SOURCE :- BBC NEWS

క్యారెట్లు తింటే కంటిచూపు మెరుగవుతుంది, కళ్లు మరింత స్పష్టంగా కనిపిస్తాయి, చీకట్లోనూ కంటిచూపు మెరుగ్గా ఉంటుంది.. అని ఎవరో ఒకరు అనడం, చెప్పడం మీరు వినే ఉంటారు.
బహుశా చిన్నతనంలో మీ అమ్మ కూడా ఇలాగే చెప్పి మీతో క్యారెట్లు తినిపించి ఉండొచ్చు.
కానీ, ఇందులోని నిజానిజాల సంగతి అటుంచితే, ప్రజలతో క్యారెట్లు తినిపించడానికి బ్రిటిషర్లు చేసిన ప్రచారాలు, కుట్రసిద్ధాంతాల గురించి మీకు తెలిసి ఉండకపోవచ్చు.
ఎందుకంటే, రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి ఈ కుట్ర సిద్ధాంతాన్ని చాలామంది ఇంకా నమ్ముతున్నారు. అదేంటో చూద్దాం.


ఫొటో సోర్స్, Getty Images
ఈ నమ్మకం ఎలా పుట్టుకొచ్చింది?
మిత్రరాజ్యాల గెలుపునకు ఎంతో కీలకమైన ఒక టెక్నాలజీని గోప్యంగా ఉంచడం కోసం యూకే సమాచార మంత్రిత్వ శాఖ పుట్టించిన ఒక కహానీ ఇది అని ఇంపీరియల్ వార్ మ్యూజియం, మాస్ అబ్జర్వేషన్ ఆర్కైవ్స్, యూకే నేషనల్ ఆర్కైవ్స్ ఫైల్స్ ద్వారా తెలుస్తుంది.
రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు 1940 సెప్టెంబర్ -1941 మే మధ్య కాలంలో బ్రిటన్‌పై నాజీలు వైమానిక బాంబు దాడులు చేసేవారు. అయితే, చీకటి కారణంగా జర్మన్ వైమానిక దళానికి ఇబ్బందులు ఎదురయ్యేవి.
ప్రత్యర్థిని మరింత ముప్పుతిప్పలు పెట్టడానికి, లక్ష్యాలపై గురిపెట్టకుండా చేయడానికి నగరాల్లో బ్రిటిష్ ప్రభుత్వం బ్లాకవుట్స్ (వెలుగు లేకుండా చేయడం) విధించేది. అదే సమయంలో రాయల్ ఎయిర్‌ఫోర్స్ (ఆర్‌ఏఎఫ్) ఒక కొత్త, రహస్య రాడార్ సాంకేతికత సహాయంతో జర్మన్ ఫైటర్లను తిప్పికొట్టేది.
ఈ విషయం బయటకు పొక్కకుండా, ఎవరికీ తెలియకుండా ఉంచడం కోసం యూకే సమాచార మంత్రిత్వ శాఖ ఒక ఉపాయం వేసింది.
ఆర్‌ఏఎఫ్ విజయానికి క్యారెట్లు కారణమంటూ ప్రచారం మొదలుపెట్టింది.
1940లో ఏఐ రాడార్ సహాయంతో శత్రుదేశపు విమానాన్ని కూల్చేసిన తొలి బ్రిటిష్ పైలట్ జాన్ కన్నింగ్‌హామ్. ఆర్‌ఏఎఫ్ ఫైటర్ అయిన ఈయనకు ‘క్యాట్స్ ఐస్’ అనే ముద్దుపేరు ఉండేది.
ఈయన కూల్చేసిన శత్రు విమానాల సంఖ్య 20. అందులో 19, రాత్రిపూట కూల్చేశారు.
కన్నింగ్‌హామ్ వంటి పైలట్లు విపరీతంగా క్యారెట్లు తినడమే ఆర్‌ఏఎఫ్ విజయానికి కారణమంటూ వార్తాపత్రికలకు యూకే ప్రభుత్వం చెప్పింది.
క్యారెట్లు తినడం వల్ల చీకట్లోనూ కళ్లు బాగా కనిపిస్తాయని చెప్పుకొచ్చింది. జర్మన్లను బోల్తా కొట్టించడంతో పాటు దేశంలోని ప్రజలు క్యారెట్లను తినేలా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో యూకే ప్రభుత్వం ఈ వ్యూహాన్ని అనుసరించింది.
క్యారెట్లకు హైప్ ఇవ్వడంలో ఆర్‌ఏఎఫ్ కూడా భాగమైంది.

ఫొటో సోర్స్, National Archives/SSPL/Getty Images
”డిగ్ ఫర్ విక్టరీ”
రెండో ప్రపంచ యుద్ధం కారణంగా బ్రిటన్ 1940ల్లో ఆహారం కొరత, రేషన్ కొరత, దిగుమతులు తగ్గడం సహా చాలా సమస్యలతో ఇబ్బందిపడింది.
దీంతో బ్రిటన్ వ్యవసాయ మంత్రిత్వ శాఖ క్యారెట్ల సాగును బాగా ప్రోత్సహించింది. ఆహార మంత్రిత్వ శాఖ కూడా ప్రచారాల రూపంలో ఈ కార్యక్రమంలో తన వంతు పాత్ర పోషించింది.
యుద్ధం కారణంగా అందుబాటులో లేని, పరిమితంగా దొరికే ఉత్పత్తులకు క్యారెట్‌ను ప్రత్యామ్నాయంగా చూపిస్తూ చాలా సమాచారాన్ని ప్రజల్లోకి పంపించింది.
‘డిగ్ ఫర్ విక్టరీ’ అని ప్రచారం చేస్తూ కుటుంబాలను విక్టరీ గార్డెన్స్ పేరుతో సొంతంగా కూరగాయలు, క్యారెట్లు పండిచాలని కోరింది.
దీంతో 1942 నాటికి పదివేల టన్నుల క్యారెట్ల మిగులును చూపించింది.
రెండో ప్రపంచయుద్ధ కాలంలో ఆహార కొరత ఉన్నప్పటికీ యూకేలో జాతీయ న్యూట్రిషన్, ఆరోగ్యం మెరుగైంది. దీనికి కారణం పోషకాలు, ఖనిజాలు ఉండే ఆహారాలకు సంబంధించి ప్రభుత్వం విపరీతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించింది.
అలాగే ‘విటమిన్ ఎ’ అనే సంచిని పట్టుకున్న ‘డాక్టర్ క్యారెట్’ అనే ఒక కార్టూన్ క్యారెక్టర్‌ను సృష్టించి ప్రజలకు క్యారెట్ వల్ల కలిగే ప్రయోజనాలను చేరువ చేసింది.
రెండో ప్రపంచ యుద్ధం జరిగిన ఆరు సంవత్సరాల కాలంలో రేషన్ ఫుడ్‌కు ప్రత్యామ్నాయంగా క్యారెట్లను ప్రజలు వినియోగించేలా చేయడానికి చేయాల్సిందంతా చేసింది.
రెండో ప్రపంచ యుద్ధం ఈ విధంగా క్యారెట్ పాపులారిటీని పెంచి, కిచెన్‌లో దానికి సముచిత స్థానాన్ని కల్పించింది. అందులోని పోషకాల కారణంగా ఒక ప్రధాన ఆహారంగా క్యారెట్ స్థాయిని పెంచింది.
క్యారెట్లను ఒక సీక్రెట్ కోడ్‌గా రెండో ప్రపంచ యుద్ధంలో ఉపయోగించినట్లు బీబీసీ ఫ్రెంచ్ సర్వీస్ ప్రసారం చేసింది.
డీ డే రోజున నార్మండీ చొరబాటు గురించి ఫ్రెంచ్ వారికి చెప్పడానికి ‘ద క్యారెట్స్ ఆర్ కుక్డ్, ఐ రిపీట్, ద క్యారెట్స్ ఆర్ కుక్డ్’ అనే సందేశాన్ని వాడినట్లు బీబీసీ ఫ్రెంచ్ సర్వీస్ పేర్కొంది.
రెండో ప్రపంచ యుద్ధం కాలం నాటి ప్రచారాలకు, వాటి పబ్లిసిటికి బ్రిటిష్ ప్రభుత్వ సమాచార మంత్రిత్వ శాఖదే బాధ్యత అని యూనివర్సిటీ ఆఫ్ లండన్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
డాక్టర్ క్యారెట్ ప్రచారాలు
బ్రిటిష్ ప్రభుత్వం చెప్పిన కథను జర్మన్లు నమ్మారా? లేదా? అనే విషయం పక్కనబెడితే బ్రిటిష్ ప్రజలు మాత్రం క్యారెట్లను తినడానికి సిద్ధంగా ఉన్నట్లే కనిపించారు.
కొత్త వంటకాల రెసిపీలను, చిట్కాలను అందించే బీబీసీ రేడియో కార్యక్రమం ‘ద కిచెన్ ఫ్రంట్’ను ప్రజలు అనుసరించేవారు.
చక్కెర దొరకడం కష్టంగా మారిన ఆ సమయంలో సహజ స్వీటెనర్ అయిన క్యారెట్‌ను ఉపయోగించి క్యారెట్ ఫుడ్డింగ్, క్యారెట్ కేక్, క్యారెట్ మర్మలాడ్ వంటి వాటిపై వారు ఆధారపడ్డారు.
మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచేలా, బ్లాకవుట్స్ సమయాల్లోనూ మీరు చూడగలిగేలా క్యారెట్లలోని పోషకాలు మీకు సహాయపడతాయంటూ బ్రిటన్ ప్రభుత్వం పోస్టర్లను పంచింది. వార్తాపత్రికల్లో ప్రకటనలు చేసింది.
యూకే ఆహార మంత్రి లార్డ్ వూల్టన్, క్యారెట్లపై అవలంబించిన విధానాల గురించి 1942లో న్యూయార్క్ టైమ్స్ పత్రికలో లండన్ ప్రతినిధి రాశారు.
”క్యారెట్లను ఆహారంలో భాగం చేయడం ద్వారా బ్రిటిష్ ప్రజలను క్యాబేజీ, బ్రస్సెల్ స్ప్రౌట్స్ వంటి వాటికి దూరంగా ఉంచేందుకు లార్డ్ ప్రయత్నించారు. బొగ్గు గనుల్లోనూ చూడటానికి సరిపడేంత విటమిన్ ఎ, క్యారెట్లలో ఉంటుందని చెప్పారు” అని న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు.
యుద్ధం నేపథ్యంలో స్వయం సమృద్ధి (సెల్ఫ్ సస్టెనబిలిటీ) అవసరం గురించి ప్రజలతో మాట్లాడుతూ మంత్రి వూల్టన్ నొక్కి చెప్పారు.
”ఇది ఆహార యుద్ధం. ఇంట్లో పెంచే కూరగాయలతో షిప్పింగ్‌ను తప్పించుకోవచ్చు. కిచెన్ గార్డెన్ల సహాయం లేకుండా ఈ యుద్ధాన్ని గెలవలేం” అని అన్నారు.
యూకే సమాచార మంత్రిత్వ శాఖ 1941లో క్యారెట్లపై ప్రాపగండా చిత్రాన్ని కూడా విడుదల చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
”బ్లూ బెర్రీ తింటే బ్లూ అవుతామా?”
క్యారెట్లు తింటే కంటి ఆరోగ్యం బాగుంటుందని చాలా పరిశోధనలు సూచిస్తున్నాయి.
జాన్ నిర్వహించే డిజిటల్ మ్యూజియం మొత్తం క్యారెట్లకు సంబంధించిన ఆశ్చర్యకరమైన అంశాలతో ఉంటుంది.
బ్లూబెర్రీలు తింటే మనిషి నీలం రంగులోకి మారతాడనడంలో ఎంత నిజం ఉందో క్యారెట్లు తింటే చీకట్లోనూ కళ్లు బాగా కనబడతాయనడంలో అంతే నిజం ఉందని ఆయన అన్నారు.
క్యారెట్ల గురించి ఈ ప్రచారం వాడుకలోకి ఎలా వచ్చింది? రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఈ ప్రచార మూలాలు ఎక్కడున్నాయి వంటి అంశాలను ఈ డిజిటల్ మ్యూజియం వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
బ్రిటిషర్ల ఎత్తులకు నాజీలు చిక్కారా?
జర్మన్ వ్యూహకర్తలను బోల్తా కొట్టించేందుకు బ్రిటిషర్లు వేసిన క్యారెట్ ఎత్తులు ఫలించినట్లు తాను అనుకోవట్లేదని జాన్ స్టోలార్చెక్ అభిప్రాయపడ్డారు.
”బ్రిటిషర్ల ఎత్తులకు నాజీలు చిక్కినట్లు ఎలాంటి ఆధారాలు లేవు. కానీ, కంటి ఆరోగ్యానికి క్యారెట్లు మంచివనే భావన జర్మన్లలో కూడా స్థిరపడింది. అయితే, అందులో కొంత నిజం ఉందని భావించిన జర్మన్లు తమ ఫైటర్లకు కూడా క్యారెట్లు తినిపించినట్లు కథలు వాడుకలో ఉన్నాయి” అని తన పుస్తకం ‘హౌ క్యారెట్స్ హెల్ప్‌డ్ విన్ వరల్డ్ వార్ 2” కోసం మినిస్ట్రీ ఫైల్స్ సమీక్ష అనంతరం స్టోలార్చెక్ ఒక ఈమెయిల్ రాసినట్లు ‘ద అట్లాంటిక్’ వెబ్‌సైట్ పేర్కొంది.
అయితే, ఈ అంశంపై లండన్‌లోని రాయల్ ఎయిర్‌ఫోర్స్ మ్యూజియం అసిస్టెంట్ క్యురేటర్ బ్రయాన్ లెగెట్ ఒక భిన్నమైన అంశాన్ని వెల్లడించారు.
”మా రాడార్ వ్యవస్థ గురించి జర్మన్ ఇంటెలిజెన్స్ సర్వీస్‌కు మంచి అవగాహన ఉంది. నిజానికి ఒక విమానంలో కమర్షియల్ రేడియోలను అమర్చి వాటిని ఫ్రాన్స్ మీదుగా పంపించి వివిధ రేడియో ఫ్రీక్వెన్సీలను వినడం ద్వారా జర్మన్ ఎయిర్‌బార్న్ రాడార్‌ను ఆర్‌ఏఎఫ్ గుర్తించింది” అని ఆయన వెల్లడించారు.
తమకు విసుగు వచ్చేంతవరకు క్యారెట్లను తినిపించారని కన్నింగ్‌హామ్ తన పుస్తకం ”ద ఫియర్ ఇన్ ద స్కై: వివిడ్ మెమొరీస్ ఆఫ్ బాంబర్ ఎయిర్‌క్రూ ఇన్ వరల్డ్ వార్ టు”లో పేర్కొన్నారు.
”క్యారెట్లు తినడం వల్లే నైట్ ఫైటర్ పైలట్లకు రాత్రిపూట కళ్లు బాగా కనిపిస్తాయంటూ తప్పుడు సమాచారం యేట్స్‌బరీలో వ్యాప్తి చెందింది. ఆర్‌ఏఎఫ్ వద్ద రాడార్ ఉందనే వాస్తవాన్ని కప్పిపుచ్చడానికి ఈ సమాచారాన్ని వ్యాప్తి చేశారు. మా క్లాస్ పైలట్లకే విసుగు వచ్చేంతవరకు క్యారెట్లు తినిపించారు. మిగతా వర్గాలకు ఇలా చేయలేదు. కొన్ని వారాల పాటు ఇది సాగింది” అని పుస్తకంలో కన్నింగ్‌హామ్ రాసినట్లు వరల్డ్ క్యారెట్ మ్యూజియం పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
క్యారెట్లలో పోషకాలు పుష్కలం
రెండో ప్రపంచ యుద్ధం ప్రచారానికి విరుద్ధంగా క్యారెట్లను తింటే రాత్రిపూట పిల్లులకు కనిపించినట్లుగా మానవులకు కళ్లు కనిపించవు.
కానీ, రోగనిరోధక శక్తిని పెంచడం, కంటి ఆరోగ్యాన్ని కాపాడటం వంటి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయని హెల్త్‌లైన్ వెబ్‌సైట్ పేర్కొంది.
క్యారెట్లలో బీటా కెరోటిన్ అని పిలిచే పిగ్మెంట్ ఉంటుంది. దీన్ని మన శరీరం ‘విటమిన్ ఎ’గా మార్చుతుంది.
విటమిన్ ‘ఎ’ తగినంతగా లేకపోవడం వల్ల రేచీకటి రావొచ్చు, లేదా కంటిచూపు కూడా పోవచ్చు.
ఏదైనా లోపం (డెఫిషియన్సీ) వల్ల కలిగే దృష్టి లోపాన్ని (పూర్ విజన్) విటమిన్ ‘ఎ’ తీసుకోవడం వల్ల పూరించుకోవచ్చని అధ్యయనాలు చెబుతున్నప్పటికీ, ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తిలో కంటిచూపును బలోపేతం చేయడం లేదా వయస్సు పెరుగుతున్న కొద్దీ కంటిచూపు మందగించడాన్ని ఇది అడ్డుకోలేదని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)