SOURCE :- BBC NEWS

బీజేపీ, కేరళ, తిరువనంతపురం, ఎల్డీఎఫ్, యూడీఎఫ్, రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, ani

ఒక గంట క్రితం

కేరళ స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) భారీ విజయం సాధించగా, అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్‌(ఎల్‌డీఎఫ్)కు భారీ ఎదురుదెబ్బ తగిలింది.

ఈ రెండు కూటముల గెలుపోటముల గురించేకాక, తిరువనంతపురంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ ) విజయంపైనా చర్చ జరుగుతోంది.

ఎల్‌డీఎఫ్ ఖాతాలో ఉన్న తిరువనంతపురం కార్పొరేషన్‌లో తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలో 101 వార్డులకుగానూ 50 వార్డులను ఎన్‌డీఏ గెలుచుకుని అతిపెద్ద సంకీర్ణంగా అవతరించింది.

తిరువనంతపురం నియోజకవర్గానికి కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2026లో కేరళ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో తిరువనంతపురంలో ఎన్‌డీఏ విజయంపై చర్చ జరుగుతోంది.

తిరువనంతపురంలో విజయాన్ని కేరళలో “కొత్త అధ్యాయానికి నాంది”గా బీజేపీ చూస్తోంది.

ఈ విజయం “కేరళ రాజకీయాల్లో చరిత్రాత్మకమైనది”గా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
బీజేపీ, కేరళ, తిరువనంతపురం, ఎల్డీఎఫ్, యూడీఎఫ్, రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

అసెంబ్లీ ఎన్నికల కోణంలో ‘స్థానిక’ ఫలితాల విశ్లేషణ

కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో యూడీఎఫ్ విజయాన్ని లోక్‌సభలో ప్రతిపక్షనేత, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ “ప్రోత్సాహకరంగా” అభివర్ణించారు.

కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ విజయాలను దేశంలోని రెండు ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ వచ్చే ఏడాది రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల కోణంలో చూస్తున్నాయి.

రెండు పార్టీల మధ్య రాజకీయ మాటల యుద్ధం కూడా మొదలైంది. తిరువనంతపురంలో బీజేపీ తన విజయాన్ని “ఏదో సాధించడం”గా చూపించిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ విమర్శించారు.

తన నియోజకవర్గంలో బీజేపీ విజయాన్ని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ “ప్రజాస్వామ్య గొప్పదనం”గా అభివర్ణించారు.

బీజేపీ విజయం తిరువనంతపురం ”రాజకీయాల్లో గొప్ప మార్పు”కు నిదర్శనమని ఆయన అన్నారు.

బీజేపీ, కేరళ, తిరువనంతపురం, ఎల్డీఎఫ్, యూడీఎఫ్, రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, Raj K Raj/Hindustan Times via Getty

ఏ పార్టీకి ఎన్ని సీట్లు ?

డిసెంబరు 9 ,11 తేదీల్లో కేరళలో జరిగిన రెండు దశల స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడ్డాయి.

రాష్ట్రంలోని 6 మున్సిపల్ కార్పొరేషన్లు, 14 జిల్లా పంచాయతీలు, 87 మున్సిపాలిటీలు, 152 బ్లాక్ పంచాయతీలు, 951 గ్రామ పంచాయతీలలో ఎన్నికలు జరిగాయి.

కాంగ్రెస్ నేతృత్వంలోని యుడీఎఫ్, సీపీఐ(ఎం) నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్‌పై ఘన విజయం సాధించింది.

యుడీఎఫ్ గెలుపు:

  • మున్సిపల్ కార్పొరేషన్లు (కొల్లం, కొచ్చి, త్రిస్పూర్, కన్నూర్) -4
  • జిల్లా పంచాయతీలు -7
  • మున్సిపాల్టీలు -54
  • బ్లాక్ పంచాయతీలు -79
  • గ్రామపంచాయతీలు -50.

ఎల్‌డీఎఫ్ గెలుపు:

  • మున్సిపల్ కార్పొరేషన్ (కోజికోడ్‌) -1
  • జిల్లా పంచాయతీలు-7
  • మున్సిపాలిటీలు -28
  • బ్లాక్ పంచాయతీలు -63
  • గ్రామ పంచాయతీలు -340

2020 ఎన్నికలలో ఐదు మున్సిపల్ కార్పొరేషన్లను గెలుచుకున్న వామపక్ష కూటమి ఈసారి కోజికోడ్‌లో మాత్రమే గెలిచింది.

ఎన్‌డీఏ గెలుపు:

  • మున్సిపల్ కార్పొరేషన్ (తిరువనంతపురం) -1
  • మున్సిపాలిటీలు -2
  • గ్రామ పంచాయతీలు -26

తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌లో బీజేపీ 50 సీట్లు గెలుచుకుంది, ఆ తర్వాత ఎల్‌డీఎఫ్ 29, యుడీఎఫ్ 19 సీట్లు గెలుచుకుంది.

గతంలో తిరువనంతపురంలో బీజేపీ ప్రతిపక్షంలో ఉంది.

బీజేపీ, కేరళ, తిరువనంతపురం, ఎల్డీఎఫ్, యూడీఎఫ్, రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

బీజేపీ ఏమంటోంది?

బీజేపీ-ఎన్‌డీఏ అభ్యర్థులకు ఓటు వేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేరళ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. “కేరళ ప్రజలు యూడీఎఫ్, ఎల్‌డీఎఫ్‌తో విసుగు చెందారు” అని ఆయన అన్నారు .

తిరువనంతపురంలో బీజేపీ విజయాన్ని ‘కొత్త అధ్యాయానికి నాంది’గా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభివర్ణించారు.

“తిరువనంతపురం ఆశావాదంతో, దృఢ నిశ్చయంతో నిలబడింది. మున్సిపల్ కార్పొరేషన్‌లో బీజేపీకి విజయం కట్టబెట్టడం ద్వారా కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. ఇది మార్పు, అభివృద్ధి, స్వచ్ఛమైన పాలనకు ఆమోదం” అని ఆయన అన్నారు .

కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేరళ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. “స్థానిక సంస్థల ఎన్నికల్లో కేరళ ప్రజలు బీజేపీకి, ఎన్‌డీఏకు అఖండ విజయాన్ని అందించారు. తిరువనంతపురంలో మొదటి బీజేపీ మేయర్‌ ఉండబోతున్నారు” అని ఆయన అన్నారు .

“మలయాళీలు అవినీతి రహిత పాలన, అభివృద్ధి, జవాబుదారీతనం కోరుకుంటున్నారు. దశాబ్దాల అసమర్థ, అవినీతి లెఫ్ట్ -రైట్ రాజకీయాలకు దూరంగా సాగడానికి వారు సిద్ధంగా ఉన్నారు” అని కేరళ బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ ఎన్నికల ఫలితాలను విశ్లేషించారు.

“ఈ మార్పును నమ్మిన ప్రతి ఓటరుకు నేను కృతజ్ఞుడను” అని ఆయన అన్నారు.

బీజేపీ, కేరళ, తిరువనంతపురం, ఎల్డీఎఫ్, యూడీఎఫ్, రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, Raj K Raj/Hindustan Times via Getty

‘ఇది ట్రైలర్ మాత్రమే’

యూడీఎఫ్ విజయంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కేరళ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. “ఇది నిర్ణయాత్మకమైన, ప్రోత్సాహకరమైన తీర్పు” అన్నారు ఆయన.

“ఈ ఫలితాలు యూడీఎఫ్‌పై పెరుగుతున్న నమ్మకానికి స్పష్టమైన సంకేతం. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయానికి ఇవి మార్గం సుగమం చేస్తాయి” అన్నారు రాహుల్ గాంధీ .

యూడీఎఫ్ సాధించిన భారీ విజయం కేవలం ‘ట్రైలర్’ మాత్రమేనని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, కేరళకు చెందిన కేసీ వేణుగోపాల్ చెప్పారు.

“ఇది ప్రారంభం మాత్రమే. 2026 లో అనేక ‘కోటలు’ కూలిపోతాయి, యూడీఎఫ్ జెండా ఎగురుతుంది. బీజేపీ విభజన, వివాదాస్పద రాజకీయాలను తీవ్రంగా తిరస్కరించే సంప్రదాయాన్ని కేరళ కొనసాగిస్తుంది” అని ఆయన అన్నారు .

తిరువనంతపురంలో బీజేపీ విజయంపై మీడియా కథనాలను కూడా కేసీ వేణుగోపాల్ విమర్శించారు. బీజేపీ విజయాన్ని ఓ ”వేవ్‌’గా ‘మీడియా చిత్రీకరించడం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. “ఎన్‌డీఏకు జిల్లా పంచాయతీలు లేవు. బ్లాక్ పంచాయతీలు లేవు. ఒక మునిసిపల్ కార్పొరేషన్‌లో గెలుపును “ఏదో సాధించినట్టుగా చూపిస్తున్నారు” అని ఆయన అన్నారు .

“2024 లోక్‌సభ ఎన్నికల్లో త్రిసూర్‌లో బీజేపీ గెలవడాన్ని కూడా పెద్ద విజయమని చెప్పారు. ఇప్పుడు అదే మున్సిపల్ కార్పొరేషన్‌లో ప్రజలు యూడీఎఫ్‌కు భారీ విజయం కట్టబెట్టారు. 2024 లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే బీజేపీ ఓట్ల వాటా కూడా ఐదు శాతం తగ్గింది” అని వేణుగోపాల్ అన్నారు.

”గత ఎన్నికలతో పోలిస్తే వారు ఏడు గ్రామ పంచాయతీల్లో మాత్రమే అదనంగా గెలిచారు. 941 పంచాయతీల్లో గతంలో 19గెలవగా ఇప్పుడాసంఖ్య 26కి పెరిగింది” అని ఆయనన్నారు.

“ఆరు మున్సిపల్ కార్పొరేషన్లలో యూడీఎఫ్ నాలుగు గెలిచింది. అంటే గత ఎన్నికలతో పోలిస్తే మూడు ఎక్కువగా గెలిచినట్టు. 86 మునిసిపాలిటీలలో 54 గెలుచుకుంది. 505 గ్రామ పంచాయతీలతో గ్రామీణ కేరళలో బలమైన పట్టును ఏర్పరచుకుంది” అని ఆయన అన్నారు.

కేరళ ప్రజల తీర్పు రాష్ట్ర ప్రజాస్వామ్య స్ఫూర్తిని పూర్తిగా ప్రతిబింబిస్తోందని కాంగ్రెస్ నాయకుడు, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ అన్నారు.

యుడీఎఫ్ 2020 కంటే మెరుగైన ఫలితాలను సాధించిందన్నారు.

“తిరువనంతపురంలో బీజేపీ సాధించిన చారిత్రక విజయాన్ని కూడా నేను గుర్తించాలనుకుంటున్నాను. నగర కార్పొరేషన్‌లో కీలక విజయానికి వారిని అభినందిస్తున్నాను. ఇది గట్టి విజయం. తిరువనంతపురం రాజకీయ యవనికలో గణనీయమైన మార్పును చూపుతుంది” అని శశిథరూర్ అన్నారు.

” ఎల్‌డీఎఫ్ 45 ఏళ్ల దుష్ట పరిపాలన నుంచి మార్పు కోసం నేను ప్రచారం చేసాను. కానీ ఓటర్లు మరొక పార్టీకి ప్రతిఫలం ఇచ్చారు. ఇదే ప్రజాస్వామ్య అందం. రాష్ట్రవ్యాప్తంగా యూడీఎఫ్‌కు అనుకూలంగా ఉన్నా, నా నియోజకవర్గంలో బీజేపీకి అనుకూలంగా ఉన్నా ఏదైనా సరే ప్రజల నిర్ణయాన్ని గౌరవించాలి ” అని శశిథరూర్ అన్నారు.

బీజేపీ, కేరళ, తిరువనంతపురం, ఎల్డీఎఫ్, యూడీఎఫ్, రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

రాజకీయ నిపుణులేమంటున్నారు?

దశాబ్దం కిందట కూడా తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌లో బీజేపీ పెద్ద సంఖ్యలో సీట్లు గెలుచుకుంది. కానీ ఈసారి విజయాన్ని కేరళలో కీలకమలుపు అయ్యే అవకాశమని నిపుణులు పరిగణిస్తున్నారు.

“ఇది ఎల్‌డిఎఫ్ విశ్వసనీయతను కోల్పోయిన విషయం. తిరువనంతపురం నుంచి కాసరగోడ్ వరకు, ఎల్‌డీఎఫ్‌పై వ్యతిరేకత ఉంది. బీజేపీకి మెజారిటీ వచ్చిన తిరువనంతపురంలో కూడా బలహీనమైన కాంగ్రెస్ ఈసారి తన సీట్ల సంఖ్యను పెంచుకుంది” అని రాజకీయ విశ్లేషకులు, ప్రొఫెసర్ జె. ప్రభాష్ బీబీసీతో అన్నారు.

తిరువనంతపురంలో బీజేపీ విజయాన్ని బ్రేక్ త్రూగా అభివర్ణించారు సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్.

“చిత్రం స్పష్టంగా ఉంది. హరియాణాలోలా కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఎలాంటి తప్పులు చేయకపోతే అసెంబ్లీ ఎన్నికలకు ముందు బలమైన స్థితిలో ఉంటుంది. బీజేపీ క్రమంగా పట్టు సాధిస్తోంది. ఎల్‌డీఎఫ్ భారీగా నష్టపోయింది” అని ఆయన విశ్లేషించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)