SOURCE :- BBC NEWS
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, తెలంగాణ సిద్ధాంతకర్తగా మన్ననలు అందుకున్న ప్రొఫెసర్ జయశంకర్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉండేవి. అవి ఎంతలా అంటే.. జయశంకర్ నోటి మాటమీదే, ప్రోటోకాల్‌ను పక్కనపెట్టి మరీ కేంద్ర ఆర్థికశాఖా మంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ దిల్లీ నుంచి వరంగల్‌కు వచ్చేంతగా.
విద్యావేత్తలుగా, ఆర్థిక నిపుణులుగానే కాకుండా..రాజకీయాల్లోనూ వీరిద్దరూ ఎదురుపడి పనిచేసిన సందర్భాలున్నాయి.
ఇద్దరినీ ఆర్థిక శాస్త్రం కలిపింది
ప్రొఫెసర్ జయశంకర్, మన్మోహన్ సింగ్‌లది సుమారు మూడు దశాబ్దాల అనుబంధం. తొలి రోజుల్లో వీరిద్దరి మధ్య స్నేహానికి వారిద్దరికీ ఇష్టమైన ఆర్థిక శాస్త్రమే కారణమైంది.
ఆ రోజుల్లో దేశవ్యాప్తంగా జరిగిన ఆర్థిక శాస్త్ర సెమినార్లు, సింపోజియంలలో వారిద్దరూ తరచూ కలుసుకునేవారు.
మన్మోహన్ సింగ్ 1970ల నాటికి ప్రఖ్యాత ఆర్థిక వేత్తగా ఎదిగారు. యూనివర్సిటీ ప్రొఫెసర్ స్థాయి నుంచి యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్) చైర్మన్, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్, ఆ తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఎదిగారు. ఆ తరువాత భారత ప్రధాని అయ్యారు.
ఇద్దరి మధ్య సంబంధాలు ఎలా కొనసాగాయంటే..
మన్మోహన్ సింగ్ వివిధ పదవుల్లో ఉన్న సమయంలో ప్రొఫెసర్ జయశంకర్‌తో సత్సంబంధాలు కొనసాగించారు. అనేక సందర్భాల్లో కలవడమే కాక, ఇద్దరి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా కొనసాగేవి. ప్రొఫెసర్ జయశంకర్ కోరిక మేరకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ హోదాలో మన్మోహన్ సింగ్ కొందరు పరిశోధక విద్యార్థుల ప్రాజెక్టులకు నిధులు సమకూర్చారు.
అందులో విజయవంతమైన ప్రాజెక్టుల పనితీరుపై వారిద్దరూ కలిసినప్పుడు మాట్లాడుకునేవారు. ఇలాంటి ప్రాజెక్టులను ప్రోత్సహించాలని మన్మోహన్ సింగ్ అంటే… మీరు ఫండింగ్ ఇవ్వాలి కదా.. అని జయశంకర్ అనేవారు. వారిద్దరి మధ్య ఇలాంటి సంభాషణలు జరిగేవి.
1990లలో యూజీసీ చైర్మన్‌గా మన్మోహన్ సింగ్, హైదరాబాద్ సీఫెల్ (సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్) రిజిస్ట్రార్ గా జయశంకర్ తరచూ సమావేశాల్లో కలుసుకునేవారు.
“నాతో ఉన్న పరిచయమో, ప్రేమో, అభిమానం వల్లో అనేక జాతీయ స్థాయి కమిటీల్లో ఆయన నన్ను సభ్యునిగా వేశారు” అని ప్రొఫెసర్ జయశంకర్ ఒక సందర్భంలో గుర్తుచేసుకున్నారు.
కేయూ స్నాతకోత్సవానికి మన్మోహన్ ఎలా వచ్చారంటే..
పీవీ నర్సింహారావు ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్న సమయానికి జయశంకర్‌తో స్నేహం మరింత బలపడింది. ఆ సమయంలో ప్రొఫెసర్ జయశంకర్ కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా ఉన్నారు.
1992లో నిర్వహించిన కాకతీయ యూనివర్సిటీ స్నాతకోత్సవ సభకు కేంద్ర ఆర్థిక మంత్రి హోదాలో మన్మోహన్ సింగ్ అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి తాను స్వయంగా దిల్లీ వెళ్లి ఆయన్ను ఆహ్వానించాలని ప్రొఫెసర్ జయశంకర్ భావించారు. అయితే అలాంటిదేమీ జరగకుండానే మన్మోహన్ సింగ్ స్నాతకోత్సవానికి హాజరయ్యారు.
అలా ఎలా జరిగిందో ప్రొఫెసర్ జయశంకర్ ఆత్మకథగా భావించే ఓ పుస్తకంలో వివరించారు. అపాయింట్ మెంట్ కోసం దిల్లీకి ఫోన్ చేసిన సందర్భంలో వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇలా సాగింది.
“హౌ ఆర్ యు జయశంకర్. ఐ యామ్ హ్యాపీ యు హ్యావ్ బికమ్ ఎ వైస్ చాన్సలర్, డూ యూ వాంట్ ఎనీ ఫండింగ్?” అని మన్మోహన్ సింగ్ అడిగారు.
”ఐ యామ్ నాట్ ఆస్కింగ్ యు ఫర్ ఫండింగ్ సర్! ఐ రిక్వెస్ట్ యు టు బి ద చీఫ్ గెస్ట్ టు అడ్రస్ ద కాన్వొకేషన్. ఐ వాంట్ టు కమ్ అండ్ రిక్వెస్ట్ యు టు గివ్ యాన్ అపాయింట్ మెంట్” అని జయశంకర్ చెప్పారు.
”ఐ యామ్ కమింగ్, డోన్ట్ టేక్ ది ట్రబుల్ ఆఫ్ కమింగ్ హియర్’ అని మన్మోహన్ సింగ్ చెప్పారు.
భారత్‌లో ఆర్థిక సంస్కరణల అమలు తీరుపై మన్మోహన్ మొదటిసారి చేసిన ప్రసంగంగా స్నాతకోత్సవ సభను చూస్తారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో..
మలిదశ తెలంగాణ ఉద్యమ సమయానికి ఆర్థిక వేత్తలుగా కాకుండా వీరిద్దరి మధ్య బంధం రాజకీయాలతో ముడిపడింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో ప్రత్యేక తెలంగాణ అంశంపై ‘తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేటివ్ ఫోరం'( టీసీఎల్ఎఫ్) ఏర్పడింది. ఈ అంశంపై అధ్యయనం కోసం ప్రణబ్ ముఖర్జీ ఆధ్వర్యంలో ఏఐసీసీ వేసిన కమిటీలో మన్మోహన్ సింగ్ సభ్యుడిగా ఉన్నారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఎందుకు కావాలనే అంశాన్ని ప్రణబ్ ముఖర్జీ కమిటీ ముందు వివరించేందుకు టీసీఎల్ఎఫ్ తరపున ప్రొఫెసర్ జయశంకర్ హాజరయ్యారు.
ఆ తర్వాత క్రమంలో యూపీఏ-1 ప్రభుత్వంలో రాజ్యసభ సభ్యత్వం, కేంద్ర ప్రణాళిక సంఘ సభ్యునిగా ప్రొఫెసర్ జయశంకర్ పేరు ప్రతిపాదనకు వచ్చినపుడు మన్మోహన్ సింగ్ మద్దతు పలికారు. అయితే అప్పటి రాజకీయ సమీకరణాల వల్ల ఆ రెండూ జరగలేదు.
“వివిధ సందర్భాల్లో కేసీఆర్‌తో కలిసి ప్రధాని మన్మోహన్ సింగ్ దగ్గరకు వెళ్లినప్పుడు.. ‘హౌ ఆర్ యు జయశంకర్! అని ముందు నన్నే పలకరిస్తడు. పాత సంబంధం అది. చాల సింపుల్ మనిషి ఆయన” అని ప్రొఫెసర్ జయశంకర్ ఒక సందర్భంలో గుర్తు చేసుకున్నారు.
అడ్రస్ తప్పు రాసిన మన్మోహన్ సింగ్
2004లో యూపీఏ ప్రభుత్వంలో ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఏర్పాటైన నేషనల్ కమిషన్ ఫర్ ఎంటర్ ప్రైజెస్ ఫర్ రూరల్ ఆర్గనైజేషన్’ కమిటీలో ప్రొఫెసర్ జయశంకర్ సభ్యునిగా నామినేట్ అయ్యారు. అయితే ఈ కమిషన్ మొదటి మీటింగుకు జయశంకర్ హాజరు కాలేకపోయారు.
విషయం ఏంటా అని ప్రధాన మంత్రి ఆరా తీశారు.
సభ్యునిగా జయశంకర్ నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు మన్మోహన్ సింగ్ తన స్వహస్తాలతో రాసి.. జయశంకర్, ఫార్మర్ వైస్ ఛాన్స్‌లర్, వరంగల్ యూనివర్సిటీ అని రాశారు.
వరంగల్ పేరుతో ఎలాంటి యూనివర్సిటీ లేకపోవడంతో అవి ఆయనకు చేరలేదు.
ఆ తర్వాత మన్మోహన్ సింగ్‌ను కలిసినప్పుడు.. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ పనులకు కమిషన్ సభ్యుడి బాధ్యతలు అడ్డువస్తాయన్న అనుమానం వ్యక్తం చేశారు ప్రొఫెసర్ జయశంకర్.
ఆ సమయంలో ‘ఆ బాధ్యతలు నీ కార్యకలాపాలకు ఏం అడ్డురావు. అయితే ఒకటి, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించేటప్పుడు గట్టిగా తిట్టకు (పెద్దగా నవ్వుతూ)’ అని మన్మోహన్ సింగ్ ఆయనకు చెప్పారు.
ఆ తర్వాత కొద్ది కాలానికే జయశంకర్ కమిషన్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తనకు ఇష్టం లేకపోయినా కొన్ని నెలల తర్వాత మన్మోహన్ సింగ్ ఆ రాజీనామాను ఆమోదించారు.
ఆ తర్వాత పలుసార్లు మన్మోహన్ సింగ్ ను కలిసినా అదే చనువు, ఆప్యాయత, మర్యాద వారిద్దరి మధ్య కొనసాగింది.
(ఆధారం: వొడువని ముచ్చట – తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ పుస్తకం నుంచి)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)