SOURCE :- BBC NEWS

మెస్సీ, భారత పర్యటన, కోల్‌కతా

ఫొటో సోర్స్, Getty Images

45 నిమిషాలు క్రితం

ఫుట్‌బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ, భారత పర్యటన శనివారం (డిసెంబర్ 13) కోల్‌కతాలో ప్రారంభమైంది. అయితే, కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియం నుంచి కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. అందులో స్టేడియంలోకి ప్రేక్షకులు సీసాలు, కుర్చీలు విసిరేస్తున్నట్లు కనిపిస్తున్నారు.

ఈవెంట్ నుంచి మెస్సీ త్వరగా వెళ్లిపోయారంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో స్టేడియంలో తీవ్ర గందరగోళం నెలకొందని చెబుతున్నారు.

‘మేం ఇప్పటికే ఈవెంట్ ప్రధాన నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నాం. ఈ నిర్వహణాలోపానికి తగిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నాం’ అని స్టేడియంలోని గందరగోళ పరిస్థితుల గురించి మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ డీజీపీ రాజీవ్ కుమార్ చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

మెస్సీని చూసేందుకు వచ్చిన అభిమానులు అక్కడి పరిస్థితులను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘ఈరోజు నా పెళ్లి. కానీ మెస్సీని చూడటానికి ఇక్కడికి వచ్చేశాను. కానీ మెస్సీని సరిగ్గా చూడలేకపోయాను’ అని పీటీఐ వార్తా ఏజెన్సీతో ఒక అభిమాని చెప్పారు. కోల్‌కతాలో ఈవెంట్ కోసం చేసిన ఏర్పాట్లు తమకు నచ్చలేదని చాలామంది అభిమానులు అంటున్నారు.

మెస్సీ చుట్టూ జనం ఉండటం వల్ల రెప్పపాటు కాలం కూడా ఆయనను చూడలేకపోయామని అభిమానులు విచారం వ్యక్తం చేశారు.

వేల రూపాయలు ఖర్చు చేసి స్టేడియానికి వచ్చిన తాము మెస్సీని సరిగా చూడలేకపోయామంటున్నారు.

కోల్‌కతాలో మెస్సీ పర్యటన గందరగోళం

ఫొటో సోర్స్, ANI

‘టికెట్ కనీస ధర 5 వేల రూపాయలు. వీవీఐపీ వ్యక్తులంతా మెస్సీ చుట్టూ ఎందుకు ఉన్నారు?’ అని మెస్సీని చూడటానికి వచ్చిన ఒక అభిమాని తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు.

‘మేం కనీసం ఆయన్ను చూడలేకపోయాం. పోలీసులు ఎందుకు చర్య తీసుకోవడం లేదు? నాకేం అర్థం కావడంలేదు. ఇక్కడికి వచ్చిన ప్రజలంతా బాగా కోపంగా ఉన్నారు. మాకు మా డబ్బును తిరిగి ఇచ్చేయండి’ అని ఆయన అన్నారు.

‘మేం డార్జిలింగ్ నుంచి మెస్సీని చూసేందుకు వచ్చాం. ఆయనను చూసే అవకాశమే రాలేదు. చాలా నిరాశచెందాం’ అని మరో అభిమాని అన్నారు.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ

ఫొటో సోర్స్, AFP via Getty Images

మమతా బెనర్జీ క్షమాపణ

స్టేడియంలో ఈవెంట్ ‘అస్తవ్యస్థంగా’ జరగడంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. దీనిపై ప్రజలకు క్షమాపణలు చెప్పారు.

‘సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన గందరగోళాన్ని చూసి నేను షాకయ్యాను. లియోనల్ మెస్సీతో పాటు క్రీడాభిమానులు అందరికీ నేను క్షమాపణలు చెబుతున్నా. ఈ ఘటనపై దర్యాప్తు చేయడానికి ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నాం’ అని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఆమె ట్వీట్ చేశారు.

ఈ ఘటనపై మమత ప్రకటనను విమర్శించిన రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష బీజేపీ, ఆమె ‘మొసలి కన్నీళ్లు’ కారుస్తున్నారని విమర్శించింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి

X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

‘మొసలి కన్నీరు కార్చడం ఆపండి. ఇలాంటి అస్తవ్యస్థ పాలన, అవినీతి మీ ప్రభుత్వం చేసే ప్రతీ పనిలో ఉంటుంది. పశ్చిమ బెంగాల్ ప్రజలు, ఫుట్‌బాల్ క్రీడాభిమానుల మనోభావాలపై తృణమూల్ కాంగ్రెస్ దాడి చేసింది. వాళ్లను అవమానించింది.

మీరు వీలైనంత త్వరగా ఈ ఘటనకు బాధ్యులను గుర్తించి, వారితో రాజీనామా చేయించాలి’ అని బీజేపీ అధికార ప్రతినిధి అమిత్ మాలవీయ ట్వీట్ చేశారు.

మెస్సీ పర్యటన దేశంలోని నాలుగు ప్రధాన నగరాలైన కోల్‌కతా, ముంబై, న్యూదిల్లీ, హైదరాబాద్‌కే పరిమితం. మెస్సీ గతంలో 2009లో కోల్‌కతాలో స్నేహపూర్వక ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడటానికి భారత్‌కు వచ్చారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)