SOURCE :- BBC NEWS

Carney

ఫొటో సోర్స్, Reuters

29 ఏప్రిల్ 2025, 10:48 IST

అప్‌డేట్ అయ్యింది 5 గంటలు క్రితం

ఫలితాల వేళ మార్క్ కార్నీ తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడారు. అణకువతో నడుచుకుంటామని, అంటే.. ప్రభుత్వంలోని అన్ని పార్టీలతో కలిసి పనిచేయడం, ప్రావిన్సులు, స్థానిక ప్రజలతో మమేకమై పనిచేయడమని అన్నారు.

కార్మికులు, వ్యాపారవర్గాలు, పౌరసమాజాన్ని ఏకతాటిపైకి తీసుకురావాలని అనుకుంటున్నట్లు ఆయన చెప్పారు.

అమెరికా ‘‘మన నేలను, మన వనరులను, మన దేశాన్ని కోరుకుంటోంది’’ అని కొన్నినెలలుగా హెచ్చరిస్తున్నానన్నారు కార్నీ.

దానికి, జనసమూహం స్పందిస్తూ, ”నెవర్” అంటూ నినాదాలిచ్చారు.

”మనల్ని విడగొట్టడం ద్వారా మన దేశాన్ని హస్తగతం చేసుకోవాలని ట్రంప్ భావిస్తున్నారు, కానీ అది ఎన్నటికీ జరగదు” అని కార్నీ అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
కెనడా ఎన్నికలు, మార్క్ కార్నీ, కెనడా, భారత్

ఫొటో సోర్స్, Reuters

మెజార్టీ దక్కినట్టేనా?

కెనడాలో ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. తదుపరి ప్రభుత్వం మెజార్జీ ప్రభుత్వమా, లేక మైనార్టీ ప్రభుత్వమా అనేది తేలేందుకు మరికొన్ని గంటలు పడుతుందని ఆ దేశ ప్రభుత్వ వార్తా సంస్థ సీబీసీ తెలిపింది.

లిబరల్స్‌ 172కి పైగా సీట్లు సాధిస్తే మెజార్టీ లభించినట్టే.ఇది వారికి బలాన్ని చేకూరుస్తుంది. పార్లమెంట్‌లో చట్టాల ఆమోదానికి ఇతర పార్టీలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు.

2021లో, జస్టిన్ ట్రూడో హయాంలో జరిగినట్లుగా 172 సీట్ల కంటే తక్కువ వస్తే, ఇతర పార్టీల మద్దతు అవసరం అవుతుంది.

ప్రస్తుతం కొనసాగుతున్న ట్రెండ్స్‌ను బట్టి లిబరల్స్ 168 స్థానాలు చేజిక్కించుకునే అవకాశం ఉందని అంచనాలున్నాయి. అంటే, మెజార్టీ ప్రభుత్వానికి నాలుగు సీట్లు తక్కువ.

కన్వర్వేటివ్ పార్టీ, కెనడా ఎన్నికలు

ఫొటో సోర్స్, EPA

కార్నీ ప్రత్యర్థి పియరీ ఓటమి

కన్జర్వేటివ్ పార్టీ నేత, మార్క్ కార్నీ ప్రత్యర్థి, 45 ఏళ్ల పియరీ పొయిలీవ్రే ఓటమి చెందినట్లు వార్తా సంస్థ సీబీసీ తెలిపింది. ఒంటారియోలోని కార్లటన్ నుంచి పోటీ చేసిన కన్జర్వేటివ్ నేత ఓడిపోయినట్లు ఆ సంస్థ పేర్కొంది.

కెనడా పశ్చిమ ప్రాంతంలోని ఆల్బెర్టా ప్రావిన్స్‌లో జన్మించిన పియరీని ఓ ఉపాధ్యాయ జంట దత్తత తీసుకున్నారు. ఆయన కాల్గరీ ప్రాంతంలో పెరిగారు.

సీనియర్ రాజకీయ నేతల్లో ఒకరైన పియరీ 25 ఏళ్ల వయసులో తొలిసారి, ఒట్టావా ప్రావిన్స్‌లోని ఒక స్థానం నుంచి గెలుపొందారు. ఆ ఎన్నికల్లో గెలిచిన అతిపిన్న వయస్కులలో ఒకరిగా నిలిచారు.

ఎన్నికలకు ముందు జరిగిన జాతీయ సర్వేలలో, ట్రూడో నేతృత్వంలోని లిబరల్స్‌ కంటే ఈయన పార్టీకి ఆధిక్యం లభించింది. కానీ, ట్రూడో రాజీనామా తర్వాత లిబరల్స్‌కు మద్దతు పెరిగింది.

విమర్శకులు పియరీని ట్రంప్ ప్రతిబింబంగా చూపించారు. ట్రంప్ వాణిజ్య యుద్దం.. 51వ రాష్ట్రంగా కెనడా.. వంటి అంశాలు గట్టి ప్రభావం చూపించాయి.

లిబరల్ పార్టీ

ఫొటో సోర్స్, Reuters

పోలింగ్ ఫలితాలు వస్తుండగా, లిబరల్ పార్టీ హెడ్ క్వార్టర్స్‌లో పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.

”కెనడా చరిత్రలో ఇది అతి పెద్ద పునరాగమనం. దేశానికి భరోసా అవసరమైన సమయంలో ఆయన ముందుకు వచ్చారు” అని ఫలితాల ట్రెండ్స్‌ను చూస్తూ లిబరల్ పార్టీ మద్దతుదారుడు ఒకరు సీబీసీతో అన్నారు.

ఒకవేళ సంపూర్ణ మెజార్టీ రాకపోయినా, కెనడాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన సీట్లు వస్తాయని సీబీసీ పేర్కొంది.

కెనడా రాజకీయాల్లో గత కొన్ని నెలలుగా లిబరల్ పార్టీ తీవ్ర ఒత్తిడిలో ఉంది. జనవరిలో మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో లిబరల్ పార్టీ నాయకత్వానికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి కెనడాలో అనేకమంది రాజకీయ నాయకులు ఎన్నికలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ పార్టీ పనైపోయిందని గత కొన్ని నెలలుగా కెనడాలో చర్చ జరిగింది. అయితే, ఈ అంచనాలను పటాపంచలు చేస్తూ నాలుగోసారి అధికారం దిశగా పయనిస్తోంది పార్టీ.

లిబరల్ పార్టీ ముందంజలో ఉండటంలో అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ విధానాలు, చేసినప్రకటనలు కీలక పాత్ర పోషించాయని బీబీసీ ప్రతినిధి ఆంటోని జెర్కర్ అన్నారు.

కెనడాను ట్రంప్ పదేపదే రెచ్చగొట్టారని, అమెరికాలో 51వ రాష్ట్రంగా మారాలని డిమాండ్ చేశారని జెర్కర్ అన్నారు. దీంతో, కెనడా ఓటర్లందరూ ఏకమై లిబరల్ పార్టీకి మద్దతుగా నిలిచారని జెర్కర్ విశ్లేషించారు.

జగ్మీత్ సింగ్

ఫొటో సోర్స్, Reuters

న్యూ డెమోక్రటిక్ పార్టీ నేత పదవికి జగ్మీత్ సింగ్ రాజీనామా

మార్క్ కార్నీ విజయం సాధించడంతో న్యూ డెమోక్రటిక్ పార్టీ నేతగా జగ్మీత్ సింగ్ రాజీనామా చేశారు. ఆయన భారత సంతతికి చెందిన సిక్కు నేత.

‘‘న్యూ డెమోక్రాట్లకు ఇది నిరాశను మిగిల్చిన రోజు’’ అని తన మద్దతుదారులను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు జగ్మీత్ సింగ్. పోరాటం ఆపినప్పుడే మనం ఓడిపోయినట్లని ఆయన అన్నారు.

ఈ ఎన్నికల్లో న్యూ డెమోక్రటిక్ పార్టీ ప్రస్తుతం 8 సీట్లలో ఆధిక్యం లేదా గెలుపు అవకాశాలు కనిపిస్తున్నాయి.

జగ్మీత్ సింగ్ కార్మికుల సమస్యలపై ఎక్కువ దృష్టి సారించేవారు. కెనడాలో ఓ ప్రధాన పార్టీకి నేతృత్వం వహించిన తొలి మైనార్టీ, సిక్కు నేతగా ఆయన 2017లో చరిత్ర సృష్టించారు.

2019లో ఎంపీగా గెలిచారు. 2021 నుండి, ట్రూడో లిబరల్ పార్టీ ప్రభుత్వ మనుగడకు ఎన్‌డీపీ సాయపడింది.

మార్క్ కార్నీ

ఫొటో సోర్స్, Dave Chan / AFP) (Photo by DAVE CHAN/AFP via Getty Images)

ఎన్నికలు ఎలా జరుగుతాయి?

కెనడా వ్యాప్తంగా 343 నియోజకవర్గాలు ఉన్నాయి. వీటినే ఎలక్టోరల్ డిస్ట్రిక్ట్స్ అని కూడా పిలుస్తారు. ప్రతి నియోజకవర్గానికి హౌస్ ఆఫ్ కామన్స్‌లో ఒక్కో సీటు ఉంటుంది. ఐదేళ్లకోసారి దిగువసభకు అంటే హౌస్ ఆఫ్ కామన్స్‌కు ఎన్నికలు జరుగుతాయి.

ఇక ఎగువ సభ అయిన సెనేట్‌లో సభ్యులను నియమిస్తారు. వారు ఎన్నికలలో పోటీ చేయరు.

యూకే మాదిరిగానే కెనడాలో కూడా “ఫస్ట్-పాస్ట్-ది-పోస్ట్” ఎన్నికల వ్యవస్థ ఉంది. సింపుల్‌గా చెప్పుకోవాలంటే మెజార్టీ వచ్చినవారు చట్టసభకు ఎన్నికవుతారు.

ప్రతి నియోజకవర్గంలోనూ ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థి ఎంపీ అవుతారు.

ఇక ఎక్కువ సీట్లు గెలుచుకునే పార్టీ అధికారం స్వీకరిస్తే, తదుపరి స్థానంలో నిలిచే పార్టీ ప్రతిపక్షంగా మారుతుంది.

ఏ పార్టీకీ మెజారిటీ సీట్లు రాకపోతే దానిని హంగ్ పార్లమెంట్ లేదా మైనారిటీ ప్రభుత్వం అంటారు. ఇలాంటి ప్రభుత్వాలలో పార్లమెంటులో ఇతర పార్టీల అండ లేకుండా బిల్లులను ఆమోదింపచేసుకోలేవు.

కెనడా

ఎవరు ఓటు వేయవచ్చు?

  • కెనడా పౌరుడు అయి ఉండాలి.
  • కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉండాలి,
  • గుర్తింపు చిరునామా ధ్రువపత్రాన్ని కలిగి ఉండాలి.
  • కెనడియన్లు కూడా ఈస్టర్ వీకెండ్‌లో ముందుగానే ఓటు వేసే అవకాశం లభించింది. అలా రికార్డు స్థాయిలో 73 లక్షలమంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
కార్నీ

ఫొటో సోర్స్, Reuters

మార్క్ కార్నీ ఎవరు?

మార్క్ కార్నీ వయసు 60 ఏళ్లు. ఈ ఏడాది మార్చిలో కెనడా ప్రధాని అయ్యారు. కానీ కొద్దికాలం మాత్రమే ఆ పదవిలో ఉన్నారు. లిబరల్ పార్టీ నాయకుడిగా 85 శాతం ఓట్లతో ఎన్నికయ్యారు.

ఆర్థిక విషయాల్లో నిపుణుడైన ఆయన బ్యాంక్ ఆఫ్ కెనడా, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌కు గవర్నర్‌గా పనిచేశారు.

కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా చేస్తామంటూ ట్రంప్ చేసిన ప్రకటనపై స్పందించి, అది ఎప్పటికీ జరగనివ్వబోమని కార్నీ చెప్పారు.

కార్నీ ప్రధాని పదవికి ముందు ఏనాడూ ఏ ప్రభుత్వ పదవి నిర్వహించలేదు. ఆయన ఫ్రెంచ్ భాష తన ప్రత్యర్థులకంటే మెరుగ్గా లేదు. క్యూబెక్ ప్రావిన్స్‌లో ఫ్రెంచ్ మాట్లాడటం సాధారణం.

ఎన్నికల ప్రచారంలో అనేకసార్లు విరామం తీసుకున్నారనే విమర్శలను కార్నీ ఎదుర్కొన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

SOURCE : BBC NEWS