SOURCE :- BBC NEWS
కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ రేప్, మర్డర్ కేసు నిందితుడు సంజయ్ రాయ్‌ను కోర్టు దోషిగా తేల్చింది.
ట్రైనీ డాక్టర్‌పై లైంగిక దాడి, హత్య ఆరోపణలు సీబీఐ సమర్పించిన సాక్ష్యాధారాలు రుజువు చేస్తున్నాయని బోనులో నిల్చొన్న సంజయ్ రాయ్‌ని చూస్తూ న్యాయమూర్తి చెప్పారు.
భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) 64, 103(1) సెక్షన్ల కింద సంజయ్ రాయ్‌ను కోర్టు దోషిగా తేల్చింది. సోమవారం శిక్ష ఖరారు చేయనున్నట్లు కోర్టు ప్రకటించింది.
గత ఏడాది ఆగస్టులో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా ప్రజాగ్రహానికి దారితీసింది.
2024 ఆగస్టు 9న హాస్పిటల్ సెమినార్ హాల్లో 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్ మృతదేహాన్ని గుర్తించారు. ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన తర్వాత హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది.
ఈ ఘటనతో కోల్‌కతాలో భారీ నిరసనలు జరిగాయి. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో రెండు నెలలకు పైగా ఆరోగ్య సేవలు స్తంభించిపోయాయి.
కోర్టు ఏం చెప్పింది?
ఈ ఘటన జరిగిన ఐదు నెలల తర్వాత, శనివారం కోల్‌కతాలోని సీల్దా కోర్టు తీర్పు వెలువరించింది.
కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి అనిర్బన్ దాస్, బోనులో నిల్చున్న సంజయ్ రాయ్ వైపు చూస్తూ, తీర్పు చదివారు. లైంగిక వేధింపులు, రేప్ కేసులో సీబీఐ సమర్పించిన సాక్ష్యాధారాలు నేరాన్ని రుజువు చేస్తున్నాయని అన్నారు.
భారత శిక్షాస్మృతిలోని సెక్షన్లు 64, 103 (1) కింద నిందితుడు సంజయ్ రాయ్‌ని దోషిగా నిర్ధరించారు.
సోమవారం శిక్షను ఖరారు చేస్తామని, ఆ సమయంలో నిందితుడు సంజయ్ రాయ్ కోర్టుకి హాజరుకావాల్సి ఉంటుందని కోర్టు తెలిపింది.
ఈ కేసులో ‘సాక్ష్యాలు నాశనం చేయడం’ గురించి వచ్చిన అభియోగాల్లో మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, స్థానిక టాలా పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి అభిజీత్ మండల్‌పై సీబీఐ చార్జీషీట్ దాఖలు చేయలేకపోయింది. దీంతో వారికి గతంలోనే బెయిల్ లభించింది.
అయితే, సీబీఐ దర్యాప్తుపై మృతురాలి తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసును పర్యవేక్షిస్తున్న సుప్రీంకోర్టు, కలకత్తా హైకోర్టులలో పిటిషన్లు దాఖలు చేశారు.
సీల్దా ప్రత్యేక కోర్టు శిక్ష ప్రకటించకుండా ఆపాలని, ఈ కేసులో మరోసారి సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఆ పిటిషన్లలో వారు కోరారు.
ఏరోజు, ఏం జరిగింది?
ఆగస్టు 9, 2024
ఉదయం, ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ సెమినార్ హాల్లో మహిళా ట్రైనీ డాక్టర్ మృతదేహం లభ్యమైంది. ట్రైనీ డాక్టర్‌ను రేప్ చేసి, ఆ తర్వాత చంపేశారు. హత్యకు గురైన డాక్టర్, రాత్రి భోజనం చేసిన తర్వాత సెమినార్ హాల్లోనే నిద్రపోయారు.
పోలీసుల కథనం ప్రకారం, ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటన రాత్రి 3 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య జరిగింది.
ఈ ఘటనపై వైద్యులు నిరసనలకు దిగారు.
ఆగస్టు 10, 2024
పోలీసులు టాస్క్‌ఫోర్స్ టీమ్‌ను ఏర్పాటు చేశారు. ఆరుగంటల్లోనే నిందితుడు సంజయ్ రాయ్‌ను అరెస్టు చేశారు. సీసీటీవీ ఫుటేజీతో పాటు సెమినార్ హాల్లో విరిగిపోయిన బ్లూటూత్ ఇయర్‌ఫోన్‌ను గుర్తించారు.
అది నిందితుడి ఫోన్‌తో కనెక్ట్ అయ్యి ఉంది. వీటి ఆధారంగా పోలీసులు నిందితుడు సంజయ్ రాయ్‌ను అరెస్టు చేశారు.
ఆగస్టు 12, 2024
మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ రాజీనామా.
ఆగస్టు 13, 2024
ఈ కేసులో దర్యాప్తు సరిగ్గా జరగలేదన్న కోల్‌కతా హైకోర్టు, కేసును సీబీఐకి అప్పగించింది.
ఆగస్టు 15, 2024
ఆగస్టు 14, 15 తేదీల మధ్య రాత్రి, ఆర్‌జీ కర్ ఆస్పత్రిలోని వైద్యుల నిరసన శిబిరంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు.
ఆగస్టు 16, 2024
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతాలో మార్చ్ నిర్వహించారు. ఈ మార్చ్‌పై బీజేపీతో పాటు అనేక మంది విమర్శలు చేశారు.
సుమోటోగా విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు
ఆగస్టు 20, 2024
కోల్‌కతా ట్రైనీ డాక్టర్ రేప్, మర్డర్ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. దేశవ్యాప్తంగా వైద్యులు, వైద్య సిబ్బందికి సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడంపై సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. నేషనల్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది.
ఆగస్టు 21, 2024
ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ భద్రతా వ్యవహారాలను సీఐఎస్ఎఫ్ చేపట్టింది.
ఆగస్టు 22, 2024
అప్పటికి 11 రోజులుగా కొనసాగుతున్న సమ్మెను డాక్టర్లు విరమించుకున్నారు.
ఆగస్టు 27, 2024
వైద్యురాలిపై అత్యాచారం, హత్యను నిరసిస్తూ విద్యార్థులు రాష్ట్ర సచివాలయం వరకూ నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చారు. ఈ నిరసన సందర్భంగా నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
‘పశ్చిమ్ బంగా ఛాత్ర్ సమాజ్’ అనే నూతన విద్యార్థి సంఘం ఈ నిరసనకు ”నబాన్న అభియాన్” అని పేరుపెట్టింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని నిరసనకారులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
ఆగస్టు 28, 2024
నిరసన ప్రదర్శన చేస్తున్న విద్యార్థులపై పోలీసు బలగాల మోహరింపు, అరెస్టులను వ్యతిరేకిస్తూ బీజేపీ 12 గంటలపాటు బెంగాల్ బంద్‌కు పిలుపునిచ్చింది. బీజేపీ రాష్ట్రంలో అరాచకం సృష్టించాలని చూస్తోందని అధికార టీఎంసీ ఆరోపించింది.
పశ్చిమ బెంగాల్‌లో కొత్త చట్టం
సెప్టెంబర్ 2, 2024
సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌ను అరెస్టు చేసింది. ఆయనతో పాటు హాస్పిటల్‌కు వస్తువులను సరఫరా చేసే కాంట్రాక్టర్లు బిప్లబ్ సింగ్, సుమన్ హజ్రా, సందీప్ ఘోష్ బాడీగార్డ్ అఫ్సర్ అలీ ఖాన్‌ను కూడా అరెస్టు చేశారు.
దీంతో పాటు సాక్ష్యాలను నాశనం చేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలతో స్థానిక టాలా పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి అభిజీత్ మండల్‌ను కూడా సీబీఐ అరెస్టు చేసింది.
సెప్టెంబర్ 3, 2024
సంఘటన జరిగిన నెల రోజుల్లోనే, ‘పశ్చిమ బెంగాల్ క్రిమినల్ లా’ను సవరిస్తూ చేసిన ”అపరాజిత వుమన్ అండ్ చైల్డ్ బిల్ 2024”ను పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది.
ఈ బిల్లుతో మహిళలపై నేరాలకు సంబంధించి ఇండియన్ జస్టిస్ కోడ్, 2023 (బీఎన్ఎస్), ఇండియన్ సివిల్ సెక్యూరిటీ కోడ్, 2023 (బీఎన్ఎస్ఎస్), పోక్సో యాక్ట్, 2012కు సవరణలు చేసింది.
సెప్టెంబర్ 8, 2024
ఈ కేసు విషయంలో సొంతపార్టీ నేతల నుంచి కూడా మమతా బెనర్జీ ప్రభుత్వం వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఆర్‌జీ కర్ హాస్పిటల్లో అత్యాచారం, హత్య ఘటనపై ప్రజల నుంచి తీవ్ర ఆందోళనలు వ్యక్తమవడంతో రాజ్యసభలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ జవహర్ సర్కార్, పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి లేఖ రాయడంతో పాటు తాను రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు.
సెప్టెంబర్ 14, 2024
దాదాపు నెలరోజుల ఆందోళనలు, నిరసన ప్రదర్శనల అనంతరం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమ్మె చేస్తున్న వైద్యులను కలిశారు. ఈ సందర్భంగా తమ డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు సీఎంని కోరారు.
సెప్టెంబర్ 17, 2024
కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయెల్‌ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది.
అక్టోబర్ 7, 2024
ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌పై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది.
డిసెంబర్ 13, 2024
ఈ కేసులో నిందితులుగా ఉన్న అప్పటి ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, కోల్‌కతా టాలా పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి అభిజీత్ మండల్‌లకు బెయిల్ లభించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)