SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, Dorababu/Tanuku
ఆస్తి కోసం కన్నకూతురిని చంపేసి.. షార్ట్ సర్క్యూట్ ప్రమాదంగా చిత్రీకరించిన ఆమె తండ్రి, మారుతల్లిని మూడేళ్ల తర్వాత అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు.
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలంలోని ముద్దాపురం గ్రామంలో జరిగిన ఈ ఘటన పూర్వాపరాలను తణుకు రూరల్ సీఐ కృష్ణ కుమార్, ఆ కేసులో ఫిర్యాదుదారులైన గుజ్జరపు బలరాం, పార్వతి బీబీసీకి వివరించారు.
మూడేళ్ల కిందట అసలేం జరిగింది?
తాడేపల్లిగూడెంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో సెకండియర్ చదువుతోంది నాగహారిక (19). తణుకు మండలం ముద్దాపురం గ్రామానికి చెందిన ఆమె 2022 నవంబర్ 11 రాత్రి తన ఇంట్లో మంచంపై సజీవ దహనమైంది.
ఉదయం తాము నిద్రలేచి చూసే సరికి తన కుమార్తె మంటల్లో కాలిపోయి చనిపోయిందంటూ ఆమె తండ్రి ముళ్లపూడి శ్రీనివాస్, ఆయన రెండో భార్య రూప పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సెల్‌ఫోన్ చార్జర్ షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగి, ఆ ప్రమాదంలో చనిపోయినట్లు పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ మేరకు అప్పటి తణుకు రూరల్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

హారికను తండ్రి, సవతి తల్లే చంపేసి ప్రమాదంగా చిత్రీకరించారంటూ మృతురాలి మేనమామ బలరాం, అమ్మమ్మ పార్వతి, తాతయ్య సత్యనారాయణ అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే, తమ ఫిర్యాదును అప్పట్లో పోలీసులు పట్టించుకోలేదని వారు బీబీసీకి చెప్పారు.
శ్రీనివాస్ రెండో భార్యకి రాజకీయంగా పలుకుబడి ఉండటంతో పోలీసులు తమ ఫిర్యాదును అప్పట్లో పట్టించుకోలేదని హారిక మేనమామ బలరాం బీబీసీతో అన్నారు.
దీంతో తాము హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు ఆదేశాలతో పాటు ప్రస్తుత జిల్లా ఎస్పీ నయీం హష్మీ చొరవతో ఇన్నేళ్లకి విచారణ జరిగిందని బలరాం చెబుతున్నారు.
ఇదే విషయాన్ని ప్రస్తుత సీఐ కృష్ణకుమార్ వద్ద ప్రస్తావించగా.. “అలా ఏమీ లేదు. ఫోరెన్సిక్ రిపోర్టు, పూర్తి సాక్ష్యాధారాలు లభించేందుకు కాస్త సమయం పట్టింది. అందుకే ఒకింత ఆలస్యమైంది” అని ఆయన చెప్పారు.
ఫొటో సోర్స్, Dorababu/Tanuku
నా కూతురు కూడా గడ్డిమందు తాగిందని చెప్పారు : హారిక అమ్మమ్మ
“2003 మే 20న ముద్దాపురం గ్రామస్థుడు ముళ్లపూడి శ్రీనివాస్‌కు, కృష్ణయ్యపాలెం గ్రామానికి చెందిన గుజ్జరపు వసంతకు వివాహమైంది. 2004 ఆగస్టు 1న నాగహారిక జన్మించింది.
పాప పుట్టిన మూడేళ్లకే 2007లో వసంత అనారోగ్యంతో మృతి చెందినట్టు శ్రీనివాస్ మాకు కబురు పంపారు. మేం గట్టిగా అడిగితే గడ్డిమందు తాగి చనిపోయిందని చెప్పారు. ఆ మాటపై కూడా మాకు అనుమానాలు వచ్చినా, మనవరాలు హారిక భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఆ విషయం వదిలేశాం” అని హారిక అమ్మమ్మ పార్వతి బీబీసీతో చెప్పారు.
“ఆమె చనిపోయిన రెండేళ్లకు శ్రీనివాస్.. రూప అనే మహిళను వివాహం చేసుకున్నారు.
మొదటి భార్య వసంత చనిపోయిన మూడు నెలలకే ఆమెకు వారసత్వ హక్కుగా వచ్చిన మూడు ఎకరాల భూమిని హారిక పేరిట రాయాలని మమ్మల్ని అడగ్గా.. అందుకు మేం నిరాకరించాం. ఈ విషయమై కోర్టులో కేసు కూడా నడుస్తోంది. ఆస్తిని మేం మా మనవరాలికి రాసిచ్చినా.. పాప గార్డియన్‌గా ఉన్న తండ్రి రాయించుకునే అవకాశం ఉండటంతో పాప పెళ్లి అయ్యేవరకూ ఆగుదామని నిర్ణయించుకున్నాం” అని ఆమె అన్నారు.
ఫొటో సోర్స్, Dorababu/Tanuku
“పాప మైనారిటీ తీరగానే హత్య చేశారు”
“శ్రీనివాస్ తండ్రి ముళ్లపూడి వెంకటరావు తన కోడలు చనిపోయిన తర్వాత ఆయన పేరిట ముద్దాపురంలో ఉన్న ఒక ఎకరం పొలాన్ని మనవరాలు హారిక పేరిట రాశారు. కొడుకు పేరిట రాయకుండా మనమరాలి పేరిట రాయడంపై అప్పట్లోనే శ్రీనివాస్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
కానీ, అప్పటికే ఉద్యోగం లేకుండా కోడిపందేల వ్యసనపరుడిగా మారిన కుమారుడి పేరిట కంటే మనవరాలి పేరిట రాయడం సబబని ఆయన భావించారు. అప్పటి నుంచి ఆ ఆస్తిపై కన్నేసిన శ్రీనివాస్.. కుమార్తె హారిక మైనారిటీ తీరిన మూడు నెలలకే ఆమెను హత్య చేశారు. ఆమె చనిపోయిన తర్వాత ఆ ఆస్తి గార్డియన్‌గా ఉన్న తనకు వస్తుందని భావించే హత్య చేశారు” అని హారిక అమ్మమ్మ పార్వతి, మేనమామ బలరాం బీబీసీ వద్ద ఆరోపించారు.
పోలీస్ కస్టడీ కోరుతూ పిటిషన్ వేస్తాం..
తమ విచారణలో కూడా ఆస్తి కోసమే హారికను తండ్రి, మారుతల్లి హత్య చేసినట్టు తేలిందని సీఐ కృష్ణకుమార్ వివరించారు.
“విచారణలో స్వయంగా తండ్రి, ఏ–1 నిందితుడిగా ఉన్న ముళ్లపూడి శ్రీనివాస్ కూడా ఆస్తి కోసమే కూతురిని చంపినట్టు అంగీకరించారు” అని సీఐ బీబీసీతో చెప్పారు.
“ఆస్తి కోసమే తండ్రి ముళ్లపూడి శ్రీనివాస్, మారుతల్లి రూప ఇద్దరూ కలిసి హారిక తలపై బలంగా రాడ్డుతో కొట్టి, నిప్పు పెట్టారని మా దర్యాప్తులో తేలింది. దీంతో వారిద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కి పంపించాం” అని సీఐ కృష్ణకుమార్ తెలిపారు.
మరిన్ని వివరాల కోసం నిందితులను పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పిటిషన్ వేస్తామని సీఐ తెలిపారు.
ఫొటో సోర్స్, UGC
అప్పటి పోలీసుల విచారణనూ పరిశీలిస్తున్నాం: ఎస్పీ
మృతురాలి బంధువులు తనను కలిసిన వెంటనే విచారణకు ఆదేశించినట్లు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నయీం హష్మీ తెలిపారు.
“సాక్ష్యాలన్నీ సేకరించాం. హత్యగా తేలడంతో నిందితులను రిమాండ్‌కి పంపాం. అయితే, అప్పటి పోలీసులు ఏ మేరకు విచారణ చేపట్టారు. సాక్ష్యాలను కనుక్కోవడంలో విఫలమయ్యారా? లేదా ఆ దిశగా ఆలోచించలేదా? అనేది పరిశీలన చేస్తున్నాం” అని ఎస్పీ నయీం హష్మీ బీబీసీతో చెప్పారు.
ఆమెకు మా పార్టీతో సంబంధం లేదు
నిందితురాలు రూప గతంలో తణుకు రూరల్ మండల వైసీపీ మహిళా అధ్యక్షురాలిగా పనిచేశారని, అందుకే అప్పట్లో ఆ పార్టీ అధికారంలో ఉండటంతో పోలీసులు ఆ కేసును పట్టించుకోలేదని తాము భావిస్తున్నామని మృతురాలి మేనమామ బలరాం బీబీసీ వద్ద ఆరోపించారు.
అయితే, “ఆమె ఎప్పుడో గతంలో పార్టీలో కొనసాగి ఉండొచ్చు.. కానీ హత్య జరిగిన 2022కి ముందు నుంచే ఆమె పార్టీకి దూరంగా ఉన్నారు. ఆమెకు మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు” అని తణుకు పట్టణ వైసీపీ అధ్యక్షుడు మారిశెట్టి శేషగిరి బీబీసీతో అన్నారు.
ప్రస్తుతం రూప ఏ పార్టీలోనూ కొనసాగడం లేదని గ్రామస్థులతో మాట్లాడినప్పుడు తెలిసింది.
హత్య చేసే పరిస్థితి వస్తుందని ఊహించలేదు..
“శ్రీనివాస్‌కు రెండో వివాహం అయిన తర్వాతి నుంచే కూతురు హారికకు వేధింపులు ఎక్కువయ్యాయి. నిత్యం వేధించేవారు. అయితే మరీ చంపే పరిస్థితి వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు” అని ముద్దాపురం గ్రామస్థుడు సతీశ్ బీబీసీతో అన్నారు.
ఈ కేసులో నిందితులుగా ఉన్న మృతురాలి తండ్రి శ్రీనివాస్, సవతి తల్లి రూప బంధువులతో మాట్లాడేందుకు కూడా బీబీసీ ప్రయత్నించింది. కానీ, వారు మీడియాతో మాట్లాడేందుకు ఆసక్తి చూపించలేదు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS







