SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Reuters
ఒక గంట క్రితం
కెనడా సార్వత్రిక ఎన్నికల్లో లిబరల్ పార్టీకి మెజార్టీ వచ్చే అవకాశాలున్నాయని ఆ దేశ ప్రభుత్వ వార్తా సంస్థ సీబీసీ న్యూస్ చెప్పింది.
అయితే, 343 సీట్లున్న పార్లమెంట్‌లో సంపూర్ణ మెజార్టీ లిబరల్ పార్టీకి వస్తుందో లేదో స్పష్టత లేదని కూడా సీబీసీ న్యూస్ పేర్కొంది.
పోలింగ్ ఫలితాలు వస్తుండగా, లిబరల్ పార్టీ హెడ్ క్వార్టర్స్‌లో పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.
”కెనడా చరిత్రలో ఇది అతి పెద్ద పునరాగమనం. దేశానికి భరోసా అవసరమైన సమయంలో ఆయన ముందుకు వచ్చారు” అని ఫలితాల ట్రెండ్స్‌ను చూస్తూ లిబరల్ పార్టీ మద్దతుదారుడు ఒకరు సీబీసీతో అన్నారు.
ఒకవేళ సంపూర్ణ మెజార్టీ రాకపోయినా, కెనడాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన సీట్లు వస్తాయని, మార్క్ కార్నీ గెలుస్తారని కూడా సీబీసీ పేర్కొంది.
కెనడా రాజకీయాల్లో గత కొన్ని నెలలుగా లిబరల్ పార్టీ తీవ్ర ఒత్తిడిలో ఉంది. జనవరిలో మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో లిబరల్ పార్టీ నాయకత్వానికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి కెనడాలో అనేకమంది రాజకీయ నాయకులు ఎన్నికలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ పార్టీ పనైపోయిందని గత కొన్ని నెలలుగా కెనడాలో చర్చ జరిగింది. అయితే, ఈ అంచనాలను పటాపంచలు చేస్తూ నాలుగోసారి అధికారం దిశగా పయనిస్తోంది పార్టీ.
లిబరల్ పార్టీ ముందంజలో ఉండటంలో అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ విధానాలు, చేసినప్రకటనలు కీలక పాత్ర పోషించాయని బీబీసీ ప్రతినిధి ఆంటోని జెర్కర్ అన్నారు.
కెనడాను ట్రంప్ పదేపదే రెచ్చగొట్టారని, అమెరికాలో 51వ రాష్ట్రంగా మారాలని డిమాండ్ చేశారని జెర్కర్ అన్నారు. దీంతో, కెనడా ఓటర్లందరూ ఏకమై లిబరల్ పార్టీకి మద్దతుగా నిలిచారని జెర్కర్ విశ్లేషించారు.


ఫొటో సోర్స్, Reuters
న్యూ డెమోక్రటిక్ పార్టీ నేత పదవికి జగ్మీత్ సింగ్ రాజీనామా
మార్క్ కార్నీ విజయం దిశగా దూసుకుపోతుండటంతో, న్యూ డెమోక్రటిక్ పార్టీ నేతగా జగ్మీత్ సింగ్ రాజీనామా చేశారు. ఆయన భారత సంతతికి చెందిన సిక్కు నేత.
‘‘న్యూ డెమోక్రాట్లకు ఇది నిరాశను మిగిల్చిన రోజు’’ అని తన మద్దతుదారులను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు జగ్మీత్ సింగ్. పోరాటం ఆపినప్పుడే మనం ఓడిపోయినట్లని ఆయన అన్నారు.
ఈ ఎన్నికల్లో న్యూ డెమోక్రటిక్ పార్టీ ప్రస్తుతం 8 సీట్లలో ఆధిక్యం లేదా గెలుపు అవకాశాలు కనిపిస్తున్నాయి.
జగ్మీత్ సింగ్ కార్మికుల సమస్యలపై ఎక్కువ దృష్టి సారించేవారు. కెనడాలో ఓ ప్రధాన పార్టీకి నేతృత్వం వహించిన తొలి మైనార్టీ, సిక్కు నేతగా ఆయన 2017లో చరిత్ర సృష్టించారు.
2019లో ఎంపీగా గెలిచారు. 2021 నుండి, ట్రూడో లిబరల్ పార్టీ ప్రభుత్వ మనుగడకు ఎన్‌డీపీ సాయపడింది.

ఫొటో సోర్స్, Dave Chan / AFP) (Photo by DAVE CHAN/AFP via Getty Images)
ఎన్నికలు ఎలా జరుగుతాయి?
కెనడా వ్యాప్తంగా 343 నియోజకవర్గాలు ఉన్నాయి. వీటినే ఎలక్టోరల్ డిస్ట్రిక్ట్స్ అని కూడా పిలుస్తారు. ప్రతి నియోజకవర్గానికి హౌస్ ఆఫ్ కామన్స్‌లో ఒక్కో సీటు ఉంటుంది. ఐదేళ్లకోసారి దిగువసభకు అంటే హౌస్ ఆఫ్ కామన్స్‌కు ఎన్నికలు జరుగుతాయి.
ఇక ఎగువ సభ అయిన సెనేట్‌లో సభ్యులను నియమిస్తారు. వారు ఎన్నికలలో పోటీ చేయరు.
యూకే మాదిరిగానే కెనడాలో కూడా “ఫస్ట్-పాస్ట్-ది-పోస్ట్” ఎన్నికల వ్యవస్థ ఉంది. సింపుల్‌గా చెప్పుకోవాలంటే మెజార్టీ వచ్చినవారు చట్టసభకు ఎన్నికవుతారు.
ప్రతి నియోజకవర్గంలోనూ ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థి ఎంపీ అవుతారు.
ఇక ఎక్కువ సీట్లు గెలుచుకునే పార్టీ అధికారం స్వీకరిస్తే, తదుపరి స్థానంలో నిలిచే పార్టీ ప్రతిపక్షంగా మారుతుంది.
ఏ పార్టీకీ మెజారిటీ సీట్లు రాకపోతే దానిని హంగ్ పార్లమెంట్ లేదా మైనారిటీ ప్రభుత్వం అంటారు. ఇలాంటి ప్రభుత్వాలలో పార్లమెంటులో ఇతర పార్టీల అండ లేకుండా బిల్లులను ఆమోదింపచేసుకోలేవు.

ఎవరు ఓటు వేయవచ్చు?
- కెనడా పౌరుడు అయి ఉండాలి.
- కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉండాలి,
- గుర్తింపు చిరునామా ధ్రువపత్రాన్ని కలిగి ఉండాలి.
- కెనడియన్లు కూడా ఈస్టర్ వీకెండ్‌లో ముందుగానే ఓటు వేసే అవకాశం లభించింది. అలా రికార్డు స్థాయిలో 73 లక్షలమంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఫొటో సోర్స్, Reuters
మార్క్ కార్నీ ఎవరు?
మార్క్ కార్నీ వయసు 60 ఏళ్లు. ఈ ఏడాది మార్చిలో కెనడా ప్రధాని అయ్యారు. కానీ కొద్దికాలం మాత్రమే ఆ పదవిలో ఉన్నారు. లిబరల్ పార్టీ నాయకుడిగా 85 శాతం ఓట్లతో ఎన్నికయ్యారు.
ఆర్థిక విషయాల్లో నిపుణుడైన ఆయన బ్యాంక్ ఆఫ్ కెనడా, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌కు గవర్నర్‌గా పనిచేశారు.
కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా చేస్తామంటూ ట్రంప్ చేసిన ప్రకటనపై స్పందించి, అది ఎప్పటికీ జరగనివ్వబోమని కార్నీ చెప్పారు.
కార్నీ ప్రధాని పదవికి ముందు ఏనాడూ ఏ ప్రభుత్వ పదవి నిర్వహించలేదు. ఆయన ఫ్రెంచ్ భాష తన ప్రత్యర్థులకంటే మెరుగ్గా లేదు. క్యూబెక్ ప్రావిన్స్‌లో ఫ్రెంచ్ మాట్లాడటం సాధారణం.
ఎన్నికల ప్రచారంలో అనేకసార్లు విరామం తీసుకున్నారనే విమర్శలను కార్నీ ఎదుర్కొన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)