్ దాడులను భారత బలమైన వైమానిక రక్షణ వ్యవస్థ సమర్థంగా అడ్డుకుందని ఇండియన్ ఆర్మీ పేర్కొంది.
ఆపరేషన్ సిందూర్ గురించి సోమవారం భారత ఆర్మీ విలేఖరుల సమావేశం నిర్వహించింది. ఇందులో డీజీఎంవో లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘయ్, డీజీఏవో, ఎయిర్ మార్షల్ ఏకే భారతి, డీజీఎన్‌వో, వైస్ అడ్మిరల్ ఏఎన్ ప్రమోద్ పాల్గొన్నారు.
“భారత బలమైన, బహుళ అంచెల రక్షణ వ్యవస్థను పాకిస్తాన్ ఛేదించలేకపోయింది” అని డీజీఎంవో లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘయ్ అన్నారు.
వైమానిక రక్షణ వ్యవస్థ దేశానికి గోడలా నిలిచిందని ఎయిర్ మార్షల్ ఏకే భారతి అన్నారు. ”ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా చేసుకున్నాం, పాకిస్తాన్‌లోని సామాన్య పౌరులకు ఎలాంటి నష్టం వాటిల్లలేదు” అని ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు.

అణ్వాయుధ కేంద్రంపై దాడి ప్రశ్నకు జవాబిచ్చిన ఎయిర్ మార్షల్..
పాకిస్తాన్‌లోని అణ్వాయుధ కేంద్రంగా చెబుతున్న కిరానా హిల్స్‌పై భారత్ దాడి చేసిందా అని మీడియా ప్రశ్నించగా, ఎయిర్ మార్షల్ ఏకే భారతి స్పందిస్తూ, “కిరానా హిల్స్‌లో ఒక అణ్వాయుధ కేంద్రం ఉందని మాకు చెప్పినందుకు ధన్యవాదాలు. దాని గురించి మాకు తెలియదు. కిరానా హిల్స్‌లో ఏముందో మాకు తెలియదు కానీ, మేమైతే దాడి చేయలేదు” అని ఏకే భారతి సమాధానమిచ్చినట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ పేర్కొంది.
చైనా తయారీ పీఎల్-15 మిసైల్ గురించి మీడియా సమావేశంలో ఏకే భారతి ప్రస్తావించారు. కొన్ని చిత్రాలను చూపిస్తూ, ‘ఈ భాగాలు చైనా క్షిపణి పీఎల్-15 అయ్యుండొచ్చు’ అని ఆయన పేర్కొన్నారు.
భారత ఆర్మీ కూల్చేసినట్లుగా చెబుతున్న కొన్ని డ్రోన్ల శిథిలాల ఫోటోలనూ ఏకే భారతి చూపించారు. ఈ శిథిలాలు తుర్కియే తయారీ యిహా, సోంగర్ డ్రోన్లకు సంబంధించినవని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, ANI
“మా పోరాటం ఉగ్రవాదంపైనే. పాకిస్తాన్ సైన్యంతోనో, పౌరులతోనో కాదు. దీనిపై మేం స్పష్టంగా ఉన్నాం” ఏకే భారతి అన్నట్లు ఏఎన్ఐ తెలిపింది.
ఎలాంటి దాడులనైనా తిప్పికొట్టడానికి నిరంతర నిఘా కొనసాగిస్తున్నామని వైఎస్ అడ్మిరల్ ప్రమోద్ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)