SOURCE :- BBC NEWS

కులగణన, సామాజిక న్యాయం, రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు

ఫొటో సోర్స్, Getty Images

  • రచయిత, నల్లపనేని కమలాదేవి
  • హోదా, బీబీసీ ప్రతినిధి
  • 3 మే 2025

కేంద్రం నిర్ణయాన్ని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్వాగతించారు.

కులగణనకు తెలంగాణ రాష్ట్రం ఒక నమూనాగా నిలుస్తుందని రాహుల్ గాంధీ అన్నారు.

అసలు కులగణన ఎందుకు, కులగణన వల్ల కలిగే ప్రయోజనాలేంటి? దేశంలో ఇప్పటిదాకా ఎన్నిసార్లు కులగణన జరిపారు? కులగణనను వ్యతిరేకించేవారి వాదనలేంటి? తెలుగు రాష్ట్రాల పరిస్థితులేంటి వంటి విషయాలు తెలుసుకుందాం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
కులగణన, సామాజిక న్యాయం, రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు

ఫొటో సోర్స్, Getty Images

1. భారత్‌లో కులగణన ఎప్పుడు జరిపారు?

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత్‌లో కులగణన జరగలేదు. దేశవిభజనకు ముందు బ్రిటిష్ పాలనా కాలంలో 1931లో చివరిసారిగా కులగణన జరిగింది. అయితే ఎస్సీ, ఎస్టీ జనాభా లెక్కలు మాత్రం పదేళ్లకోసారి జరిపే జనగణనలో సేకరిస్తున్నారు.

దేశంలో చివరిసారిగా 2011లో జనాభా లెక్కలు సేకరించారు. 2021లో జరగాల్సిన జనగణన కరోనా కారణంగా వాయిదా పడింది. తదుపరి జనగణనతో పాటు కులగణన చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

మళ్లీ ఇన్నాళ్లకు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత, దేశవిభజన జరిగిన తర్వాత తొలిసారి కులాల లెక్కలు తేల్చేందుకు అడుగులు పడుతున్నాయి.

ఇప్పటిదాకా కులాలకు సంబంధించి 1931లో జరిగిందే అధికారిక లెక్క. 1941లో బ్రిటిష్ పాలనలో కులగణన జరిగినప్పటికీ ఆ వివరాలు బయటకు వెల్లడించలేదు.

సామాజిక, ఆర్థిక కుల గణన (సోషియో ఎకనమిక్ కాస్ట్ సెన్సస్ – ఎస్‌ఈసీసీ)లో భాగంగా 2011లో సేకరించిన సమాచారాన్ని బయటపెట్టబోవడం లేదని జులై 2022లో పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

సుప్రీంకోర్టులో ఈ విషయంపై విచారణ సమయంలో 2021లో కేంద్రం స్పందించింది. ”2011లో చేపట్టిన సామాజిక-ఆర్థిక కులగణనలో చాలా లోపాలు ఉన్నాయి. తప్పులు దొర్లడంతోపాటు ఆ సమాచారం దేనికీ ఉపయోగపడదు”అని కేంద్రం చెప్పింది.

రాజ్యాంగం ప్రకారం జనగణన నిర్వహించే అధికారం రాష్ట్రాలకు లేదు. కానీ కులసర్వే జరపొచ్చు.

స్వతంత్ర భారత దేశంలో ఇప్పటిదాకా అధికారికంగా తెలంగాణ, కర్ణాటక, బిహార్ రాష్ట్రాల్లో కులాలసర్వే జరిగింది.

‘‘కులగణన అవసరాన్ని, ప్రాధాన్యాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జాతీయస్థాయిలో పదే పదే ప్రస్తావించడంతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కులసర్వే హామీని నిలబెట్టుకోవడంతో బీజేపీకి ఈ అంశం రాజకీయ సవాలుగా మారిందని, అందుకనే బిహార్ ఎన్నికలకు ముందు దీనిపై కేంద్రం ప్రకటన చేసిందని’’ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పారు.

కులగణన, సామాజిక న్యాయం, రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు

ఫొటో సోర్స్, Getty Images

2. కులగణన ఎందుకు?

సామాజిక న్యాయం అమలుకావాలంటే కులగణన తప్పనిసరిగా జరిగి తీరాలన్నది నిపుణుల అభిప్రాయం. నిధులు, నియామకాలు, సంక్షేమపథకాలు, విధానాల రూపకల్పనకు కులగణన కీలకంగా మారుతుందని చెబుతున్నారు. బీసీల రిజర్వేషన్లు రాష్ట్రానికో రకంగా ఉన్నాయి. అవి ఆయా రాష్ట్రాలు చేపట్టిన సర్వేల ఆధారంగా ఉంటాయి. ఎస్సీ ఎస్టీలకు వారి పూర్తి జనాభాకు తగిన నిష్పత్తిల్లో రిజర్వేషన్లు ఇస్తే, బీసీలకు మాత్రం వారి జనాభాలో సగం నిష్పత్తికే రిజర్వేషన్ ఇస్తున్నారని ఆరోపణ.

మండల్ కమిషన్ అంచనా ప్రకారం దేశంలో బీసీలు 52 శాతం ఉంటే వారికి 27 శాతం రిజర్వేషన్ ఉంది. ఇక ఓసీల జనాభా చాలా తక్కువ ఉన్నప్పటికీ వారిపై ఏ సర్వే లేకుండానే నేరుగా ఎస్టీల కంటే ఎక్కువగా ఆర్థికంగా వెనకబడిన వర్గాల కింద10 శాతం రిజర్వేషన్ అమలవుతోందనే విమర్శలు వినిపిస్తుంటాయి.

”కులగణన వల్ల సమాజంలో వనరులు ఏ స్థాయిలో ఉన్నాయో తెలియడంతోపాటు అవి ఎవరి దగ్గర పోగుపడ్డాయో కూడా తెలుసుకోవచ్చు. అసమానతలు ఉంటే కులగణనతో మేలు జరుగుతుంది. ముందు కొన్ని రకాల రాజకీయ సమస్యలు వచ్చే మాట వాస్తవమే. అయితే, దీర్ఘకాలంలో దీనితో దేశానికి మేలు జరగొచ్చు”అని ఆయన తెలిపారు.

దేశంలో మెజార్టీ వర్గంగా ఉన్న బీసీలకు విద్య, ఉపాధి, రాజకీయాధికారం విషయంలో సరైన ప్రాతినిధ్యం లభించడం లేదని ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ పద్మజ బీబీసీకి చెప్పారు.

”పరోక్ష పన్నుల రూపంలో వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రజలు దేశానికి భారీ స్థాయిలో ఆదాయం అందిస్తున్నా కనీస సౌకర్యాలు పొందలేకపోతున్నారు. ఈ అన్యాయం సరికావాలంటే కులాల వారీగా జనాభాను లెక్కించి, వాళ్ల స్థితిగతులను పరిశీలించి, సమగ్ర కార్యాచరణతో వారికి ప్రతిఫలం అందేలా చేయడమే పరిష్కారం” అని పద్మజ సూచించారు.

కులగణన, సామాజిక న్యాయం, రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు

ఫొటో సోర్స్, Getty Images

3. కులగణనపై వ్యతిరేకత సరైనదేనా?

భారతీయ సమాజాన్ని విభజించి పాలించాలనే వలసవాదలక్ష్యంలో భాగంగా సామాజిక లోపాలను సామ్రాజ్యవాద వలసవాదానికి ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతో బ్రిటిష్ ప్రభుత్వం భారత్‌లో కులగణన జరిపిందనే వాదన ఉంది. మరి అలాంటి కులగణన ఇప్పుడెందుకు నిర్వహించాలన్న ప్రశ్నకు సమాధానం సామాజిక న్యాయాన్ని సాధించడమని ప్రొఫెసర్ నాగేశ్వర్ విశ్లేషించారు.

”కులాన్ని మరిపింపజేయాలి, కులరహిత సమాజాన్ని సృష్టించాలి. కులచైతన్యాన్ని తగ్గించాలి. కుల జాడ్యాన్ని వదిలించాలి అనే పేరుతో కులగణన వ్యతిరేకించడం సరైనది కాదు. దేశంలో 95శాతం పెళ్లిళ్లు ఒకే కులంలో జరుగుతున్నాయి. ఇక కులం ఎక్కడ లేదు? మనకు ఇష్టమున్నా లేకపోయినా కులం అనేది భారత్‌లో ఒక వాస్తవం. ప్రభుత్వ విధానాల్లో, రాజకీయ వ్యవస్థలో, సామాజిక జీవనంలో కులం ఉంది. కులగణన వల్ల కులభావం పెరుగుతుందనడంలో హేతుబద్ధత లేదు” అని ఆయనన్నారు. కులాంతర వివాహం వల్ల పుట్టిన పిల్లలకు మల్టీక్యాస్టిజం అనే ఆప్షన్ ఉపయోగించవచ్చని ఆయన సూచించారు.

తాము నష్టపోతామని భావించేవారు, తమ అధికారానికి, రాజకీయ ఆధిపత్యానికి గండిపడుతుందనుకునేవారు మాత్రమే కులగణను వ్యతిరేకిస్తున్నారని రిటైర్డ్ ప్రొఫెసర్ పద్మజ అన్నారు. కులగణనను వ్యతిరేకించడం ప్రగతిశీల ఆలోచన కానేకాదని ఆమె అన్నారు.

”కులం గురించి బహిరంగంగా మాట్లాడకపోయినప్పటికీ ఎన్నికల్లో సీట్ల కేటాయింపు మొదలుకుని, అన్ని వ్యవహారాలూ భారత్‌లో కులం ఆధారంగానే జరుగుతాయి. కులమే అన్ని నిర్ణయాలకూ ప్రాతిపదిక. బయటకు మాట్లాడనంత మాత్రాన కుల ప్రభావం లేదనడం సమంజసం కాదు. అధికార స్థానాల్లో ఎవరున్నారు? రాజ్యాంగం ఇచ్చిన హక్కులు అందరికీ ఒకేలా అమలవుతున్నాయా? దళితులు, ఆదివాసీలకు సరైన ప్రాతినిధ్యం దక్కుతోందా? వెనకబడిన వర్గాలకు శ్రమకు తగ్గ ఫలితం లభిస్తోందా వంటివి పరిశీలిస్తే సమాజంపై కుల ప్రభావం ఎంత ఉందో అర్ధమవుతుంది” అని పద్మజ విశ్లేషించారు.

”కుల వ్యవస్థ వల్ల ప్రయోజనాలు పొందిన అగ్ర వర్ణాల లెక్కింపు దీనిలో మొదటిది. వారు తమను లెక్కించొద్దనే కోరుకుంటారు. మరోవైపు ఆర్థికంగా ముందు వరుసలోనున్న కొన్ని తరగతులు తమకు ఎలాంటి కులం లేదని చెబుతాయి. ఇప్పుడు వారిని ఏ కేటగిరీలో పెట్టాలి అనేది మరో సమస్య”అని ఆయన చెప్పారు.

”జనాభా లెక్కల్లో భాగంగా మీ కులం ఏమిటని అందరినీ అడిగినప్పుడు, తమకు కులం అనేది ఒకటుందని అందరికీ మనం మరోసారి గుర్తు చేసినట్టు అవుతుంది”అని ఆయన అన్నారు.

కులగణన, సామాజిక న్యాయం, రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు

ఫొటో సోర్స్, Getty Images

4. రిజర్వేషన్ల డిమాండ్లు పెరిగితే ఏం చేయాలి?

దేశంలో వెనకబడిన వర్గాలు 52శాతం ఉన్నాయని మండల్ కమిషన్ చెప్పింది కూడా 1931 కులగణన లెక్కల ప్రకారమేనని ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్ల తర్వాత కూడా మనం వెనకబడిన వర్గాల గురించి ఆ లెక్కల ప్రకారమే మాట్లాడుకోవడం ఏ రకంగా సరైనదని ఆయన ప్రశ్నించారు.

”స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కులగణన జరగకపోయినప్పటికీ ఉత్తరాది నుంచి దక్షిణాది దాకా అనేకరాష్ట్రాల్లో రిజర్వేషన్ల డిమాండ్లు పెరుగుతూనే ఉన్నాయి. కాబట్టి కులగణన వల్ల రిజర్వేషన్ల సమస్య ఏర్పడుతుందన్నవాదన అర్ధం లేనిది. కులగణన జరిగితే కనీసం శాస్త్రీయ సమాచారం ఉంటుంది. కొత్త డిమాండ్లు రావడం అనేది నిజం. కానీ దానికి హేతుబద్ధత ఉంటుంది” అని ఆయన అభిప్రాయపడ్డారు.

”కులగణన వల్ల అన్ని వివరాలూ సమగ్రంగా తెలుస్తాయి. దేశంలోని ప్రతి మనిషీ స్థితిగతులూ అర్ధమవుతాయి, ప్రభుత్వాల విధానాల రూపకల్పనకు ఇది ప్రాతిపదిక అవుతుంది. కులగణన తర్వాత పథకాల అమలుకు సమగ్ర కార్యాచరణను రూపొందిస్తే రాజ్యాంగం తమకు ఇచ్చిన హక్కులు నెరవేరుతున్నాయన్న నమ్మకం సమాజంలో అన్ని వర్గాలకు కలుగుతుంది” అని పద్మజ విశ్లేషించారు..

సమాజంలో అణగారిన వర్గాల కోసం ప్రభుత్వాలు వేల కోట్లు సంక్షేమ పథకాల రూపంలో ఖర్చు పెడుతున్నాయని, సామాజిక, ఆర్థిక స్థితిగతులు శాస్త్రీయంగా సేకరించకుండా ఇలా ఖర్చుపెట్టడం వల్ల అసలైన అర్హులకు ప్రయోజనం దక్కడం లేదన్న వాదన ఉంది.

కులగణన ద్వారా ఆయా కులాలకు చెందినవారు ఎక్కడ వెనుకబడిఉన్నారు, ఎందులో పురోగతి చెందుతున్నారు వంటి వివరాలన్నీ తెలుస్తాయని, అందుకు తగ్గట్టుగా వారికి అవకాశాలు కల్పించవచ్చని, అంతిమంగా ఇది సమాజాన్ని పురోగమింపచేస్తుందని విశ్లేషకులు అంటున్నారు.

”కులగణన అంటే కులాల లెక్కింపు మాత్రమే కాదు. కుల, సామాజిక, ఆర్థిక స్థితిగతులకు ఉన్న సంబంధాన్ని లెక్కిస్తారు. ఇది సామాజిక న్యాయం వైపు ప్రభుత్వాలు నిర్ణయం తీసుకునేలా చేస్తుంది” అని నాగేశ్వర్ తెలిపారు.

అలాగే కులగణన వల్ల వెనకబడిన వర్గాల ఐక్యత దెబ్బతింటుందన్న వాదనను ఆయన తోసిపుచ్చారు.

”భారత్‌లో సామాజిక అసమానతలున్నాయి. కులానికి బహురూపాలున్నాయి. వెనకబడిన వర్గాల్లోనూ అనేక అసమానతలున్నాయి. వెనకబడినవర్గాలు ఒక్కటిగా లేవు. కులగణన వల్ల వెనకబడిన వర్గాల ఐక్యత దెబ్బతింటుందనడంలో అర్ధం లేదు. అలాగే కులగణన కులాన్ని అంతం చేస్తుంది. అణగారిన వర్గాలకు సాధికారిత లభించేలా చేస్తుంది అన్నదాంట్లో కూడా నిజం లేదు.

సామాజిక ఆర్థిక ప్రగతికి, దోహదం చేస్తుందే తప్ప అదే అన్ని సమస్యలకూ పరిష్కారం కాదు అని నాగేశ్వర్ అన్నారు.

కులగణన, సామాజిక న్యాయం, రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు

ఫొటో సోర్స్, Getty Images

5. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి?

ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కులసర్వే జరిపింది. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే’ పేరుతో ఈ కార్యక్రమం నిర్వహించింది.

కుల సర్వే పూర్తయ్యాక వివాదాలు పెరిగాయి. ముఖ్యంగా బీసీల సంఖ్య 2014 కంటే బాగా తగ్గడంతో బీసీ సంఘాలు, పార్టీల్లోని బీసీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు.

ఇక ఆంధ్రప్రదేశ్‌లోనూ కులసర్వేకు ప్రయత్నాలు జరిగాయిగానీ కార్యరూపం దాల్చలేదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కులగణన చేపట్టాలని ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది.

అంతకుముందు రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇంటింటి సర్వే జరిగింది. ప్రతీ కుటుంబంలో ఉన్న వారి వివరాలు అధికారికంగానే సేకరించారు.

అందులో కులాలు, మతాల వారి వివరాలు కూడా ఉన్నాయి. అయితే ఆ లెక్కలను అధికారికంగా వెల్లడించలేదు.

కులగణన, సామాజిక న్యాయం, రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు

ఫొటో సోర్స్, Getty Images

అప్పుడలా..ఇప్పుడిలా…

దేశంలో బీసీలు, ఇతర కులాల సంఖ్య నిర్దుష్టంగా తెలియకపోవడంతో కులగణన చేయాలనే డిమాండ్ చాలాకాలంగా బీసీ సంఘాల నుంచి వస్తోంది. కులగణన వల్ల రిజర్వేషన్ల డిమాండ్ పెరుగుతుందన్నది నిజమేనన్నది పలువురి అభిప్రాయం.

తాము అధికారంలోకొస్తే 50శాతం పరిమితిని సవరించి రిజర్వేషన్లు పెంచుతామని రాహుల్ గాంధీ చెబుతున్నారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలుచేస్తామంటున్నారు.

షెడ్యూల్ కులాలు, తెగలు తప్ప మిగిలిన కులాలను లెక్కించడం తమ విధానం కాదని 2021 జూలై 20న అప్పటి హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ పార్లమెంటులో ప్రకటన సైతం చేశారు.

కానీ అనూహ్యంగా ఇప్పుడు కులగణనకు మోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం పచ్చజెండా ఊపింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

SOURCE : BBC NEWS